Jump to content

ఎల్లమ్మ

వికీపీడియా నుండి
ఎల్లమ్మ
Renukok/Renuk
మహూర్ దేవాలయంలో రేణుకాదేవి విగ్రహం
దేవనాగరిरेणुका/एल्लम्मा
సంస్కృత అనువాదంRénûka/Renu/ellamma
అనుబంధందేవి
నివాసంమహూర్, మహారాష్టృఅ
భర్త / భార్యజమదగ్ని
పిల్లలుపరశురాముడు, వసు
వాహనంసింహం

ఎల్లమ్మ హిందూ దేవత. ఆమెను రేణుక అని కూడా పిలుస్తారు.

పద వ్యుత్పత్తి

[మార్చు]

ఎల్లమ్మ అనే పదం "ఎల్ల", "అమ్మ" అనే పదాల కలయికతో ఏర్పడింది. ఇందులో ఎల్ల అనగా సరిహద్దు. దానిని 'పొలిమేర' అని కూడా అంటారు. అంటే సరిహద్దు దగ్గర ఉండే దేవర అని అర్థం. "ఎల్ల" ' అనగా అందరు, అందరికి 'అమ్మ' అని చెప్పటమే సమంజసం. కన్నడంలో ఈమెను “ఎల్లరిగె అమ్మ” అని అంటారు. అనగా ఎల్లరకు దేవత ఎల్లమ్మ అన్నపుడు తెలుగులో కూడా (ఎల్ల + అమ్మ) అందరి అమ్మ అనే అర్థమే వస్తుంది. తెలుగులో కూడా కొందరీమెను ఎల్లారమ్మ (ఎల్లరి + అమ్మ) అని కూడా అంటుంటారు

విశేషాలు

[మార్చు]

ఎల్లమ్మనే రేణుక అని కూడ పిలిచేవారని, "బవనీలు అంటే మాదిగ స్త్రీలు ఎల్లమ్మ కథను జవనిక (యంత్రవాద్యం) వాయిస్తూ వీరావేశంతో చెప్పేవారని క్రీడాభిరామం చెబుతోంది. తండ్రి ఆజ్ఞపై పరశురాముడు తల్లి రేణుక తలను ఖండిస్తే, తల మాదిగ వాడలో పడింది. అప్పటి నుంటి రేణుక వారు ఆమెను తమ కులదేవతగా కొలుస్తున్నారు..[1] ఎల్ల అనగా పొలిమేర కనుక కొందరీమెను గ్రామ సరిహద్దు దగ్గర ఉండే దేవత అన్నారు. కాని ఎల్లమ్మ గుడి ఏ గ్రామంలో కూడా పొలిమేరలో లేదు, ఊరిలోనే ఉంది. ఎల్లమ్మ దగ్గర జలకడవ కూడా ఉంటుంది. జలకడవ అంటే నీరు తెచ్చే కుండ.

ఎల్లమ్మ దేవాలయం లేని గ్రామంలోని వారు ఊరి వెలుపలికి వెళ్ళి "ఎదురుండి" చేస్తారు. అనగా ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఎల్లమ్మ ఉండే దిశకు తిరిగి నైవేద్యం పెట్టడం అన్నమాట. ఈ దేవతకు మ్రొక్కుకున్నవారు వెండితో కళ్ళు, పాదాలు చేయిస్తారు. ఆర్థిక స్థితి బాగు లేనివారు, కట్టె పాదాలు చేయిస్తారు. పాకోళ్ళు సమర్పిస్తారు. కల్లు పోస్తారు. ఎల్లమ్మ మహారాష్ట్ర, దక్షిణ భారత రాష్ట్రాలలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు పోషకదేవత. ఆమె భక్తులు ఆమెను "విశ్వమాత"గా లేదా "జగదాంబ"గా భావిస్తారు.

