కందర్పకేతు విలాసము
కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణుడు రాసిన రచన. తెనాలి రామకృష్ణుడు కందర్ప కేతు విలాసము, హరిలీల విలాసము వంటి రెండు రచనలు చేసినట్లు పెదపాటి జగ్గన్న కవి తాను రాసిన "ప్రబంధ రత్నకరము"లో, ఉటంకించాడు.[1] ఈ గ్రంథం కథాకావ్యం.
ప్రథమాంధ్ర కవిజీవిత చరిత్రనిర్మాత గురజాడ శ్రీరామమూర్తి 1893లో ప్రకటించిన తమ కవిజీవితములు సంపుటంలో చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని వ్రాతప్రతుల ఆధారంగా, రామకృష్ణుని చాటుధారాపద్యములు అని ఉదాహరించిన వాటిలో కందర్పకేతు విలాసము లోని పద్యం ఉదాహరణగా చూడవచ్చు.[2]
ఉ.ఆ నలినాక్షి వేనలికి _నంబుధరంబు సమంబు గామిచేఁ
దా నిరువ్రయ్యలై చనినఁ _ద ద్దశఁ జూచి దయార్ద్రులై బుధుల్
దాని పదాంతరంబునను _దారు వసించినవారు గావునన్
బూని తదంశమున్ సమతఁ _బోల్చిరి తత్సతి దృ క్కుచంబులన్.
1915లో ‘తెనాలి కవులు’ వ్యాసంలో రామకృష్ణుడితోపాటు ఆ వంశపు ఇతర కవులను, వారి గ్రంథాలను గురించి రాశాడు. పాండురంగ మాహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్రం, ఘటికాచల మహాత్మ్యాలే కాకుండా హరిలీలా విలాసం, కందర్పకేతు విలాసం’ అనే ప్రబంధాలనూ తెనాలి రామకృష్ణుడు రచించాడని అందులో చెప్పాడు.[3]
కందర్పకేతు విలాసం లోని నాయకుడు కందర్పకేతుడు చింతామణి మహారాజు కొడుకు. ఒకనాటి రాత్రి కలలో ఒక లోకోత్తరసౌందర్యరాశి సాక్షాత్కరించి అతని మనసు దోచుకొంటుంది. తెల్లవారగానే అతను మకరందుడనే తన ప్రియసఖుణ్ణి వెంటబెట్టుకొని ఊరుపేరులు తెలియని ఆమె కోసం గాలిస్తూ, రోజంతా ప్రయాణించి వింధ్య పర్వతాన్ని చేరుకొని అక్కడ ఒక చెట్టుకింద సేద తీరుతున్నప్పుడు ఆ చెట్టు కొమ్మల మీద వాలిన చిలుక, గోరువంకలు మాట్లాడుకోవటం వినిపిస్తుంది.
కుసుమపుర మహారాజు శృంగారశేఖరుని కుమార్తె వాసవదత్త వంటి అందగత్తె మూడు లోకాలలోనూ లేదట. యుక్తవయసు వచ్చిన తర్వాత తండ్రి ఆమెకు వివాహం చేయదలిచి, స్వయంవరణాన్ని ప్రకటించాడట. దేశదేశాల నుంచి వచ్చిన రాకుమారులలో ఏ ఒక్కరూ ఆమెకు నచ్చలేదట. ఆ మునుపటి రోజే ఆమెకు రాత్రి కలలో కందర్పకేతుడనే అందగాడు కనిపించాడట. ఆమె అతనికి తన ప్రేమను వెల్లడిస్తూ ఉత్తరం వ్రాసి, తమాలిక అనే ప్రియమైన గోరువంక పక్షి ద్వారా అతనికి పంపించిందట.
