ఎన్.ఎస్.కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1949లో నేలనూతల కృష్ణమూర్తి

ఎన్.ఎస్.శ్రీకృష్ణమూర్తి'(స్నేహితుల్లో "ఎన్.ఎస్.కె."గా పేరొందాడు) అయన జననం 1910 ఏప్రిల్ 16. సాహిత్య, కళా విమర్శకుడు, సామాజికశాస్త్ర పండితుడు, చరిత్రకారుడు. న్యాయవాదిగా పనిచేస్తూనే విస్తృతమైన అధ్యయనంతో పరిశోధన సాగించాడు. అధ్యయనం ఎక్కువగానూ, రచన తక్కువగానూ చేయడం అతని పద్ధతి. సాహిత్యం, భారతీయకళ, చరిత్ర వంటి సామాజిక శాస్త్రాలన్నిటిలోనూ విస్తారమైన ఆసక్తితో అధ్యయనం సాగించాడతను. అన్నామలై విశ్వవిద్యాలయంలో 1934లో బి.ఏ.పూర్తిచేసి, మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.బి.ఎల్, కలకత్తా విశ్వవిద్యాలయంనుంచి ఏం.ఏ. హిస్టరీలో డిగ్రీలు పొంది, నెల్లూరు జిల్లాకోర్టులో న్యాయవాదవృత్తి చేపట్టాడు. ఆంధ్రదేశంలో 'జ్ఙానజ్యోతి' అని, విజ్ఙానసర్వసం అని, నడిచే గ్రంథాలయం అని పేరుపొందాడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

నేలనూతల శ్రీకృష్ణమూర్తి 1910 ఏప్రిల్ 16న అద్దంకిలో శ్రీరామనవమి పండుగనాడు, తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు జానకమ్మ, శ్రీరాములు. కృష్ణమూర్తి తండ్రి శ్రీరాములు పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటులో పనిచేసేవాడు. అతని ఉద్యోగంలో తరచు బదిలీలు కావడంతో ఎన్.ఎస్.కె. బాల్యం కోస్తాంధ్ర ప్రాంతంలోని పలు పట్టణాల్లో సాగింది. దీనితో పదోతరగతి వరకూ అతని విద్యాభ్యాసం పలు పట్టణాల్లో సాగింది. చివరకు శ్రీరాములు స్వంత ఊరు నెల్లూరు వచ్చి స్థిరపడి, అక్కడే ఉద్యోగ విరమణ చేయడంతో శ్రీకృష్ణమూర్తి ఇంటర్మీడియట్ చదువు 1927-29 మధ్యకాంలో నెల్లూరు వి.ఆర్.కళాశాలలో సాగింది. చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం ప్రధానమైన సబ్జెక్టుగా తీసుకుని 1932లో డిగ్రీ పాసయ్యాడు. 1932-1934 మధ్య నెల్లూరులోనే ఖాళీగా ఉన్నాడు. ఈ సమయంలో ఇష్టమైన పుస్తకాలు చదువుతూ, వివిధ అంశాలు అధ్యయనం చేస్తూ గడిపాడు. 1936లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.బి.ఎల్.పట్టాపుచ్చుకొని నెల్లూరులో న్యాయవాదవృత్తిలో స్థిరపడ్డాడు. సహన్యాయవాది, విద్వాంసులు ఒంగోలు వెంకటరంగయ్య ప్రభావంలో అతని సాహచర్యంలో భరతుని నాట్యశాస్త్రం,ఇతర నాట్యశాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేశాడు. అప్పుడే సుప్రసిద్ధ ఇండాలజిస్టు ఆనందకుమారస్వామి రచనలు చదివి ప్రభావితుడయ్యాడు. ఆనంద కుమారస్వామి వితంతువు భారతదేశం వచ్చినపుడు ప్రత్యేకంగా నెల్లూరు వచ్చి ఆయనను కలుసుకొన్నది. ఎన్.