Jump to content

ఉప్పుగల్

అక్షాంశ రేఖాంశాలు: 17°51′41″N 79°27′10″E / 17.861432°N 79.452721°E / 17.861432; 79.452721
వికీపీడియా నుండి

ఉప్పుగల్,తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, జాఫర్‌గఢ్ మండలంలోని గ్రామం.[1]

ఉప్పుగల్
—  రెవిన్యూ గ్రామం  —
ఉప్పుగల్ is located in తెలంగాణ
ఉప్పుగల్
ఉప్పుగల్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°51′41″N 79°27′10″E / 17.861432°N 79.452721°E / 17.861432; 79.452721
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ
మండలం జాఫర్‌గఢ్‌
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,750
 - పురుషుల సంఖ్య 2,405
 - స్త్రీల సంఖ్య 2,345
 - గృహాల సంఖ్య 1,234
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన జాఫర్ గఢ్ నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 36 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

గ్రామ చరిత్ర

[మార్చు]

కల్లు అనగా తమిళంలో రాయి అని అర్థం. ఉప్పుగల్లు అనగా ఉప్పురాయి . ఉప్పుగల్లు

ఆకేరు ఏటి ఒడ్డున వెలసిన ఉప్పుగల్లు ఒక చారిత్రిక గ్రామం. గ్రామం మధ్యగా వెళ్ళే తోవ ఒక్కటే సి సి రోడ్డు. యాభై ఏళ్ల కిందటి గ్రామాల సౌందర్యం ఇంకా తొణికిసలాడుతుంది. మట్టి పెంకల ఇండ్లు, కాగులు , జాలారి గుంటలు, చెట్ల కింద పిల్లల ఆటలు , మూల మలుపుల సందులు  అన్నీ సజీవంగా ఉన్నాయి. గ్రామంలో ఉప్పురాయి ఏమీ లేదు కానీ ఉప్పు నీళ్ళు మాత్రం ఉన్నాయి. ఆ నీళ్ళు తాగితే ఉప్పురాయి నోట్లో వేసుకున్నట్లు ఉంటదనీ పూర్వీకులు చెబుతుంటారు. పక్కన ఉన్న వాగులో చెలిమెలు తోడి మంచి నీళ్ళు తెచ్చుకునే వారు.అలా ఉప్పుగల్లు అనీ గ్రామ నామం ఏర్పడి ఉండవచ్చు.

రాకాసుల దు(ది)బ్బ

[మార్చు]

ఉప్పుగల్లు నుండి తమ్మడపల్లి వెళ్లే తోవకు రెండు వైపులా ఎత్తు గడ్డపై "రాకాసుల దు(ది)బ్బ "ఉంది. ఉప్పుగల్లు నాగరికత ఆది మానవుల కాలం నుండే మొదలైంది. ఈ గ్రామాన్ని  చరిత్ర పరిశోధకులు రెడ్డి రత్నాకర్ రెడ్డి  పరిశోధించి అనేక విషయాలు తెలియజేసారు. ఊరిపై ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు. ఉప్పుగల్లులో గొయ్యి శ్మశానవాటికలు, కైరాన్స్, సిస్ట్ బరియల్స్ వంటి రకాల సమాదులు ఉన్నాయి.

పప్పోల్ల బండ

[మార్చు]

సమీపంలో_ పప్పు 'ఇంటి పేరుగల వారి భూముల్లో ఉన్న పప్పోల్ల బండ ఉంది. ఇక్కడి నుండి పెద్ద పెద్ద గుండ్ల వంటి రాళ్ళను దొర్లించి ఆది మానవులు సమాధులు నిర్మించారు.ఇవి B.C 1000 నుండి A.D 500 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవి. ఈ కాలాన్ని బృహద్ శిలా యుగం అంటారు. ఈ సమాధులను రాక్షస గూళ్ళు అంటారు.ఈ రాకాసి గూళ్ళు కు 13 నుండి 21 వరకు బౌండరీ రాళ్ళు ఉన్నాయి. వీటిలో గుంత సమాధులు, సమాధులు, గూడు (Cist burials) సమాధు లు ఉన్నాయి.

గూడు సమాధులు

[మార్చు]

దీర్ఘ చురస్రాకారంలో ఒక గుంతను తవ్వుతారు. ఈ గుంటలు 6 నుండి 8 అడుగుల లోతు, 4 నుండి 8 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ఆ గుంటలో శవాన్ని పూడ్చి వేస్తారు. పైన  వృత్తాకారంలో పెద్ద పెద్ద రాళ్ళను  అమరుస్తారు.