అదృష్టవశాత్తు అదే చెట్టుమీద వాలిన తమాలిక – ఆ మాటలను శ్రద్ధగా వింటున్న వాడు కందర్పకేతుడని గుర్తించి, అతనికి లేఖను అందించి, కుసుమపురానికి తీసుకొనివెళ్తుంది. అక్కడొక దివ్యసౌధంలో నాయికా నాయకులు కలుసుకొంటారు. కాని, అదే రోజున శృంగారశేఖరుడు వాసవదత్తను విద్యాధర రాజకుమారుడు పుష్పకేతునికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకొంటాడు. ప్రేమికులిద్దరూ మకరందుని ఎప్పటికప్పుడు వర్తమానాలు కనుక్కొంటుండమని రాజధానిలోనే ఉంచి, మనోజవమనే మాయాశ్వాన్నెక్కి వింధ్యాద్రికి వెళ్తారు. రాత్రంతా వారికి ఏకాంత ప్రణయలీలలతో గడిచిపోతుంది.
తెల్లవారేసరికి వాసవదత్త నిద్రలేచి, ప్రియునికి పండ్లను తేవటానికి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఘోరయుద్ధం చేస్తున్న ఆటవికసైన్యాల మధ్య చిక్కుకొంటుంది. ఆమె అందానికి ముగ్ధులై వారు తమ కలహం మాట మరచి ఆమె వెంటపడతారు. వాసవదత్త ఒక యోగసిద్ధుని ఆశ్రమంలో తలదాచుకోబోతుంది. ఆటవికులు ఆశ్రమంలోకి జొరబడి కనబడినదల్లా చిందరవందర చేస్తారు. ఆ దురాగతానికి కారణం ఆమేనని మండిపడి ముని ఆమెను శిలామూర్తివి కమ్మని శపిస్తాడు. ఆ తర్వాత ఆమె దీనంగా వేడుకొనగా అతని మనస్సు కరిగి, ప్రియుని స్పర్శ సోకితే శాపమోక్షం కలుగుతుందని అనుగ్రహిస్తాడు.
కందర్పకేతుడు మేలుకొన్నాక వాసవదత్త కనబడకపోయేసరికి సమీప ప్రాంతాలలో వెదకి నిరాశచెంది ఆత్మహత్య చేసుకోబోతాడు. ఆకాశవాణి అతనిని వారించి, ప్రేయసీ పునస్సమాగమం సిద్ధిస్తుందని చెబుతుంది. కందర్పకేతుని మనస్సు కుదుటపడుతుంది. ప్రాణేశ్వరిపై మళ్ళీ కోరిక ఉదయిస్తుంది. అపుడు అతను
లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు నేత్రాసితో
త్పల ముచ్చైఃస్తనకోక మోష్ఠవిలసద్బంధూక ముద్యత్కటీ
పులినం బుద్గతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ
జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే’ అని అనుకుంటాడు.[5]
విమర్శలు
[మార్చు]కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణకవి రచనమేనని, అది సంస్కృతంలో సుబంధుని వాసవదత్తా కథకూ, కన్నడంలో నేమిచంద్రుని లీలావతీ ప్రబంధానికీ సంయుక్తానువాదమని ఏల్చూరి మురళీధరరావు ప్రతిపాదించారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ N_r_ya_ar_vu, V_lc_ru; Rao, Velcheru Narayana; Shulman, David (2002). Classical Telugu Poetry: An Anthology (in ఇంగ్లీష్). Univ of California Press. ISBN 978-0-520-22598-5.
- ↑ 2.0 2.1 "తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-14.
- ↑ "మానవల్లి...పరిశోధనా కల్పవల్లి". www.teluguvelugu.in. Retrieved 2020-05-14.[permanent dead link]
- ↑ Berriedale keith.A (1927). A Heritage of india series, Classical sanscrit literature. London: oxford University, London. p. 77.
- ↑ "నన్నెచోడుని కుమారసంభవంలో లలితాస్యాంబురుహంబు' పద్యవివాదం: స్థితిస్థాపన – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-14.
బాహ్య లంకెలు
[మార్చు]- "నన్నెచోడుని కుమారసంభవంలో 'లలితాస్యాంబురుహంబు' పద్యవివాదం: స్థితిస్థాపన – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-14.