Jump to content

శివానందమూర్తి

వికీపీడియా నుండి
(కందుకూరి శివానందమూర్తి నుండి దారిమార్పు చెందింది)

కందుకూరి శివానందమూర్తి
సద్గురు శివానందమూర్తి
జననంశివానందమూర్తి
(1928-12-20)1928 డిసెంబరు 20
రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నిర్యాణము2015 జూన్ 10(2015-06-10) (వయసు 86)
వరంగల్
తండ్రివీరబసవరాజు
తల్లిసర్వమంగళ

కందుకూరి శివానంద మూర్తి ( 1928 డిసెంబరు 20 - 2015 జూన్ 10) మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. అతను 1928 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలోని ఉర్లాం, దేవాడి గ్రామాలకు చెందిన రాజ కుటుంబంలో జన్మించాడు. అతని చిన్ననాటి నుండి, ఆధ్యాత్మిక విషయాల పట్ల, ముఖ్యంగా యోగ శాస్త్రాల పట్ల గాఢంగా ఆకర్షితుడయ్యాడు.[1] అతను ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు.[2] పేదల అభ్యున్నతికి తన సమయాన్ని వెచ్చించడం ప్రారంభించాడు. హిందూ ధర్మం, దాని శాశ్వతమైన సత్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాడు. [3]భారతదేశం లోనూ, విదేశాల్లోనూ ఎంతో మంది శిష్యులు, అభిమానులు ఉన్నారు. విశాఖపట్నంలోని భీమునిపట్నంలో ఆనందవనం పేరిట ఉన్న ఆశ్రమంలో నివసించాడు సంప్రదాయం, సంస్కృతి అంశాల మీద ఎన్నో పుస్తకాలు రచించాడు.

జీవిత విశేషాలు

అతని తల్లిదండ్రులు సర్వమంగళ, వీరబసవరాజులు శివభక్తులు,అతను సమస్యాత్మక సరిహద్దు ప్రాంతాలతో సహా భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటించాడు, దేశంలోని అన్ని మూలల్లో హిందూ ధర్మ పరిరక్షణ కోసం 450 రుద్రయాగాలు చేశాడు. [4]తను ఆరాధ్యబ్రాహ్మణులు. చిన్నతనం నుండి శివానందమూర్తి ఆధ్యాత్మిక విషయాల పట్ల, ముఖ్యంగా యోగశాస్త్రం పట్ల ఎంతో ఆసక్తి కనబర్చేవాడు.[5] 1949 లో సైన్సు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పోలీసు డిపార్టుమెంటులో చేరాడు. హన్మకొండలో పనిచేస్తున్నప్పుడు ఆర్తులకు, పేదవారికి సేవ చేయడం పట్ల, హిందూ ధర్మ బోధన పట్ల ఎక్కువ సమయం వెచ్చించే వాడు. ఆఫీసరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సేవాకార్యక్రమాల పట్ల, సాంస్కృతిక సేవ పట్ల దృష్టి సారించాడు.

సమున్నతమైన భారతదేశం, సనాతన ధర్మాల వేళ్లూనుకున్న ప్రాచీన సంస్కృతి పట్ల అతనికి అమితప్రేమ. సన్యాసులతో సహా అందరూ ప్రజాసంక్షేమానికి ట్రస్టీలుగా, సంరక్షకలుగా తమవంతు కర్తవ్యం నిర్వర్తించాలని తన ప్రసంగాల్లో తరుచూ చెప్పేవాడు. హిందుధర్మం, దాని చరిత్ర, సంగీత సాహిత్యాలు, నాట్యనాటకాల విషయాల్లో అతను ఒక విజ్ఞాన సర్వస్వంగా ఉండేవాడు

