జిరాఫీ
జిరాఫీ జిరాఫా జాతికి ఒక ఆఫ్రికన్ శాకాహార జంతువు. ఇది భూమ్మీద నివసించే అత్యంత ఎత్తైన జంతువు.
జిరాఫీని చూడగానే ఆకర్షించేవి దాని పొడవాటి మెడ, కాళ్ళు, ఇంకా చర్మం మీద మచ్చలు. ఇవి సాధారణంగా గడ్డి మైదానాలు (సవన్నాలు), లేదా అడవిసీమల్లో ఎక్కువగా నివసిస్తాయి. ఆకులు, పండ్లు, అడవి చెట్ల పూలు వీటి ప్రధాన ఆహారం. ఇవి తమ పొడవాటి మెడ సహాయంతో ఇతర శాకాహార జంతువులకు అందని పండ్లను, పూలను కూడా తినగలుగుతాయి.
సింహాలు, చిరుత పులులు, హైనాలు, ఆఫ్రికన్ అడవి కుక్కలు వీటిని వేటాడటానికి సిద్ధంగా ఉంటాయి. ఇవి చాలావరకు గుంపులు గుంపులుగా నివసిస్తూ ఉంటాయి. జిరాఫీలకున్న విచిత్రమైన ఆకారం వలన ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు అనేక సంస్కృతులను ఆకర్షించాయి. ఫలితంగా వీటిని అనేకమైన చిత్రపటాలలోనూ, పుస్తకాలలోనూ, కార్టూన్లలోనూ చిత్రించారు.
అంతర్జాతీయ జంతు సంరక్షణా సంస్థలు దీన్ని అంతరించిపోతున్న జాతికింద చేర్చాయి. కానీ ఇప్పటికీ జాతీయ ఉద్యానవనాలూ, అభయారణ్యాలలో ఇవి విరివిగా కనిపిస్తుంటాయి. 2016 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 97,500 జిరాఫీలు ఉన్నాయి. 2010 గణాంకాల ప్రకారం సుమారు 1600 జిరాఫీలు జంతుప్రదర్శనశాలల్లో ఉంచి పోషిస్తున్నారు.
ఈ జంతువు పేరు అరబిక్ భాషలో జిరాఫా అనే పదం నుంచి వచ్చింది.[1]