కొండపల్లి శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండపల్లి శ్రీనివాస్
కొండపల్లి శ్రీనివాస్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం

ఎమ్మెల్యే
నియోజకవర్గం గజపతినగరం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు కొండపల్లి కొండలరావు, సుశీల
జీవిత భాగస్వామి లక్ష్మి సింధు
సంతానం విహాన్, మేధ

కొండపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గజపతినగరం శాసనసభా స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్యపై 24,302 ఓట్ల మెజార్టీతో గెలిచారు. శ్రీనివాస్ వాణిజ్యవేత్తగా, సాఫ్ట్ వేర్ నిపుణులుగా రాణించిన సంఘసేవకుడు. ఆయన 1982 ఏప్రిల్ 13న కొండపల్లి కొండలరావు, సుశీల దంపతులకు జన్మించారు. శ్రీనివాస్ భార్య లక్ష్మి సింధు. కుమారుడు విహాన్, కుమార్తె మేధ. శ్రీనివాస్ గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి సాఫ్ట్ వేర్ నిపుణుడిగా పేరొందారు. తన వృత్తిలో భాగంగా అనేక దేశాలు తిరిగినా జన్మభూమికి సేవ చేయాలనే తలంపుతో అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. తన కుటుంబ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు.[1]

గ్రామీణ స్థాయి నుంచి సాఫ్ట్ వేర్ నిపుణుడిగా ..

[మార్చు]

శ్రీనివాస్ ప్రాధమిక విద్యాభ్యాసం విజయనగరం, అరకు ప్రాంతాల్లో సెయింట్ జోసఫ్ స్కూలులో సాగింది. ఇంటర్మీడియట్ విశాఖలోని విజ్ఞాన్ విద్యాసంస్థలో చదివారు. జి.ఎం.ఆర్. ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ (కంప్యూటర్స్ ) చదివారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి ఇండియానా రాష్ట్రంలోని ప్రఖ్యాత బాల్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. శ్రీనివాస్ ఆ తరువాత వెనక్కి తిరిగి చూడలేదు. అమెరికాలో స్థిరపడి ఒరాకిల్ సంస్థలో ఇ.ఆర్.పి. సొల్యూషన్స్ విభాగంలో సుధీర్ఘ కాలం సాఫ్ట్ వేర్ నిపుణుడిగా భాద్యతలు నిర్వర్తించారు. పరిశ్రమలు, విద్యుతుద్పాదన, హోటళ్ళు, బ్యాంకింగ్, ఎయిర్ లైన్స్, ఇన్సూరెన్స్ వంటి రంగాల్లో సాఫ్ట్ వేర్ సేవలను అందించారు. ఈ క్రమంలో ఐబిఎమ్, హెచ్.పి, విప్రో వంటి 500 పైగా అంతర్జాతీయ సంస్థలతో కలిసిపనిచేసారు. ఈ వృత్తి పనిలో భాగంగా శ్రీనివాస్ అమెరికా, మిడిల్ ఈస్ట్ లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్ తో సహా మిగతా దేశాలు, హాంగ్ కాంగ్ వంటి దేశాలు పర్యటించి తన సంస్థల తరుపున ప్రాతినిధ్యం వహించారు. ఈ పర్యటనలలో విశేష అనుభవాన్ని గడించారు.

కుటుంబ రాజకీయ నేపధ్యం

[మార్చు]

కొండపల్లి శ్రీనివాస్ కుటుంబం తరాల రాజకీయ నేపధ్యం కలిగి వుంది. శ్రీనివాస్ తాతయ్య కొండపల్లి పైడితల్లి నాయుడు మూడుసార్లు బొబ్బిలి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై 11వ,12వ,14వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గాను, విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా సేవలు అందించారు.[2]

శ్రీనివాస్ తండ్రి కొండపల్లి కొండలరావు గంట్యాడ మండల పరిషత్ అధ్యక్షుడుగా ఎన్నికై సేవలు అందించారు.

శ్రీనివాస్ తల్లి తరుపున తాతయ్య అయిన అప్పికొండ సత్యం నాయుడు 1962-82 మధ్య కాలంలో సాలూరు సమితి అధ్యక్షుడుగా సేవలు అందించారు.

సేవలతో గుర్తింపు

[మార్చు]

శ్రీనివాస్ వృత్తి పనిలో భాగంగా అనేక దేశాలు తిరిగినా పుట్టి పెరిగిన ప్రాంతం అభివృద్ధి గురించి తాపత్రయపడే వ్యక్తిత్వం. సహజంగా రాజకీయ కుటుంబ నేపధ్యం నుంచి వచ్చిన ఆయనకు రాజకీయాలపైనా, స్థానిక సమస్యలు, వాటి పరిష్కార అంశాలపైనా అవగాహన మెండు. ప్రత్యక్ష్య రాజకీయాల్లో లేకపోయినా ఏళ్లుగా ప్రజాసేవలో నిమగ్నమయిన ఆయన దాతృత్వం యువతలో మంచి గుర్తింపు ఇచ్చింది. రోటరీ క్లబ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాస్ అనేక రక్తదాన శిబిరాల స్వచ్చంద నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో 26 వరకూ తాగునీటి ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు గాను నిధులను సమకూర్చడంలో ఫలితాలను సాధించారు. గజపతినగరం నియోజకవర్గంతో సహా విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, క్రీడా, సాంస్కృతిక, సేవాకార్యక్రమాలకు ఆర్ధిక సహకారం అందిస్తూ గ్రామాల వికాసానికి కృషి చేస్తున్నారు.

వాణిజ్యంలోనూ రాణింపు

[మార్చు]

శ్రీనివాస్ వివిధ దేశాల్లో సాఫ్ట్ వేర్ రంగ నైపుణ్యం తన పుట్టిన ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు విస్తరించేందుకు దోహదపడింది. తన అనుభవం, ఆలోచనలతో గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వివిధ వాణిజ్య సంస్థలను స్థాపించి మంచి ఫలితాలు సాధించారు. హోటళ్ళ రంగంలో విజయనగరం జిల్లాలో హోటల్ కొండపల్లి గ్రాండ్, విహార రెంటల్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ లో భాగంగా శ్రీ రాధాకృష్ణ ఆగ్రో ఫుడ్స్, రాధాకృష్ణ మోడర్న్ రైస్ మిల్స్ ను స్థాపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో విహాన్ నిర్మాణ సంస్థ ద్వారా విజయనగరం, సాలూరు ప్రాంతాల్లో లక్షకు పైగా చదరపు అడుగుల్లో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు. వృత్తి, సేవ, వాణిజ్యం, రాజకీయం ..ఇలా ఏ రంగంలో అయినా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని..గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కొండపల్లి శ్రీనివాస్ చెబుతున్నారు.

మూలాలు

[మార్చు]
  1. అందరినీ కలుపుకొని ముందుకెళ్తా: కొండపల్లి శ్రీనివాస్‌
  2. గజపతినగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా : కొండపల్లి శ్రీనివాస్
  1. EENADU (14 June 2024). "పవన్‌కు పంచాయతీరాజ్‌... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  2. TV9 Telugu (29 February 2024). "ఈ జిల్లాలో టీడీపీ సీనియర్స్‎ను కాదని యంగ్ లీడర్స్‎ను తెరపైకి.. వీరి గెలుపు ఖాయమా." Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)