గరగ నృత్యం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
- జానపదకళారూపాలలో ఒక క్రియ గరగనృత్యం. ఇవి గరగలు అనే అమ్మవారి రూపాలతో ఉన్న వాటిని తలపై మోస్తూ చేసే నృత్యాలు
కళారూప విశేషాలు
[మార్చు]ప్రాచీన జానపదనృత్యాలలో ఒక ప్రత్యేక శైలిని సంతరించుకున్న నృత్యం గరగ నృత్యం. ఇది పురాతన నాట్య కళ అనవచ్చును. దీని ప్రాముఖ్యం ఆంధ్ర దేశంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో హెచ్చుగా కనిపిస్తుంది. దీనినే ఘట నృత్యమని పిలవటం కూడా వాడుకలో ఉంది. నెత్తిపైన కుండ వుంచుకుని ప్రారంభమయ్యే ఈ నృత్యం, నాగరికత కనుగుణంగా మలచబడింది. ఈ గరగలనేవి లోహ నిర్మితమై, వాటిపై ఆదిశేషువు ఆదిగాగల చెక్కడపు బొమ్మలతో అలరారుతూ వుంటాయి. గరగ ఆకారం ఒక పూర్ణకుంభం మాదిరిగా వుంటుంది. ఈ గరగలను గ్రామ దేవతలని వివిధ పేర్లతో పిలువబడే అమ్మవారి గుళ్ళలో పదిలపర్చబడి అమ్మ వారితో పాటు పూజార్హమై, జాతర సమయాలలో నెలకు ముందు నుండే గర్భగుడి నుండి బయటకు తీసుకవచ్చి ఆసాదులనబడేవారు ధూప సేవతో నెత్తిపై పెట్టుకుని డప్పుల వాయిద్యంతో లయ భద్ధంగా నృత్యం చేస్తూ, అవేశ పూరితంగా కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లుమని మ్రోగుతుండగా అమ్మవారిని తన్మయత్వం చేస్తూ, చూపరులకు ఉత్సాహాన్ని కలిగిస్తూ, తెల్ల వార్లూ ఈ నృత్య కార్యక్రమాన్ని అత్యంత నిష్టతో నిర్వహించటం ఒక విశేషం. ఆ తరువాత అమ్మవారి విగ్రహం దగ్గరకు గరగలను గర్భడుడికి చేర్చుతారు. మరికొన్ని చోట్ల ఈ గరగ నృత్యం చేసే ఆసాది వారి నిష్టకు నిదర్శనమా అన్నట్లు కణకణ మండే చింత నిప్పులపై నడుస్తూ నాట్యమాడటం కూడా గమనించవలసిన విశేషం. ఈ నిప్పుల గుండం త్రొక్కడమనే ఆచారం మహమ్మదీయుల పీర్ల పండగలో కూడా మనం చూస్తూ వుంటాం.
- అందాల అలంకారం
అమ్మ విగ్రహాన్ని అలంకరించినట్లుగానే, చీర, గాజులు, పసుపు కుంకుమలతో ఈ గరగలను కూడా అలంకరించి, ఒక పూజ్య భావాన్ని కలిగింప చేస్తారు. కొన్ని కొన్ని గ్రామాలలో, తీర్థ మహోత్సవాలలో జాతర జరుపుతూ మరలా పంట జారగా సంవత్సరానికి రెండు జాతరలు జరుపుకుంటారు. వీటి ముఖ్యోద్దేశం గ్రామ ప్రజలు సుఖ సంతోషాలకు, ఆరిష్ట నివారణకు, పిశాచ భయ విధ్వంస నానికి ముఖ్యంగా గ్రామ సంరక్షణకూ గ్రామ దేవతలే మూలమని, గర్భగుడిలోని అమ్మవారి మూల విరాట్టుకు ప్రతి రూపంగా ఈ గరగలను మాత్రమే బయటకు తెచ్చి తీర్థ జాతరలలో వినియోగించడం, ఈ గరగ దర్శనంతో అమ్మవారి దర్శన భాగ్యం కలిగినట్లు భావించడం ఒక నిత్య సత్యమైంది.
శిరములపై గరగలు
[మార్చు]ఆయా సమయాలలో గర్భగుడి నుండి బయటకు తీసుకు వచ్చిన గరగలు ఆసాదుల శిరములనలంకరించి లయబద్ధమైన డప్పుల వాయిద్యాల మధ్య తాళాని కనుగుణ్య మైన నృత్యంతో పురవీధులలో ఊరేగుతూ తమతమ ప్రదేశాలకు రాగానే ఆసాదుల కాళ్ళకు బిందెడు నీళ్ళు అభిషేకంతో, ఫల వుష్పాలతో పాటు, చీరలూ గాజులూ, పశుపు కుంకమలను సమర్పించు కుని అమ్మవారి సేవకు అంకితమౌతారు భక్తులు.
