గీత గోవిందం
గీత గోవిందం జయదేవుడు రచించిన సంస్కృత కావ్యం. దీన్నే అష్టపదులు అని కూడా అంటారు. ఈ కావ్యం రాధాకృష్ణుల మధ్య ప్రేమను, విరహ వేదనను వర్ణిస్తుంది.[1][2] వంగ దేశంలో 12వ శతాబ్దంలో జన్మించిన[3] ఈ కావ్యం భారతదేశమంతటా ప్రాచుర్యం పొందింది. సంగీత నృత్య రూపకాలలో ఈ అష్టపదులను తరచుగా ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒడిషా, అస్సాం రాష్ట్రాల లలిత కళలపై గీత గోవిందం ప్రభావం ఉంది.
జయదేవుని గీతగోవిందంలో మొత్తం 83 గీతాలున్నాయి. మొత్తం 12 భాగాలు. ఒక్కొక్క భాగాన్ని 24 ప్రభంధాలుగా విభజించారు. ప్రభంధాలలో అష్టపదులు కనిపిస్తాయి. ఎనిమిది శ్లోకాలు కలిగినది కాన ఈ శ్లోక నిర్మాణానికి ఆష్టపదులని పేరు. 1972 లో సర్ విలియం జోన్స్ ఈ గీత గోవిందాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తరువాత లాటిన్, జర్మన్, ఫ్రెంచ్ లాంటి ప్రపంచ భాషలలోకి తర్జుమా చేయడం జరిగింది. సుప్రసిద్ధ వాగ్గేయకారుడైన నారాయణ తీర్థుల వంటి వారికి ఈ గ్రంథం స్ఫూర్తినిచ్చింది.[1]
కవి
[మార్చు]దీని రచయిత అయిన జయదేవుడు సా. శ 12వ శతాబ్దానికి చెందిన వాడు. ఈయన జన్మస్థలం బెంగాల్ లోని కెండూలి అనే ప్రాంతం. భోజదేవుడు, రమాదేవి ఈయన తల్లిదండ్రులు. ఈయన బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించిన ఆఖరి హిందూ రాజు, విష్ణు భక్తుడు అయిన లక్ష్మణసేనుడి ఆస్థాన కవిగా ఉండేవాడు.[4]
సారాంశం
[మార్చు]శ్రీమహావిష్ణువు యొక్క అవతార మూర్తుల స్మరణతో కావ్యం ఆరంభమవుతుంది. మూల వస్తువు విరహ వేదన. పన్నెండు సర్గలున్న ఈ కృతిలో మొదటి పది సర్గలలో విరహ శృంగారమూ, తర్వాతి రెండు సర్గలలో సంభోగ శృంగారమూ వర్ణించబడ్డాయి.[5] మొదటి కీర్తన తప్పించి మిగతా అష్టపదులు 10 చరణాలుగా వ్రాయబడ్డాయి. ప్రతి సర్గ శ్రీకృష్ణారాధనతో ప్రారంభమౌతుంది.
అష్టపదులు
[మార్చు]గీత గోవిందంలో వున్న పన్నెండు సర్గలలో 24 ప్రబంధాలున్నాయి. ఒక్కో ప్రబంధము ఒక్కో అష్టపదిని కలిగి వుంది. క్రింది పట్టిక అష్టపదుల యొక్క సర్గ ప్రబంధాలతో పాటు రాగ-తాళ, ధ్రువాలను కూడా చూపిస్తుంది.
