Jump to content

చిల్లర దేవుళ్ళు (నవల)

వికీపీడియా నుండి
చిల్లర దేవుళ్ళు
"చిల్లర దేవుళ్ళు" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: దాశరథి రంగాచార్య
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: పూర్వపు నైజాం ప్రాంతంలోని తెలంగాణ పల్లెలో తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు కాలం
ప్రచురణ:
విడుదల: 1970
పేజీలు: 130

చిల్లరదేవుళ్ళు డా.దాశరథి రంగాచార్య రచించిన నవల. పూర్వపు నైజాం ప్రాంతంలోని తెలంగాణ పల్లెలో తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు కాలాన్ని నవలలో చిత్రీకరించారు. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన నవల.[1]

నవల నేపథ్యం

[మార్చు]

తెలంగాణా సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను సవివరంగా దాశరథి రంగాచార్యులు రచించిన నవలల్లో చిల్లర దేవుళ్లు మొదటి నవల. ఈ నవలల మాలికను రచయిత ప్రారంభించడానికి చారిత్రిక నేపథ్యం ఉంది.
వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, గంగు వంటి నవలల ద్వారా నాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. ఆ నవలల ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారు స్వామి మరణించారు. సాయుధపోరాట యోధులుగా, సాహిత్యవేత్తలుగా ఆళ్వారుస్వామికీ, రంగాచార్యులకూ సాన్నిహిత్యం ఉండేది. పోరాటానికి పూర్వం, పోరాట కాలం, పోరాటం అనంతరం అనే విభజనతో నవలలు రాసి పోరాటాన్ని నవలలుగా రాసి అక్షరీకరించాలనీ, అది పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సాహిత్యవేత్తలపై ఉన్న సామాజిక బాధ్యత అనే అభిప్రాయాలను వారిద్దరూ పంచుకున్నవారే కావడంతో ఆళ్వారుస్వామి మరణానంతరం ఆ బాధ్యతను రంగాచార్యులు స్వీకరించారు. ఆ నవలా పరంపరలో తొలి నవలగా 1942వరకూ ఉన్న స్థితిగతులు "చిల్లర దేవుళ్లు"లో కనిపిస్తాయి.
నాణానికి మరోవైపు చూస్తే తెలంగాణ పోరాటం ముగిసిన దశాబ్దికి కొందరు నిజాం రాజును మహనీయునిగా, ఆ నిజాం రాజ్యస్థితిగతులను ఆదర్శరాజ్యానికి నమూనాగా పలు రాజకీయ కారణాల నేపథ్యంలో కీర్తించారనీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుని, ప్రాణాన్ని లెక్కచేయక నిజాంను ఎదిరించిన తమకు ఆనాటి దుర్భర స్థితిగతుల్ని ఇలా అభివర్ణిస్తూంటే ఆవేశం వచ్చేదని రంగాచార్య ఒక సందర్భంలో పేర్కొన్నారు. నిజాం రాజ్యంలో బానిసల్లా జీవించిన ప్రజల స్థితిగతులను, మానప్రాణాలను దొరలు కబళించిన తీరును ఆ నేపథ్యంలో ప్రపంచమే ఆశ్చర్యపోయేలా సాగిన తెలంగాణా సాయుధపోరాటం, పోరాటానంతర స్థితిగతులు వంటివి భావితరాలకై అక్షరరూపంగా భద్రపరచదలిచిన ఆళ్వారుస్వామి ప్రణాళికను స్వీకరించినట్టు రచయిత తెలిపారు..[2]

ఇతివృత్తం

[మార్చు]

చిల్లర దేవుళ్లు కథాకాలం 1936-42 ప్రాంతంలోనిది. కథాస్థలం తెలంగాణాలోని ఓ చిన్న పల్లెటూరు. నవల ప్రారంభంలో సారంగపాణి అనే సంగీత ఉపాధ్యాయుడు బతుకుతెరువు కోసం విజయవాడ నుంచి ఆ ఊరికి వస్తాడు. ఊరి నడుమ దేశ్‌ముఖ్ రామారెడ్డి గడీ ఉంటుంది. అది ఊరి మొత్తానికీ ఏకైక భవంతి కాగా కరణం వెంకట్రావుతో పాటుగా మరికొందరికి మాదిరి ఇళ్ళు ఉంటాయి. మిగతా ఊరందరివీ గుడిసెలు. నిజాం పాలనలో లభించిన విపరీతమైన అధికారాలతో దొర, కరణం ఊరిని పరిపాలిస్తూ ఉంటారు. సంగీతం పట్ల ఆసక్తి ఉన్న దొర పాణికి తన గడీలో ఆశ్రయమిస్తాడు. రోజూ పాణి పాట వింటూ, అతనికి ఊళ్ళో కరణం కూతురు తాయారుతో పాటుగా రెండు మూడు సంగీత పాఠాలు ఏర్పాటుచేస్తాడు.

