Jump to content

ఋణానందలహరి

వికీపీడియా నుండి
ఋణానందలహరి
ఋణానందలహరి
కృతికర్త: ముళ్ళపూడి వెంకటరమణ
బొమ్మలు: బాపు
ముఖచిత్ర కళాకారుడు: బాపు
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథా సాహిత్యం
ప్రచురణ:
విడుదల: 1959
పేజీలు: 67


ఋణానందలహరి ముళ్లపూడి వెంకటరమణ రాసిన కథలమాలిక. ఋణము అనగా అప్పు. అప్పులు తీసుకోవడం, అప్పులవాళ్ల నుంచి తప్పించుకోవడం, అప్పుల ప్రశస్తి వంటి హాస్యస్ఫోరకమైన అంశాల ఆధారంగా రాసిన కథలమాలిక.

రచన నేపథ్యం

[మార్చు]

ముళ్లపూడి వెంకటరమణ ఋణానందలహరి కథలన్నీ 1959లో రాశారు. ఫ్లాష్ బ్యాక్ లు, ఉదంతాలతో పెద్దదిగా పెరిగిన ఋణానందలహరి పూర్తి ఐన మూడేళ్లకు 1961లో ఋణాల గురించిన గీతంగా "ఋణదా! శరధీ! కఋణాపయోనిధీ!" రాశారు.

ఇతివృత్తం

[మార్చు]

పంచతంత్ర కథల్లో మనుషుల కోసం జంతువుల కథల ద్వారా నీతి చెప్తే రమణ ఋణానందలహరిలో జంతువులు ఓ వ్యవహారం తేల్చుకునేందుకు మనుషుల కథల ద్వారా నీతి చెప్తారు. సుబ్బన్న, నాగలక్ష్మి అనే పాములు తమ పుట్టకు తిరిగివచ్చేసరికి పుట్టను చీమలు ఆక్రమించడంతో నిర్ఘాంతపోతారు. ఆ పుట్ట తమదేనని గొడవ మొదలుపెట్టే పాములను గత జన్మలలోని ఋణానుబంధాలను చెప్పి ఆ వాదన పూర్వపక్షం చేయబోవడం ప్రధాన ఇతివృత్తం.
ఆ ప్రయత్నంలో భాగంగా పాముల పూర్వజన్మ ఋణానుబంధాల కథలు, ఆ కథలకు సమాధానంగా పాము సుబ్బన్న చెప్పే మానవుల ఋణగాథలతో కథలు ముందుకు సాగుతాయి.

కథల జాబితా

[మార్చు]

ఋణానందలహరి కథలమాలికలోని కథలు గొలుసుకట్టు కథలు. మొత్తం కథలన్నీ ఋణానందలహరి మూలకథతో ముడిపడ్తాయి.

  1. ఋణదత్తుని కథ
  2. గుర్నాథం కథ
  3. శేషయ్య కథ
  4. తాతబ్బాయి కథ
  5. అప్పుల నర్సయ్య కథ
  6. ఋణహృదయము
  7. వచ్చినవాడు అప్పారావు
  8. ఋణోపదేశం
  9. అన్నపూర్ణతో పెళ్ళిప్రమాదము
  10. ప్రమాదము తప్పిన ప్రకారము
  11. చెంచయ్య కథ
  12. అప్పడి కథ
  13. ఋణాన్నభుక్కుల కథ
  14. ఋణకేతుని కథ
  15. అడగని కథ
  16. గడసరి కథ
  17. భవిష్యజ్జాతక కథలు
  18. రష్యాలో రామయ్యకథ
  19. గరుడ దర్శనం
  20. అప్పారావు కథ
  21. ఫలశ్రుతి

