Jump to content

కన్నెగంటి రమాదేవి

వికీపీడియా నుండి
కన్నెగంటి రమాదేవి

కన్నెగంటి రమాదేవి ఎలీప్ (అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెనెర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) సంస్థ అధ్యక్షురాలు, స్థాపకురాలు.[1][2] ప్రధానమంత్రి హై లెవెల్ టాస్క్ ఫోర్స్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వందలాది మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ఆమె ఓ రోల్ మోడల్.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె గుంటూరు జిల్లా, గుంటూరులో ఒక మధ్య తరగతి కుటుంబములో జన్మించింది. 1976లో వ్యాపార యోజనా శాస్త్రములో డిప్లొమా పొందింది.

ఒక చిన్న పరిశ్రమతో మొదలుబెట్టి మహిళలు సంఘటితముగా కష్టపడితే గాని విజయము సాధించలేరని భావించి కృష్ణా జిల్లా సూరంపల్లి గ్రామములో మహిళా పారిశ్రామిక ఎస్టేట్ ప్రారంభించింది.[3] అందులో పలువురు స్త్రీలు చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించి సఫలులయ్యారు. 30 ఎకరములలో 70 చిన్న పారిశ్రామిక యూనిట్లు ఉన్నాయి. భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం దీనిని ఆవిష్కరించారు.

ఆమె డిగ్రీ చదివిన తరువాత పెళ్ళైంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె భర్త ఫ్యాబ్రికేషన్ రంగంలో ఉన్న ఒక సిక్ పరిశ్రమను తీసుకున్నారు. ఆయనకు ఆ పరిశ్రమను నిర్వహించడం తలకు మించిన భారమయింది. ఆ సమయంలో ఆమె ఆయనతో కలిసి 1983లో కంపెనీ కార్యకలాపాల గురించి తెలుసుకుంటూ.. ఒకొక్కటిగా సమస్యను పరిష్కరించుకుంటూ 1990లో శివానీ ఫ్యాబ్రికేషన్స్ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేసారు. ఒక్క బస్సు నుంచి పది బస్సులు తయారు చేసే స్థాయికి కంపెనీని తీసుకు వచ్చారు. ఇన్సులేషన్ వ్యాన్స్, బస్సుల తయారీ ఆ సంస్థ ప్రత్యేకత. కోస్తా తీర ప్రాంతాల నుంచి సీ ఫుడ్‌ను దూరప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రవాణా వాహనాలను తయారు చేయడం ఆ సంస్థ ప్రత్యేకత.

ఆమె ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఒకసారి అనుకోకుండా ఆమెకు ficci ఢిల్లీ నుంచి అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలనే పిలుపు వచ్చింది. ఆ బాధ్యతను ఆమె తన భూజానికి ఎత్తుకుని కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ఆ కార్యక్రమానికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. చురుకుగా కదులుతూ ఉత్సాహంగా ఉన్న రమాదేవిని చూసి.. మహిళా పారిశ్రామికవేత్తలకు ఏం కావాలని కోరారు. "తమను అందరూ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని, తాము కూడా సమాజంలో గౌరవంగా, హుందాగా బతకేలా చూడాలని కోరారు. వీలైతే మహిళల కోసం ప్రత్యేకంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఇరవై ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలని అడిగారు" ఆమె. ఆయన వెంటనే అంగీకారం తెలుపడంతో పాటు ఉత్తర్వులను కూడా విడుదల చేసారు. ఈ లోపే అసోసియేషన్ ఆఫ్ లేడీ ఆంట్రప్రెన్యూర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎలీప్) పేరుతో ఓ సంస్థను స్థాపించారు. కానీ భూమి మంజూరు కాలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు ఇతర ప్రయోజనాలు పొందేందుకు అదనంగా మరో 10 ఎకరాలు కూడా స్థలం కావాలని కోరడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెంటనే సాంక్షన్ చేసి హైదరాబాద్‌లోని గాజులరామారంలో 30 ఎకరాల స్థలాన్ని సబ్సిడీ ధరకు కేటాయించారు. నగరానికి అప్పట్లో 18 కిమీ దూరంలో కొండలు, గుట్టలు, అడవిలా ఉన్న ప్రాంతం అది.

ప్రస్తుతం గాజులరామారంలో ఉన్న 120 ప్లాట్లలో దాదాపు 140 పరిశ్రమలు కొలువుదీరాయి. పచ్చళ్లతో మొదలై.. ట్రాన్స్‌ఫార్మర్లు, పెయింట్ల తయారీ వరకూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎన్నో అక్కడ కొలువుదీరాయి. త్వరలో 83 ఎకరాల్లో జర్మనీ సహకారంతో మరో ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఎలీప్ ఆధ్వర్యంలో రాబోతోంది.[4]

పురస్కారాలు

[మార్చు]

రమాదేవికి పలు పురస్కారాలు లభించాయి. ఉత్తమ యెన్.జి.వొ, ఉత్తమ వార్షిక మహిళా పురస్కారము వగైరా.

మూలాలు

[మార్చు]
  1. "managing committee of aleap". Archived from the original on 2016-07-03. Retrieved 2016-06-18.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-05-02. Retrieved 2009-09-17.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-03-24. Retrieved 2010-08-08.
  4. ఒక సాధారణ గృహిణి.. నేడు మహిళా పారిశ్రామికవేత్తలకే రోల్ మోడల్.. [permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]