ఏప్రిల్ 1 విడుదల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏప్రిల్ 1 విడుదల
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం వంశీ
నిర్మాణం గొట్టిముక్కల పద్మారావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
శోభన,
కృష్ణ భగవాన్
జయలలిత (నటి)
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ పూర్ణతేజ క్రియేషన్స్
భాష తెలుగు

ఏప్రిల్ 1 విడుదల సినిమా ఎమ్.ఐ.కిషన్ రాసిన "హరిశ్చంద్రుడు అబద్దమాడితే" అనే నవల ఆధారంగా నిర్మించబడింది.పూర్ణతేజ క్రియేషన్స్ బ్యానర్ లో గొట్టిముక్కల పద్మారావు నిర్మించిన ఈ చిత్రం కు దర్శకుడు వంశీ. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన జంటగా నటించగా, సంగీతాన్ని ఇళయరాజా అందించారు.

కథనం

[మార్చు]

అబద్ధాలతోనూ, లౌక్యంతోనూ ఆనందంగా బ్రతికే దివాకరం (రాజేంద్రప్రసాద్) ఒక అనాథ. రైల్వేలో డాక్టరుగా పని చేసే వసుంధర అతడిని కొడుకులా పెంచుతుంది. విజయనగరంలో పెళ్ళికి వెళ్ళిన దివాకరం భువనేశ్వరి (శోభన) అనే ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. రైల్వేలో బుకింగ్ క్లర్కుగా పనిచేసే ఆమె కొన్ని విలువలతో జీవిస్తుంటుంది. ఆమె కోసం ఆమె బాబాయితో మాట్లాడి పెళ్ళికి ఒప్పించమని చెపుతాడు. ఆమెతో పెళ్ళి అయ్యేనాటికి అన్ని సౌకర్యాలు, ఇల్లు సమకూర్చాలని అబద్దలతో, తన తెలివితేటలతోనూ, ఆ ప్రాంతానికి రౌడీగా చలామణీ అయ్యే తన మిత్రుడు గోపి (కృష్ణ భగవాన్) సహాయంతోనూ డబ్బు సమకూర్చి వీడియో షాపు ప్రారంభిస్తాడు.

భువన బదిలీ మీద రాజమండ్రి వస్తుంది. తన ప్రేమను తెలియచేసి తను ఆమె కోసం ఏమేమి చేస్తున్నానో తెలియ చెపుతాడు దివాకరం. అప్పటికే అతనిపై మంచి అభిప్రాయం లేని ఆమె అతనికి కొన్ని షరతులతో కూడిన ఒక పేపరుపై సంతకం తీసుకొంటుంది. దాని ప్రకారం అతడు ఒక నెలపాటు అనగా ఏప్రిల్ 1 వరకూ అబద్దాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా, నిజాలు మాత్రమే చెపుతూ ఉండాలి. అలాగైతే అతడితో పెళ్ళికి సరే అంటుంది. సరే అని ఒప్పుకుంటాడు దివాకరం. అప్పటి నుండి అతడు కేవలం నిజాలు మాత్రమే చెపుతుండటం వలన చాలా మందికి కష్టాలు ప్రారంభమవుతుంటాయి. ఎన్నో రకాలుగా అతని వలన కాలనీ వాసులు ఇబ్బందులు పడుతారు. చివరకు అతడు చెప్పిన నిజాల వలన అతని మిత్రుడు గోపి జైలుకు వెళతాడు. దివాకరంపై పగ పట్టిన గోపి అతడిని చంపేందుకు వెతుకుతూ అతడిని చంపబోతే వసుంధర గోపిని గొడుగుతో పొడిచి చంపేస్తుంది. తమ పందెంలో గడువు ఆ రోజుతో ముగుస్తుందని తెలిసీ తనను తల్లిలా పెంచిన ఆమె కోసం అతడు అబద్ధం చెప్పి ఆ నేరాన్ని తనపై వేసుకొని జైలుకు వెళతాడు. కాని వసుంధర జరిగినది పోలీసులకు చెప్పి తను లొంగి పోతుంది. ఆపద సమయంలో చేసిన హత్య కనుక ఆమెకు ఎక్కువ శిక్ష పడదు. దివాకరం తను ఓడిపోయాను కనుక ఇక ఎప్పుడూ నీకు కనిపించనని భువనతో చెపుతాడు. అతడి నిజాయితీ అర్ధమయిన భువన అతడితో పెళ్ళికి ఒప్పుకుంటుంది.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • చుక్కలు తెమ్మన్నా తీసుకురానా , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం మనో, కె ఎస్ చిత్ర
  • ఒక్కటే ఆశ , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.మనో, కె ఎస్ చిత్ర
  • నిజమంటే నిప్పేకదా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.మనో
  • వంపుల వైఖరి , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కె ఎస్ చిత్ర .
  • మాటంటే మాటేనంట , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.

చిత్ర విశేషాలు

[మార్చు]
  • ఈ సినిమాకు కోలపల్లి ఈశ్వర్ రచన హరిశ్చంద్రుడు అబద్దమాడితే
  • ప్రముఖ హాస్య నటుడు కృష్ణ భగవాన్ ఈ చిత్రానికి రచనా సహకారం అందించారు.
  • సినిమా చిత్రీకరణ అత్యంత సహజంగా ఉండుటకు దాదాపు ఎవరికీ మేకప్ లేకుండా నటింపచేసారు.
  • ఈ సినిమాను అధిక భాగం రాజమండ్రి రైల్వే కాలనీలో చిత్రీకరించారు.
  • చిత్రీకరణకు ఎక్కడా సెట్స్ వేయకుండా దాదాపు కాలనీలోని యాభై ఇళ్ళను, కాలనీ ప్రాంతమును షూటింగ్ కోసం వాడారు.

మరిన్ని విశేషాలు

[మార్చు]
  • ఈ చిత్రంలో 'చుక్కలు తెమ్మన్నా తీసుకురానా', మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమల్లా చెబుతా' వంటి హిట్ గీతాలున్నాయి.
  • చిత్రమాద్యంతం హాస్యభరితంగా ఉండి హస్యచిత్రాలలో ఒక క్లాసిక్ గా నిలిచింది.
  • మల్లికార్జునరావు, రాళ్ళపల్లి, సాక్షి రంగారావు, జయలలిత, వై.విజయ, జయవిజయ, ప్రదీప్ శక్తి, శుభ తదితరులు నటించారు.
  • ఎల్. బి. శ్రీరామ్ ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించారు.
  • చిత్రంలో ప్రత్యేకంగా పేర్కొనవలసింది గోదావరి యాసతో సాగే సంభాషణలు (ఎల్.బి.శ్రీరాం?). 'చిన్నంతరం పెద్దంతరం లేకుండా', 'బెడ్డుచ్చుకొట్టానంతేనా', 'అబ్బో ఏమి స్టోనండి ఏమి స్టోను', 'జాయిగా గుండు గీయించేస్తానన్నాడు', 'ఈ పేను కొరుకుడు లేకపోతేనా' ఇత్యాది సంభాషణలు గోదారి తీరంలో ప్రసిద్ధం.
  • ఈ చిత్రానికి సంభాషణలు వ్రాసింది ఎల్.బి శ్రీరాం గారు.

మూలాలు

[మార్చు]