Jump to content

కత్తిసాములు, కర్ర సాములు

వికీపీడియా నుండి


కత్తి సాములూ, కఱ్ఱ సాములూ....

[మార్చు]
కేరళ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో కత్తి సాము ప్రదర్శన

గతంలో ఏ గ్రామంలో చూసినా వ్వాయామ శాలలకు సంబంధించిన తాలింఖాలు వుండేవి. ముఖ్యంగా వ్యవసాయ తరుణం అయిపోయిన తరువాత తీరుబడిగా వున్న సమయంలో గ్రామంలో వుండే యువకులందరూ పైన సూచించిన తాలింఖానాలలో చేరు కఱ్ఱ సాము, కత్తి సాము, గరిడీలను చేసే వారు. వారు ముఖ్యంగా ఆత్మ రక్షణ కోసం ఈ విద్యను నేర్చుకునే వారు. ఒకప్పుడు రాజాధి రాజులు తమ దేశ రక్షణకోసమూ, ఆత్మ రక్షణ కోసమూ నైనికులకు శిక్షణ ఇచ్చేవారు. పాలకులు కూడా ఈ విద్యలో ఆరి తేరిన వారై యుండేవారు.

గ్రామీణ కేరళలో కత్తి సాము (కలరిపయట్టు)

మారిని పరిస్థితులు

[మార్చు]

రాజులు, సామంత రాజులూ పోయిన తరువాత ఆంగ్లేయులు భారత దేశాన్ని హస్త గతం చేసుకున్న తరువాత అత్యాధునిక మారణాయుధాలు వచ్చిన తరువాత కత్తిసాము, కర్రసాము ప్రాముఖ్యం తగ్గి పోయిన తరువాత వీటి మీద ప్రజలకు ఆసక్తి తగ్గి పోయిందని డా: బిట్టు వెంకటేశ్వర్లు గారు కరీంనగర్ రాష్ట్ర స్థాయి జానపద కళోత్సవాల సంచికలో వుదహరించారు.

ఆనాడు ఈ విద్యకు అధిక ప్రాముఖ్య మిచ్చేవారు. ఈ విన్యాసాలలో పోటీలు ఏర్పరచేవారు. ప్రజలు ఎంతో ఆసక్తితో ఈ ప్రదర్శనాలను ప్రదర్శించేవారు. ఆంగ్లేయుల కాలంలో కూడా సంస్థానాల లోనూ, జమీందారీల లోనూ ఈ విద్యను పోషించే వారు. విజయనగర సామ్రాజ్యం లోని సంస్థాన సామంత రాజులు కత్తి సాము కర్ర సాములను ఔత్సాహిక ప్రదర్శనలుగా నిర్వహించే వారట. ఎంతో సాహస వంతంగా ప్రాముఖ్య వహించిన ఈ కర్ర సాము, కత్తి సాము విద్యలు వినోదాత్మక ప్రదర్శనలుగా విరాజిల్లాయి. ఈనాడు వీటికి ఏవిధమైన ఆదరణ లేక పోయి నప్పటికీ ఈ ప్రదర్శనాలు ఒక ప్రక్రియగా, ఒక కళగా ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనాలు వెనుకటి రోజుల్లో కత్తి సాములో రక్షణ కొరకు కృపాణాలనూ, కవచాలనూ ధరించి సైనికుల్లాగా పోరాటం జరిపే వారు. అయితే ఈ నాడు మామూలు వస్త్ర ధారణ తోనే ఈ విద్యను ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కర్ర సాములో ఒక కర్ర తోనూ రెండు చేతులతో రెండు కర్రల తోనూ ఒకరి కొకరు పోటీ పడి, ఒకరు కొట్టిన దెబ్బను మరొకరు కాచు కుంటూ ప్రేక్షకులకు భయం కలిగే విధంగా ఉధృతంగా కర్ర సాము చేసేవారు. అదే విధంగా కత్తి, డాలును ధరించి కూడా అలాగే పోరాటం జరిపేవారు. ఈ పోరాటంలో ఎత్తుకు పై ఎత్తులు, దెబ్బ కొట్టడం, దెబ్బ కాచు కోవడం ఒకరి కొకరు తల పడి ఉధృతంగా పోరాటం జరిపే వారు. ఈ పోరాటంలో కొందరు డప్పు వాయిద్యంతో పోరాట కారుల్ని ఉద్రేక పర్చే వారు. ప్రేక్షకులు, ఈలలతో, కేకలతో ఇరు పక్షాలుగా విడిపోయి ఇరువుర్నీఉద్రేక పర్చే వారు. ప్రేక్షకులు, ఈలలతో, కేకలతో ఇరు పక్షాలుగా విడిపోయి ఇరువుర్నీ ఉత్సాహ పర్చే వారు.