రాజకీయ, సాంస్కృతిక ఆధ్యాత్మిక చరిత్ర మీద అతను రాసిన వ్యాసాలు ఒక తెలుగు డైలీలో ప్రచురితమై తరువాత భారతీయత పేరిట రెండు సంపుటాలు ముద్రితమయ్యాయి. కఠోపనిషత్ మీద అతను రాసిన కఠయోగ అన్న పుస్తకం బహథా ప్రశంసలు అందుకుని, కంచి పీఠం పరమాచార్య, శృంగేరీ శంకరాచార్యుల మన్ననలను చూరగొంది. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన డేవిడ్ ఫ్రాలీ "అద్వైతం, జ్ఞానం, యోగం, దాని అంతర్వాహినుల గురించి తెలిసిన విశిష్ఠమైన వ్యక్తి శివానంద మూర్తి" అన్నారు. హిందూ వివాహ వ్యవస్థ (2006), మహర్షుల చరిత్ర (2007), గౌతమబుద్ధ (2008) అతని ఇతర రచనల్లో ముఖ్యమైనవి. సరైన జీవన విధానం పట్ల సామాన్యుడికి స్ఫూర్తినిస్తూ అతను రాసిన 450 పైగా వ్యాసాలు ఆంధ్రభూమిలో ప్రచురితమయ్యాయి. పురాణాలు, కావ్యాలు, సాహిత్య గ్రంథాల నుంచి ఆంధ్రదేశ చరిత్రను క్రోడీకరించి మనకథ పేరిట గ్రంథస్తం చేశారు. ఇది హైదరాబాదు దూరదర్శన్ లో 13 భాగాలుగా ప్రసారమైంది.

సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టుకు అతను ప్రధాన ధర్మకర్త. లలిత కళలు, సాంకేతికం, విజ్ఞానం, వైద్యం, జర్నలిజం, మానవశాస్త్రాలు, ఇతర రంగాల్లో కృషి చేసిన వారిని ఈ ట్రస్టు ఒక వేదిక మీదకు తీసుకుని వచ్చి సన్మానిస్తూ ఉంటారు.

భారతీయ సంప్రదాయ సంగీతాన్ని, నాట్యాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్ర మ్యూజిక్ అకాడెమీని స్థాపించారు. రికార్డింగుల కోసం ఆనందవనం ఆశ్రమంలో అత్యాధునికమైన రికార్డింగ్ హాల్ ను నిర్మించాడు. ఇక్కడ వర్క్ షాపులను నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా హైదరాబాదులో ఈ అకాడెమీ సంగీతోత్సవాలను నిర్వహిస్తుంది. చెన్నైలోని శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ అతనిని 2000 లో శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం తో, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సన్మానించాయి. తిరుపతినందు గల రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం మహామహోపాధ్యాయ బిరుదముతో సత్కరించింది.

అతని ప్రవచనాలు ప్రధానంగా సనాతన ధర్మం మీదనే సాగుతుంటాయి. సనాతన ధర్మాన్ని చిత్తశుద్ధితో పాటిస్తే భారతదేశానికి పునర్వైభవం సిద్ధిస్తుందని చెప్పేవాడు. సనాతన ధర్మాచారం వల్ల విలువలు ఏర్పడి ఆత్మగౌరవం ఇనుమడిస్తుందని భోధించేవాడు.

సద్గురు శివానందమూర్తి (87) 2015 జూన్ 10న బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలప్పుడు కన్నుమూశాడు. కొద్ది రోజులుగా ఆనారోగ్యానికి గురైన శివానందమూర్తి వరంగల్‌లోని ములుగు రోడ్డులో ఉన్న గురుధామ్‌లో శివైక్యం పొందాడు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1928, డిసెంబరు 20న జన్మించిన శివానందమూర్తి, భీమిలిలో ఏర్పాటు చేసిన ఆనందవనం ద్వారా ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించాడు. శివానంద కల్చరల్ ట్రస్ట్, ఆంధ్రా మ్యూజిక్ అకాడెమీలను నెలకొల్పి తెలుగు రాష్ట్రాలతో సహా ఎన్నో ప్రాంతాలలో సాంస్కృతిక, కళారంగాలకు విశిష్ట సేవలందించాడు. శివానంద అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతని కుమారుడికి ఫోన్ చేసి సద్గురు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు.