ఎల్లమ్మ కధ

[మార్చు]

“పూర్వ గాథాలహరి"లో ఉన్న రేణుకాదేవి గాథనే ఎల్లమ్మ దేవర కథగా ప్రతి గ్రామంలో చెపుతారు. రేణుకాదేవి పతివ్రతయే అయినా భర్త కోపానికి గురయింది. నీటికని వెళ్ళిన ఆమె స్నానం చేస్తున్న చిత్రరథుని చూస్తూ ఉండినందుకు కొద్దిగా ఆలస్యమయింది. అలా ఆలస్యంగా రావటంతో, యజ్ఞ జలం కోసం ఎదురుచూస్తున్న జమదగ్ని ఋషీశ్వరుడు కోపంతో అపార్థం చేసుకుని, శాపం ఇస్తాడు. ఆమె అడవిలో గుర్తుపట్టలేని వికృత ఆకారం దాల్చి కష్టాలను అనుభవించి, చివరకు ముని ఉపదేశంతో కైలాస గంగా జలంలో మునిగి శాప విముక్తురాలు అవుతుంది. తన కూతురు జాడ తెలుపమని రేణుకా దేవి తండ్రి జమదగ్ని ని నిలదీస్తున్నసమయంలో వచ్చిన శాప విముక్తురాలైన రేణుకా ఎల్లమ్మ ను చూసి , జమదగ్ని కోపంతో ఆశ్రమ ప్రవేశం లేదని చెప్పినా మళ్ళీ ఎందుకు వచ్చావని అంటున్నా, అతని మాట వినకుండా నా భర్త పాదాల దగ్గరే నేను ఉంటాను అని పట్టు బట్టిన రేణుకా ఎల్లమ్మ ను భస్మం చేయ తీర్థ జలం ప్రయోగించబోతుంటే, మీ చేతుల్లో భస్మం కావడం నాకు వరమే అని నిలుచున్న ఎల్లమ్మని చూసి, నీకు ఈ పవిత్ర జలాన్ని తాకే అర్హత కూడా లేదు అని కుమారులను పిలిచి , భర్త ఆజ్ఞ మీరిన భార్య మీ తల్లి శిరచ్ఛేదం చేయమని కొడుకులను ఆజ్ఞాపించినాడు. కానీ వారిలో కొందరు తిరస్కరించినారు. పరశురాముడు మాత్రం పితృవాక్యం ఆదేశంగా భావించి తల్లి తలను నరుకపతాడు. మళ్ళీ వెంటనే తల్లిని బ్రతికించమని తండ్రిని వేడుకుంటాడు. పరశురాముడు శిరచ్ఛేదం చేసినప్పుడామె తల వెళ్ళి మాదిగల వీధిలో పడినందున ఆమె గ్రామ దేవతయిందని అంటారు. అయితే గ్రామస్థులు ఈమెను పీడించే దేవతగా కాక, ఒక పతివ్రతామ తల్లిగా, వరాలిచ్చే దేవతగానే కొలుస్తారు. కొన్ని ప్రాంతాలలో చర్మ వ్యాధులేర్పడినప్పుడు ఈమెనారాధించే ఆచారం ఉంది.

బల్కంపేట్ ఎల్లమ్మ

[మార్చు]

రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం హైదరాబాద్ లోని బల్కంపేట్ లో ఉంది. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో ఎల్లమ్మ కల్యాణోత్సవం వేలాది మంది భక్తులతో రేణుకా ఎల్లమ్మ తల్లి వారి ఆశీస్సులను పొందేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ దేవి విగ్రహం, భూమి మట్టం కంటే 10 అడుగుల లోతులో ఉంటుంది. బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో ఓ బావి కూడా ఉందని, బావిలో నిల్వ ఉన్న నీరు అన్ని రకాల అనారోగ్యాలను బాగు చేసే దని భక్తుల నమ్మకం.[2]

మూలాలు

[మార్చు]
  1. Srinivas, Mittapalli (2017-07-19). "జానపదుల ఇష్ట దేవత రేణుక ఎల్లమ్మ చరిత్ర." telugu.oneindia.com. Retrieved 2020-09-08.
  2. "Balkampet Yellamma Temple, Hyderabad". Tripadvisor (in Indian English). Retrieved 2020-09-08.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఎల్లమ్మ&oldid=4022503" నుండి వెలికితీశారు