Jump to content

కథలు గాథలు (చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి)

వికీపీడియా నుండి
కథలు గాథలు
కృతికర్త: చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: వ్యాసాలు
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
విడుదల:
పేజీలు: 960(1వ సంపుటం), (2వ సంపుటం)
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-93-80409-97-9

కథలు గాథలు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి పలు అంశాలపై రాసిన వ్యాసాల సంకలనం. కథలు గాథలు గ్రంథాన్ని రెండు సంపుటాలుగా ప్రచురించారు.

రచనా నేపథ్యం

[మార్చు]

కథలు గాథలులోని వ్యాసాల్లో అధికభాగం నాటి ఆంధ్ర సచిత్ర వారపత్రిక, కృష్ణాపత్రిక, భారతి, త్రిలింగ, ఆంధ్రవాణి, ప్రౌఢభారతి, ఉదయలక్ష్మి, ప్రజామిత్ర, సమదర్శిని, జాగృతి, ఆదిశైవ, తెలుగుదేశం తదితర పత్రికల్లో ప్రచురితమైనవి. ప్రముఖ కవి, తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రాసిన వ్యాసాల్లో అధికభాగాన్ని కథలు గాథలులో సంకలనం చేశారు. ఆశుకవిత్వం, అవధానాలు, పద్యనాటకాలు, పద్యకావ్యాలు వంటివాటి రచనలో తెరిపిలేని వేంకటశాస్త్రి 1930ల నుంచి వచనం రచించడం ప్రారంభించారు. ఆయన వచన రచనలను సంకలనం చేసి తొలిసారిగా కథలు గాథలుగా గ్రంథకర్త కుమారుడు చెళ్లపిళ్ల దుర్గేశ్వరరావు 1960వ దశకంలో ప్రచురించారు. అనంతర కాలంలో ప్రముఖ ప్రచురణ సంస్థ ఎమెస్కో పబ్లికేషన్స్ ప్రచురణలో వెలువడుతోంది.

కథలు గాథలు పుస్తకము మొదటి పుట
కథలు గాథలు పుస్తకము మొదటి పుట

గ్రంథకర్త గురించి

[మార్చు]

ప్రధాన వ్యాసం: చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తిరుపతి వేంకట కవులలో ఒకరు. తన ఆప్తమిత్రుడు దివాకర్ల తిరుపతిశాస్త్రితో కలిసి ఊరూరా అవధానాలు చేయడం ద్వారా ప్రఖ్యాతులయ్యారు. జంటకవులుగా వారు రచించిన పాండవోద్యోగ విజయాలు నాటకం ప్రదర్శించని ఊరంటూ ఆంధ్రదేశంలో లేదు అన్నంత స్థాయిలో ప్రాచుర్యం పొందింది. తిరుపతిశాస్త్రితో కలిసి, ఆయన మరణానంతరం విడిగానూ పలువురు సాహిత్యవేత్తలతో వాదాలు, సాహిత్య యుద్ధాలు జరిపారు. గుంటూరు సీమ మొదలైన గ్రంథాలుగా ఆయా వివాదాలను ప్రచురించారు. శ్రావణానందం, పాణిగృహీత, బుద్ధచరిత్ర, దేవీభాగవతం మొదలైన కావ్యాలు, పాండవ విజయ, పాండవాశ్వమేధ, పాండవ ప్రవాస, పాండవజనన, పాండవోద్యోగ, పాండవరాజసూయాది నాటకాలు రచించారు. పలు వచన రచనలు చేశారు. విక్రమాంక దేవ చరిత్ర, హర్షచరిత్ర కావ్యాలను, మృచ్చకటిక, ముద్రారాక్షసాది నాటకాలను అనువదించారు. రాజాస్థానాల్లో చెప్పిన పద్యాలను నానారాజ సందర్శనం గ్రంథంగా, ఏ విభాగానికి చెందని రచనలను కలగూరగంపగా ప్రకటించారు.[1]

రచనా అంశాలు

[మార్చు]