పాత్రలు

[మార్చు]
  • అప్పారావు: కథానాయకుడు
  • సుబ్బన్న: మగపాము
  • నాగలక్ష్మి: ఆడపాము
  • కాకరాజు: మగకాకి
  • చీమంతుడు: మగచీమ
  • చీమంతి: ఆడచీమ
  • చీమల సింహాద్రి: చీమల పెద్ద
  • ఋణదత్తుడు: సుబ్బన్న గతజన్మలో పేరు
  • ఋణసుందరి: నాగలక్ష్మి గతజన్మలో పేరు
  • ఋణబుద్ధి: ఋణదత్తుడి తండ్రి
  • ఋణసిద్ధి: ఋణదత్తుడి యజమాని
  • ఋణకేతుడు: ఋణసుందరి తండ్రి
  • ఋణతిలక: ఋణసుందరి చెలికత్తె
  • గుర్నాధం
  • మునసబు గారు: గుర్నాధం తండ్రి
  • శేషయ్య: ఋణదాత
  • నరశింహులు: శేషయ్యకి మొదట స్నేహితుడు, ఆపై ఋణగ్రహీత
  • తాతబ్బాయి: అప్పు చేయడంలో నేర్పరి, ప్రయోజకుడు
  • రావకిష్ఠుడు: అప్ప్రయోజకుడు, తాతబ్బాయి తోడబుట్టినవాడు
  • వరాలమ్మ: వరాలు తల్లి, తాతబ్బాయి, రావకిష్టుల అక్క
  • వరాలు తల్లి: తాతబ్బాయి భార్య
  • అప్పల నర్సయ్య: ఋణప్రవీణుడు
  • అప్పలస్వామి: అప్పారావు తండ్రి
  • భానుమతి: గుర్నాధం ప్రేయసి
  • అన్నపూర్ణ: గుర్నాధానికి తప్పిపోయిన పెళ్ళికూతురు
  • చేబదుళ్ల చెంచయ్య: ఋణ గ్రహీత
  • ఏడుకొండలు: వడ్డీ వ్యాపారి
  • అప్పడు: ఋణగ్రహీత
  • ఋణాన్నభుక్కు: ఋణగ్రహీత
  • ఋణాశనుడు: ఋణగ్రహీత
  • ఋణకేతుడు/ఋణవ్రతుడు: ఋణగ్రహీత
  • ధనస్వామి: శ్రేష్ఠి
  • ఇంధనస్వామి: ఋణదాత
  • ఋణతిలకుడు: ఋణలోభి
  • అప్పన్న: ఋణగ్రహీత
  • గడసరి: ఋణదాత, చీమల సింహాద్రి పూర్వజన్మ నామం
  • రష్యా రామయ్య: అప్పివ్వబోయి మానేసిన బుద్ధిమంతుడు, రష్యాలోని రైతు.
  • మారయ్య: రష్యన్ ఋణగ్రహీత

శిల్పం

[మార్చు]

ముళ్లపూడి వెంకటరమణ ఈ కథల్లో పంచతంత్రం, జాతకకథలు తదితర భారతీయ కథాసాహిత్య శిల్పాన్ని అనుసరించారు. పౌరాణిక కథన శిల్పంల్లో కూడా శుకమహర్షి భాగవతాన్ని చెప్పడం, కురుక్షేత్రం జరిగే తీరు సంజయుడు చెప్పడం వంటి వాటి శిల్పాన్ని అనుసరించి ఉంటుంది ఈ కథామాలిక.
చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరవవడం సామాన్య ధర్మం కాగా విచిత్రంగా పాముల పుట్టను లక్షలాది చీమలు ఆక్రమించుకోవడంతో ఈ గొలుసుకట్టు కథలు ప్రారంభమవుతాయి. పంచతంత్రంలో మనుషులకు రాజనీతిని జంతువుల కథల ద్వారా చెప్పగా, ఈ ఋణానందలహరిలో జంతువులు అప్పు అనే అంశంపై వాదులాటలో మనుషులపై ఆరోపించి కథలు చెప్పుకోవడం విశేషం. బహుశా పంచతంత్రాన్ని తిరగేసినట్టు సాగిన కథనశిల్పాన్ని సూచించేందుకే రచయిత కథామాలికను ప్రపంచతంత్రం అని చీమల సింహాద్రి పాత్రద్వారా వారేవీరు లేక పరివర్తనము ఉపకథలో అభివర్ణించుకున్నారు.[1] చీమల సింహాద్రి చెప్పిన ఋణదత్తుని కథ, సుబ్బన్న చెప్పిన గడసరి కథ, భవిష్యజ్జాతక కథలు జాతక కథలకు పారడీ.