శివానందమూర్తి కళలను, సాహిత్యాన్ని సనాతన ధర్మ స్ఫూర్తికి అనుగుణంగా పునరుజ్జీవింపజేస్తూ ఒక మణిసేతువును నిర్మించాడు. ఆధ్యాత్మిక స్థాయిలో తత్వ రహస్యాలను ఉపదేశించి సాధుమార్గంలో నడిపించాడు.

అనుగ్రహభాషణం

"ఈ జగత్తు అంతా ఒక గ్రంథం. దాని గ్రంధకర్త ఆ ఈశ్వరుడే. ఈ జగత్తులో ఏ ఘటన చోటుచేసుకున్నా ఆ గ్రంథంలో వ్రాసి ఉన్నందునే సంభవిస్తోంది. వేలమంది పండితుల అనుభవాలను వ్రాసినా ఆ జగత్ గ్రంధకర్త అనుభవసారం అంతుచిక్కదు. జీవితంలో కష్టాలు, సుఖాలు, చరిత్ర, సనాతన సంప్రదాయం వంటి చెడు, తీపి ఘటనలన్నీ జగత్ గ్రంధకర్త వ్రాసిన గ్రంథంలోనివే. ఆ గ్రంథం మనం చదవకుండా ఉండలేం .. చదివి అర్ధంచేసుకోలేం .. ఎంత చదివినా పూర్తికాదు. గ్రంధకర్త వ్రాసింది సృష్టి, స్థితి, లయం అను మూడు అధ్యాయాలే. కానీ వాటి సారాన్ని తెలుసుకోవడం ఎవరికైనా గగనమే.

"అయితే గ్రంధకర్తని ధ్యానిస్తే చాలు. ఏం చేసినా ఈశ్వరునికి అర్పణ చేయాలి. అప్పుడే జీవితం ఈశ్వరునికి ఇచ్చిన హారతి అవుతుంది.

"దేనికీ ఇతరులపై ఆధారపడవద్దు. అలా ఆధారపడితే ఫలితం దక్కదు. ఎవరినుండీ ఏమీ ఆశించవద్దు. ఎదుటివారు విమర్శిస్తే ఆ మాట వినవద్దు.

"ఆత్మగౌరవంతో ఏది మంచి మార్గమో ఆలోచించి ఆ దిశగా పయనించాలి. ఆత్మవిశ్వాసం నుండి ఆత్మగౌరవం వస్తుంది.

"ఒకరి ఆమోదం కోసం యాచించవద్దు. ఒకరి నుండి కోరినది దక్కకపోతే బాధపడవద్దు.

"మన జీవితంలో ఏది చోటుచేసుకున్నా అది జగత్ గ్రంధకర్త నిర్ణయమే అని ఆమోదిస్తూ సనాతన ధర్మ మార్గంలో పయనించడం అందరి లక్ష్యం కావాలి.

"ఈశ్వరుని ఆరాధన, నామస్మరణ ఎన్నటికీ మరవకండి."

మూలాలు

  1. "SPECIAL STORY". web.archive.org. 2008-11-23. Archived from the original on 2008-11-23. Retrieved 2023-04-05.
  2. "The Hindu : The friend, philosopher and guide". web.archive.org. 2008-03-11. Archived from the original on 2008-03-11. Retrieved 2023-04-05.
  3. "Guruji | About Guruji | Sanathana Dharma Charitable Trust". web.archive.org. 2016-10-25. Archived from the original on 2016-10-25. Retrieved 2023-04-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "SPECIAL STORY". web.archive.org. 2008-11-23. Archived from the original on 2008-11-23. Retrieved 2023-04-05.
  5. "The fundamental cardinal principle in creation is that every desire is fulfilled". web.archive.org. 2012-02-05. Archived from the original on 2012-02-05. Retrieved 2023-04-05.

వెలుపలి లింకులు