Jump to content

కసిణ

వికీపీడియా నుండి

ఇది పాళీ పదం. కృత్స్న అనే సంస్కృత శబ్దానికి దగ్గరగా ఉన్న పదం. (సింగపూర్‌ బుద్ధిస్ట్‌ మెడిటేషన్‌ సెంటర్‌ ప్రచురించిన Buddhist Dictionary) సమస్తం/ మొత్తం అని ఈ సంస్కృత పదానికి అర్థం. ప్రధానంగా థేరవాద సంప్రదాయంలో ఏకాగ్రతను పెంపొందించు కొనడానికి ఎంచుకొనే ఒక లక్ష్యం/ గుర్తు ఏదైనా అని అర్థం. (ఆక్స్‌ఫర్డ్‌ ప్రచురించిన Dictionary of Buddhism) అది రంగులో ఉన్న చుక్క కావచ్చు, ఒక చక్రం లాంటిది కావచ్చు, మట్టి ముద్ద కావచ్చు, దూరంగా ఉన్న ఒక జలాశయం కూడా కావచ్చు. తదేకంగా దానిపైనే దృష్టిని కేంద్రీకరించడం సాధనలో భాగం. ఈ విధంగా చేయడంలో వివిధ దశలు గడిచాక, ఇంద్రియాలు పని చేయడం మానేస్తాయి. ఏమీ కనపడని, వినపడని స్థితి వస్తుంది. కాయిక భావనలు, ఆలోచనలు ఏమీ ఉండవు. ధ్యాన లక్ష్యంలో సాధకుడు లీనం కావడం ‘ఝానం’ (ధ్యానం) మొదటి స్థితి. ఏకాగ్రత పెరిగిన కొలదీ దేని మీద దృష్టిని కేంద్రీకరించారో అందుకు సంబంధించిన దృశ్యాలు కొన్ని అనుభవమౌతాయి. అలాంటి పది దృశ్యాలను బౌద్ధ సుత్తాలు పేర్కొంటున్నాయి. అవి: మట్టి, నీరు, అగ్ని, గాలి, నీలం, పసుపు, ఎరుపు, తెలుపు, అంతరిక్షం, చైతన్యం. వీటిని ఆవరణలని కూడా అంటారు. కింద, మీద, చుట్టుపక్కల, అఖండంగా, అపరిమితంగా ఈ ఆవరణలు ఉండవచ్చు. ధ్యానం చక్కగా సాగుతున్నప్పుడు కొంతకాలానికి నిజమైన ఆకారంగా తోచే ‘పటిభాగ నిమిత్త’ అనే మచ్చలేని ఒక దృశ్యం మనో నేత్రం ముందు ఆవిష్కృతమవుతుంది. అది నిశ్చలంగా నిలచి ఉంటుంది. సాధనలో ప్రగతిని సూచించే దశ ఇది. అగ్ని, గాలి మొదలైనవి గానీ, అఖండంగా తోచే మరేవైనా గానీ ధ్యానంలో కనిపిస్తాయి కనుక సమస్తం అని అర్థం వచ్చే సంస్కృత పద సమానమైన పాళీ పదమో, రూపం మారిన సంస్కృత పదమో ఇక్కడ చేరి ఉండవచ్చునని ఒక భావన.

"https://te.wikipedia.org/w/index.php?title=కసిణ&oldid=2951206" నుండి వెలికితీశారు