పాణికి పోనుపోనూ ఊళ్ళో దొరది ఎదురులేని శాసనమని తెలుస్తుంది. చిన్న చిన్న తప్పులు చేసినా, తన అధికారాన్ని ఏమాత్రం తక్కువచేసినా దొర ఎలాంటి కఠినశిక్షలు విధిస్తాడో తెలుస్తూంటుంది. దొరకీ కరణానికి వైరం ఉన్నా జనాన్ని అణచివేయాల్సి వస్తే మాత్రం ఏకమైపోవడం కూడా చూస్తాడు. గడీలో ఆడబాపగా పనిచేస్తున్న వనజది వేశ్య కన్నా దారుణమైన జీవితం. ఐతే ఆమె సారంగపాణిని ప్రేమిస్తుంది. దొర కూతురు మంజరి, మరోవైపు కరణం కూతురు తాయారు కూడా అతనిపై మనసుపడతారు. తాయారు మరో అడుగు ముందుకువేసి తనను పెళ్ళిచేసుకుంటే తండ్రి కరణీకం ఇప్పిస్తాననీ, లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనీ హెచ్చరిస్తుంది.

మరో వైపు భూతగాదాల్లో లంబాడీలను కరణం మోసం చేయగా ఆదుకోవాల్సిన పోలీసులు కరణానికి మద్దతుగా ప్రజలపైనే కాల్పులు జరుపుతారు. ఓ లంబాడీ స్త్రీపై అత్యాచారం చేయబోగా ఆత్మగౌరవంతో ఆ ప్రయత్నం నుంచి కాపాడుకునేందుకు పోలీసు అధికారిని చంపుతుంది. ఆ వెంటనే తానూ ఆత్మహత్య చేసుకుంటుంది. నిజాం మనుషులు కూలీలను బలవంతంగా ముస్లిం మతంలోకి మారిస్తే, ఆ తర్వాత అటు హిందువులూ కాలేక, ఇటు ముస్లిములుగానూ మనలేక పడే బాధలూ చిత్రీకరించింది. దొర బండి రోడ్డుపై వెళ్తూన్న సమయంలో బండికి ముందు మనిషి తప్పుకోమని అరుస్తూ పరుగులు పెట్టడం వంటివి చూపించారు. ఆ పనిచేసే మనిషి వెట్టిచాకిరీతో తిండి లేక ఎంత కునారిల్లిపోతాడో కూడా చిత్రించారు. నిజాం పాలనలో దెబ్బ తింటున్న తెలుగు భాషా సంస్కృతుల సముద్ధరణకు కంకణం కట్టిన మాడపాటి హనుమంతరావు కృషిని పాణి తెలుసుకోవడమూ నవలలో ఉంటుంది. ఈ నేపథ్యంలో కథ ఎలా మలుపులు తిరిగి చివరకు ఏమైందనేది మిగిలిన ఇతివృత్తం.

శైలి-శిల్పం

[మార్చు]

చిల్లరదేవుళ్ళు నవలను రాయడంలో రచయిత ఉద్దేశం సాయుధపోరాటానికి ముందున్న తెలంగాణా స్థితిగతులు చిత్రీకరించడం. అందుకే చివర్లో కొన్ని పాత్రల ప్రవర్తన సహజత్వానికి బాగా దూరంగా, కార్యకారణ సంబంధం లేకుండా ఉందని కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు. చిల్లరదేవుళ్ళులో వ్యక్తుల సంభాషణలకు తెలంగాణా యాసనే ఉపయోగించినా, కథనాన్ని మాత్రం ఆనాటి శిష్టవ్యవహారికంలోనే నడిపించారు.

పాత్రలు

[మార్చు]

నవలలోని ముఖ్యమైన పాత్రలు ఇవి:

సారంగపాణి: కథానాయకుడు. విజయవాడ నుంచి బతుకుతెరువుకై తెలంగాణా కుగ్రామానికి వచ్చిన సంగీతోపాధ్యాయుడు.

మంజరి:

రామారెడ్డి:

వెంకట్రావు:

వనజ:

తాయారు:

మాడపాటి హనుమంతరావు:

మూలాలు

[మార్చు]
  1. India, The Hans (2015-06-09). "'Modugu Poolu' won't fade away". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-09.
  2. డా.దాశరథి రంగాచార్యులు ఆత్మకథ "జీవన యానం"

ఇవి కూడా చూడండి

[మార్చు]