Jump to content

కవి - కావ్యం

వికీపీడియా నుండి

కవి శబ్ధం మొట్టమొదటిసారిగా ఈశాన్య ఉపనిషత్తులో కనిపిస్తుంది. ఆ తర్వాత ఋగ్వేదంలో కనిపిస్తుంది. కవి అనే పదానికి కమ్ అనే పదాన్ని ధాతువుగా చెప్పవచ్చు. కమ్ అనగా బ్రహ్మ జ్ఞానం తెలిసినవాడు అని, పరమేశ్వర సాక్షాత్కారం పొందినవాడు అని అర్థాలు ఉన్నాయి. పూర్వీకులు కవిని పరమాత్మ స్వరూపంగా భావించారు. ఉపనిషత్తుల తర్వాత కాలంలో కవిని ఋషితో పోల్చారు.[1]

ప్రముఖుల వ్యాఖ్యలు

[మార్చు]

కావ్యప్రకాశంలో మమ్మటుడు క్రింది విధంగా తెలిపాడు. నా కృషి కురుతే కావ్యమ్ ఋషిశ్చ కిల దర్శనాత్ (ఋషి కానివాడు కవి కాలేడు కవి కాని వాడు కావ్యం రాయలేడు)

అభినవ భారతిలో అభినవ గుప్తుడు క్రింది విధంగా తెలిపాడు. కావయః క్రాంత దర్శనః కమనీయం కావ్యం (దర్శనభాగ్యం కలవాడు కవి. రమణీయంగా వర్ణింపబడినది కావ్యం.

ధ్వన్యాలోకంలో ఆనంద వర్ధనుడు క్రింది విధంగా తెలిపాడు. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః యథాస్మై రోచతే విశ్వంతతేనం పరివర్తతే (అనంతమైన కావ్య ప్రపంచానికి కవియే బ్రహ్మ. కవి ఇష్టానుసారమే కావ్య జగత్తు నిర్మితమవుతుంది.[2]

కవి లక్షణాలు

[మార్చు]

విన్నకోట పెద్దన తన కావ్యాలంకార చూడామణిలో అలాగే అప్పకవి తన అప్పకవీయంలో సప్తవిధ కవులను, వారి లక్షణాలను క్రింది విధంగా ప్రస్తావించారు.

  1. వాచికుడు: అర్థ గాంభీర్యం లేకుండా అనుప్రాస మాత్రమే వాడుతూ లలితమైన పద ఆడంభరంతో కావ్యం రచించే వాడు.
  2. అర్థుడు : శబ్ధాలు తక్కువగానే ఉన్నా వ్యాఖ్యానిస్తే విస్తృత అర్థం వచ్చేటట్లు కావ్యం రచించేవాడు.
  3. శిల్పకుడు: యమక అలంకారంతో కావ్యం రచించే వాడు.
  4. రౌచికుడు: మృధుమధురంగా అంటే సౌకుమార్య మాధుర్య గుణ ప్రాధాన్యంతో కావ్యం రచించే వాడు.
  5. భూషణార్థి: రకరకాల శబ్ధ, అర్థ అలంకారాలతో కావ్యాన్ని రచించే వాడు.
  6. మార్దవానుగతుడు: శబ్దాలు సరళంగా, అర్థాలు విరళంగా, రసస్పూర్తి అరుదుగా కలిగేటట్లు రచించే వాడు.
  7. వివేకి: అలంకార శాస్త్ర ప్రతిభావంతుడుగా అయి, చంధో వ్యాకరణ పరిజ్ఞానం కలిగి, దోషరహితంగా, గుణవంతంగా అభివ్యక్తి మార్గంలో కావ్యం రచించేవాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. పింగళి లక్ష్మీకాంతం (2002-11-01). సాహిత్య శిల్ప సమీక్ష.
  2. డా. ద్వానా శాస్త్రి. తెలుగు సాహిత్య చరిత్ర.
  3. డా. ఎన్. కె. మద్దిలేటి. తెలుగు సాహిత్య దర్శిని.