ఎస్.కె ఆంధ్రదేశంలోని దేవాలయాలలో, ఇతర ప్రదేశాలలో ఉన్న శిలలమీద చెక్కిన శిల్పాలను అధ్యయనంచేసి "Andhra Dance Sculpture" 301 పుటల సచిత్ర గ్రంథాన్ని రచించాడు. దీనిని ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడెమి 1975లో ప్రచురించింది. నాట్యశాస్త్రాలలో చెప్పిన లక్షణాలను ఆంధ్రదేశ ఆలయ శిల్పాలతో సమన్వయంచేస్తూ ఈ గ్రంథాన్ని రచించాడు. ఎన్.ఎస్.కె నెల్లూరు టౌన్ హాల్ ఆవరణలోని వర్ధమానసమాజం గ్రంథాలయం గౌరవ గ్రంథాలయ అధికారిగా దాదాపు పాతికేళ్ళకు పైగా పనిచేశాడు. గ్రంథాలయానికి వచ్చిన పండితులు, పరిశోధకులు అతనికి అత్యంత ఆత్మీయ మిత్రులయ్యారు. అతను దేశంలోని ఎక్కడెక్కడి గ్రంథాలయాలను సంప్రదించి, పుస్తకాలు తెప్పించి తాను చదవడమేకాక, అవసరమైనవారికి ఇచ్చి సహకరించేవాడు. మంచి మంచిగ్రంథాలు చదవమని పరిచయస్తులందరినీ ప్రోత్సహించేవాడు. 1964లో అతని సంపాదకత్వంలో విక్రమసింహపురి మండలసర్వస్వం వెలువడింది. ఆరోజుల్లో నెల్లూరు జిల్లాపరిషద్ చైర్మన్ చంద్రశేఖరరెడ్డి ఈ బృహత్ గ్రంథాన్ని, 2000 పైచిలుకు పుటల గ్రంథాన్ని జిల్లా పరిషద్ తరపున ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే తోలి మండల సర్వస్వం. ఇప్పటికీ జిల్లాకు సంబంధించి ఇదే గొప్ప పరామర్శ గ్రంథం. మండల సర్వస్వాన్ని తయారుచేస్తున్న సమయంలో indexing విధానాన్ని అతను చక్కగా అధ్యయనంచేసి, ఈ శాస్త్రీయ విధానాన్ని వినియోగించుకొని దాదాపు 30 సంవత్సరాలు ఒక్కచేతిమీదుగా తెలుగు పత్రికల వ్యాససూచి తయారుచేశాడు. ఆంధ్రపత్రిక, భారతి మొదలైన 90 పత్రికలలో వ్యాసాలను ఈ పరామర్శ గ్రంథంలో పరిగణనలోకి తీసుకొన్నారు.ఇదే పధ్ధతిలో పత్రికలలోని వ్యాసరచయితలకు ఒక సూచికను తయారు చేసాడు. విశ్వవిద్యాలయాలు, అకాడెమీలు పూనుకోడానికే భయపడి, పూనుకోనని పనిని ఆతను ఒక్కచేతిమీదుగా, ఎటువంటి ఆర్థిక ప్రోత్సాహకాలు, సహాయంలేకుండా ఏళ్లతరబడి శ్రమించి సాధించాడు. ఈ రెండు బృహద్ గ్రంథాలను ఆంధ్రపరదేశ్ సాహిత్యఅకాడెమి ప్రచురించింది. ఈ రెండు గ్రంథాలు లేకుండా తెలుగులో పరిశోధన అడుగు కూడా ముందుకు సాగదు. ఎన్ .ఎస్.కె గొప్ప కార్యశూరుడు. నెల్లూరు వర్ధమాన సమాజం ఆధ్వర్యంలో "భారతవీరులు" శీర్షికతో 18రోజులు 18 ఉపన్యాసాలు ఏర్పాటుచేశాడు. నెల్లూరు టౌన్ లోని విద్యావంతులందరు ఆ సభలకు శ్రోతలు. వీటిలో కొన్ని ఉపన్యాసాలు ఆవేశ కావేశాలను, ఉద్రేకాలను రగిలిచాయి కూడా. ఎన్.