అంకితమైన ఆసాదులు
[మార్చు]ప్రత్యేకించి ఈ గరగ నృత్యాన్ని వృత్తిగా స్వీకరించి, అందుకే అంకితమైన వారిని ఆసాదులంటారు. పెల్లెల ద్వారా ప్రచారం పొందిన నృత్యాలకు జానపద నృత్యాలని పిలవబడటం మూలాన ఈ గరగ నృత్యాలను కూడా జానపద కళలలో ఒక కళగా భావించవచ్చు. ఈ కళకు అంకితమైన ఈ ఆసాదు లనబడే వారు కూడా వృత్తి కళాకారులకు చెందిన వారై యున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వీరి సంఖ్య దాదాపు అయిదు వందలు. ఈ జిల్లాలలో గరగ నృత్యాల ప్రాముఖ్యతను సంతరించుకున్న కొన్ని గ్రామాల్లో వున్న గ్రామదేవతలు పెద్దాపౌరం మరిడమ్మ,, కాండ్రికోననూకాలమ్మ, రాజమండ్రి సోములమ్మ, రాజానగరం ముత్యాలమ్మ , ఠాణేలంక బులుసమ్మా', గోకవరం గుబ్బాలమ్మ , మారేడుమల్లి గంగాలమ్మ , బమ్మంగి పేరంటాలమ్మా', మల్లిపాల శిగరమ్మ ., దేవీపటం గడి పోచమ్మ , తుని తలుపలమ్మ , కొత్తపల్లి నూకాలమ్మ, ప్రసిద్ధం.
కోనసీమ గరగలు
[మార్చు]అమాలపురం తాలూకా కోనసీమ ప్రాంతంలో ఈ మాదిరి దేవతలు గరగ నృత్యాల ప్రాముఖ్యంతో వున్న గ్రామాలు దాదాపు 35 వరకూ వున్నాయి. ఒరిస్సాకు చెందిన రాయగడ మజ్జి గౌరమ్మ ఉత్సవంలో కూడ ఈ గరగ నృత్య ప్రాముఖ్యత వుంది. అగ్ని గుండాలను తొక్కడం ద్వారా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలలో, మరింకెన్నో గ్రామాలలో ఈ గరగ నృత్యాలు ప్రసిద్ధి చెందాయని పెంజర్ల వేంకటేశ్వర రావు గారు వివరిస్తున్నారు. గ్రామదేవతలను నమ్ముకుని, అమ్మవారికి అంకితమై, గరగ నృత్యమే జీవనాథారంగా పేర్కొన బడిన ఆసాదులు వృత్తి కళాకారులనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
గరిక ముంతలే గరగలు
[మార్చు]ఆంధ్ర దేశంలోనూ, రాయలసీమ లోనూ, తెలంగాణాలోనూ, కర్నాటక లోనూ కరగ అనే పేరుతోనూ తమిళంలో కరగం అనే పేరు తోనూ, ఇతర ఆంధ్ర ప్రాంతాలలో గరికె, గరిక, గరిగ,గరిగె అనే పేర్లు తోనూ ప్రచారంలో వుంది. ఈ గరగ నృత్యాన్ని నృత్యకారులెంత నేర్పుగా ప్రదర్శిస్తారో ఆ నేర్పుకు తగిన లయబద్ధ సహకారం డప్పులు వాయించే వారు అందిస్తూ వుంటారు. ఈ రెండు సమిష్టి కలయికల తోనూ ఈ గరగ నృత్యం ఎంత గానో శోభిల్లుతుంది. ఈ గరగలను సేవించడం ద్వారా ఆమ్మవారిని సేవించినట్లే భావింప బడుతుంది. గరిక అంటే కుండ అని అర్థం. ద్రౌపది తన వివాహ సమయంలో అనందావేశంతో ప్రక్క నున్న కలశాన్ని నెత్తిన పెట్టుకుని చిందులు వేసిందనీ, ఆ విధంగా అది పవిత్రం పొందిందనీ తెలుగు విశ్వవిద్యాలం జానపద కళల విభాగపు లెక్చరర్ డా: బిట్టు వెంకటేశ్వర్లు గారు అంటున్నారు. ఈ నాటికీ వివాహ సమయంలో అన్ని ప్రాంతాలలోనూ గరికె ముంత, గరిగె బుడ్డి (అలంకరించిన) ముంత, పెండ్లి సమయాలలో కుమ్మరి వారు అలివేణి కుండలతో పాటు ఈ కరికె ముంతను కూడ అందంగా రంగులతో చిత్రిస్తారు. దీనిని ఎంతో పవిత్రంగా చూస్తారు. గరికె ముంత లేకుండా వివాహం జరపరు. ఆ ముంతతో పూజా విధాన ముగింపుతో దానిని తాకించి, మంత్రాలు చదువుతారు.
