Jump to content

గుళ్ళపల్లి నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
గుళ్ళపల్లి నాగేశ్వరరావు
వేమలగిరి లో సందేశం ఇస్తున్న గుళ్ళపల్లి నాగేశ్వరరావు
జననంగుళ్ళపల్లి నాగేశ్వరరావు
1945 సెప్టెంబరు 1,
చోడవరం (నాగాయలంక మండలం)
ఇతర పేర్లు"నాగ్"
వృత్తినేత్ర వైద్యులు
ప్రసిద్ధియల్.వి. ప్రసాద్ కంటి వైద్యశాల
Notable work(s)అంధత్వ నిర్మూలన కార్యక్రమం
మతంహిందూమతం
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం - 2002

గుళ్ళపల్లి నాగేశ్వరరావు, ప్రముఖ నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత. యల్.వి. ప్రసాద్ కంటి వైద్యశాల వ్యవస్థాపకులు.

జననం

[మార్చు]

గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు సొంత ఊరు కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు. సెప్టెంబర్ 1, 1945లో అమ్మమ్మగారి ఊరు చోడవరం (నాగాయలంక మండలం)లో జన్మించాడు. తాతగారు కోవెలమూడి రాఘవయ్య స్వాతంత్ర్య సమరయోధుడు.తొలి ఉపాధ్యాయుడు సీతారామయ్య.

విద్య, వైద్యం

[మార్చు]

ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో పి.యు.సి, గుంటూరు వైద్య కళాశాలలో యం.బి.బి.యస్ చదివాడు. తరువాత ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో కంటి జబ్బులకు సంబంధించిన ప్రత్యేక కోర్స్ చేశాడు. 1974లో ఉన్నత విద్యకై బోస్టన్, అమెరికా వెళ్ళాడు. రోచస్టర్ విశ్వవిద్యాలయము వైద్య కళాశాలలో వైద్యునిగా, బోధకునిగా 1986వరకు కొనసాగాడు. అంతర్జాతీయ కంటి వైద్యశాస్త్ర రంగములో "నాగ్" పేరుతో నాగేశ్వరరావు ప్రఖ్యాతి గాంచాడు.

యల్.వి. ప్రసాద్ కంటి వైద్యశాల

[మార్చు]

యల్.వి. ప్రసాద్ తనయుడు రమేష్ ప్రసాద్ ప్రోద్బలముతో హైదరాబాదులో "యల్.వి. ప్రసాద్ కంటి వైద్యశాల" స్థాపించడానికి మూల కారకుడు. ఈ కంటి వైద్యశాలను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థగా రూపొందించాడు.

కంటికి సంబంధించిన వ్యాధులపై 250 పరిశోధన వ్యాసాలు వ్రాశాడు. నాగేశ్వరరావు ఆధ్వర్యములో 2,50,000 మందికి కంటి శస్త్రచికిత్సలు జరిగాయి[1]. వీరు అంతర్జాతీయ అంధత్వ నిరోధక సంస్థకు అధ్యక్షుడి పనిచేస్తున్నారు.

పురస్కారాలు

[మార్చు]

అంధత్వ నివారణకు చేసిన సేవలకు గాను నాగేశ్వరరావుకు పలు పురస్కారాలు లభించాయి. పలు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి.[2]

  • భారత శాస్త్ర అకాడెమీ ఫెలోషిఫ్
  • 1983 లో అమెరికా కంటివైద్యశాస్త్ర అకాడెమి పురస్కారము
  • 1996 లో భారత జాతీయ వైద్యశాస్త్ర అకాడెమి ఫెలోషిఫ్
  • 2002 లో భారత పర్భుత్వము నుండి పద్మశ్రీ పురస్కారం
  • 2006 లో ప్రపంచ అంధత్వనిరోధక పురస్కారము - అమెరికా కంటి వైద్యశాస్త్ర అకాడెమి

మనోగతం

[మార్చు]
  • పల్లెటూళ్లో పెరగకపోతే మంచి వైద్యుడు కావడం కష్టం. సామాన్యుడి కష్టసుఖాలు నాకు తెలిసేలా చేసింది మా ఊరే. ఈడుపుగల్లు వంటి పల్లెటూళ్లో పెరగడం అనేది నా అదృష్టం అనుకుంటాను. అక్కడ పెరిగిన కాలమే నా జీవితంలో అత్యంత విలువైన కాలం. పల్లెటూరిలో పుట్టిపెరిగినవారు మెడిసిన్‌లోకి వెళితే మాత్రం మంచి వైద్యులు కాగలరని, బాగా పేరు తెచ్చుకోగలరని నా అభిప్రాయం. ఎందుకంటే పల్లెటూళ్లో కనీసం కొన్నేళ్లు పెరిగితే సామాన్య మానవుల కష్టసుఖాలు ఏమిటో అర్థమవుతాయి. ఏదో సెలవులకు చుట్టపుచూపుగా వెళితే అర్థమయ్యే విషయాలు కావు అవి.
  • ఈడుపుగల్లుకు 1950 - 52లో విద్యుత్ సౌకర్యం వచ్చింది. కరెంటుతో వెలిగే బల్బు, ఫ్యానులను చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్లం. చెబితే నవ్వుతారేమోగాని, మా ఊళ్లో మొట్టమొదట లావెట్రీ కట్టించింది మైనరుగారే. ఊరుఊరంతా వచ్చి దాన్ని అబ్బురంగా చూసి వెళ్లడం నాకింకా గుర్తుంది.
  • వైద్యులనే కాదు, ఏ రంగంలో రాణించాలన్నా పల్లెటూళ్ల జీవన శైలి తెలిసి ఉండటం మంచిదని నేననుకుంటాను. 'పుట్టినూరి నుంచి ఒక మనిషిని బైటికి తీసుకురాగలం గాని మనిషిలోంచి సొంతూరిని తీసెయ్యలేం' అని ఒక ఇంగ్లీషు సామెత ఉంది. అలా నేను ఈడుపుగల్లు నుంచి బైటికొచ్చి చాలా దూరం ప్రయాణించానుగాని, నా లోపల మా ఊరు ఇప్పటికీ అలాగే సజీవంగా ఉంది. మా ఊరు నన్ను మంచి వైద్యుణ్ని చేసింది, అంతకన్నా మిన్నగా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దింది.
  • సాధారణంగా పల్లెటూళ్ల నుంచి వైద్యవృత్తిలోకి వచ్చేవాళ్లు - వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లినప్పుడు, పది పదిహేనేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చేద్దామని అనుకుంటారు. కాని వెళ్లిన తర్వాత ఎక్కువమంది ఆ ఆలోచనను మర్చిపోతారు. నేను ఎన్ని దేశాలు తిరిగినా తొలినాటి ఆలోచనను మర్చిపోకుండా, మారిపోకుండా మళ్లీ మన దేశానికి వచ్చెయ్యడం, ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థను తాడిగడపలో ప్రారంభించడం వెనక మా ఊరి ప్రభావం ఎంతో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 82
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-04-01. Retrieved 2010-06-30.

వెలుపలి లంకెలు

[మార్చు]