Jump to content

కుల్లూరు

అక్షాంశ రేఖాంశాలు: 14°29′19.104″N 79°21′52.524″E / 14.48864000°N 79.36459000°E / 14.48864000; 79.36459000
వికీపీడియా నుండి
కుల్లూరు
పటం
కుల్లూరు is located in ఆంధ్రప్రదేశ్
కుల్లూరు
కుల్లూరు
అక్షాంశ రేఖాంశాలు: 14°29′19.104″N 79°21′52.524″E / 14.48864000°N 79.36459000°E / 14.48864000; 79.36459000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలంకలువాయి
విస్తీర్ణం30.45 కి.మీ2 (11.76 చ. మై)
జనాభా
 (2011)[1]
5,593
 • జనసాంద్రత180/కి.మీ2 (480/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,887
 • స్త్రీలు2,706
 • లింగ నిష్పత్తి937
 • నివాసాలు1,521
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్524343
2011 జనగణన కోడ్591982

కుల్లూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కలువాయి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కలువోయ నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నెల్లూరు నుండి 75 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1521 ఇళ్లతో, 5593 జనాభాతో 3045 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2887, ఆడవారి సంఖ్య 2706. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1190 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 704. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591982[2].

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. సమీప బాలబడి కలువాయిలో ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కలువోయలోను, ఇంజనీరింగ్ కళాశాల నెల్లూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ నెల్లూరులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నెల్లూరులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

కుల్లూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

కుల్లూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కుల్లూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 1320 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 531 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 421 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 27 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 14 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 4 హెక్టార్లు
  • బంజరు భూమి: 60 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 663 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 173 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 554 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కుల్లూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 418 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 100 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 35 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

కుల్లూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, వేరుశనగ, పొద్దు తిరుగుడు

కుల్లూరు గ్రామానికి సంబంధించిన కొంత సమాచారం

[మార్చు]

నెల్లూరు - సోమశిల మార్గంలో నెల్లూరు నుండి 74 కి.మీ దూరంలో ఉన్న ఒక ప్రత్యేకత సంతరించు కొన్న గ్రామం కుల్లూరు. నైసర్గికంగా ఉత్తరాన పెన్నానది, దక్షిణాన దట్టమైన అడవులు - అల్లంత దూరంలో పెంచలకోన క్షేత్రం, పడమట సోమశిల రిజర్వాయర్, తూర్పున నెల్లూరు రహదారి ఉన్నవి . ఊరికి పడమట చెరువు, చెరువు ఆనుకొని శిథిలమైన శివాలయం, దాని ప్రక్కనే శిథిలమైన కోట, దాని చుట్టూ అగడ్త ఉన్నాయి. చెరువు అలుగు లోని ఒక శిలా శాసనం వల్ల ఈ గ్రామం విజయ నగర రాజుల ఏలుబడిలో ఉన్నట్లు భావించవచ్చు. కోటలో ఆ ప్రాంతానికి చెందిన కొంత సైన్యం ఉండేది. దానికి అధికారిగా కొండమురుసయ్య అనే విజయ నగర రాజుల సైన్యాధికారి ఉండేవాడు.కుల్లూరు గ్రామంలోని పూర్వీకులు కోటలో గుర్రపు రౌతులు అనగా ఆశ్విక సైనికులుగా ఉండేవారు. నాకు తెలిసినంత వరకు కుల్లూరులోని ప్రతి ఇంటిలో రాజుల కాలంలో వాడిన కత్తులు, ఖడ్గాలు, బాకులు, డాలులు, కట్టె తుపాకులు - మొదలైన ఆయుధాలు ఉండేవి. కుల్లూరు ప్రాచీన కాలంనుండి నాగరికమైన ఊరు. తీర్చి దిద్దినట్లు వీధులు, కులాల వారీగా ఆవాసాలు, వైభవోపేతంగా వర్తక వ్యాపారాలు నడిచేవి. చుట్టు ప్రక్కల గ్రామాలకు తల మానికంగా ఉండేది. గ్రామంలో బలిజ కులస్తులే మెజారిటీ కుటుంబాలు. మిగతా కులాలన్నీ వీళ్లను అనుసరించేవి. బలిజల ఇంటి పేర్లు, ఆచార - సంప్రదాయాలు పరిశీలిస్తే రాచరిక వ్యవస్థలో భాగస్వామ్యం ఉన్నట్టు తెలుస్తుంది. రాచరికం రూపు కోల్పోయిన తదనంతరం వీరు ముత్యాల వర్తకులుగా ప్రసిధ్ధి పొందినారు. స్వతహాగా సాము గరిడీల మీదను, చదువు సంధ్యల మీదను ఆసక్తులు కావడం వల్ల విద్యకు ప్రాధాన్య మిచ్చి 1949 లోనే ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేసుకున్నారు. తదనంతర పరిణామాలలో ప్రభుత్వకొలువులే వీరికి వృత్తిగా మారినవి. ఈ గ్రామంలో ఉన్నన్ని దేవాలయాలు ఇంకే గ్రామంలోనూ ఉండ వంటే అతిశయోక్తి కాదు. ఆరడుగుల పైగా ఎతైన దేదీప్యమానమైన మూర్తులతో శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ అచ్యుత స్వామి వారి దేవాలయం ఆరేడు వందల ప్రాచీన ఆలయం ఉంది. ఇక ప్రాచీన చెన్నకేశవ ఆలయం, రామాలయం పునరుధ్ధరింపబడినవి. ఆంజనేయ స్వామి ఆలయం, శాయి బాబా ఆలయం, వెంకయ్యస్వామి ఆలయం, విఘ్నేశ్వరాలయం, శివాలయం, పొలేరమ్మగుడి, అంకమ్మగుడి—ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్ద దౌతుంది. ఈ గ్రామం సంస్కృతీ సంప్రదాయాలకు, కవులకూ, కళాకారులకూ, రాజకీయ వేత్తలకూ పెట్టింది పేరు.

