టాంజానియాలో హిందూమతం
సా.శ. 1వ సహస్రాబ్ది నుండి తూర్పు ఆఫ్రికా, భారత ఉపఖండం మధ్య వాణిజ్యం వర్థిల్లినప్పుడు టాంజానియాలో హిందూమతం ప్రవేశించింది. ఈ వ్యాపారులలో ఎక్కువ మంది గుజరాత్, దక్కన్ (ప్రస్తుతం మహారాష్ట్ర), చోళ సామ్రాజ్యం నుండి వచ్చారు. జాంజిబార్, స్వాహిలి తీరం, జింబాబ్వే, మడగాస్కర్ ప్రాంతాలలో చిన్నపాటి హిందూ స్థావరాలకు సంబంధించిన పురావస్తు ఆధారాలు లభించాయి. [1]
2010లో టాంజానియాలో దాదాపు 50,000 మంది హిందువులు ఉన్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది [2]
చరిత్ర
[మార్చు]భారతదేశం, ఆఫ్రికాలోని హిందువుల మధ్య పురాతన వాణిజ్యం గురించిన ప్రస్తావన, బాబిలోన్ ప్రపంచ వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ఉన్న సమయంలో నాబోనిడస్ కాలం నాటిది. పురాతన కాలంలో హిందువులు రాజకీయ వ్యవస్థలో జోక్యం చేసుకునేవారు కాదు. తమ వ్యాపారమేదో తాము చేసుకుని, భారతదేశానికి తిరిగి వెళ్ళేవారు. హిందువుల చిన్న స్థావరాలు సా.శ. 1వ శతాబ్దంలో మొదలయ్యాయి. ఎక్కువగా ఆఫ్రికాకు తూర్పున ఉన్న ద్వీపాలలో తీరం వెంబడి, కొన్ని సందర్భాల్లో లోతట్టు ప్రాంతాలలోనూ ఉన్నాయి. ప్రాచీన భారతీయ గ్రంథాలు న్యామ్‌వేజీని లేదా "చంద్రుని లోని మనుషులు"ను సూచిస్తాయి - టాంజానియాలోని న్యామ్‌వేజీ ప్రజలను గుర్తించడానికి ఈ పదం ఇప్పటికీ వాడుకలో ఉంది. [3] ఆఫ్రికా తూర్పు తీరాన్ని సందర్శించిన ప్రతి ప్రధాన అన్వేషకుడూ జాంజిబార్, కిల్వా, మొంబాసా, మాలింది, మొజాంబిక్‌లలో హిందూ వ్యాపారుల ఉనికి ఉన్నట్లు ప్రస్తావించారు. వాస్కో డా గామా ఆఫ్రికా ద్వారా భారతదేశానికి చేసిన తొలి సముద్రయానంలో మార్గ దర్శకం చేయమని ఆఫ్రికాలో స్థిరపడిన ఒక గుజరాతీ హిందువును ప్రార్థించి ఒప్పించాడు. [4] సంవత్సరంలో కొంత భాగం తూర్పు ఆఫ్రికా నుండి భారత ద్వీపకల్పం వరకు ప్రవహించే స్థిరమైన వాణిజ్య పవనాలు వాణిజ్యానికి దోహదపడ్డాయి. సంవత్సరంలో మిగతా భాగంలో భారతీయ ద్వీపకల్పం నుండి తూర్పు ఆఫ్రికా వరకు పవనాలు వీస్తాయి
హిందువులు శాకాహారులు, అహింసావాదులు అని ప్రసిద్ధి. ఆఫ్రికాలో వారి మతాన్ని గానీ, సంస్కృతిని గానీ ఎన్నడూ రుద్దలేదు. జాంజిబార్ లోను, ఇతర ఆఫ్రికన్ సమాజాల లోనూ మంచి వాణిజ్యం, నాణ్యమైన ఉత్పత్తులు, నగదు రుణాలను అందించడం ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందారు. కానీ సాంప్రదాయకంగా వారి మతం, సామాజిక, సాంస్కృతిక జీవితాన్ని తమ వ్యక్తిగత విషయంగానే ఉంచుకున్నారు. [5] షియా ఇస్లాం (ఇస్మాయిలీ) రాకతో టాంజానియాలో మొదటి పెద్ద మార్పు వచ్చింది. ముస్లింలు, ఒమానీ అరబ్బులు భారతీయ హిందువులతో పోటీపడటం మొదలై, ముస్లింలు మతమార్పిడి ప్రచారం మొదలు పెట్టడంతో ఈ మార్పు మొదలైంది. రెండవ ప్రధాన మార్పు 16వ శతాబ్దంలో వలస సామ్రాజ్యాలు, క్రైస్తవ మతం రాకతో వచ్చింది.
