Jump to content

కావూరి పూర్ణచంద్రరావు

వికీపీడియా నుండి
కావూరి పూర్ణచంద్రరావు

కావూరి పూర్ణచంద్రరావు ఆశుకవి, అవధాని, రచయిత, విమర్శకుడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు 1924, సెప్టెంబరు 3వ తేదీ వినాయకచవితి నాడు (రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి) కృష్ణా జిల్లా, గుడివాడ పట్టణంలో బగళాదేవి, సూర్యప్రకాశరావు దంపతులకు జన్మించాడు. ఇతని స్వగ్రామము చింతలపూడి అగ్రహారం.[1]

ఇతడు ఒకటవ క్లాసు నుండి అయిదవ క్లాసు వరకు గుడివాడ వీధిబడిలో చదువుకున్నాడు. పిదప గుడివాడ బోర్డు హైస్కూలులో థర్డు ఫారం నుండి ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివి 1943లో స్కూలు ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. తరువాత ఇతడు ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేసుకుంటూ ఫ్రైవేటుగా ఇంటర్మీడియెట్, బి.ఎ., భాషా ప్రవీణ ప్రిలిమినరీ, బి.ఓ.ఎల్., ఎం.ఎ. పరీక్షలలో ఉత్తీర్ణుడైనాడు. ఇతని ప్రధాన విద్యాగురువు, అవధాన గురువు భమిడిపాటి అప్పయ్యశాస్త్రి.

ఇతడు మొదట విజయా కమర్షియల్ బ్యాంకులో స్టెనోగా ఉద్యోగంలో ప్రవేశించి, క్రమక్రమంగా విజయవాడలో ఎ.పి.వర్క్స్ సంస్థలో అకౌంట్స్ గుమాస్తాగా కొంతకాలం, భారత్ పిక్చర్స్‌లో టైపిస్టుగా కొంతకాలం, రేషనింగ్ ఆఫీసులో క్లర్క్‌గా కొంతకాలం, ఏషియన్ అష్యూరెన్స్ కంపెనీలో క్లర్క్‌గా మరికొంతకాలం పనిచేసి విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో తెలుగు ట్యూటర్‌గా చేరాడు. 1968లో తెలుగు ఉపన్యాసకుడిగా పదోన్నతి పొంది 1984లో పదవీ విరమణ చేశాడు.

అవధానాలు

[మార్చు]

ఇతడు 1975-95 మధ్యకాలంలో సుమారు 100కు పైగా అష్టావధానాలు నిర్వహించాడు. చాలా వరకు విజయవాడలోనే అవధానాలు చేసినా హైదరాబాదు, గుంటూరు, మంగళగిరి, నర్సరావుపేట, మచిలీపట్నం, కంచికచర్ల, నందిగామ, ఆగిరిపల్లి, ఏలూరు, నర్సాపురం, అనంతపురం, నెల్లూరు మొదలైన చోట్ల కూడా తన అవధాన విద్యను ప్రదర్శించాడు. ఇతని అవధానాలలో సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, వారకథనము, యాంత్రికచిత్రము, అప్రస్తుత ప్రసంగము అనే అంశాలు ఉంటాయి.

ఇతని అవధానాలలో కొన్ని పూరణలు ఈ విధంగా ఉన్నాయి.

  • సమస్య : రక్తి మించి సంసారి బైరాగి యయ్యె

పూరణ:

కంటి శుక్లంబులును, పుప్పిపంటి నొప్పి
శక్తి హీనత, భార్యకు భక్తిలేమి
సుతుల నిర్లక్ష్యవైఖరి మతి చెఱుప; వి
రక్తి మించి సంసారి బైరాగి యయ్యె

  • దత్తపది: ధాత - ఈశ్వర - బహుధాన్య - ప్రమాధి పదాలతో రామాయణార్థములో

పూరణ:

ధరణిని రావణాసురుని దర్పమడంపగ నెంచి ధాత ఈ
శ్వర పరరూపమట్లు ప్రభవం బొనరించెను రామమూర్తిను
ర్వర బహుధాన్యవంతము పురంబగునట్టి అయోధ్య లోపలన్
పరమ ప్రమాదియై అసురభంజకుడయ్యె నతండు మెత్తురే

రచనలు

[మార్చు]

ఇతడు ఈ క్రింది రచనలను చేశాడు.

  1. భీష్మచరిత్ర
  2. రాఘవపాండవీయము
  3. జన్నవాడ కామాక్షీ చరితామృతము
  4. నమస్సుమాలు
  5. ఆత్మబోధ
  6. స్వప్నవాసవదత్త
  7. భాగవత కథలు
  8. గజేంద్ర మోక్షము - శ్రీ కృష్ణలీలలు
  9. హోమియో చికిత్సలోని మెళకువలు
  10. అవధాన మంజరి
  11. సరస వినోదిని - సమస్యా పూరణము (అముద్రితం)

సాహిత్య రూపకాలు

[మార్చు]

ఇతడు భువన విజయం, బ్రహ్మసభ, ఇందిరా మందిరం మొదలైన సాహిత్యరూపకాలలో మహాకవుల పాత్రలను పోషించి ప్రేక్షకుల మెప్పును పొందాడు.

బిరుదులు

[మార్చు]

ఇతడికి అవధాన సరస్వతి,అవధాని శిరోమణి అనే బిరుదులు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). అవధాన సర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 337–341.