మనోఙ్ఞమైన సీసపద్యం

---

అవగాహనేహా సమాయత్త విభుదరా

ట్కమనీయ మణి శతాంగములనంగ

తాటాక సేతు సందర్శనేచ్ఛా గత

స్థిత సమున్నత మహా శిఖరులనగ

నేతదుజ్వల ధరానేతృ సంపాదిత

మూర్తి భాస్వద్కీర్తి మూర్తులనగ

ముక్తా మణీ యుక్త మోహనాంబర చుంబి వరుణ రాజన్య

గోపురములనగ నిలిపె గుల్లూరి నల్ల చెర్వలుగు నందు

ముప్పదియు మూడు రా కంబములు జెలంగ

చింతపట్ల పురస్థాయి శ్రీవిధాయి రుచిర గుణహారి చెంచయ రుద్రశౌరి .

----

పై పద్యం భావం

[మార్చు]

మా కుల్లూరి శీమ రాజ్యభార ధురంధరుండైన చింతపట్ల రుద్రశౌరి మాయూరి నల్లచెరువుకు ముప్పదిమూడు రాతిస్తంభాలతో అలుగు నిర్మిం చెను . ఆ అలుగు వర్ణణ యిది . సా.శ. 1612లో శిలాశాసనంలో వ్రాయబడి ఉంది . సదరు చెరువులో మునగడానికి వచ్చి దేవతల రాజు అచట నిలిపిన కమనీయ మణిమయ రథము వలెనూ, తటాక సేతు సందర్శనేచ్చతో వచ్చిన సందర్శకులకు శిఖరముల వలెనూ, ప్రకాశమానమైన కుల్లూరి శీమను పాలించిన రాజులు సముపార్జించిన కీర్తి స్తంభాల వలెనూ, ముత్యములు మణులతో నిర్మితమై ఆకసము నంటుచున్న వరుణదేవుని రాజమందిర గోపు రముల వలెనూ అలుగు రాతిస్తంభములున్నవట .