టాసా వాయిద్యం

[మార్చు]

కర్ర సాము, కత్తి సాము జరిపేవారు అడుగులనూ, భంగిమలనూ చాల అట్ట హాసంగా చూపించే వారు. అడుగులకు అనుగుణంగా టాసా అనే వాయిద్యాన్నివాయించే వారు. మరి కొందరు నగారానూ, నౌబత్ ఖానా వాయిద్యాన్ని, కొమ్ము నాదాలనూ చేసి ఉత్సాహపర్చేవారు. వాయిద్య ధ్వనులను విన్న కొలదీ బరిలో వున్న పోరాట యోధులు రెచ్చి పోయి విద్యను ప్రదర్శించేవారు. ఈ ప్రదర్శనాన్ని మూడు రకాలుగా ప్రదర్శిస్తారంటారు డా: బిట్టు వెంకటేశ్వర్లు గారు. ఒకటి కర్ర సాము, రెండుకత్తి సాము, మూడు ఏటా సాము. కర్ర సాములో బాణాకర్రల్లో ఒంటి బాణా, బోడి బాణా అని రకరకాలుగా వరుసలు త్రిప్పు తారు. ఎదుటి వాడు నెత్తిమీద కొడితే ఆ దెబ్బను తట్టు కోవడం, అలాగే గూడ దెబ్బ కొడితే దానిని తట్టుకోవడం ఇలా తట్టుకుంటూనే ఎదుటి వాడిని దెబ్బ తీయటం. ఇలా పోరాడతారు.

విన్యాసాలు:

[మార్చు]

ఈ కర్ర కత్తి సాములో అందంగా, సుందరంగా ప్రేక్షకులను ఆనంద పర్చే విధంగా రక రకాల విన్యాసం చేస్తారు. బాణా కఱ్ఱకు రెండు ప్రక్కలా కిరసనాయిలు ముంచిన గుడ్డలు చుట్టి వాటిని అగ్గి పుల్లతో ముట్టించి కుడి ఎడమ చేతుల్లో మార్చు కుంటూ తిప్పటం బాణాక్వ్ వరుసలో తిప్పటం. అలాగే కత్తీ డాలూ ధరించి, రక రకాలుగా త్రిప్పి విన్యాసాలు చేస్తారు. ఒక మనిషిని క్రింది పడుకో బెట్టి అతని పొట్టమీద సొరకాయను పెట్టి పొట్టకు గాయం కాకుండా దానిని రెండు ముక్కలు చేయడం. అలాగే అరటి కాయను పెట్టి అలాగే చేయడం. ఇలా నరకడంలో ఏంతో చాక చక్యాన్ని చూపిస్తూ, అలాగే అరటి కాయను కంఠం మీదా నాలుక మీదా పెట్టి నరుకుతారు. అలాగే పొట్టపై కొబ్బరికాయ నుంచి బలంగా కొట్టి రెండు ముక్కలు చేస్తారు. అంతే కాక పొట్ట మీద తమలపాకును పెట్టి దానిపై ఒక పలుచని గుడ్డ వేసి గుడ్డ తెగకుండా క్రింద నున్న తమలపాకును రెండు ముక్కలుగా చేస్తారు. ఇది ఎంత సున్నితంగా చేస్తారూ వివరించడం కష్టం. దేనిని నరకటానికి ఎంత బలం ఉపయోగించాలో అలా కత్తిని ఉప యోగిస్తారు.

ఈ కర్ర, కత్తి సాము విద్యనూ, విన్యాసాలనూ విచిత్రాలను విజయనగరానికి చెందిన కరుమజ్జి సత్యం బృందం అత్యద్భుతంగా ఈ ప్రదర్శానాలను నిస్తూ ఉంది.