Jump to content

చతుర్వేదుల వెంకట రాఘవయ్య

వికీపీడియా నుండి

చతుర్వేదుల వెంకట రాఘవయ్య స్వగ్రామం నెల్లూరుకు 6మైళ్ళ దూరంలోని, పెన్నానది వడ్డున ఉన్న పల్లిపాడు అగ్రహారం. ఈయన సుందరరామశర్మ కుమారుడు. రాఘవయ్య స్కూల్ టీచరుగా చేసాడు. ఈయన పత్రికాధిపతి, సంపాదకుడు కూడా. 1903లో నెల్లూరు స్థానిక వార్తలను ప్రచురించడానికి, నెల్లూరునుంచి "హిందూ బాంధవి" పక్షపత్రికను నెలకొల్పాడు. నెల్లూరులో మునిసిపాలిటీ కొళాయిలను ప్రవేశపెట్టినపుడు అవి ధనికులకు మాత్రమే ఉపయోగిస్తాయని వ్యతిరేకించాడు. జాతీయ భావాలతొపాటు ఈయనకు హిందూ మతాభినివేశం కూడా ఎక్కువ.ఈయన బాలగంగాధర తిలక్ అభిమాని. హిందూ బాంధవి పత్రిక ఎక్కువ కాలం కొనసాగినట్లు లేదు. ఈయన కుమారుడ సి.వి.కృష్ణ 1915-16 విప్లవోద్యమంలో, తర్వాత గాంధీజీ అభిమానిగా పల్లిపాడులో పినాకిని సత్యాగ్రహాశ్రమాన్ని నెలకొల్పిన ప్రముఖులలో ఒకరు.

ఈయన ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొనినందుకు 5-7-1930న అయిదు నెలల కఠిన కారాగార శిక్ష, 50/రూపాయల జుల్మానా, జుల్మానా చెల్లించక పొతే మరొక నెల సాధారణ జైలు శిక్ష వివిధించబడింది. వెల్లూరు, ఆలీపురు జైళ్లలో శిక్షాకాలం ఉన్నాడు. జుల్మానా చెల్లించనందున మరొక నెల శిక్షకూడా అనుభవించాడు.

గాంధిజీ 1929లో పల్లిపాడు ఆశ్రమానికి వచ్చి ఆరాత్రి నిదురించిన సందర్భంలో, పినాకిని సత్యాగ్రహాశ్రమంలో బ్రాహ్మణులకు, ఇతరులకు ఓకేబావి వాడుకలో ఉన్నదని, బ్రాహ్మణులకు, ఇతరులకు రెండు బావులు ఏర్పాటు చేయవలసిందిగా కోరాడు. గాంధీజీ ఆ అభ్యర్ధనను తిరస్కరించారు. ఆశ్రమవాసులలో బ్రాహ్మణులు కర్మకాండ, తిథులు జరుపుకోడానికి పౌరోహితులెవరూ రావడంలేదని, కనుక ఈ వెసులుబాటు కలిగించమని కోరాడు. 1929 ప్రాంతంలో ఆయన హిదూ బాంధవి పత్రికను పునరుద్హరించి తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల పత్రికగా నిర్వహించాడు. ఆశ్రమంలో రెండు బావుల విధానానికి అనుమతివ్వమని గాంధీజీని కోరుతూ ఇంగ్లీషులో సంపాదకీయం కూడా రాసాడు.

తన ఏకయిక కుమారుడు సి.వి.కృష్ణ అస్పృశ్యతను పాటించకుండా గ్రామాల్లోకి హరిజనులను తీసుకొని రావడం, వారితో కలిసి భోజనం చేయడం వంటివి సహించలేక 1932 ప్రాంతంలో ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఆజూకి తెలియలేదు.

మూలాలు:1.who's who of freedom struggle in Andhra Pradesh, volume three,: Editor : Sarojini Regani page 52. 2. పినాకినీ తీరంలో మహాత్మా గాంధీ , సంపాదకులు:ఇ.ఎస్ .రెడ్డి. ఆర్. సుందరరావు , వాణీ ప్రచురణలు, కావాలి.2004. 3. పెన్న ముచ్చట్లు, రచయిత : కాళిదాసు పురుషోత్తం, పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ, 2018.4. జమీన్ రైతు పత్రిక సంపుటాలు.