ఈ గ్రంథంలోని వ్యాసాల్లో ఆత్మకథాత్మకమైనవి, వివాదాత్మకమైనవి, సాహిత్యాంశాల వివరణకు సంబంధించినవి ఉన్నాయి. సమకాలీన సమాజంలో అసమాన సమ్మాన గౌరవాలందుకొని ఇప్పుడు పేరుకూడా వినిపించనివారుగా మిగిలిన ఎందరో కవులు, పండితుల గురించి ఈ వ్యాసాల్లో సవివరణాత్మక ప్రస్తావనలు ఉన్నాయి. సంస్థానాలు కలిగి ఉండడమే అర్హతగా కాక ఎదుటివారు నోరు విప్పగానే పస అర్థం చేసుకుని సముచిత సన్మానాలు చేయగల జమీందారులను, విద్యాస్పర్థతో ఆయా శాస్త్రాల్లో పారంగతులైన మహాపండితుల గురించి వ్యాసాల్లో రాశారు. స్వతహాగా పండితులైనా "నాకు రెండు కళ్ళు పోయినా పర్వాలేదు కానీ ఎదుటివాడికి ఒక కన్నైనా పోవా"లనే మత్సరగ్రస్తుల్ని, మహానుభావులను, సామాన్యులను వేంకటశాస్త్రి అక్షరమాత్రంగానైనా నిలిపారు. చర్ల బ్రహ్మయ్యశాస్త్రి, మార్కొండపాటి చతుష్టయం, చిలకూరి చతుష్టయం, ర్యాలీ షట్కం (బొమ్మకంటి సోదరులు), ఐలండు పంచకం వంటి పండితకుటుంబాల గురించి రాశారు. ఇటువంటివే కాక సోమరిసత్రాలు, ఆచారభేదాలు, సామెతలు, బ్రాహ్మణశాఖలు వంటి వైవిధ్యభరితమైన విషయాల గురించి రాశారు. దేవదాసీ జాతి కళాప్రదర్శనలు, మద్యపాన నిషేధం వంటి ఆనాటి సాంఘికాంశాల గురించి వ్యాసాలు రాశారు.
వేంకటశాస్త్రి సాహిత్యజీవితంలో అతి ముఖ్యమైన అంశాలైన అష్టావధానాలు, వివాదాల గురించిన అంశాలు కూడా ఈ వ్యాసాల్లో కనిపిస్తాయి. పలు సాహిత్య విషయాల గురించి చెళ్లపిళ్ల ఎందరితోనో ఆడిన తగవులు, వివాదాలు వ్యాసాల రూపంలో ఇందులో నిలిచివున్నాయి. ఆక్షేపణలకు సమాధానాలు, ఖండనలు, ఉత్తరప్రత్యుత్తరాలు వంటివి వ్యాసాలుగా ఆనాటి పత్రికల్లో ప్రచురించడంతో అవి కథలు గాథల్లోకి చేరాయి.

శైలి

[మార్చు]

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రచించిన తెలుగు వచనం గ్రాంథిక ఛాయాల్లో ప్రారంభమై సరళ వ్యవహారికంలోకి మారింది. ఒక వ్యాసంలో స్వయంగా తానెందుకు వ్యావహారికంలో రాస్తున్నానో వివరిస్తూ తనకు వ్యావహారికమంటే ఇష్టం లేని మాట నిజమే ఐనా అనిష్టం కూడా లేదని స్పష్టం చేశారు.[2] దాంతో కథలు గాథలు సంపుటాల్లోని వ్యాసాలు కొన్ని గ్రాంథికశైలిలోనూ, అధికభాగం సరళ వ్యావహారికంలోనూ ఉన్నాయి. కథలు గాథలులోని వ్యాసాల్లో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి వాక్ శైలి (తాను చెప్తున్నట్టుగా)ని ఎంచుకుని రాశారు. ఒక విషయం నుంచి మరొక విషయంలోనికి వెళ్తూ శాఖాచంక్రమణం చేస్తూ సాగే ఆయన శైలి వల్ల ఈ వ్యాసాలు బహుళ ప్రచారాన్ని పొందాయి. ఆ శాఖాచంక్రమణంలో ఎన్నెన్నో అరుదైన విషయాలను రుచ్యంగా వివరించారు.[3] గురు శిష్య ప్రశ్నోత్తరములు వంటి వ్యాసాల్లో ఇద్దరు వ్యక్తుల సంభాషణలనే వ్యాసంగా మలిచారు. వ్యాసాల్లో ఆయన సందర్భావశాత్తూ సంస్కృత శ్లోకభాగాలు, తెలుగు సామెతలు, జాతీయాలు, నానుడులు వంటివి ప్రయోగిస్తూ ఆసక్తికరంగా మలిచారు.

ప్రాచుర్యం

[మార్చు]

కథలు గాథలు పలు ముద్రణలు పొంది బహుళ ప్రచారాన్ని సాధించుకుంది. శాస్త్రి గారి కథలు గాథలు ఒక అర్థశతాబ్ది తెలుగు సాంస్కృతిక చరిత్ర అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు అంటూ సంపాదకులు సంభావించారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథల ముందుమాట రాస్తూ మల్లాది రామకృష్ణశర్మ ఈ శతాబ్దంలో, వచనరచనకు పెట్టినది పేరు… ఒక్క యిద్దరికే… శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారూ, శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారూ! వేంకటశాస్త్రిగారు, కబుర్లలో ఎన్నో కథలు చెప్పారు: సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, కథలుగా ఎన్నో కబుర్లు చెప్పారు. వేంకటశాస్త్రిగారి వచనము చదవకపోతే, తెలుగువారికి తెలుగు రాదు! శ్రీపాదవారి కథలు వినివుండకపోతే – తెలుగుల ఉనికి అయోమయం! అంటూ కథలు గాథల రచనా విశిష్టత గురించి ప్రశంసించారు.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

కాశీయాత్ర, తిరుపతి వేంకట కవులు

మూలాలు

[మార్చు]
  1. కథలు గాథలు: డిసెంబరు 2011, ఎమెస్కో ముద్రణ: అట్టవెనుక భాగంలోని వివరాలు
  2. కాశీయాత్ర గ్రంథం:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, సం.మోదుగుల రవికృష్ణ, మిత్రమండలి ప్రచురణ
  3. కాశీయాత్ర గ్రంథం ముందుమాటలో మోదుగుల రవికృష్ణ
  4. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు శీర్షికన మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన నివాళి వ్యాసం