జె.ఎం.రాజమణిదేవి
జె.ఎం.రాజమణిదేవి భారత జాతీయ కాంగ్రేసుకు చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె 1952లో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై హైదరాబాదు రాష్ట్ర శాసనసభా సభ్యురాలైంది.
రాజమణిదేవి, 1920, ఫిబ్రవరి 10న అప్పటి నిజాం రాజ్య రాజధాని హైదరాబాదులో మాల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి కంతే ముత్తయ్య. ఈమె హైదరాబాదులో సామాజిక, రాజకీయ నాయకుడైన జె.హెచ్.కృష్ణమూర్తిని వివాహం చేసుకున్నది. ఈమె షెడ్యూల్డ్ కులాల సమాఖ్య కార్యకర్త, ఉపాధ్యక్షుడు అయిన కంతే ప్రేమ్‌కుమార్ (కంతే పెంటయ్య) సోదరి. ఈ విధంగా పుట్టింటి వారినుండి, మెట్టింటివైపు వారినుండి సామాజిక, రాజకీయ వారసత్వం అందుకున్నది. ఈమె మాల సమాజ సేవ చేయాలని బలమైన ఉద్దేశంతో ఉండేది. 1944, జూలై 16న, ఈమెకు షెడ్యూల్డ్ కులాల సమాఖ్య జాయింట్ సెక్రటరీ అయ్యే అవకాశం వచ్చింది. ఆ తరువాత ఎస్.సి.ఎఫ్ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా పదవోన్నతి పొందింది.
ఈమె స్వచ్ఛమైన మనస్సుతో, ఏ కల్మషం లేకుండా సమాజసేవకై కృషిచేసింది. ఈమె భాగ్యరెడ్డివర్మ యొక్క వీరాభిమాని. భాగ్యరెడ్డి వర్మ హరిజన సమాజానికి చేసిన సేవలకు ఎంతగా అభిమానించిందంటే, ఆయన చనిపోయినప్పుడు, శ్మశానవాటికలో ఆయన చితిలోకి దూకి సహగమనం చేయటానికి సిద్ధపడింది. అయితే అక్కడున్నవారు, అమెను పట్టుకొని నివారించారు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]1952లో సిరిసిల్ల ద్విసభ్య నియోజకవర్గం. జనరల్ సీటులో జె.ఆనందరావు ఎన్నికకాగా, ఎస్.సి రిజర్వుడు సీటుకు, షెడ్యూల్డ్ కులాల సమాఖ్య (ఎస్.సి.ఎఫ్) పార్టీ తరఫున పోటీ చేసి, కాంగ్రేసు అభ్యర్థి అయిన ఎస్.ఆర్.బాబయ్యను ఓడించి శాసనసభకు ఎన్నికైంది. ఆ తర్వాత కాంగ్రేసు పార్టీలో చేరి, 1957లో సిరిసిల్ల నియోజకవర్గానికి కాంగ్రేసు అభ్యర్థిగా పోటీచేసింది కానీ గెలవలేదు. ఆ ఎన్నికలలో పి.డి.ఎఫ్ అభ్యర్థి కర్రెల్లి నరసయ్య చేతిలో ఓడిపోయింది.[2]
1952 నుండి రాజమణిదేవి కాంగ్రేసు పార్టీలో అనేక కీలక పదవులను చేపట్టింది. ప్రదేశ్ కాంగ్రేసు కమిటీ సభ్యురాలిగా, ప్రదేశ్ కాంగ్రేసు కమిటీ కార్యాచరణ సంఘపు సభ్యురాలిగా, ప్రదేశ్ కాంగ్రేసు మహిళా విభాగానికి కార్యాచరణ సంఘపు సభ్యురాలిగా పనిచేసింది. ఆ తరువాత 1972లో ఇందిరా కాంగ్రేసులో చేరి, సికింద్రాబాదు నుండి శాసనమండలికి ఎన్నికై, 1972 నుండి 1978 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యురాలిగా పనిచేసింది.
మూలాలు
[మార్చు]- ↑ P.R., Venkatswamy (ఫిబ్రవరి 2, 2020). Our Struggle for Emancipation: The Dalit Movement in Hyderabad State, 1906-1953. Hyderabad Book Trust. p. 280. ISBN 978819073779-. Retrieved 29 July 2024.
{{cite book}}
: Check|isbn=
value: length (help) - ↑ Kshīrasāgara, Ramacandra (1994). Dalit Movement in India and Its Leaders, 1857-1956. M.D. Publications. p. 304. ISBN 9788185880433. Retrieved 28 July 2024.