Jump to content

కొందుర్గు పిల్లలమర్రి

వికీపీడియా నుండి

కొందుర్గు పిల్లలమర్రి మహబూబ్ నగర్ జిల్లాలో రెండవ పెద్ద పిల్లలమర్రి. ఇది కొందుర్గ్ మండలంలో పెద్దేల్కిచర్ల గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం నుండి రంగారెడ్డి జిల్లా ముజాహిద్పూర్కు వెళ్ళే మార్గంలో రోడ్డు పక్కన పచ్చని పంటపొలాల మధ్యన ఈ పెద్ద మర్రి వృక్షం ఎత్తైన కొమ్మలతో, పెద్ద పెద్ద ఊడలతో, పచ్చని ఆకులతో కనువిందు చేస్తుంది.. సుమారు రెండున్నర ఎకరాలలో ఈ మహావృక్షం విస్తరించి ఉంది. దీని వయసు దాదాపు 200 సంవత్సరాలు ఉంటుందని గ్రామస్తుల అంచనా. ఈ వృక్షాన్ని దైవాంశసంభూతంగా ఇక్కడి ప్రజలు భావిస్తారు. ఈ వృక్షం చూపరులకు అందాన్ని, ఆనందాన్ని పంచుతూ అలరారుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం వేళలలో ఇక్కడి దృశ్యాలు కనువిందు చేస్తాయని అంటారు.

మహావృక్షం- గ్రామాలావిర్భావం

[మార్చు]

ఇక్కడే, ఈ వృక్షం కింద కొలిచిన వారికి కొంగు బంగారంగా భావించే వీరన్న స్వామి వెలిశాడు. ఈ స్వామి రాత్రి వేళలో చుట్టుపక్కల పంటపొలాలకు కావలిగా ఉంటాడని, అందుకే ఇక్కడి పొలాలలో ఏనాడూ పంటను దోచుకపోవడం అంటూ జరగలేదని ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు. ఇక్కడ వెలిసిన దేవుడిని వీరన్న అను భక్తుడు పూజలు చేయడం ప్రారంభించడం వలన ఈ స్వామికి వీరన్న స్వామిగా పేరు స్థిరపడిపోయింది. ఈ వీరన్న స్వామికి ఇద్దరు భార్యలని, ఒకరు ఎల్లమ్మ అని, మరొకరు గాలెమ్మ అని చెబుతారు. వీరి పేరు మీదుగానే కొందుర్గ్ మండలంలో వీరన్న స్వామి పేరు మీద వీరన్నపేట, ఎల్లమ్మ పేరు మీదుగా ఎల్కిచర్ల, గాలెమ్మ పేరు మీదుగా గాలి గూడెం గ్రామాలు ఏర్పడ్డాయని చెబుతారు[1].

మహావృక్షంతో గురువులయ్య అనుబంధం

[మార్చు]

నిజాం పాలనా కాలంలో ఈ వృక్షం చుట్టు పక్కల గ్రామాలలో కలరా, మశూచి వంటి రోగాలు వచ్చి జనం వందలాదిగా చనిపోయారట. ఈ విషయాన్ని ఈ ప్రాంతపు జాగీర్ధారు అప్పటి గుల్బర్గా సంస్థానానికి తెలియజేయగా, సంస్థానపు మహా వైద్యుడు హరిలాల్ ఈ ప్రాంతానికి వచ్చి, వైద్య సేవలందించి ఇక్కడే గురువులయ్యగా స్థిరపడిపోయాడట. ఆ గురువులయ్య కూడా ఈ మహా వృక్షం కింద నివసించాడని ప్రతీతి. అందుకే ఈ పిల్లలమర్రి సమీపాన ఉన్న ఓ కుంటకు గురులోని కుంట అని, సమీపంలోని ఓ బావికి గురులోని బావి అని పేర్లు ఉన్నాయి.

వీరన్నస్వామి ఉత్సవాలు

[మార్చు]

పూర్వం ప్రతి శివరాత్రికి ఇక్కడికి ఎద్దుల బండ్లు కట్టుకొని వచ్చి మహావృక్షం చుట్టూ తిప్పేవారట. రానురాను ఆ ఆచారం మరుగున పడిపోయింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం వినాయకచవితి నిమజ్జనం రోజు వీరన్న స్వామికి పూజలు చేసి, వరదపాశం పోసి, అన్నదానం, అభిషేకం, అఖండభజన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

గ్రామస్తుల ఆకాంక్ష

[మార్చు]

ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా గుర్తించి, అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. సూర్య దినపత్రిక, ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక, మహబూబ్ నగర్ జిల్లా, అక్టోబర్, 2008, పుట - 42