వలసరాజ్యాల కాలంలో, ఐరోపా అధికారుల తర్వాత, [6] హిందువులే టాంజానియాలో ఆర్థికంగా అత్యంత విజయవంతమైన జాతి సమూహంగా ఉన్నారు. అయితే వారు రాజకీయంగా, చట్టపరంగా మైనారిటీగాను, అభద్రత తోనూ ఉన్నారు. [7] బ్రిటిష్ వలసరాజ్యాల శకం ముగిసాక, భారతీయ హిందువులు హింసకు గురయ్యారు. చాలా మంది టాంజానియా నుండి ఐరోపాకు, భారతదేశానికీ వలస పోయారు. [8]
ఆధునిక టాంజానియాలో హిందూమతం
[మార్చు]హిందూమతం టాంజానియాలో మైనారిటీ మతం. ప్రధాన భూభాగం లోను, జాంజిబార్ లోనూ కలిపి దాదాపు 30,000 మంది (1996) హిందువులున్నారు. చాలా మంది ఇండో-టాంజానియన్ (ముఖ్యంగా గుజరాతీ ) మూలానికి చెందినవారు.
ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనాల ప్రకారం 2010లో టాంజానియాలో దాదాపు 50,000 మంది హిందువులు ఉన్నారు. [2]
హిందూమతంలోని వివిధ సంప్రదాయాలలో, గుజరాత్‌కు చెందిన స్వామినారాయణ్, టాంజానియా కెన్యాల్లో హిందూమతం యొక్క క్రియాశీలక శాఖ. తూర్పు ఆఫ్రికాలో సామాజిక, సాంస్కృతిక, ఆలయ నిర్మాణ కార్యక్రమాల కారణంగా ఇది 1950 నాటికి బాగా స్థిరపడింది. దార్-ఎస్-సలామ్‌లో హిందూ దేవాలయాలను నిర్మించారు. వాటిలో ఎక్కువ భాగం నగర మధ్య భాగంలో ఉన్నాయి. హిందూ దేవాలయాలు ఉన్న వీధి పేరు ప్రముఖ స్వామి వీధిగా పేరు మార్చారు. స్వామినారాయణ దేవాలయాలు దార్-ఎస్-సలాం లోనే కాకుండా జాంజిబార్, అరుషా, మోషి వంటి ఇతర నగరాల్లో కూడా ఉన్నాయి. [9] టాంజానియాలో ఉన్న ఇతర హిందూ శాఖల్లో యోగా, వేదాంత ఉన్నాయి.
టాంజానియాలోని హిందువులలో బ్రహ్మ కుమారి, సత్య సాయి బాబా, హరే కృష్ణ అనుచరులు కూడా ఉన్నారు.
దీపావళి తదితర హిందూ పండుగలను హిందువులు పాటిస్తారు.
టాంజానియాలోని హిందూ దేవాలయాల జాబితా
[మార్చు]టాంజానియాలో అనేక నగరాల్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలో సహాయం చేయడానికి హిందూ కౌన్సిల్ ఉంది. [10]
- BAPS శ్రీ స్వామినారాయణ మందిర్, అరుష
- ఇస్కాన్ అరుషా సెంటర్, అరుష
- హిందూ దేవాలయం, బరోంగో రోడ్, బుకోబా
- శ్రీ స్వామినారాయణ్ మందిర్, మొరోగోరో రోడ్, దార్ ఎస్ సలామ్
- BAPS శ్రీ స్వామినారాయణ్ మందిర్, ప్రముఖ్ స్వామి వీధి, దార్ ఎస్ సలాం
- శ్రీ సనాతన్ ధర్మ సభ ఆలయం, ప్రముఖ్ స్వామి వీధి, దార్ ఎస్ సలాం
- శ్రీ శంకరాశ్రమ దేవాలయం, ప్రముఖ్ స్వామి వీధి, దార్ ఎస్ సలాం
- ఇస్కాన్ దార్ ఎస్ సలాం సెంటర్, మసీదు వీధి, దార్ ఎస్ సలాం
- హిందూ దేవాలయం, కిలిమా స్ట్రీట్, మోషి
- హిందూ మండల్ ఆలయం, స్టేషన్ స్ట్రీట్, మొరోగోరో
- శ్రీ సనాతన్ ధర్మ మందిర్, మ్వాన్జా
- BAPS శ్రీ స్వామినారాయణ మందిర్, మ్వాన్జా
- శక్తి ఆలయం, జాంజిబార్
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Constance Jones and James D. Ryan, Encyclopedia of Hinduism, ISBN 978-0816073368, pp. 10-12
- ↑ 2.0 2.1 Table: Religious Composition by Country, in Numbers Pew Research Center (2012)
- ↑ W.H. Ingrams (1967), Zanzibar: Its History and Its People, ISBN 978-0714611020, Routledge, pp. 33-35
- ↑ W.H. Ingrams (1967), Zanzibar: Its History and Its People, ISBN 978-0714611020, Routledge, pp. 33-35
- ↑ Prabha Bhardwaj, [1]
- ↑ Both during the German colonial empire before World War I, as well the British colonial rule of Tanzania after World War I
- ↑ G. Oonk (2006), South Asians in East Africa (1880-1920) with a Particular Focus on Zanzibar: Toward a Historical Explanation of Economic Success of a Middlemen Minority, African and Asian Studies, Volume 5, Issue 1, pages 57 – 90
- ↑ A. Keshodkar (2010), Marriage as the Means to Preserve ‘Asian-ness’: The Post-Revolutionary Experience of the Asians of Zanzibar, Journal of Asian and African Studies, 45(2), pp. 226-240
- ↑ List of Hindu temples outside India#Tanzania
- ↑ Organization Archived 2016-03-04 at the Wayback Machine Hindu Council, Tanzania