కన్నయ్య కిట్టయ్య
కన్నయ్య కిట్టయ్య | |
---|---|
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
రచన | దివాకర్ బాబు (మాటలు) రేలంగి నరసింహారావు (కథ/చిత్రానువాదం) |
నిర్మాత | గంగుల ఇందిర |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, శోభన |
ఛాయాగ్రహణం | వి. ఎస్. ఆర్. స్వామి |
కూర్పు | డి. రాజగోపాల్ |
సంగీతం | వంశీ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జూన్ 11, 1993[1] |
సినిమా నిడివి | 145 ని |
భాష | తెలుగు |
కన్నయ్య కిట్టయ్య రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ కన్నయ్యగా (శ్రీకృష్ణుడు), కిట్టయ్య(కథానాయకుడు) గా ద్విపాత్రాభినయం చేసిన 1993 నాటి హాస్యకథాచిత్రం. శ్రీకృష్ణుడు భూమ్మీదకు వచ్చి తన భక్తుడికి సహాయపడటం లాంటి సోషియో ఫాంటసీ లాంటి అంశాల్ని కూడా మేళవించారు. ప్రముఖ సినీ దర్శకుడు వంశీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.[2] వంశీ తన జోకర్ సినిమాకు కాకుండా సంగీతాన్ని అందించిన సినిమా ఇదే.[3] ఇందులో రుక్మిణీ సత్యభామలుగా ఆమని, తులసి నటించారు. నారదుడిగా బ్రహ్మానందం నటించాడు.
కథ
[మార్చు]బంగారయ్య (కోట శ్రీనివాసరావు) చెల్లెలు జానకమ్మ (అన్నపూర్ణ). స్వయానా చెల్లెలయినా బంగారయ్యకి ఆమె అంటే పడదు. కిట్టయ్య (రాజేంద్ర ప్రసాద్) ఆమె కొడుకు. రోజూ వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటాడు. తనకు కావాల్సినవి అడగక ముందే ఆ దేవుడే చూసుకుంటాడని కిట్టయ్య నమ్మకం. బంగారయ్య భార్య మాత్రం కిట్టయ్య కుటుంబం అంటే అభిమానం చూపిస్తుంటుంది. కానీ బంగారయ్యకు అది నచ్చదు. కిట్టయ్యకు ఎన్ని సంబంధాలు వచ్చినా జానకమ్మే స్వయంగా లేనిపోని మాటలు చెప్పి వాటిని చెడగొడుతుంటుంది. బంగారయ్య కూతురు సరోజను పెళ్ళి చేసుకోమని కోరుతుంది. అందుకు కారణం ఆమె వేరే కులం వ్యక్తిని పెళ్ళి చేసుకున్నందుకు బంగారయ్య ఆమెనూ, ఆమె భర్తను అవమానించి ఉంటాడు. బంగారయ్య సరోజకు కూడా అత్తయ్య కుటుంబం మీద ద్వేషం నూరిపోసి ఉంటాడు. అంతే కాకుండా దగ్గరగా ఉంటే బావా మరదళ్ళ మధ్య అనుబంధం పెరుగుతుందని సరోజను విదేశాల్లో ఉంచి చదివిస్తుంటాడు.
విదేశాల నుంచి చదువు పూర్తి చేసుకుని తిరిగివచ్చినప్పటినుంచి కిట్టయ్య తన మరదలు సరోజ (శోభన) ను తన ప్రేమలోకి దింపి పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. రాగానే ఆమెను ఆటపట్టిస్తాడు. సహజంగానే బంగారయ్యకి మాత్రం అది ఇష్టం ఉండదు. సరోజకు కూడా కోపం వస్తుంది. ముందు తండ్రితో కలిసి కుట్ర పన్ని సరోజ నిశ్చితార్థానికని పిలిచి కిట్టయ్య కుటుంబాన్ని అవమానిస్తారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక జానకమ్మ చనిపోవాలనుకుంటుంది. కానీ సమయానికి కిట్టయ్య వచ్చి ఆమెకు ధైర్యం చెబుతాడు. కిట్టయ్యకు కోపం వచ్చి కన్నయ్యను నిందిస్తాడు. అవన్నీ దివ్యలోకంలో ఉన్న కన్నయ్యకు చెవినబడతాయి. దాంతో కన్నయ్య తన భక్తుని దారి మళ్ళించడానికి తానే స్వయంగా వచ్చి భక్తుడికి దర్శనమిస్తాడు. కానీ మిగతా వారికెవరికీ కన్నయ్య రూపం కనిపించదు. మాటలు వినిపించవు. ఇంట్లో వాళ్ళు కిట్టయ్యకు ఏదైనా దయ్యం పట్టిందేమోనని అనుమానిస్తారు. కిట్టయ్య తన మరదలు సరోజను ప్రేమలోకి దింపడానికి ఉపాయాలు అడుగుతాడు. ప్రేమలేఖ రాయమని సలహా ఇచ్చి మళ్ళీ పిలిచినపుడు పలుకుతానని అదృశ్యమౌతాడు కన్నయ్య. ఒకసారి కిట్టయ్య బంగారయ్య సారా దుకాణం అడ్డుకుంటాడు. అందుకు అతని మీద పగ తీర్చుకోవాలని సరోజ ప్రేమగా నటించి పొలం దగ్గరికి రమ్మని చెబుతుంది. అలా వచ్చినపుడు అతనికి కరెంటు షాక్ ఇచ్చి చంపాలని పథకం వేస్తాడు. కిట్టయ్య సరోజను కలుసుకోవడానికి వెళుతుండగా కన్నయ్య అడ్డుకుని ఆపద ఉందని హెచ్చరిస్తాడు. కానీ కిట్టయ్య అర్థం చేసుకోకపోవడంతో తానే సరోజగా మారి కిట్టయ్యను అడ్డుకుంటాడు.
