Jump to content

చర్చ:వారసవాహిక

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

క్రోమోసోము పేజీని వారస వాహిక పేజీని మెర్జ్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చేరు.

ప్రస్తుతం "క్రొమోజోము" పేజీలో ఉన్న ఉపోద్ఘాతం అంతా తెలుగులోనే ఉంది - ఒక్క శీర్షికలోనే ఇంగ్లీషు మాట తెలుగు లిపిలో ఉంది. ఈ పేజీలో ఉన్న టేబుల్‌, బొమ్మ, రెఫరెన్సులు ఇక్కడనుండి "వారసవాహిక" ల పేజీలోకి మార్చి, ఈ పేజీలో ఉన్న కొద్దిపాటి తెలుగు ఉపోద్ఘాతాన్నీ కొంచెం కొరుకుబడేటట్లు తెలుగులో తిరగ రాస్తే సరిపోతుందని నా అభిప్రాయం.

క్రోమోజోముకి నేను వాడిన తెలుగు మాట అందరికీ తెలియదు కనుక "వారసవాహిక (క్రోమోసోమ్‌)" అని ముందు తెలుగు మాటనీ, తరువాత ఇంగ్లీషు మాటనీ శీర్షికలో పెడితే తెలుగులో "వెతికి"నప్పుడు ఈ పేజీ వస్తుందో లేదో చూడాలి. ఈ ఇబ్బంది ఒక్క క్రోమోజోమ్‌ విషయం లోనే కాదు తెలుగులో రాసిన ఏ సాంకేతిక పదం తో అయినా వస్తుంది. నా మాట మీద నమ్మకం లేక పోతే ప్రస్తుతం "క్రోమోజోమ్‌" పేజీలో ఉన్న మొదటి పేరా చదివితే ఎంతమందికి అర్ధం అవుతుంది అన్న ప్రశ్న వేసుకొండి. అక్కడ చాలా సాంకేతిక పదాలు తెలుగులో ఉన్నాయి. చదివి అర్ధం అయిందో లేదో చెప్పండి. నేను చదివేను. అర్ధం కాలేదు. కాని అర్ధం చేసుకుందుకి ప్రయత్నిస్తాను. ఎందువల్ల? తెలుగులో రాయాలన్న కోరిక ఉంది కనుక!

నేను గమనించినది ఏమిటంటే ఇంగ్లీషు వికీలో ఉన్న పదార్ధాన్ని యధాతధంగా తెలుగు వికీలోకి దింపేసి దాన్ని తర్జుమా చేస్తే రాణించదు. దీనికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ రెండు భాషలలోనూ కర్త, కర్మ, క్రియ వ్యతిరిక్త దిశలలో నడుస్తాయి. పైగా తెలుగులో పేసివ్‌ వాయుస్‌ అంతగా రాణించదు. మనకి పేస్ట్ పెరఫెక్ట్‌ టెన్స్ లాంటివి లేవు. కనుక ఇంగ్లీషులో ఉన్నది అర్ధం చేసుకుని, దాని తెలుగులో నెమరు వెయ్యగలగాలి. రెండు, తెలుగులోసాంకేతిక విషయాలు రాసే సంప్రదాయం మనకి ఇంకా బాగా నాటుకోలేదు. కనుక చదివే అలవాటూ నాటుకోలేదు. సైన్సు తెలిసిన వాళ్ళకి కూడా తెలుగులో సైన్సు చదవటం అలవాటు లేదు కనుక కొంచెం నిర్వచనాలు, వివరణలు మధ్యలో జొప్పిస్తూ రాయకపోతే పేలవంగా తయారవటమే కాకుండా అర్దం అవకపోవచ్చు కూడా.

నేను ఇంత వివరంగా రాయటానికి కారణం ఏమిటంటే తెలుగు వికీ లో చాల పేజీలు (సైన్సుకి సంబంధించినవి) తెలుగులో రాయటానికి ప్రయత్నించి, నాలుగు వాక్యాలు ప్రయత్నించి వదిలేసినవే. దీనికి కారణం ఎవ్వరయితే ఈ ప్రయత్నం చేసేరో వారు తర్జుమా చెయ్యలేక పోయి ఉండాలి, లేదా బద్దకించి వదిలేసి ఉండాలి. ఇంగ్లీషులోంచి తెలుగులోకి సులభమైన శైలిలో తర్జుమా చెయ్యటం తేలిక పని కాదు.

మనం ఇంగ్లీషులో ఉన్న మాటలన్నీటిని టోకు ఎత్తున తెలుగులోకి మార్చలేము. ఏవో కొద్దో గొప్పో ప్రయత్నం చేసి చూడగలం అంతే. ఇంగ్లీషు మాటలనే తెలుగు లిపిలో రాసుకుంటే సరిపోతుందికదా అనే వాదన ఇప్పటిది కాదు. దాని లాభాలు దానికి ఉన్నాయి. అటువంటి లాభాలు పొందగోరేవారు ఇంగ్లీసు వికీనే సంప్రదిస్తారు, తెలుగు వికీ జోలికి రారు. Vemurione 06:18, 31 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]