చివరకు మిగిలింది?
![](http://upload.wikimedia.org/wikipedia/te/3/32/Chivaraku_migilindi.jpg)
చివరకు మిగిలింది? నవల మార్గరెట్ మిఛెల్ రాసిన గాన్ విత్ ద విండ్ (en:Gone with the Wind) కు తెలుగు అనువాదం. అమెరికా అంత్యర్యుద్ధం పరిణామాలను, ప్రేమకథను, ఆనాటి సామాజిక స్థితిగతులను చిత్రీకరించిన నవలగా బహుళ ప్రజాదరణ పొందింది. అటువంటి నవలను చివరికి మిగిలింది? పేరిట ఎం.వి.రమణారెడ్డి తెలుగులోకి అనువాదం చేశారు.
రచనా నేపథ్యం
[మార్చు]మార్గరెట్ మిఛెల్ చివరకు మిగిలింది? నవలను 1926లో ప్రారంభించి ఐదేళ్ళపాటు కొనసాగించి తుదకు 1931లో పూర్తిచేశారు. దాదాపు మరో ఐదేళ్ళ అనంతరం 1935లో మాక్మిలన్ ప్రచురణ సంస్థ ద్వారా వెలుగుచూసింది. మార్గరెట్ మిఛెల్ ఈ నవలను రాసిన సంగతి నవలా రచనలో సహకరించిన భర్తకు తప్ప మొదట్లో ఎవరికీ తెలియనీయలేదు. 1935లో మాక్మిలన్ ప్రచురణల ప్రకాశకుడు హెరాల్డ్ లేథమ్ అట్లాంటాకు వచ్చారు. అమెరికా దక్షిణ ప్రాంతం నుంచి సత్తా కలిగిన రచయితలను, మంచి రచనలను ఎంపికచేయడం ఆయన పర్యటన ముఖ్యోద్దేశం. జార్జియా రాష్ట్రంలో రచయితలను పరిచయం చేసేందుకు అర్థించగా మిఛెల్ ఆయనకు సహకరించారు. ఆ సమయంలోనే లేథమ్ "మీరేదైనా పుస్తకం రాసివుంటే తప్పనిసరిగా చూపించండి" అని మిఛెల్‌కు చెప్పారు. దానికి ఆమె స్నేహితురాలు "ఈ మిఛెల్ ఎక్కడ, పుస్తకం రాయడమెక్కడ? ఊహించడానికే వీలులేదే" అంటూ వెక్కిరించింది. ఆ మాటకు కోపగించుకున్న మిఛెల్ వెంటనే ఇంటికి వెళ్ళి తను రాసిన నవలకు సంబంధించిన కాగితాల కట్టను తీసుకువెళ్ళి హెరాల్డ్‌కు అప్పగించింది. అట్లాంటా నుంచి వెళ్ళిపోవడానికి తయారవుతున్న లేథమ్ ఆ కాగితాలను కూడా తీసుకుని బయలుదేరారు. న్యూయార్క్ చేరుకున్నాకా కూడా మిఛెల్ తన ప్రతిభపై అపనమ్మకంతో "మీరు దాన్ని గురించి పట్టించుకోవద్దు" అంటూ టెలిగ్రాం పంపారు. ఐతే వారు ఆ పుస్తకాన్ని అచ్చువేశారు. మొదటి మూడు నెలల్లోనే 18లక్షల కాపీలు అమ్ముడుపోవడంతో ఈ నవల చరిత్ర సృష్టించింది. 1998 వరకూ ప్రపంచవ్యాప్తంగా రెండుకోట్ల కాపీలు అమ్ముడుపోయింది. 1937లో ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ బహుమతి లభించింది. 1939లో ఈ నవలను ఆధారం చేసుకుని హాలీవుడ్‌లో తయారైన గాన్ విత్ ద విండ్ సినిమా బహుళాదరణ పొందింది.
ఈ ఆంగ్లనవలను మాలతీ చందూర్ తన ఆంగ్ల నవలా పరిచయాల్లో భాగంగా ఈ గ్రంథాన్ని గురించి పరిచయం చేశారు. ఆ పరిచయాన్ని చదివి గాన్ విత్ ద విండ్‌పై ఇష్టాన్ని పెంచుకుని, ఆంగ్లంలో మూలగ్రంథాన్ని మొదటిసారి చదివిన రమణారెడ్డి చివరకు ఈ గ్రంథాన్ని అనువదించేంతవరకూ వెళ్ళారు.