సర్గ సంఖ్య | సర్గ నామము | ప్రబంధ సంఖ్య | ప్రబంధ నామము | రాగము-తాళము | ధ్రువం | అష్టపది |
---|---|---|---|---|---|---|
ప్రథమః సర్గః | సామోద దామోదరః | ప్రథమ | దశావతారకీర్తి ధవళమ్ | మాళవ - రూపక | జయ జగదీశ! హరే! | ప్రళయ పయోధిజలే ధృతవా నసి వేదం |
ద్వితీయ | హరివిజయ మంగళాచారమ్ | భైరవి - త్రిపుట | జయ జయ దేవ! హరే! | శ్రిత కమలా కుచమండల | ||
తృతీయ | మాధవోత్సవ కమలాకరమ్ | వసంత - ఆది | విహరతి హరిరిహ సరస వసంతే నృత్యతి | లలిత లవంగ లతా పరిశీలన | ||
చతుర్థ | సామోద దామోదర భ్రమర పదమ్ | రామక్రియా - యతి | హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళి పరే | చందన చర్చిత నీల కళేబర | ||
ద్వితీయః సర్గః | అక్లేశ కేశవః | పంచమ | మధురిపు రత్నకంఠిక | ఘూర్జరీ - యతి తోడి/ధన్యాసి/దేశాక్షరీ | రాసే హరిమిహ విహిత విలాసం | సంచరదధర సుధా మధుర ధ్వని |
షష్ఠమ | అక్లేశకేశవ మంజరీతిలకమ్ | గుణక్రియ - ఏక | సఖి! హే కేశిమథన ముదారం | నిభృత నికుంజ గృహం గతయా | ||
తృతీయః సర్గః | ముగ్ధ మధుసూదనః | సప్తమ | ముగ్ధమధుసూదన హంసక్రీడనమ్ | భూపాళ - ఆది | హరి హరి హతాదరతయా గతా సా కుపితేవ | మా మియం చలితా విలోక్య వృతం |
చతుర్థః సర్గః | స్నిగ్ధ మధుసూదనః | అష్టమ | హరివల్లభాశోక పల్లవః | కర్ణాట - ఏక సౌరాష్ట్ర/కానడ | సా విరహే తవ దీనా | నిందతి చందన మిందు కిరణ |
నవమ | స్నిగ్ధ మధుసూదన రాసావలయః | దేసాక్షరీ - ఏక | రాధికా కృష్ణ! రాధికా రాధికా తవ విరహే కేశవ! | స్తన వినిహితమపి హారముదారం | ||
పంచమః సర్గః | సాకాంక్ష పుండరీకాక్షః | దశమ | హరిసముదయ గరుడపదః | పంతువరాళి - రూపక దేశాక్షరీ | తవ విరహే వనమాలీ సఖి! సీదతి, రాధే! | వహతి మలయ సమీరే |
ఏకాదశ | సాకాంక్ష పుండరీకాక్షోత్కంఠా మధురః | ఘూర్జరీ - ఏక పాడి | ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలీ | రతి సుఖ సారే గతమభిసారే | ||
షష్ఠః సర్గః | సోత్కంఠ వైకుంఠః | ద్వాదశ | ధన్య వైకుంఠ కుంకుమమ్ | గుండక్రియా - రూపక శంకరాభరణ | నాథ! హరే! జగన్నాథ! హరే! సీదతి రాధా వాస గృహే | పశ్యతి దిశి దిశి రహసి భవంతం |
సప్తమః సర్గః | నాగర నారాయణః | త్రయోదశ | నాగర నారాయణ రాసావలయః | మాళవ - యతి ఆహిరి - జంపె | యామి హే! కమిహ శరణం సఖీ జన వచన వంచితాఽహమ్ | కథిత సమయేఽపి హరిరహహ న యయౌ వనం |
చతుర్దశ | హరి రమిత చంపకశేఖరః | సారంగ - త్రిపుట వసంత - యతి | కాఽపి మధురిపుణా విలసతి యువతిరధిక గుణా | స్మర సమరోచిత విరచిత వేశా | ||
పంచాదశ | హరిరస మన్మథతిలకః | సావేరి - చాపు ఘూర్జరీ - ఏక | రమతే యమునా పుళిన వనే విజయీ మురారిరధునా | సముదిత మదనే రమణీవదనే చుంబన వలితాధరే | ||
షోడశ | నారాయణ మదనాయాసః | పున్నాగవరాళి - ఆది దేశవరాళి - రూపక | సఖి! యా రమితా వన మాలినా | అనిల తరళ కువలయ నయనేన | ||
అష్టమః సర్గః | విలక్ష్య లక్ష్మీపతిః | సప్తదశ | లక్ష్మీపతి రత్నావళీ | భైరవి - ఆది | యాహి మాధవ! యాహి కేశవ! మా వద కైతవ వాదం | రజని జనిత గురు జాగర రాగ కషాయిత మలస నివేశం |
నవమః సర్గః | ముగ్ధ ముకుందః | అష్టాదశ | అమందముకుందః | యదుకులకాంభోజి - ఆది రామకరీ ఘూర్జరీ - యతి | మాధవే మా కురు మానిని! మానమయే | హరిరభిసరతి వహతి మధు పవనే |
దశమః సర్గః | చతుర చతుర్భుజః | నవదశ | చతురచతుర్భుజ రాగరాజి చంద్రోద్యోతః | దేశవరాళి - మధ్యమాది ముఖారి - జంపె | ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే | వదసి యది కించిదపి దంత రుచి కౌముదీ |