శాసనం మాయూరి చెరువు అలుగు వద్ద ఇప్పటికీ నిలిచి ఉంది . శాలివాహనశకం 1534 పరీధావి సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి సోమవారం అనగా సా.శ.1612 న ఇది వ్రాయ బడింది . అప్పట్లో వీర వెంకట పతి రాయలు సామ్రాజ్య మేలుతూ ఉండేవారు . వారి సామంతులుగా ఈ ప్రాంతాన్ని రేచర్ల పద్మనాయక వంశ ప్రభువు వెలుగోటి వెంకటపతినాయనింగారు పాలించేవారు . రుద్రప్ప వీరి రాజ్యభార దూరందరుడు . అంటే సర్వ సైన్యాధ్యక్షులన్నమాట . ఇదీ సంగతి .రచయిత : వెంకట రాజారావు . లక్కాకుల

చారిత్రకాంశాలు

[మార్చు]

కుల్లూరి సీమకు విజయనగరసామ్రాజ్యానికీ విడదీయరాని సంబంధం ఉంది .శ్రీకృష్ణదేవరాయల హయాంనుండి ఆరవీటి రాజుల హయాం వరకూ ఈ సంబంధం కొనసాగింది . విజయనగర రాజులు పరిపాలనా సౌలభ్యం కొఱకు సామ్రాజ్యాన్ని కొన్ని రాజకీయ విభాగాలుగా మలచుకున్నారు . ' సీమ ' అనే విభాగం అందులో ఒకటి . నెల్లూరు సీమ, ఆత్మకూరు సీమ, వెంకటగిరి సీమ, రాపూరు సీమ, కుల్లూరు సీమ అనేవి మన ప్రాంతానికి చెందిన ' సీమ ' విభాగాలు .విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన సంగమ సాలువ వంశాల తదుపరి తుళువ వంశం అధికారాన్ని చేజిక్కించుకుంది . తుళువ నరసనాయకుడు నాగలాంబల కుమారుడు శ్రీకృష్ణదేవరాయడు తిమ్మరసయ్య తంత్రాంగంతో 1509 లో ఆగస్టు 8 న శ్రీజయంతి పర్వదినాన విజయనగర సామ్రాజ్య పట్టాభి షిక్తుడైనాడు . దిగ్విజయ యాత్రలు సాగించి, సామ్రాజ్యాన్ని బహుదా విస్తరించి, అవిఛ్ఛిన్నంగా 1529 వరకూ రాజ్యపాలన చేసాడు . ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, సంహాచలం ప్రాంతాలను ఆక్రమించాడు . ఉదయగిరి దుర్గాధిపతి తిరుమల రాహత్తరాయని ఓడించి, తన సేనాపతి రాయసం కొండమరుసయ్యను దుర్గాధిపతిగా నియమించాడు . దుర్గంలోని బాలకృష్ణ విగ్రహాన్ని రాజధాని హంపికి తరలించి, కృష్ణాలయం నిర్మించాడు .1512 లో ఉదయగిరి దుర్గాధిపతిగా నియమించబడ్డ కొండమరుసయ్య మహామంత్రి తిమ్మరుసయ్య సమకాలికుడు, బంధువు, సేనానులలో ఒకడు .నాటి కుల్లూరు సీమలో నేటి కలువాయ, అనంతసాగరం మండలాలూ, తెగచెర్ల వరకూ రాపూరు మండలంలో కొంతభాగం గ్రామాలు ఏలుబడిలో ఉండేవి .

ఈ ప్రాంతాలు నీటి యెద్దడితో పంటలు పండక కరువు కాటకాలతో సతమతమవుతూ ఉండుటను తెలుసుకుని రాయలవారు సేద్యపరంగా చెఱువులు నిర్మించడానికీ, సైనికపరంగా వటిష్టం చేయడానికీ పూనుకుని, ఉదయగిరి దుర్గంనుండి కుల్లూరుసీమకు అధిపతిగా నియమించి నాడు . కొండమరుసయ్య 1514 ~ 15 ప్రాంతంలో కుల్లూరు పట్టణంలో మట్టికోటను నిర్మించి, కోటకు ప్రక్కనే నల్లచెఱువును, శివాలయాన్నీ నిర్మించాడు . కోట చుట్టూ శత్రు దుర్భేద్యంగా అగడ్తను ఏర్పరచాడు . తంజనగరం నుండి గుఱ్ఱాలను కొని తెచ్చి, కోటలో ఆశ్విక దళాన్ని ఏర్పాటు చేసి, కుల్లూరును సైనిక పట్టణంగా తీర్చిదిద్దినాడు .అరోజుల్లో, కుల్లూరు పట్టణం యుధ్ధ విద్యలలో నిరంతర శిక్షణ శిబిరాలతో సందడిగా ఉండేది . కొండమరుసయ్య ఆధిపత్యంలోనే అనంతసాగరం, కలు