శైలి

[మార్చు]

పాత్రలకు పేర్లు పెట్టడం మొదలకొని, సంఘటనలు, సామెతల తిరగవేత, తెలిసిన కథల పారడీ, పాత్రల ప్రవర్తన, మాటల విరుపు, కొత్త పదప్రయోగాల వంటి ఎన్నో పద్ధతుల ద్వారా హాస్యాన్ని పండించారు రచయిత.

అప్పారావు పాత్రచిత్రణ

[మార్చు]

తెలుగు సాహిత్యంలో ముళ్లపూడి వెంకటరమణ సృష్టించిన అప్పారావు పాత్ర బహుళ ప్రచారం పొంది, చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రగా అభివర్ణించారు విమర్శకులు.[2] ఎంతటి గట్టివాడి నుంచైనా చులాగ్గా అప్పు పుచ్చుకుని కనుమూసి తెరిచేలోగా మాయమయ్యే పాత్రగా ముళ్లపూడి వెంకటరమణ ఇతర కథలెన్నిటిలోనో కనిపిస్తుంది అప్పారావు పాత్ర. ఆ పాత్రనే ఋణానందలహరి కథామాలికకు కథానాయకునిగా తీసుకున్నారు. అప్పారావు పాత్ర వర్ణన అప్పారావు కొత్తరూపాయి నోటులా ఫెళ ఫెళ లాడుతూ ఉంటాడు. కాలదోషం పట్టిన దస్తావేజులాంటి మాసినగుడ్డలూ, బడిపంతులుగారి చేబదుళ్లులా చిందరవందరగా ఉండే జుట్టూ, అప్పు తెచ్చిన విచ్చు రూపాయిలా మెరిసే పత్తికాయల్లాంటి కళ్ళూ, అప్పులివ్వగల వాల్లందరినీ చేపల్లా ఆకర్షించగల యెరలాంటి చురుకైన చూపులూ! అతను, బాకీల వాళ్లకి కోపిష్ఠివాడి జవాబులా పొట్టిగా టూకీగా వుంటాడు. అంటూ సాగుతుంది.[3].
విచిత్రమైన టెక్నిక్కులతో అప్పారావు అప్పులు సంపాదిస్తూంటాడు. ఉదాహరణకు తన చొక్కాలను హాస్టల్ రూముల్లో వదిలేస్తూంటాడు. అవి పొరబాటున వేసుకుని బయటకెళ్లిన మిత్రులు అప్పులో, చేబదుళ్ళో జేబులో వేసుకొస్తె ఉన్న ఫళంగా ఇది నాథని చెప్పి విప్పి వేసుకుపోయి జేబులో డబ్బు జేబదలుగా పుచ్చుకుంటాడు. అతను ఎప్పుడు ఎవర్ని ఎంత అప్పడుగుతాడో ఎవరూ చెప్పలేరు, చివరికి అప్పారావు కూడా. స్నేహితుడు గుర్నాధం మాటల్లో చెప్పాలంటే ఆ ఋణలీల మనకి అర్థం కాదు.[3].
రమణ ఆప్తమిత్రుడు, చిత్రకారుడు బాపు కూడా ఆ పాత్రకు రమణ రాసిన వర్ణన, వ్యక్తిత్వం వ్యక్తమయ్యేలా రేఖారూపమిచ్చారు.