ఏకాదశః సర్గః | సానంద దామోదరః | వింశతి | శ్రీహరితాళరాజి జలధరవిలసితః | మోహన - ఆది కళ్యాణి - చాపు | ముగ్ధే! మధు మథన మనుగత మనుసర రాధికే | విరచిత చాటు వచన రచనం చరణే రచిత ప్రణిపాతం |
ఏకవింశతి | సానందదామోదర ప్రేమద్రుమపల్లవః | బంగాళవరాళి - రూపక ఘంటా - జంపె | ప్రవిశ రాధే! మాధవ సమీపమిహ | మంజుతర కుంజ తల కేళి సదనే | ||
ద్వావింశతి | సానందగోవింద రాగశ్రేణి కుసుమాభరణః | మాళవ - ఆది మధ్యమావతి - ఆది | హరిమేక రసం చిరమభిలషిత విలాసం | రాధా వదన విలోకన వికసిత వివిధ వికార విభంగం | ||
ద్వాదశః సర్గః | సుప్రీత పీతాంబరః | త్రయోవింశతి | మధురిపు విద్యాధరలీలః | విభాస - ఆది నాదనామక్రియ | క్షణ మధునా నారాయణ మనుగత మనుసర రాధికే | కిసలయశయన తలే కురు కామిని! చరణ నళిన వినివేశం |
చతుర్వింశతి | సుప్రీతపీతాంబర తాళశ్రేణీ | రామక్రియా - యతి | నిజగాద సా యదు నందనే క్రీడతి హృదయ నందనే | కురు యదు నందన! చందన శిశిరతరేణ కరేణ పయోధరే |
ఇందులో మనకు మూడు పాత్రలు గోచరిస్తాయి. శ్రీ కృష్ణుడు, రాధ, సఖి. సఖి పాత్ర కీలకం. నాయికా నాయకుల విరహవేదనను పరస్పరం తెలియజేస్తూ వారిద్దరినీ సన్నిహితం చేస్తూ మధుర సంగమానికి సిద్ధం చేసే నైపుణ్యం కనబరుస్తుంటుంది.
తర్జుమాలు, వ్యాఖ్యానాలు
[మార్చు]ఈ కృతికి అనేకమంది తర్జుమాలు,వ్యాఖ్యానాలు రచించారు. ఎక్కువగా 16 నుంచి 18 శతాబ్దాల మధ్యలో ఒరియా, బెంగాలీ భాషలోకి తర్జుమాలు జరిగాయి. 14 వ శతాబ్దం నుంచి 20 వ శతాబ్దం దాకా దాదాపు 100కి పైగా వ్యాఖ్యానాలు, 50కి పైగా అనుసరణలు వెలువడ్డాయి. రసిక ప్రియ, రసమంజరి అనే వ్యాఖ్యలు ప్రసిద్ధాలు. తిరుమల దేవ రాయలు దీనిపై శ్రుతి రంజని అనే వ్యాఖ్య రచించాడు.[5] మరికొన్ని సుప్రసిద్ధమైన అనుసరణలు.
- ఉదన్య కార్య (12వ శతాబ్దం)
- జగద్ధర (14 వ శతాబ్దం)
- నారాయణ దాసు (16వ శతాబ్దం)
- లక్ష్మీధర (16వ శతాబ్దం)
- శంకర మిశ్ర (16వ శతాబ్దం)
- ధనంజయ (17వ శతాబ్దం)
- భగవద్దాస నారాయణ పండిత (17వ శతాబ్దం)
- పూజారి గోస్వామి (16, 17వ శతాబ్దం)
- లక్ష్మణ భట్ట (18వ శతాబ్దం)
- కృష్ణదాస కవిరాజ్ (18వ శతాబ్దం)
- ది సీగల్ (ఆక్స్ ఫర్డ్ 1975)
- ఎస్. ఆర్. శ్రీనివాస అయ్యర్ (1963)
- పండిట్ హరికృష్ణ ముఖోపాద్యాయ (4వ ముద్రణ కలకత్తా, 1965)
ఇంకా ఎంతోమంది వ్యాఖ్యాతలు, పండితులు, కవులు, సామాజిక వేత్తలు పలు వ్యాసాలు ప్రచురించారు.
ప్రాచుర్య సాహిత్యంలో
[మార్చు]చందన చర్చిత నీల కళేబర, సావిరహే తవదీనా లాంటి అష్టపదులు జన బాహుళ్యంలో ప్రజాదరణ పొందినవి. సినిమా పాటల్లో కూడా వీటిని వాడటం వలన కొంత ప్రచారం వచ్చినది.[5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 పింగళి, పాండురంగారావు (2017). భక్త జయదేవ ప్రణీత గీత గోవిందం. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు.[permanent dead link]
- ↑ Kapila, Vastyayan (1979). Jaur Gita Govinda. Delhi: National Museum, Janapath.
- ↑ Goerge, Keyt. Gita Govinda The Loves Of Krishna And Radha. p. 9.
- ↑ యల్లకరి, తిరువేంగళ మూరి (1996). ఆంధ్ర గీతగోవిందము.[permanent dead link]
- ↑ 5.0 5.1 5.2 మంచాల, జగన్నాథ రావు (1971). శ్రీ గీతగోవిందము. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్సు. pp. VI.