ఎస్.కె సహధర్మచారిణి శ్రీమతి పార్వతమ్మ గొప్ప విదుషీమణి. ఆమె తులసీదాసు రామాయణాన్ని, జాయిసీ పద్మాత్ ను తెలుగులోకి ఆంధ్రీకరించింది. ఈ దంపతులకు ఆంధ్రదేశంలోని గొప్ప కవిపండితులందరు ఆత్మీయులే. పుట్టపర్తి నారాయణాచార్య, డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, ప్రొఫెసర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యం, సంజీవదేవ్, ఆచార్య కేతవరపు రామకోటిశాస్త్రి, ఆచార్య బిరుదురాజు రామరాజు వంటి ఎందరో ఆత్మీయ మిత్రులు. నేలనూతల శ్రీకృష్ణమూర్తి జిల్లాలో ఏందరో యువ రచయితలను, పరిశోధకులను, ప్రోత్సహిచి వారిచేత ఏదో ఒక మంచి పరిశోధన చేయించాడు. అతని ప్రోత్సాహంతోనే, సహాయ, సలహాలతోనే కొందరు డాక్టరేట్లు సాధించారు, కొందరు పుస్తక రచనకు పూనుకొన్నారు. ఆతను బహుముఖ ప్రగ్జావంతుడు, అతనికి పరిచయంలేని లలితకళలు, శాస్త్రవిషయాలుగాని లేవు. 14 వ ఆంధ్రప్రదేశ్ చరిత్రసభల్లో నెల్లూరు సర్వోదయ కళాశాల కమిటీ తరఫున కమిటీ అధ్యక్షులు ఎడ్లపల్లి గోవిందుసేట్టి వారిని సన్మానించాడు. ఎన్.ఎస్.కె కొద్దికాలం నెల్లూరు వి.ఆర్.కాలేజీలో చరిత్ర అధ్యాపకులుగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి అతనిని హైదరాబాద్ పిలిపించి ఆయన పర్యవేక్షణలో విజ్ఙానసర్వస్వాలను తయారుచేయించిమది.ఎన్.ఎస్.కె 1996 నవంబర్ 23న, కార్తీక పౌర్ణమిరోజు అస్తమించాడు.

సాహిత్యసేవ

[మార్చు]
  • తెలుగులో ప్రచురించబడిన వ్యాసరచనలకు ఒక బృహత్సూచిక అతని సంపాదకత్వంలో రూపుదిద్దుకున్నది.[1]
  • ఆంధ్ర సదుక్తి కర్ణామృతము (ఆంధ్రేతరులు ఆంధ్రుల గురించి, వారి సాంస్కృతిక జీవనవిధానాన్ని గురించిన చెప్పిన ప్రశంసావాక్యాల సంకలనం)[2]అతను చిదంబరంలో చదువుతున్న సమయంలోనే శిల్పకళ వైపు ఆకర్శింపబడ్డాడు. నెల్లూరులో న్యాయవాది వృతిలో ఉన్నపుడు వారికన్నా వయసులో బాగా పెద్దవారయిన ఒంగోలు వెంకటరంగయ్య సాహచర్యంలో భరతుని నాట్యశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు.
  • Andhra Dance Sculpture, editor : N.S.Krishnamurty, Published by Andhra Pradesh Lalit Kala Academy, Hyderabad, 1975.
  • విక్రమసింహపురి మండల సర్వస్వం,నెల్లూరు జిల్లాపరిషత్తు ప్రచురణ.,1963.. :సంపాదకుడు : శ్రీనేలనూతల శ్రీకృష్ణమూర్తి (This volume of 2000 pages was edited by NSK and it was titled in English as 'ANNET'.