Jump to content

కర్ణి మాతా దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 27°47′26″N 73°20′27″E / 27.79056°N 73.34083°E / 27.79056; 73.34083
వికీపీడియా నుండి
కర్ణి మాతా దేవాలయం
కర్ణి మాతా ఆలయం
కర్ణి మాతా ఆలయం
కర్ణి మాతా దేవాలయం is located in Rajasthan
కర్ణి మాతా దేవాలయం
కర్ణి మాతా దేవాలయం
భారతదేశంలోని రాజస్థాన్ లో ఉనికి
కర్ణి మాతా దేవాలయం is located in India
కర్ణి మాతా దేవాలయం
కర్ణి మాతా దేవాలయం
కర్ణి మాతా దేవాలయం (India)
భౌగోళికాంశాలు :27°47′26″N 73°20′27″E / 27.79056°N 73.34083°E / 27.79056; 73.34083
పేరు
ఇతర పేర్లు:కర్ణి మాతా ఆలయం
ప్రధాన పేరు :Karni Mata Temple
దేవనాగరి :करणी माता मंदिर
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:రాజస్థాన్
జిల్లా:బికనేర్
ప్రదేశం:దెష్ణోక్
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ముఘల్ & రాజపుట్
ఇతిహాసం
నిర్మాణ తేదీ:15వ - 20వ శతాబ్దం
సృష్టికర్త:మహారాజా గంగా సింగ్

కర్ణి మాతా దేవాలయం (హిందీ: करणी माता मंदिर) రాజస్థాన్ లోని బికనేర్ కు 30 కి.మీ దూరంలో గల దేవాలయం. ఈ ఆలయ ప్రధాన దైవం కర్ణిమాత. ఈ దేవాలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.

ఈ దేవాలయంలో సుమారు 20,000 నల్ల ఎలుకలు సజీవంగా ఉన్నాయని ప్రసిద్ధి. ఈ ఎలుకలు దేవాలయం అంతా తిరుగుతుంటాయి.[1] ఈ ప్రసిద్ధ ఎలుకలను కబ్బాలు అని పిలుస్తారు. ఈ ఎలుకలు దైవత్వ ఎలుకలుగా ఆ గ్రామస్థులు పూజిస్తారట. ఈ దేవాలయాన్నిసందర్శించడానికి అనేక మంది యాత్రికులు వస్తూంటారు. ఆసక్తి గల పర్యాటకులు ప్రపంచ వ్యాప్తంగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు.

ఇతిహాసం

[మార్చు]

కర్ణిమాతా పెంపుడు కుమారుడు లక్ష్మణ్ యొక్క కథ ప్రకారం అతడు కోలయత్ తెహసీల్ లోని కపిల్ సరోవర్ వద్ద సరస్సులో నీరు త్రాగు ప్రయత్నంలో పడిపోతాడు. కర్ణిమాత యమునితో ఆయనను కాపాడమని కోరుతుంది. కొదట తిరస్కరించినా చివరికి మనసు మార్చుకొని లక్ష్మణ్ తో పాటు కర్ణిమాత యొక్క మగ సంతానాన్ని ఎలుకలుగా పునర్జన్మ యిస్తాడు.[2]

కర్ణిమాత బాల్యం నుంచి దుర్గాదేవి ఉపాసకురాలు. ఈమె 150 సంవత్సరాలు జీవించిందని తెలుస్తోంది. పుట్టుకతోనే ఈమెకు అతీంద్రియ శక్తులు ఉండేవని ప్రచారం. తనకున్న శక్తులతో పేదలు, భక్తుల సమస్యలు పరిష్కరించేదని ప్రతీతి. అందుకే ప్రజలు ఆమెను దేవతలా కొలవడం ప్రారంభించారు. ఒకరోజు ఆమె ఆకస్మాత్తుగా తన ఇంట్లోనే అదృశ్యమైంది. ఎవరికీ కనిపించలేదు. ఆమెకు అక్కడే ఆలయం నిర్మించి, నాటి నుంచి పూజలు జరిపారు. కొంతకాలానికి భక్తులతో ఆమె మాట్లాడుతూ తమ వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారంతా ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని, వారికి అన్నపానీయాలు సమర్పించి ధన్యులు కమ్మని చెప్పిందట.

ఆ సమయంలో కర్ణిమాత వంశంలో దాదాపు 600 కుటుంబాలు ఉండేవట. మాత చెప్పిన విధంగానే కొన్ని రోజులకు ఆ కుటుంబాల వారంతా మరణించడం, ఆ తర్వాతే ఈ ఆలయంలో ఎలుకలు గుంపులు గుంపులుగా రావడం చూసిన వారంతా కర్ణిమాత వంశీయులే ఎలుకలుగా మారారని భావించారు. నాటినుంచే ఈ ఎలుకలను కర్ణిమాతతో సమానంగా పూజించడం మొదలుపెట్టారట.[3]

మరో జానపద కథ ప్రకారం 20 వేల మంది బలమైన సైన్యం ఒకానొక యుద్ధంలో ఓడిపోయి, పారిపోయి దేష్నోక్ గ్రామానికి చేరుకుంది. ఇక్కడికి వచ్చాక యుద్ధం నుంచి పారిపోవటం మహాపాపమని, దానికన్నా మరణమే మేలు అని తెలుసుకున్న వారు తమకు తామే మరణశిక్ష విధించుకున్నారు. కర్ణిమాత వారి ఆత్మహత్య దోషం పోవడానికి ఈ ఆలయంలో ఎలుకలుగా ఉండిపొమ్మని చెప్పిందట. సైనికులంతా కర్ణిమాతకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ అక్కడే ఉండిపోయారట. అలా మానవులే ఎలుకలుగా పునర్జన్మ ఎత్తినట్టుగా భావిస్తారు.

ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారు. ఇక్కడ ఎలుకలు ఆహార పదార్థాలను తినడం ఎక్కువ గౌరవంగా భావిస్తారు.[1]

నిర్మాణ శైలి

[మార్చు]
దేవాలయం వద్ద పాలరాతి శిల్పాలు.

ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో గంగాసింగ్ అనే రాజు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం 20వ శతాబ్దపు మొదట్లో పునర్నిర్మించారు. మొఘలుల శిల్పకళానైపుణ్యం ఇక్కడి గోడల మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆలయం ముందు భాగమంతా పాలరాతి వైభవంతో విరాజిల్లుతుంది. వెండి తాపడం చేసిన ద్వారాలు అబ్బురపరుస్తాయి.

ఈ ఆలయానికి వెండి ద్వారాలు, నగిషీలు చెక్కిన పాలరాతిని హైదరాబాద్‌కు చెందిన కర్ణి ఆభరణ తయారీదారులు ఇచ్చినట్టు కథనాలు ఉన్నాయి. ఈ ఆలయంలోనే దాదాపు 20 వేలకు పైగా ఎలుకలు ఉన్నాయి.[4]

తెల్ల ఎలుకలు

[మార్చు]
దేవాలయంలో తెల్ల ఎలుకలు

వేల కొలది నల్లని ఎలుకల మధ్య కొన్ని తెల్లని ఎలుకలు కనిపించడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కర్ణిమాతకు ముగ్గురు పిల్లలు పుట్టి పురిట్లోనే కన్నుమూశారు. దీంతో ఆమె తన భర్తకు సొంత చెల్లెలినే ఇచ్చి వివాహం చేసింది. వారి కుమారుడు ఒకసారి ఆడుకుంటూ కపిల్ సరోవర్‌లో పడి చనిపోయాడు. కర్ణిమాత ఆ బిడ్డ ప్రాణాలను ఇవ్వమని యముడిని వేడుకుంది. యముడు ఆమె ప్రార్థనలకు కరగలేదు. కర్ణిమాత దుర్గాదేవి అనుగ్రహంతో ఆ కుమారుడిని బతికించుకుంది. అంతేకాదు ఆ కుమారుడితో పాటు ఆమె మిగతా ముగ్గురు బిడ్డలూ తిరిగి బతికారట.

ఈ ఆలయంలో కనిపించే నాలుగు తెల్లని ఎలుకలు కర్ణిమాత బిడ్డలేనని, ఆ నాలుగు ఎలుకలు కనిపించిన వారికి కర్ణిమాత పూర్తి ఆశీస్సులు లభించినట్టే అని భక్తుల నమ్మిక. అందుకే ఆ నాలుగు తెల్లని ఎలుకలు కనిపించేదాక భక్తులు అక్కడే కూర్చొని ఓపికగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ తెల్ల ఎలుకలు ముఖ్యమైన వేడుకలలో మాత్రమే కనిపించడం విశేషం.

ఆరాధన, ఉత్సవాలు

[మార్చు]

ఆరాధనలు

[మార్చు]
దస్త్రం:Devotees performing aarti at Karni Mata Temple.jpg
కర్ణిమాతా దేవాలయం వద్ద భక్తులు నిర్వహిస్తున్న హారతి

కర్ణిమాత ఆలయంలో ఉదయం 4 గంటలకు తొలి పూజ మొదలవుతుంది. పూజారులు అమ్మవారికి నైవేద్యాలు, మంగళహారతి సమర్పించి, మృదంగ ధ్వనులను వినిపిస్తారు. అప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని ఎలుకలన్నీ గర్భాలయం నుంచి బిరబిరా బయటకు వస్తాయి. పెద్ద పెద్ద పళ్లాలలో పెట్టిన నైవేద్యాన్ని ఆబగా ఆరగిస్తాయి. ఆ తర్వాత భక్తులు సమర్పించే నైవేద్యాలను తింటూ, ఆలయంలో తిరుగుతూ రోజంతా గడిపేస్తాయి. తిరిగి రాత్రి సమయంలో గర్భాలయంలోకి వెళ్లిపోతాయి.

కర్ణిమాతా ఉత్సవాలు

[మార్చు]

కర్ణిమాతా ఉత్సవాలు ముఖ్యంగా దెష్ నోక్ వద్ద సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయి;

  • మార్చి - ఏప్రిల్ నెలలలో నవరాత్రులు (చైత్ర శుక్ల ఏకాదశి నుండి చైత్ర శుక్ల దశమి).
  • సెప్టెంబరు - అక్టోబరు నెలలలో నవరాత్రులు (ఆశ్వయుజ శుక్ల ఏకాదశి నుండి ఆశ్వయుజ శుక్ల దశమి వరకు).

చిత్ర మాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Langton, Jerry (2007). Rat: How the World's Most Notorious Rodent Clawed Its Way to the Top. Macmillan. pp. 125–128. ISBN 0-312-36384-2.
  2. Deshnok – Kani Mata Temple India, by Joe Bindloss, Sarina Singh, James Bainbridge, Lindsay Brown, Mark Elliott, Stuart Butler. Published by Lonely Planet, 2007. ISBN 1-74104-308-5. Page 257.
  3. http://m.dailyhunt.in/news/india/telugu/sakshi-epaper-sakshi/mushikaalayam-newsid-58309504 మూషికాలయం
  4. మూషికాలయం Sakshi : September 25, 2016

ఇతర లింకులు

[మార్చు]