పాత్రల పేర్ల ద్వారా హాస్యం

[మార్చు]

పాత్రలకు పేర్లు పెట్టడంలో కూడా నేర్పు చూపించాడు రచయిత. చీమల పేర్లు చీమంతుడు, చీమంతి అనవలసి వచ్చినా, పాముల దగ్గరకు వచ్చేసరికి మనం పెట్టుకునే నాగలక్ష్మి, సుబ్బన్న పేర్లు చక్కగా అమిరాయి అంటారు కథారమణీయం ముందుమాటలో సంపాదకుడు ఎమ్బీఎస్ ప్రసాద్.[4] ఋణగ్రహీతల పేర్లు ఋణదత్తుడు, ఋణాన్నభుక్కు, ఋణకేతువు, ఋణవ్రతుడు, అప్పారావు, అప్పలస్వామి, అప్పన్న, చేబదుళ్ల చెంచయ్య మొదలుగా పెట్టడం కూడా హాస్యస్ఫోరకంగా అమరింది.

రచయిత చొరబాటు హాస్యం

[మార్చు]

తను రాసిన కొన్ని కథల్లోలా రచయిత కథలోకి చొరబడే ప్రయోగం ఋణానందలహరిలో కూడా చేశారు రమణ. ఆ ధోరణికి ఉదాహరణలు ఈ క్రింది వాక్యాలు:

  • చెబుదును గానీ పేజీలు పెరుగుతాయి. పబ్లిషరేమంటాడో [5]
  • ఈ కథలాగే గుర్నాధమూ అంగుళంకూడా కదల్లేదు. [6]
  • నమ్మరా? మనమంతా ఓ కథలో వాళ్లం, ఆపాటి నమ్మకం లేకపోతే ఎలా?... నీ దగ్గర ఎంత డబ్బున్నా ఖర్చు పెట్టేందుకు వీల్లేకండా చేయిస్తానుండు ఆథరుతో చెప్పి [7]
  • ఆనక కథయ్యేటప్పుడు అంతా కలిసి ఫోటోగ్రాఫు దిగుదురుగానీ ముందర వాళ్లని లేవగొట్టు [8]

వాక్యప్రయోగాల ద్వారా హాస్యం

[మార్చు]

అప్పు ఆశీర్వాదాలు, అప్పు తిట్లు అప్పుల వర్ణనలు వంటి విచిత్ర వాక్య ప్రయోగాల ద్వారా కూడా రమణ హాస్యాన్ని సాధించారు. అప్పు ఆశీర్వాదాలు అడగ్గానే అప్పు దొరకా, వీడికి అడ్డమైనవాడూ అప్పులివ్వా అప్పు తిట్లు నీ దగ్గర అడ్డమైనవాడు అప్పు చేసి ఎగ్గొట్టా, అవసరం తీరాకా అప్పు దొరకా, అప్పు ఉపమానాలు అప్పు చేసినవాడి డబ్బులా హడావుడిగా ఖర్చయిపోయింది., ఐపీ పెడుతున్నవాడికి ఆ క్రితం రోజే ఆస్తిమీద అరవైవేలు అప్పిచ్చినవాణ్ని చూసి తోటివాళ్ళు నవ్వినట్టు., చాలాకాలం తరువాత రావలసిన డబ్బు చేతికి రాగానే అప్పులవాళ్ల మొహాన విసిరికొట్టేవాడిలాగా, దూకుడుగా, అప్పులు తీర్చేసినవాడి మనసులా లోకం ప్రశాంతంగా ఉంది కథల్లో వస్తాయి.[9]

సంఘటనల ద్వారా హాస్యం

[మార్చు]

చీమ తప్పుడు కథ చెప్పడం, ఆర్నెల్లు సహవాసం చేస్తే వారు వీరవుతారన్న సామెత సార్థకం చేస్తూ చివర్లో పాములు చీమలుగా, చీమలు పాములుగా మారిపోవడం, అప్పారావు అప్పులు పొందే టెక్నిక్కులు, చివర్లో గుర్నాధం తండ్రి వద్దే సుబ్బారావుగా అప్పు పొంది అదే అప్పును తీర్చడానికి కొడుకు వద్ద అప్పు తీసుకోవడం, ఊరికే ఇచ్చినా తప్పులేదన్నారుగా అంటూ ఇంకో ఐదొందలు తీస్కోవడం వంటి సంఘటనలు హాస్యాన్ని పండిస్తాయి.