మరికొన్ని సార్లు ఆ రాళ్ళ వలయం మధ్యలో చిన్న చిన్న రాళ్లతో నింపి వేస్తారు.వీటిని కైరన్స్ ( Cairns ) అంటారు.

6)Cist burials ( గూడు సమాధులు)

ఉప్పుగల్లులో ఈ రకపు సమాధులు అనేకం ఉన్నాయి.ఇక్కడ

నేల లోపల గుంత తవ్వి , నలువైపులా చదునైన బండ రాళ్ళను స్వస్తిక్ ఆకారంలో పెట్టీ , ఒక గది లాగా తయారు చేసారు. మరికొన్నింటిని నేల పైన కొంత , నేల లోపల కొంత భాగం ఉన్న గూడు సమాధులు ఉన్నాయి.

నేల లోపల గది వలె ఉన్న చ దునైన బందలలో తూర్పు వైపు ఉన్న బండకు గుండ్రని రంధ్రం ఉంది. ఇటువంటి సమాధులను గవాక్షి కలిగి ఉన్న గూడు సమాధులు ( cist with porthole) అంటారు.

ఈ సమాధులను కొన్నింటిని గుప్త నిధులు ఉంటాయనే గుడ్డి నమ్మకంతో తవ్వి పడేశారు.

పదుల సంఖ్యలో రాక్షస గూళ్ళకు ఉన్న బౌండరీ రాళ్ళను తొలగించి గెట్టుకు నెట్టేశారు.

7)కప్ మార్క్స్ :

పప్పొల్ల చెల్కలో విడిగా ఉన్న పెద్ద బండ రాయిపై మిల్లి మీటర్ల లోతు ఉన్న అనేక చిన్న చిన్న బద్దులు ఉన్నాయి. వీటిని కప్ మార్క్స్ ఉన్నాయి.

ఒక కప్ మార్క్ కోసం చేతిలో పట్టే పెద్ద బండ రాయితో(హామర్ స్టోన్) ఒకే చోట వేల దెబ్బలు కొడితే మిల్లీ మీటర్ల లోతులో బద్ధి ఏర్పడుతుంది. ఈ కప్ మార్క్స్ రాతి యుగం మనుషుల విశ్వాసాలకు ప్రతీక.

8)  పాటి మీద తొలి చారిత్రక యుగం :

కూనూరు వెళ్ళే తోవలో  ఆకేరు వాగు ఒడ్డున సుమారుగా 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాటి మీద పూర్వపు ఉప్పుగల్లు గ్రామం అధారాలు ఉన్నాయి.

సమీపంలో చౌట చెరువు ఉంది.

    పాటి మీద తొలి చారిత్రక యుగం  నాటి మట్టి పూసలు ,అనేక రకాల మట్టితో చేసిన పల్లాలు, చిప్పలు,కుండలు , ఎత్తైన కూజలు మొదలైన మృణ్మయ పాత్రలు , పెద్ద పెద్ద  ఇటుకలు ,

తడిగా ఉన్న పదార్థాలను రుబ్బడానికి వీలుగా ఉన్న రుబ్బుగుండు తో పాటు , రోల్లు, పెబ్బల్ రకపు రాతి పనిముట్లు,  కనిపించాయి.

9) పాటి మీద మల్లన్న గుడి :

పాటి మీద మల్లన్న గుడి , ఎల్లమ్మ గుడి, బుగ్గ పోచమ్మలు ఉన్నారు.

మల్లన్న గుడి :

ఇక్కడే పాటి మీద చాళుక్యుల కాలం నాటి మల్లన్న గుడి ఉంది.తూర్పు ముఖ ద్వారం కలిగి ఉంది. రెండు గదులుగా ఉన్న ఈ గుడి మొదటి గదిలో భక్తులు నిలబడి దండం పెట్టుకునేది. రెండో గది గర్భ గుడి. రెండు దర్వాజలకు  రెండు వైపులా పూర్ణ కుంభాలు ఉన్నాయి. గర్భ గుడి దర్వాజపై గజలక్ష్మి శిల్పం ఉంది. శివ లింగం మల్లన్నగా పూజలందు

కుంటున్నది. శివ లింగం వెనుక భాగాన సిమెంట్ తో చేసిన మల్లికార్జున స్వామి విగ్రహం ఉంది.     పైన కప్పుకు అష్ట కోణం నడుమ విరిసిన అష్ట దళ రేకుల పద్మం ఉంది.