వాయ చెఱువులు కూడా నిర్మింప బడ్డవి, విజయనగర రాజుల హయాంలో ఒక సంవత్సరకాలం అంటే _ ఆశ్వజయ శుధ్ధ దశమి మొదలు మహార్ణవమి వరకు . ఈ సాంప్రదాయం కుల్లూరు పట్టణంలో కూడా ఉండేది . ఆశ్వజయ మాసారంభం నుండి మహార్ణవమి వరకూ తొమ్మిది రోజులు పట్టణంలోని సైనిక శిబిరాలలో యుధ్థవిన్యాసాల పోటీలు జరిగేవి . గెలుపొందిన వీరులకు విజయదశమి రోజున బహుమతి ప్రదానం జరిగేది . విజయదశమి నుండి జైత్రయాత్రలు సాగించేవారు .చంద్రగిరి రాజధానిగా పాలించిన సాళువ నరసింహరాయల వద్ద కొలువు చేసిన ఆరవీటి తిమ్మరాజు రాజుగా విజయనగర సామ్రాజ్యాన్ని ఆరవీటి వంశం చేజిక్కించుకుంది . తిమ్మరాజు కొడుకు తిరుమలరాయ లు . అతని కొడుకులలో వీర వెంకటపతి రాయలు చం ద్రగిరి రాజధానిగా తమిళప్రాంతాన్ని 1612 వరకూ పాలించాడు .వీర వేంకటపతి రాయలపై తమిళప్రాంతం లోనిపాండ్యులు తిరుగుబాటు చేసారు . ఈ తిరుగుబాటును రాయల సామంతరాజు రేచర్లపద్మనాయక ప్రభువైన రాజా వెలుగోటి వెంకటపతినాయనింగారు సమర్ధంగా అణచివేసినారు . అందుకు బహుమానంగా వీరవేంకటపతిరాయలు నెల్లూరు ప్రాంతాన్ని అమరానకు పాలించుకొనుటకిచ్చి, పంచపాండియధరావిభాలుం డు, సంగ్రామపార్ధుండు, పద్మనాయక వంశాంభోది చంద్రుండు అను బిరిదులతో నాయనింగారిని సత్కరించారు.నాయనింగారి ఏలుబడి లోకి కుల్లూరిసీమ కూడా

చేరింది . అటుపై రాజా చింతపట్ల రుద్రప్పనాయనింగారిని కుల్లూరిసీమ కథిపతిగా నియమించుకొనిరి .విజయనగర రాజుల మార్గంలోనే, వెలుగోటివెంకటపతి నాయనింగారు కుడా ప్రజోపయోగ కార్యాలలో ప్రసిధ్ధి చెందిరి . అనేక చెరువులు వీరి హయాంలోనే మరమ్మత్తులకు నోచుకున్నవి . కుల్లూరుసీమలో భాగమైన అనంతసాగరం చెఱువు గట్టు కేతామన్నేరు ఉరవడికి ప్రతియేటా తెగి, నీళ్ళు ఊళ్ళను ముంచుతుండేవి . వెంక టవతి నాయనింగారు రుద్రప్పనాయనింగారిచే కట్టను పటిష్ఠపరచి, తూము నిర్మింపజేసి శాశ్వత పరిష్కారం చూపినారు . అనంతరం కలువాయ చెఱువుకు అలుగు నిర్మించారు .1612లో రాజా వెలుగోటి వెంకటపతి నాయనింగారు కుల్లురుసీమ అధివతి రాజా చింతపట్ల రుద్రప్పనాయనింగారిని తన కొలువుకు రావించి, సబహుమానంగా గౌరవించి, తన తండ్రి రాజా కుమార తిమ్మానాయనిగారికి పుణ్యం కలనగననట్లుగా కుల్లూరు నల్ల చెఱువుకు తూర్పలుగు నిర్మించవలసందిగా కోరిరి .వారికోరిక మేరకు రుద్రప్పనాయనింగారు ముప్పదిమూ డు శిలాస్ధంభాలతో నల్లచెఱువుకు అలుగు నిర్మాణం చేపట్టినారు . సాక్ష్యంగా ఇప్పటికీ మా చెఱువు గట్టున ఒకశిలా శాసనం ఉంది .

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=కుల్లూరు&oldid=4339569" నుండి వెలికితీశారు