Jump to content

ఖుటులున్

వికీపీడియా నుండి
ఒగెడై కుటుంబానికి నాయకుడైన కైదుకు చెందిన టమ్ఘా స్టాంపు చిత్రం.

ఖుటులున్ (1260 – 1306), ప్రముఖ మంగోలియన్ రాజు కైదు కుమార్తె. ఈమెను ఐగైర్నే, [1] ఆయురుగ్, ఖోటొల్ సాగన్, ఆయ్ యారుక్ (చంద్ర కిరణాలు అని అర్ధం) అని కూడా పిలుస్తారు.[2] కుబ్లై ఖాన్ సోదర కుమార్తె ఈమె. ఖుటులున్ సైనిక వ్యూహాల అంటే ఆమె తండ్రికి ఎంతో నమ్మకం. మార్కోపోలో, రషీద్ ఆల్-దిన్ లు ఈమె గురించి  తమ పుస్తకాల్లో రాసుకున్నారు.[1]

జీవితం

[మార్చు]

1260వ సంవత్సరంలో జన్మించారు ఖుటులున్.[3] పడమర మంగోలియా నుంచి ఆక్సస్ వరకు, ఇటు మధ్య సైబీరియా నుంచి భారతదేశం వరకు విస్తరించి ఉన్న మధ్య ఆసియా ప్రాంతానికి 1280 కల్లా ఆమె తండ్రి కైదు శక్తివంతమైన పాలకునిగా ఉన్నారు.

మార్కో పోలో ప్రకారం ఖుటులున్ మంచి యోధురాలు. డేగ కోడిని ఎత్తుకుపోయినంత సులభంగా ఈమె కూడా శత్రువుల శ్రేణుల్లో దూరి బంధీలను ఎత్తుకురాగలదు అని మార్కో అభిప్రాయం. ఎన్నో యుద్ధాల్లో తండ్రికి సాయపడ్డారు ఖుటులున్. ముఖ్యంగా ఆమె దాయాది సోదరుడు యాన్ వంశానికి చెందిన గ్రేట్ ఖాన్ - కుబ్లై (1260-94) పై చేసిన యుద్ధంలో ఆమె సహకారం కైదుకు ఎంతగానో ఉపయోగపడింది.

తనను పెళ్ళి చేసుకోవాలనుకునే వారు తనను కుస్తీలో ఓడించాలి. ఓడించలేని పక్షంలో తమ గుర్రాన్ని ఆమెకు వదులుకోవాల్సి వస్తుంది అని ఆమె ప్రకటించింది. అలా ఆమె 10,000 గుర్రాలను సంపాదించడం విశేషం.[3]

ఆమె భర్త గురించి సరైన ఆధారాలు లభించడంలేదు. కొందరు చరిత్రకారుల ప్రకారం ఖుటులున్ తండ్రిని చంపేందుకు వచ్చిన ఒక యువకుణ్ణి బంధించిన ఆమె, అతణ్ణి ప్రేమించారనీ, తరువాత వివాహం చేసుకున్నారు. మరికొందరు చోరోస్ వంశానికి చెందిన రాజును వివాహం చేసుకున్నారని వాదిస్తారు. రషీద్ ఆల్-దిన్ తన పుస్తకంలో ఖుటులున్ గురించి రాస్తూ పర్షియాకు చెందిన మంగోల్ రాజు ఘజన్ ను ఆమె ప్రేమించారని వివరించారు.

కైదుకు తన పిల్లందరిలోకీ ఖుటులున్ అంటే చాలా ఇష్టం. రాజకీయాల గురించి అన్ని రకలా సలహాలూ, సహాయాలూ ఆమె నుంచే ఎక్కువగా తీసుకునేవారు ఆయన. 1301లో ఆయన చనిపోవడనికి ముందు చాలాసార్లు తన తరువాత ఖనటే రాజ్యానికి ఖుటులున్ నే రాణిని చేయాలని ప్రయత్నించారు. మిగిలిన బంధువుల  ఒత్తిడి వల్ల ఆయన కోరిక నిజం కాలేదు. ఆమె తండ్రి చనిపోయినపుడు ఖుటులున్ ఒక సోదరుడు ఓరస్ తో కలసి తండ్రి శవాన్ని కాపాడారు. తన సోదరులు చాపర్, బంధువు దువ్వా వంటి వారు అధికారంలోకి రావడానికి ఆమె నిరాకరించడంతో, ఆమెను వారు ఎంతో వ్యతిరేకించారు.

సంస్కృతిలో ఖుటులున్ జాడలు

[మార్చు]
ఖుటులున్ చిత్రం

ఎన్నో ఇటలీ, పర్షియన్ నాటకాల్లో ఉండే టురండాట్ అనే పాత్రకు ఖుటులున్ వ్యక్తిత్వమే ప్రేరణ. మంగోల్ సంస్కృతిలో ఆమె ప్రఖ్యాత యోధురాలిగా ఇప్పటికీ ప్రసిద్ధురాలు. ప్రేమకు లొంగిపోయే మహిళగా ఆమె గురించి చెప్పుకుంటారు. మంగోల్ ప్రజలు ఖుటులున్ గురించి ఎంతో గర్వంగా చెప్పుకుంటారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Polo, Marco (1982). "195".
  2. Bernardini, Michele; Guida, Donatella (2012).
  3. 3.0 3.1 Jack Weatherford - The Wrestler Princess in Lapham’s Quarterly
"https://te.wikipedia.org/w/index.php?title=ఖుటులున్&oldid=2984733" నుండి వెలికితీశారు