    గుడిపై  రాతితో స్టెప్పెడ్ పిరమిడ్ రూపంలో గోపురం , పైన రాతితో ఉన్న అమలక శిఖరం ఉంది.

ఈ గోపురం జాలాల్పురం ద్వాదశ ఛాయా మల్లిఖార్జున స్వామి ఆలయాలు ( సూర్యాపేట), పానగల్లు ఛాయా సోమశ్వరాలయం ( నల్గొండ ) లను కొద్దిపాటి తేడాతో పోలి ఉంది.

నాగ దేవతల శిల్పాలు :

ఆలయం ముందు ద్వజ స్తంభం వద్ద  ధ్వంసమైన   సప్త మాతృకల శిల్పం  లోని రెండు ముక్కలు ఉన్నాయి. ఇందులో వినాయక శిల్పం కూడా ఒకటి.ఇద్దరిద్దరు మాత్రమే ఉన్న దేవతలున్న  ఈ రెండు ముక్కలను కలుపుకొని మధ్యలో నాగ దేవత శిల్పాన్ని గ్రామస్థులు నిలుపు కున్నారు. మరో రెండు జతల మణులు ధరించిన నాగు పాము ల శిల్పాలు ఉన్నాయి.

      గుడికి ప్రహరీ ఉంది. 30 గంటల మాన్యం ఉంది.ధూప దీప నైవేద్యాల పథకం అమలు అవుతున్నది.

10)ఎల్లమ్మ గుడి :

మల్లన్న గుడి ప్రహరీ బయట నాగుల గుడి నుండి తరలించిన నాగ దేవతల  విగ్రహాలను  ఎల్లమ్మ తల్లి గా పూజలందుకుంటుంది. గుడి నుండి వాగు వైపు వెల్తే మరో రెండు ఏడు పడగల, ఐదు పడగల నాగ దేవతల శిల్పాలు ఉన్నాయి. వీటిని బుగ్గ పోచమ్మ గా పిలుస్తారు. ఇక్కడ పూర్వం ఉండే కొలనును బుగ్గ కొలను అంటారు. కొలను పక్క నుండే వాగు ప్రవహిస్తుంది.

11) నాగులమ్మ గుడి :

రాతి స్తంభాలతో నిర్మించిన పురాతన నాగ దేవాలయం ఉంది. ఇందులో అనేక నాగ దేవతల విగ్రహాలు ఉన్నాయి. చేతులు జోడించి ఉన్న ఒక స్త్రీ శిల్పం ఉంది. గుడి పైకప్పును చడునైన బండ రాళ్లతో కప్పారు.

       పచ్చని పొలాల మధ్య ఉన్న గుడి , మట్టితో కప్పుకొని పోయింది. ఈ మట్టిలో తల భాగం కలిపిస్తున్న ఒక వినాయక శిల్పం ఉంది. ఈ గుడి కి అత్యంత సమీపంలో మరో చిన్న గుడి ఆనవాళ్లు ఉన్నాయి.

12) బీరప్ప గుడి :

నాగులమ్మ గుడి సమీపంలో బీరప్ప గుడి ఉంది. ఇక్కడ లింగాలు పూజలందుకుంటున్నాయి.

13) చెదిరిపోయిన గుడి :

నాగులమ్మ గుడి సమీపంలో ఇళ్ల పక్కన పునాదులు మిగిలి ఉన్న గుడి ఉంది. చెక్కిన బరువైన రాతి పలకలతో నిర్మించ బడింది.ఇక్కడ

రాచ భక్తురాలు , వీరగాల్లు, భైరవ శిల్పం ఉన్నాయి.రాచ భక్తురాలు శిల్పం ఆకర్షణీయంగా ఉంది

14)జోడ హనుమాండ్ల గుడి:

గ్రామం మధ్యలో జోడ హనుమాండ్ల గుడి ఉంది.గుడిలో రెండు భక్తాంజనేయ విగ్రహాలు ఒకరినొకరు చూసుకుంటున్నట్లుగా నిలబెట్టారు.మూలకు ఒక వినాయక విగ్రహం ఉంది. గుడి బయట ద్వార పాలక విగ్రహం ఉంది.

15)       ఉప్పుగల్లు వాగు :

ఎగువన ఉన్న నష్కల్ నుండి ఉప్పుగళ్లు మీదుగా ప్రవహిస్తూ దిగువన ఉన్న కూనూరు , తిడుగు గ్రామాల వైపు వెళుతుంది. వాగులో నిర్మించిన మినీ చెక్ డ్యాం వాల్ల ఒక కిలో మీటర్ దూరం వరకు నీళ్ళు (బ్యాక్ వాటర్) నిల్వ ఉంటాయి.

