కోరమాండల్ తీరం
కోరమాండల్ తీరం, భారత ఉపఖండంలోని ఆగ్నేయ తీర ప్రాంతం. దీనికి ఉత్తరాన ఉత్కళ మైదానాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన కావేరీ డెల్టా, పశ్చిమాన తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. దీని వైశాల్యం దాదాపు 22,800 చదరపు కిలోమీటర్లు. [1] ఈ తీరం సముద్ర మట్టం నుండి సగటున 80 మీటర్ల ఎత్తున ఉంది. తీరానికి రెండవవైపున తూర్పు కనుమలు మద్దతుగా ఉన్నాయి.
చోళ రాజులు పాలించిన భూమిని తమిళంలో చోళమండలం అని పిలుస్తారు. దీని నుండే కోరమాండల్ అనే పేరు ఉద్భవించింది.
12వ శతాబ్దం నుండి చారిత్రక ముస్లిం మూలాధారాలలో, కోరమాండల్ తీరాన్ని మాబార్ అనేవారు.[2]
వ్యుత్పత్తి
[మార్చు]చోళ పాలకుల భూమిని తమిళంలో చోళమండలం అంటారు. పోర్చుగీసు వారి నోట ఈ పేరు కోరమాండల్ గా క్మారింది.[3][4][5][6][7] ఈ పేరు కరై మండలం నుండి కూడా వచ్చి ఉండవచ్చు.[8]
మరొక సిద్ధాంతం ఏమిటంటే, భారతదేశానికి మొదటి డచ్ నౌక పులికాట్‌కు ఉత్తరాన ఉన్న ద్వీప గ్రామమైన కరిమణల్‌లో ఆగింది. ఓడలో ఉన్న నావికులు గ్రామం పేరును 'కోరిమండల్' అని తప్పుగా ఉచ్చరించారు. ఆ తర్వాత ఆ పేరు నిలిచిపోయింది. [9]
ఇటలీకి చెందిన ఒక అన్వేషకుడు, లుడోవికో డి వర్తేమా, బహుశా 1510లో కోరమాండల్ అనే పేరును మొదటగా వాడాడు. దానినే పోర్చుగీసు వారు మ్యాపుల్లో ఉపయోగించారు, అయితే అక్కడ బాగా వ్యాపారం చేసుకున్నది మాత్రం డచ్చి వారు.[10]
చరిత్ర
[మార్చు]1530 చివరి నాటికి కోరమాండల్ తీరంలో నాగపట్నం, సావో టోమ్ డి మెలియాపూర్, పులికాట్‌లలో పోర్చుగీసు వారికి మూడు స్థావరాలుండేవి. 17వ, 18వ శతాబ్దాలలో, భారతదేశంలో వాణిజ్యంపై నియంత్రణ కోసం ఐరోపా రాజ్యాల మధ్య పోటీలకు కోరమాండల్ తీరం వేదికగా ఉంది. బ్రిటిషు వారికి ఫోర్ట్ సెయింట్ జార్జ్ (మద్రాస్), మసూలిపట్నం ల లోను, డచ్చివారికి పులికాట్, సద్రాస్, కోవెలాంగ్‌లలోను, ఫ్రెంచ్ వారికి పాండిచ్చేరి, కారైకల్, నిజాంపట్నంలలోను, డానిష్‌లకు తరంగంబాడిలోని డాన్స్‌బోర్గ్ లోనూ స్థావారాలు ఉండేవి.
వాళ్ళ పోటీలో చివరికి బ్రిటిష్ వారు గెలిచారు. ఫ్రెంచి వారు 1954 వరకు పాండిచ్చేరి, కారైకాల్‌లోని చిన్న ప్రాంతాలను మాత్రం నిలుపుకోగలిగారు. పెట్టెలు, తెరలు, చెస్ట్‌ల వంటి చైనా లక్క వస్తువులు, 18వ శతాబ్దంలో అనేక చైనీస్ ఎగుమతులను కోరమాండల్ ఓడరేవుల్లోనే సమీకరించేవారు. ఈ కారణంగా ఇవి "కోరోమాండల్" వస్తువులుగా ప్రసిద్ధి చెందాయి.
ఇదే పేరుతో ఇతరత్రా
[మార్చు]రాయల్ నేవీకి చెందిన నాలుగు నౌకలకు HMS కోరమాండల్ అనే పేరు ఉండేది. న్యూజిలాండ్‌లోని కోరమాండల్ ద్వీపకల్పానికి ఈ నౌకల్లో ఒకదాని పేరు పెట్టారు. న్యూజిలాండ్‌లోని కోరమాండల్ పట్టణానికి భారత ద్వీపకల్పం నుండే ఆ పేరు పెట్టారు. సౌత్ ఆస్ట్రేలియా లోని కోరమాండల్ వ్యాలీ, దాని పొరుగున ఉన్న శివారు కోరమాండల్ ఈస్ట్ లకు 1837 లో 156 మంది ఇంగ్లీషు వలసదారులు లండన్ నుండి హోల్డ్‌ఫాస్ట్ బేకి వచ్చిన కోరమాండల్ ఓడ పేరిట వాటికి ఆ పేర్లు వచ్చాయి. ఓడ ఒడ్డుకు చేరుకున్న తర్వాత, దాని నావికులలో కొందరు దక్షిణ ఆస్ట్రేలియాలోనే స్థిరపడి పోవాలని భావించి, కోరమాండల్ వ్యాలీ ప్రాంతంలోని కొండలలో ఆశ్రయం పొందారు.
భారతీయ రైల్వేలలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ అనే రైలు ఉంది. ఈ రైలు పశ్చిమ బెంగాల్ లోని షాలిమార్ రైల్వే స్టేషను, తమిళనాడు లోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Coromandel Coast | Tamil Nadu, Bay of Bengal, & Map | Britannica". www.britannica.com.
- ↑ Shokoohy, Mehrdad; Shokoohy, Natalie H. (2020). "Maʿbar". Encyclopedia of Islam (third ed.). Brill. ISBN 9789004435933. Retrieved 9 March 2021.
- ↑ The Land of the Tamulians and Its Missions, by Eduard Raimund Baierlein, James Dunning Baker
- ↑ South Indian Coins – Page 61 by T. Desikachari – Coins, Indic – 1984
- ↑ Indian History – Page 112
- ↑ Annals of Oriental Research – Page 1 by University of Madras – 1960
- ↑ The Periplus of the Erythræan Sea by Wilfred Harvey Schoff
- ↑ Edgar Thurston (2011). The Madras Presidency with Mysore, Coorg and the Associated States. Cambridge University Press. p. 11. ISBN 978-1-107-60068-3.
- ↑ "A Brief Narrative of The Danish Mission on the Coast of Coromandel par Baron Alanson Stow (1801-1869): Good Hardcover (1837) 1st Edition | The Book Collector, Inc. ABAA, ILAB". www.abebooks.fr (in ఫ్రెంచ్). Retrieved 2024-04-01.
- ↑ Allen, Charles (13 December 2017). "How A Coast Got Its Name". Books. The Hindu. Retrieved 24 December 2020.