గ్వాలియర్ రెసిడెన్సీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 

గ్వాలియర్ రెసిడెన్సీ
బ్రిటిషు భారతదేశంలో ఏజెన్సీ

1782–1947
Location of గ్వాలియర్ రెసిడెన్సీ
Location of గ్వాలియర్ రెసిడెన్సీ
1909 లో మధ్య భారతదేశం మ్యాపు. గ్వాలియర్ రెసిడెన్సీ ఉత్తర్ పశ్చిమ సెక్టార్లలో ఉంది
చరిత్ర
 -  సాల్బాయ్ ఒప్పందం 1782
 -  మధ్య భారత ఏజెన్సీ నుండి గ్వాలియర్‌ను వేరుచేసారు 1921
 -  రాంపూర్, బెనారస్‌లను గ్వాలియర్ రెసిడెన్సీకి బదలాయించారు 1936
 -  భారతదేశ స్వాతంత్ర్యం 1947
విస్తీర్ణం
 -  1901 46,167 km2 (17,825 sq mi)
జనాభా
 -  1901 21,87,612 
Density 47.4 /km2  (122.7 /sq mi)

గ్వాలియర్ రెసిడెన్సీ, బ్రిటిషు భారతదేశంలో ఒక రాజకీయ కార్యాలయం. ఇది 1782 నుండి 1947లో భారతదేశం నుండి బ్రిటిషువారు వెళ్ళిపోయే వరకు ఉనికిలో ఉంది.

గ్వాలియర్ రెసిడెన్సీ 1854లో సెంట్రల్ ఇండియా ఏజెన్సీ క్రింద ఉండేది. 1921లో దాని నుండి వేరు చేసారు.

రెసిడెన్సీ కింద ఉన్న రాజ్యాలు

[మార్చు]

గ్వాలియర్ రెసిడెన్సీ మధ్య భారతదేశంలోని అనేక రాచరిక సంస్థానాలతో వ్యవహరించింది. ప్రాధాన్యత క్రమంలో సెల్యూట్ స్టేట్స్ :

  • ప్రధానంగా గ్వాలియర్ సంస్థానం, బిరుదు మహారాజా సింధియా, 21-తుపాకుల వంశపారంపర్య వందనం
  • రాంపూర్, బిరుదు నవాబ్; 15-తుపాకుల వంశపారంపర్య వందనం
  • బెనారస్ (రామ్‌నగర్), బిరుదు మహారాజా, 13-తుపాకుల వంశపారంపర్య వందనం (15-తుపాకులు స్థానికం)

నాన్-సెల్యూట్ రాష్ట్రాలు :

టోంక్ రాష్ట్రంలోని ఛాబ్రా పరగణ (జిల్లా) కూడా

చరిత్ర

[మార్చు]

1782లో బ్రిటీషు వారికి, గ్వాలియర్ మహారాజా మహద్జీ సింధియాకు మధ్య సల్బాయి ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ ఒప్పందాన్ని రూపొందించడంలో సహకరించిన డేవిడ్ ఆండర్సన్ గ్వాలియర్ దర్బారులో రెసిడెంటుగా నియమితుడయ్యాడు. 1810లో మహద్జీ వారసుడు దౌలత్ రావ్ సింధియా, తన ప్రధాన కార్యాలయాన్ని గ్వాలియర్ కోట దగ్గర, ప్రస్తుతం లష్కర్ నగరం ఉన్న ప్రదేశంలో శాశ్వతంగా స్థాపించాడు. అప్పటి వరకు అతని సభ ఒక కదిలే శిబిరంలాగా ఉండేది. దౌలత్ రావ్ సింధియా మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం ముగింపులో 1817లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంతో సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేయవలసి వచ్చింది. 1854 లో గ్వాలియర్ రెసిడెన్సీని సెంట్రల్ ఇండియా ఏజెన్సీ అధికారం కింద ఉంచే వరకు, గ్వాలియర్‌లోని రెసిడెంటు, నేరుగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకు రిపోర్టు చేసేవాడు. గ్వాలియర్ కోటను 1857 భారత తిరుగుబాటు సమయంలో తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. 1858లో బ్రిటిష్ దళాలు దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. 1886 వరకు కోటను తమ అధీనంలో ఉంచుకున్నారు. 1860లో గుణ వద్ద మధ్య భారతానికి నాయకత్వం వహించే అధికారి ఆధ్వర్యంలో చిన్న రాష్ట్రాలను ప్రత్యేక ఛార్జ్‌గా ఇచ్చారు. ఈ ఏర్పాటును 1896లో రద్దు చేసి, ఈ రాజాలను మళ్లీ రెసిడెంట్ కింద ఉంచారు. గుణ వద్ద కమాండింగ్ అధికారి చాలా పరిమిత అధికారాలతో రెసిడెంట్‌కు ఎక్స్ అఫీషియో అసిస్టెంట్‌గా పని చేయడం కొనసాగించారు. 1888లో ఖనియాధానా రాజ్యాన్ని బుందేల్‌ఖండ్ ఏజెన్సీ నుండి గ్వాలియర్‌లోని నివాసికి బదిలీ చేసారు. 1895 లో గ్వాలియర్ రాజ్యం లోని జిల్లాలైన భిల్సా, ఇసాగఢ్‌లను భోపాల్ ఏజెన్సీ నుండి గ్వాలియర్ రెసిడెన్సీకి బదిలీ చేసారు. 1921లో గ్వాలియర్ రెసిడెన్సీని సెంట్రల్ ఇండియా ఏజెన్సీ నుండి వేరు చేసారు. రెసిడెంటు మళ్లీ గవర్నర్ జనరల్‌కు నేరుగా రిపోర్టు చేసాడు. గతంలో యునైటెడ్ ప్రావిన్స్‌ల అధీనంలో ఉన్న బెనారస్, రాంపూర్ రాచరిక సంస్థానాలను, 1936 లో గ్వాలియర్ రెసిడెంటు అధికారం క్రింద ఉంచారు.