పదప్రయోగాల్లో హాస్యం

[మార్చు]

ఋణానందలహరి చూస్తే ఇతర విషయాలతోబాటు తెలుగు భాషపై రమణకున్న పట్టు ఎటువంటిదో, భాషతో ఆయన చేసిన ప్రయోగాలు ఎటువంటివో, మాటలతో ఆయన ఎలా ఆటలాడుకున్నాడో తెలుస్తుంది అంటారు విమర్శకుడు, రచయిత ఎమ్బీఎస్ ప్రసాద్. అప్పుకు సాంకేతిక పదజాలాన్ని సృష్టించారు రమణ ఈ కథల్లో. తెలిసిన పదాలనే అక్షరం మార్చి దాఋణం, అఋణకిరణుడు, కఋణ వంటి పదాలు సృష్టించారు. తిరుగుటపా-మరుగుటపా, ధనస్వామి-ఇంధనస్వామి, బిర్లా-షిర్లా వంటి జంటపదాలు వేశారు.
ఇతర జంతుజాలానికి భాష తయారు చేశారు. ఉదాహరణకు:
కాకిభాష: కావులించి, కావుకేకలు, రెక్కలో బాణం గుచ్చుకున్నట్టు, కావురుబావురుమంటూ ఏడవడం, రెక్కాడితే గాని డొక్కాడనివాళ్లం, కాకమ్మ కబుర్లు
పాముభాష: తుసాబుసామంటూ, కడుపారా గాలి భోంచేసి బుస్సున తేన్చడం (పాములను సంస్కృత సాహిత్యంలో గాలి భోంచేసే జీవులుగా అభివర్ణించారు), గాలిపుట్టలు కట్టడం
చీమభాష: చిమచిమ నవ్వు, పుట్టతీసి, పుట్టమునగడం (కొంపదీసి, కొంపమునిగింది అని మనుషులు అన్నట్టుగా).

ప్రాచుర్యం

[మార్చు]

ఋణానందలహరి కథామాలిక, అందులోని అప్పారావు పాత్ర బహుళ ప్రాచుర్యం పొందింది. ఆ పేరును తలపించేలా అప్పుల అప్పారావు సినిమా రాజేంద్రప్రసాద్ కథానాయకునిగా, ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో నిర్మించారు.

మూలాలు

[మార్చు]
  1. ముళ్లపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వం(కథారమణీయం) 2సంపుటిలో ఋణానందలహరి కథామాలికలోని అప్పారావు కథ: పేజీ.181
  2. తెలుగు కథకులు:కథన శిల్పాలు పుస్తకంలో ముళ్లపూడి వెంకటరమణ గురించి రాసిన వ్యాసం
  3. 3.0 3.1 ఋణానందలహరిలోని వచ్చినవాడు అప్పారావు కథ: ముళ్ళపూడి వెంకటరమణ సాహితీసర్వస్వం-2:పేజీ.139
  4. ముళ్లపూడి వెంకటరమణ సాహితీసర్వస్వం 2సంపుటం కథారమణీయంకు ఎమ్బీఎస్ ప్రసాద్ రాసిన ముందుమాట, పేజీ.x
  5. ఋణానందలహరిలో శేషయ్య కథ: ముళ్లపూడి వెంకటరమణ సాహితీసర్వస్వం-2: పేజీ.130
  6. ఋణానందలహరిలో ఋణోపదేశం కథ: ముళ్లపూడి వెంకటరమణ సాహితీసర్వస్వం-2: పేజీ.148
  7. ఋణానందలహరిలో ఋణోపదేశం కథ: ముళ్లపూడి వెంకటరమణ సాహితీసర్వస్వం-2: పేజీ.149
  8. ఋణానందలహరిలో భవిష్యజ్జాతక కథలు కథ: ముళ్లపూడి వెంకటరమణ సాహితీసర్వస్వం-2: పేజీ.175
  9. ముళ్లపూడి వెంకటరమణ సాహితీసర్వస్వం 2సంపుటం కథారమణీయంకు ఎమ్బీఎస్ ప్రసాద్ రాసిన ముందుమాట, పేజీ.xi