    వాగు లో ప్రవాహం ఎక్కువైనప్పుడు వాగు నుండి ధంసా అనే పేరు గల కాలువ   ద్వారా జఫర్ ఘడ్ లోని ధంస చెరువులో కలుస్తుంది. ఎన్నో ఏళ్లుగా నిండని ఈ చెరువు  2020 లో నిరంతరాయంగా కురిసిన వర్షాలకు నిండింది

ఉప్పుగల్లు బోల్లు :

16)పామునూరు ఉప్పుగల్లు మద్యలో బోల్లు ఉన్నాయి. బోళ్ళల్ల 3 క్వారీలు నడుస్తున్నాయి.

చెరువులు :

పెద్ద చెరువు , చౌట చెరువు, కొచ్చెరువు , గోరింట కుంట ,వెంకటాద్రి కుంట , చింతల కుంట మొదలైనవి ఉన్నాయి.

17)పీరీల మఱ్ఱి :

గ్రామంలో ఉన్న మర్రి చెట్టుకు పీరీలు కడతారు అలా అది పీరీల మర్రి అయ్యింది .

గ్రామంలో హనుమాన్ , మల్లికార్జునస్వామి,పోచమ్మ ,

ఎల్లమ్మ , పెద్దమ్మ , పాటి మీద కాటమయ్య గుడి ఉంది. రెండు చర్చ్ లు , ఒక మసీదు  ఉన్నాయి.

18)పెద్ద గడి :

గ్రామంలో పెద్ద గడి ఉంది. గడి నిర్మాణము రెందంతస్తులతో  సుందరంగా ఉంటుంది. పైనా కిందా స్తంభాలతో కమానులు వచ్చేలా ఉండడంతో వాటికి పరదాలు కట్టేవారేమోనని అనిపిస్తుంది.

      విస్నూర్ దొరవెలుబడిలో మార్నేని కిషన్ రావు ఘనపూర్ బ్లాక్ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో పెద్ద గడిని కమ్యూనిస్టు కార్యకర్తలు నిప్పు పెట్టారు.

ఇప్పుడు పూర్తిగా శిథిలమై పాడుబడి కూలిపోతుంది.

19)బురుజులు :

ఊరిలో 2 బురుజులు ఉన్నాయి. ఈ

రెండు బురుజలకు దేవాలయ స్తంభా లు ఉన్నాయి.

బొడ్రాయి శిథిలమైన ఇంటి వద్ద దేవుడిని నిలబెట్టే పాన మట్టం ఉంది. వీటిని బట్టి చూస్తే ఒక శిథిల దేవాలయాన్ని కూల్చి ఆ శిథిలాలను బురుజులకు ఉపయోగించారు.

20)గ్రామములో గ్రంథాలయం, నాలుగు వాటర్ ట్యాంక్ లు ఒక. బాల వికాస వాటర్ ప్లాంట్ , వివిధ కుల సంఘాల కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి.

నోవెల్ టెక్ ప్రైవేట్ కంపెనీ( 2015-16) ఏర్పడింది. పత్తి గింజల నుండి నూనె తీస్తారు. నూనె తీయగా వచ్చే పొట్టును చేపలకు దాన గా ఉపయోగిస్తారు.

రెండుసార్లు ఎమ్మెల్యే గా ఉన్న ఆరూరి రమేష్ ఉప్పుగల్లు గ్రామస్థులే.

(08/01/2021)

గణాంక వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1234 ఇళ్లతో, 4750 జనాభాతో 603 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2405, ఆడవారి సంఖ్య 2345. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 979 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 47. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578165[3].పిన్ కోడ్: 506143.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఘన్పూర్లోను, ఇంజనీరింగ్ కళాశాల వరంగల్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల వరంగల్లోను, పాలీటెక్నిక్‌ రాంపూర్లోను, మేనేజిమెంటు కళాశాల ఘన్పూర్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఘన్పూర్లోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు వరంగల్లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఆరుగురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఉప్పుగల్లో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ఉప్పుగల్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 230 హెక్టార్లు
  • బంజరు భూమి: 105 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 268 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 105 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 268 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఉప్పుగల్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 268 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ఉప్పుగల్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, ప్రత్తి

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

గ్రానైట్

చేతివృత్తులవారి ఉత్పత్తులు

[మార్చు]

కలప వస్తువులు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉప్పుగల్&oldid=4329144" నుండి వెలికితీశారు