రెసిడెంటు, గ్వాలియర్ పాలకుడికి గుర్తింపు పొందిన అధికారిగా, సాధారణ పాలసీకి సంబంధించిన అన్ని విషయాలలో కూడా పాలకుడికి, మాల్వా అండ్ భోపవార్ ఏజెంట్ల వంటి ఇతర రాజకీయ అధికారుల మధ్య కమ్యూనికేషన్ ఛానెల్‌గా ఉండేవాడు. వీరి ఛార్జీలు గ్వాలియర్ రాజూంలో అక్కడక్కడా ఉండేవి. అతను రెసిడెన్సీలో చిన్నచిన్న అంశాళను కూడా నిశితంగా పర్యవేక్షించేవాడు. ఏమాత్రం ప్రాముఖ్యత ఉన్న నేరాలన్నింటిలోనూ అతను వ్యక్తిగతంగా జోక్యం చేసుకునేవాడు, లేదా అతని అనుమతి కోసం వచ్చేవి. అతనికి గ్వాలియర్, డాటియా, సంథార్, ఖనియాధాన, ఛబ్రా పరగణా రాజ్యాల గుండా వెళ్ళిన గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేలోని మిడ్‌లాండ్, బినా-బరన్ విభాగాల భాగాలకు జిల్లా, సెషన్ న్యాయమూర్తి అధికారాలు కూడా ఉండేవి.

రాజకీయ అధికారి ప్రధాన కార్యాలయం, ది రెసిడెన్సీ అని పిలువబడే ప్రాంతంలో ఉండేది. ఇది, మోరార్‌కు దగ్గరగా, గ్వాలియర్ కోటకు తూర్పున నాలుగు మైళ్ల దూరంలో 1.17 చదరపు మైళ్లు (3.0 కి.మీ2) విస్తీర్ణంలో ఉండేది. ఈ ప్రాంతం, చుట్టుపక్కల ఉన్న మూడు గ్రామాలు రెసిడెంటు పాలనలో ఉండేవి. దీని నుండి వచ్చే ఆదాయం రెసిడెన్సీ నిర్వహణకు కేటాయించబడింది. 1901లో రెసిడెన్సీ జనాభా 1,391. గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్‌రోడ్, గ్వాలియర్ లైట్ రైల్వేలు, ఆగ్రా - బొంబాయి, భింద్ - ఝాన్సీ హై రోడ్లు ఈ ప్రాంతం గుండా వెళ్ళేవి.

గ్వాలియర్ రెసిడెన్సీ భారత స్వాతంత్ర్యం తర్వాత 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి సమయంలో రద్దు చేసారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి, భారతదేశంలోని రాచరిక సంస్థాలకూ మధ్య ఉన్న అన్ని ఒప్పంద సంబంధాలను రద్దు చేసారు. సంస్థానాల పాలకులు 1947 - 1950 మధ్య భారత ప్రభుత్వంలో చేరారు. గ్వాలియర్ సంస్థానంతో సహా చాలా వరకు గ్వాలియర్ రెసిడెన్సీని కొత్త భారత రాష్ట్రమైన మధ్యభారత్‌లో విలీనం చేసారు. రాంపూర్, బెనారస్‌లు ఉత్తర ప్రదేశ్‌కు వెళ్లాయి. మధ్యభారత్ 1956 నవంబరు 1 న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైంది.[1]

జనాభా, భౌగోళికం

[మార్చు]

1901లో రెసిడెన్సీ జనాభా 21,87,612, వీరిలో హిందువులు 18,83,038 లేదా 86 శాతం; అనిమిస్టులు 1,70,316, లేదా 8 శాతం; ముస్లింలు 1,03,430, లేదా 4 శాతం; జైనులు 30,129, లేదా 1 శాతం. 1901లో ఈ రెసిడెన్సీ వైశాల్యం 17,825 చదరపు మైళ్లు (46,170 కి.మీ2) ఉండేది. అందులో 17,020 చదరపు మైళ్లు (44,100 కి.మీ2) గ్వాలియర్ సంస్థానానికి చెందినది. జనాభా సాంద్రత చదరపు మైలుకు 123 మంది. 1931 నాటికి రెసిడెన్సీ పరిధిలోని ప్రాంతాల జనాభా 35 లక్షలకు పెరిగింది.

1901లో రెసిడెన్సీలో 6,820 గ్రామాలు, 16 పట్టణాలు ఉండేవి. వీటిలో ప్రధానమైనవి లష్కర్, మోరార్, గ్వాలియర్, గుణ, భింద్, భిల్సా, నార్వార్, ఉజ్జయిని, చందేరి. భిల్సా, మోరెనా, ఉజ్జయిని, గుణ లు ధాన్యం వ్యాపారానికి కేంద్రాలు కాగా, చందేరి చక్కటి వస్త్రాల తయారీకి ప్రధాన కేంద్రంగా ఉండేది.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Markovits, Claude (ed.) (2004). A History of Modern India: 1480-1950. Anthem Press, London.
  2. Hunter, William Wilson, Sir, et al. (1908). Imperial Gazetteer of India, Volume 12. 1908-1931; Clarendon Press, Oxford.