సరోజ ఎదురు చూసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఒకసారి కిట్టయ్య సరోజని నీటి ప్రమాదం నుంచి కాపాడటంతో అతన్ని అభిమానిస్తుంది. కానీ అది ఆమె తండ్రికి నచ్చక కిట్టయ్య రాత్రి పట్నం నుంచి తిరిగి వస్తుంటే అతన్ని చంపించాలని రౌడీలతో కొట్టించి ఓ పాడుబడ్డ బావిలో పడేయిస్తాడు. కానీ కన్నయ్య వచ్చి కిట్టయ్యను కాపాడుతాడు. మరదలిని ప్రేమలో దించడానికి కన్నయ్యను తన రూపం కాసేపు తనకిమ్మని అడుగుతాడు. ఊర్లోకి నగలతో వస్తుంటే బంగారయ్య మనసులో ఓ కుటిల ఆలోచన మెదలుతుంది. రాత్రికి ఊరిలో ఉన్న వేణుగోపాల స్వామి గుడిలో నగలు దొంగిలించి ఆ నేరం కిట్టయ్య మీద వేస్తాడు. అప్పటికే అతని రూపం కన్నయ్య తిరిగి తీసేసుకోవడంతో తను వేసుకు వచ్చిన నగలు మాయమవుతాయి. దాంతో బంగారయ్య కిట్టయ్యకు కొరడా దెబ్బలు శిక్ష వేస్తాడు. కానీ సరోజ వచ్చి తండ్రి దాచిన నగలు బయటకు తీసి కిట్టయ్యను శిక్ష నుంచి తప్పిస్తుంది.
సరోజతో తన పెళ్ళయ్యేదాకా కన్నయ్యను తనతోనే ఉండమని, ఇద్దరూ కలిసి తన మామను ఆటపట్టిద్దామని కిట్టయ్య మాట తీసుకుంటాడు. ఈ లోపు నారదుడు రుక్మిణి (ఆమని), సత్యభామ (తులసి) లకు వెళ్ళి కన్నయ్య భూలోక విహారం గురించి చెప్పి వాళ్ళిద్దరినీ భూలోకం తీసుకువస్తాడు. వాళ్ళిద్దరూ కిట్టయ్యను చూసి కన్నయ్య అనుకుని అతనే తమ భర్త అంటూ వెంట పడతారు. ఇది బంగారయ్య చూస్తాడు. వారిద్దరూ ఎంతసేపు వదలకపోయేసరికి కిట్టయ్య వారిని చంపేస్తానని మాట వరసకు బెదిరిస్తాడు. ఇదే అదనుగా బంగారయ్య వారిద్దిరిని రాత్రికి రాత్రే గొయ్యి తీసి పాతేస్తాడు. ఆ విషయాన్ని కన్నయ్య ముందే కిట్టయ్యకు వివరించి ఉంటాడు. మరునాడు ఆ ఇద్దరి హత్యానేరం మోపినపుడు కన్నయ్యను పిలిస్తే తాను వచ్చి తన ఇద్దరు భార్యలను చూపిస్తాననీ, అప్పుడు బంగారయ్య ఆట కట్టించవచ్చని అనుకుంటారు. కానీ కన్నయ్య వారిద్దరినీ పునరుజ్జీవితులని చేయగానే బలవంతంగా దివ్యలోకానికి తీసుకెళ్ళిపోతారు. చివరికి తమ తప్పు తెలుసుకుని కిట్టయ్యను కాపాడి బంగారయ్యకు బుద్ధి చెప్పడంతో కథ ముగుస్తుంది.
హాస్య సన్నివేశాలు
[మార్చు]సినిమా కథ ప్రధానంగా హాస్యరస ప్రధాన కథ. ఇందులో నారదుడు (బ్రహ్మానందం) రుక్మిణీ, సత్యభామలతో కూడి భూలోకానికి వచ్చి తిప్పలు పడటం, మరదలిని పెళ్ళి చేసుకోవడానికి బాబూమోహన్ శిల్పం రూపంలో తన మామ ఇంటికి వచ్చి తిష్ట వేయడం లాంటి సన్నివేశాల్లో హాస్యం బాగా పండింది.
తారాగణం
[మార్చు]పాటల జాబితా
[మార్చు]రాజేంద్ర ప్రసాద్
శోభన
ఆమని
తులసి
కోట శ్రీనివాసరావు
బ్రహ్మనందం
బాబూ మోహన్
రాళ్ళపల్లి
సాక్షి రంగారావు
అన్నపూర్ణ
అనూజా
వై.విజయ .
పాటల జాబితా.
అందాల బాల తోటి , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మాల్గుడి శుభ
భామ అలక ఎలా , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు,గానం..ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
చల్ చల్ గుర్రం , రచన: గూడూరు విశ్వనాథ శర్మ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కె ఎస్ చిత్ర
జుం జుం ఎద , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కె ఎస్ చిత్ర
కొండపల్లి బొమ్మ రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర .
మూలాలు
[మార్చు]- ↑ "Kannayya Kittayya (1993)". Indiancine.ma. Retrieved 2020-05-19.
- ↑ "అందుకే రెండు పాటలు స్వరపరిచా!". Sakshi. 2015-12-11. Retrieved 2020-05-19.
- ↑ పులగం, చిన్నారాయణ (ఇంటర్వ్యూ). "నాకు స్నేహం చేయడం చేతకాదేమో..!... వంశీ". స్పందన. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 19 September 2015.