ఈ గరిక ముంత (బుడ్డి) ను పెండ్లికి ముందు రోజే కుమ్మరి ఇంటినుండి మేళ తాళాలతో వెళ్ళి, కుమ్మరివారికి కానుకలు చెల్లించి, ఇంటికి తెచ్చి ఒక గదిలో వుంచి దీపారాధన చేసి పూజిస్తారు. ముందుగా ఈ గరిగెలను పూజించటం గౌరి పూజగా భావిస్తారు. అంటే పెండ్లిండ్లలో గరిగె గౌరీమాతకు ప్రతీకగా పూజ నందుకుంటుంది. వివాహ సమయంలో గరిగెను దంపతుల ముందుంచి మళ్ళ పూజచేసి, వివాహాన్ని పూర్తి చేస్తారు. వివాహం జరిగినంత సేపూ గరిగె ముంత ఎంతో ప్రాముఖ్యం వహిస్తుంది. వధువు అత్తగారింటికి వెళ్ళే ముందు ఈ గరిగను వధువుతో పంపించి పెండ్లి తరువాత కూడ దానిని పవిత్రంగా చూస్తారు. గరిగ ముంతే గరగ గా మారిందంటారు.
బోనాలు
[మార్చు]ముఖ్యంగా గ్రామ దేవతలైన ముత్యాలమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మ, సత్తెమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ మొదలైన దేవతలను, గరగల మాదిరే తెలంగాణా గ్రామాలలో బోనాలు పెడతారు. ముఖ్యంగా కుమ్మరి వారు, గొల్లవారు, ఈ బోనాల పూజకు గురువులుగా వుంటున్నారు. ఈ బోనాలనే రాయల సీమలో గరిగె బుడ్డి అనీ, సర్కారు ఆంధ్ర దేశంలో గరగలనీ, ఘటం కుండలనీ పిలుస్తారు. పూజారులుగా వున్న కుమ్మరులూ, గొల్లలూ, కలిసి ఈ కుండలను తెచ్చి, అలంకారం చేసి దానికి పసుపు కొమ్ము కట్టి, కుండ మూతి చుట్టూ వేప మండలను కట్టి తలపై పెట్టుకుని ఇంటింటికి తిరిగి అమ్మవారికి చద్ది వసూలు చేస్తారు. పెరుగు మజ్జిగ ఉల్లిపాయ ముక్కలతో కలిపిన చద్ది అన్నం అమ్మవారికి బోనంగా వసూలు చేస్తారు. గ్రామాలో ప్రతి ఒక్కరూ ఈ కుండలో బోనం వేస్తారు. ఇలా చేసినందు వల్ల గ్రామాలకు, కుటుంబాలకు వృద్ధి కలుగుతుందని వారి నమ్మకం. అమ్మవార్లూ, దేవతలూ అందరూ శాంతిస్తారని నమ్మకం. అమ్మవారి పూజ అయిన తరువాత ఆ కుండలో వున్న పెరుగు అన్నాన్ని పూజారులుగా వున్న వారూ, అక్కడ పనిచేసే వారు పంచుకుని భక్తితో ఆరగిస్తారు. ఇంటింటికీ బొనాలు తిరిగే టప్పుడు సాంబ్రాణితో దూపం వేస్తారు. తప్పెళ్ళతో దరువు వేస్తూ వుంటే బోనాలను ఎత్తుకున్న వారికి పూనకం వస్తుంది. వీర తాళ్ళతో కొట్టుకుంటారు. వెంట వున్న వారంతా ఈలలతో కేకలతో నృత్యం చేస్తూ ఆవేశంగా చిందులు త్రొక్కుతూ ఒకరి మీద మరొకరు గులాముల్నీ వసంతాలనూ చల్లుకుంటారు. తప్పెట్ల దరువుకు అనుకూలంగా చేసే చిందుల నృత్యం ఆవేశాన్ని కలిగిస్తుంది. ఈ ఉత్సవాన్ని 9 రోజులు నిర్వహిస్తారు. గ్రామ దేవతలకు ప్రతీకగా గరగలు పూజ లందుకుంటాయి. ఇలా చేయడం వల్ల అమ్మవార్లు శాంతిస్తారని వారి నమ్మకం. వూరంతా తిరిగిన తర్వాత ఆ గరగలనే బోనాలను అమ్మవారి ఎదురుగా వుంచుతారు.
మూలాలు
[మార్చు]- తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు