కె.బి.గోపాలం
కె.బి.గోపాలం | |
---|---|
![]() | |
జననం | కె.బి.గోపాలం జూన్ 16, 1953 యెనుగొండ,మహబూబ్ నగర్ జిల్లా |
వీటికి ప్రసిద్ధి | రచయిత, అనువాదకుడు, ప్రయోక్త |
కె.బి.గోపాలం పాపులర్ సైన్స్ రచయిత, అనువాదకుడు.
విశేషాలు
[మార్చు]ఇతడు 1953, జూన్ 16న మహబూబ్ నగర్ జిల్లా, యెనుగొండ గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు కె.వి.నరసింహాచార్యులు. ఇతడు జంతుశాస్త్రంలో ఎం.ఎస్సీ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని పొందాడు. బయోకెమికల్ జెనటిక్స్‌లో పి.హెచ్.డి. చేశాడు. జర్మన్ భాషలో డిప్లొమో చేశాడు. ఇతనికి తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, తమిళ, కన్నడ, జర్మన్ భాషలలో ప్రవేశం ఉంది. ఇతడు డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. తరువాత ఆకాశవాణిలో చేరి సైన్స్ ఆఫీసర్‌గా, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్‌గా, స్టేషన్ డైరెక్టర్‌గా, డిప్యుటీ డైరెక్టర్‌గా వివిధ హోదాలలో హైదరాబాదు, ఆదిలాబాదు, న్యూఢిల్లీ కేంద్రాలలో పనిచేశాడు.
రచనలు
[మార్చు]
ఇతడు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ వారపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రిక, ఆంధ్రభూమి, చెకుముకి, పల్లకి, స్వాతి మాసపత్రిక, సితార, యోజన, బాలచంద్రిక మొదలైన పత్రికలలో ఎన్నో శీర్షికలను నిర్వహించాడు. లెక్కలేనన్ని వ్యాసాలను వ్రాశాడు. కథలు, కవితలు వ్రాశాడు. అనువాదాలు చేశాడు. సుమారు 35కు పైగా గ్రంథాలను ప్రకటించాడు. ఇతడి పుస్తకాలలో కొన్ని:
- సైన్స్ సంగతులు
- మరికొన్ని సైన్స్ సంగతులు
- ఇంకొన్ని సైన్స్ సంగతులు
- విజ్ఞానప్రపంచం
- మనం - మన ఆరోగ్యం
- మీ ఆరోగ్యం
- జంతువుల కథలు
- సైన్స్ కబుర్లు
- నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం (2 భాగాలు)
- పిల్లలకు ఫిజిక్స్
- ఛార్లీ చాప్లిన్
- ఐజాక్ న్యూటన్
- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- వైద్యరంగం నాడు - నేడు
- సచిత్ర విజ్ఞాన సర్వస్వం (3 భాగాలు)
- సాగర సర్వస్వం
- అద్భుతమైన క్షీరదాలు
- పర్యావరణ విద్య
- బతుకు బాటలో పులి
- కాలయంత్రం
- ముల్లా నస్రుద్దీన్ కథలు
- విజ్ఞాన రత్నాకరం
- వంద ప్రశ్నలు
- మరణతరంగం
- తెలుగు సైన్స్ ప్రైమర్ (ఇ బుక్ )
- అందరికీ సైన్స్
- అంతరిక్షం
- మూడు కోరికలు (బాలలకథలు)
- సైన్స్ పద్ధతి
- పక్షులు ఎలా ఎగురుతాయి?
- మిణుగురులు ఎలా వెలుగుతాయి?
- మన శరీరం కథ
అనువాదకుడిగా
[మార్చు]
ఇతడు డి వెంకట్రామయ్య, కలువకొలను సదానంద, వాకాటి పాండురంగారావు, దేవరాజు మహారాజు,మధురాంతకం రాజారాం మొదలైనవారి కొన్ని ఎంపిక చేసిన కథలను తెలుగు నుండి ఆంగ్లంలోనికి అనువదించాడు. ఖలీల్ జిబ్రాన్ రచనలను తెలుగులోనికి తర్జుమా చేశాడు. మరణం అనే విషయంపై ప్రపంచ భాషలలోని పది కథలను ఎన్నుకుని వాటిని తెలుగులోనికి అనువదించి స్వాతి మాసపత్రికలో ధారావాహికగా ప్రకటించాడు.
స్క్రిప్ట్ రచయితగా
[మార్చు]ఇతడు ఆకాశవాణిలో విజ్ఞానపద్ధతి, మానవ వికాసం, ధ్వని, నిశ్శబ్దంలో ప్రేమనాదాలు, చొప్పదంటుప్రశ్నలు మొదలైన అనేక కార్యక్రమాలను రూపొందించాడు. దూరదర్శన్, జెమిని టీవి, ఈటీవి మొదలైన వాటికి ఎన్నో డాక్యుమెంటరీలను, కార్టూన్ ఫిల్ములను తెలుగులోనికి అనువదించాడు. ఆంధ్రకళావైభవం, ఆంధ్రనాట్యరీతులు మొదలైన టెలీ సీరియల్స్ వ్రాశాడు. ఈటీవి, ఈటీవి2 ఛానళ్లకు వేయికి పైగా ఎపిసోడులకు స్క్రిప్ట్ అందించాడు. హైదరాబాద్‌లోని బి.ఎం.బిర్లా ప్లానెటోరియం స్కై షోలకు స్క్రిప్ట్ వ్రాశాడు. కేవలం స్క్రిప్ట్ మాత్రమే అందించకుండా ఈటీవీ, జెమిని టీవీలలో కొన్ని కార్యక్రమాలకు నిర్మాతగా కూడా ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి బ్రహ్మోత్సవాలను ఈటీవీ ద్వారా ప్రసారం చేశాడు.
ప్రయోక్తగా
[మార్చు]ఇతడు దూరదర్శన్‌లో శాస్త్ర అనే క్విజ్ కార్యక్రమానికి ప్రయోక్తగా వ్యవహరించాడు. దూరదర్శన్ యూజిసి కార్యక్రమం Pursuit కు కూడా ప్రయోక్తగా వ్యవహరించాడు.
మృదునైపుణ్యాల శిక్షకుడిగా
[మార్చు]ఇతడు ఆరా లీడర్‌షిప్ ఫౌండేషన్ తరఫున కోకాకోలా, భారతీ టెలికామ్, ఏషియన్ పేయింట్స్, వోల్టాస్, డా.రెడ్డీస్ లాబోరేటరీస్ మొదలైన కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు కమ్యూనికేషన్స్, పబ్లిక్ స్పీకింగ్, టైమ్ మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్, స్ట్రాటజీ, యాటిట్యూడ్ బిల్డింగ్ వంటి అనేక విషయాలపై శిక్షణ ఇచ్చాడు. ఇతడు రీసోర్స్ పర్సన్‌గా సర్వశిక్షాఅభియాన్, అకాడమిక్ స్టాఫ్ కాలేజ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదలైన ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు శిక్షణ ఇచ్చాడు. ఆంధ్రమహిళాసభ లిటరసీ హౌస్‌లో నిరుద్యోగులకు, కంపెనీ ప్రతినిధులకు అనేక అంశాలపై శిక్షణాకార్యక్రమాలను నిర్వహించాడు.
సంగీతాభిమానిగా
[మార్చు]ఇతనికి శాస్త్రీయ సంగీతం అంటే ఎక్కువ మక్కువ. అందుకే కర్ణాటక సంగీతానికి సంబంధించిన అనేక కీర్తనలను డిజిటలైజ్ చేసి అంతర్జాలం ద్వారా ప్రపంచానికి అందించాడు. ఇతడు కాంచీపురంలో శ్యామశాస్త్రి జయంత్యుత్సవాలను నిర్వహించడం మొదలుపెట్టాడు. దూరదర్శన్‌లో లలితగీతాల కార్యక్రమానికి గేయాలను రచించి అందించాడు. కొన్ని సైన్స్ గేయాలను కూడా వ్రాశాడు. ఇతడు వ్రాసిన గేయాలు క్యాసెట్ల రూపంలో కూడా వెలువడ్డాయి.
పురస్కారాలు
[మార్చు]- 1993లో విశాలాంధ్ర ప్రచురణాలయం వారి 40వ వార్షికోత్సవాల సందర్భంగా ఉత్తమ సైన్స్ రచయిత పురస్కారం.
- 2007లో జమ్మి శకుంతల స్మారక పురస్కారం.
- 2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే దూరదర్శన్ శాస్త్ర కార్యక్రమానికి ఉత్తమ ప్రయోక్తగా నంది పురస్కారం.
- 2012లో సంగీతప్రియ అవార్డు.
- 2014లో తెలంగాణ అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంచే సత్కారం.