ఉత్తరరామచరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉత్తరరామచరిత్ర మహాకవి భవభూతిచే విరచితమైన ఒక సంస్కృత నాటకం. వాల్మీకి ఉత్తరరామాయణ కథను ఇతివృత్తంగా తీసుకొని భవభూతి దానికి మార్పులు చేరుస్తూ కొత్త సన్నివేశాలను సృష్టిస్తూ, మూలకథకు భిన్నంగా సరికొత్త రూపంలో దీనిని వ్రాసాడు. కరుణ రసభరితమైన ఈ నాటకం భవభూతి మహత్తర రచనగా కీర్తించబడింది.[1] [2] ఇది 7 అంకాల నాటకం. ఈ సంస్కృత నాటకం భారతీయ భాషలలోనే కాకుండా ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ తదితర యూరోపియన్ భాషలలో సైతం అనువదించబడింది.

ఉత్తరరామచరిత్ర నాటకం-ప్రత్యేకతలు

[మార్చు]
  • సంస్కృత సాహిత్యంలో కరుణరసం ప్రధాన రసంగా (అంగిరసం) పోషింపబడింది ఒక్క ఉత్తరరామచరిత్ర నాటకంలోనే.
  • భవభూతికి వచ్చిన యశస్సుకంతటికీ కారణం ఉత్తరరామచరిత్ర. [3].ఈ ఒక్క నాటక రచనతోనే నాటకకర్త భవభూతిని విమర్శకులు సంస్కృత సాహిత్యంలో కాళిదాసు సరసన నిలబెట్టతగినవాడుగా కీర్తించారు.

నాటక ఇతివృత్తం

[మార్చు]

ఉత్తరరామచరిత్ర ఏడు అంకాల నాటకం.

మొదటి అంకం

[మార్చు]

రాముని పట్టాభిషేకానంతరం సన్నిహితులు, బంధువులు తిరిగి తమ తమ స్వస్థలాలకు పయనమవడంతో నాటకం ప్రారంభమవుతుంది. విచారంగా వున్న సీతను రాముడు ఓదారుస్తాడు. రాముని చిత్రపట దర్శన సమయంలో సీతకు అరణ్యాన్ని ఒకపరి సందర్శించాలనే కోరిక కలుగుతుంది. రాముడు కూడా గర్భవతి అయిన సీత కోరికను నెరవేర్చమని లక్ష్మణునకు పురమాయిస్తాడు. ఇంతలో దుర్ముఖుడు వచ్చి సీతపై వేయబడిన లోకాపవాదు గురించి రామునికి తెలియచేస్తాడు. అన్న అభిమతానుసారం సీతను అరణ్యానికి తోడ్కోనిపోతాడు లక్ష్మణుడు.

రెండవ అంకం

[మార్చు]

ఆత్రేయి, వాసంతి సంభాషణల ద్వారా సీత వాల్మీకి ఆశ్రమంలో కుశలవులను కన్నదని తెలుస్తుంది. రాముడు శంభూకుని సంహరించడం, క్రౌంచపక్షిని చంపిన బోయవానికి వాల్మీకి శాపమివ్వడం, బ్రహ్మ వాల్మీకిని రామాయణం రచించమని కోరడం, సీత స్వర్ణ ప్రతిమతో రాముడు అశ్వమేధయాగాన్ని చేయపూనడం మొదలగునవి ఆత్రేయి సంభాషణల వల్ల తెలుస్తుంది.

మూడవ అంకం

[మార్చు]

అరణ్యంలో విడిచిపెట్టబడిన సీత దుఃఖావేశంతో గంగానదిలో దూకడం, ఆమెకు కవలలు పుట్టడం తరళ, తమస మాటల వల్ల తెలుస్తుంది. గంగాదేవి ఆ బాలురను వాల్మీకి ఆశ్రమంలో దిగపెడుతుంది. అర్చన కోసం సీత పూలు కోస్తూ వనంలోకి ప్రవేశిస్తుంది. అదే సమయంలో శంభూకుని వధ అనంతరం పంచవటిలో ప్రవేశించిన రాముడు కూడా తన సీతా జ్ఞాపకాలతో వనంలో పరిపరివిదాల విలపిస్తూ మూర్చిల్లుతాడు. తమస చెప్పడం వల్ల సీత రాముని స్పర్శిస్తుంది. ఆ ప్రేమైక స్పర్శతో రాముడు దుఖం నుంచి తేరుకొని తిరిగి అయోధ్య కు పయనమవుతాడు. ధర్మ కార్యానుసారం కోసమే తన సీతను పరిత్యాగం చేయవలసి వచ్చినదని రాముడు వాసంతికి వివరిస్తాడు. ఈ మూడవ అంకంలో భవభూతి కరుణ రసాభివ్యక్తి పరాకాష్టకు చేరుకొంది.

నాల్గవ అంకం

[మార్చు]

రాముని తల్లులు, కులగురువు వశిష్టుని సమేతంగా వాల్మీకి ఆశ్రమానికి వచ్చి అక్కడ కుశలవులను చూడటం, వారిని వాల్మీకి శిష్యులుగా భావించడం జరుగుతుంది. అశ్వమేధయాగంలో భాగంగా యాగాశ్వానికి రక్షణగా లక్ష్మణుడు కుమారుడైన చంద్రకేతువు వెంటరాగా, ఆ యాగాశ్వాన్ని లవుడు అపహరించడం జరుగుతుంది.

ఐదవ అంకం

[మార్చు]

లవుడు జ్రుంభకాస్త్ర తదితర ప్రయోగాలతో యాగాశ్వ రక్షకులైన అయోధ్య సైనికులను ఓడిస్తాడు.

ఆరవ అంకం

[మార్చు]

బాలురైన లవుడు-చంద్రకేతువుల మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధరంగంలో ప్రవేశించిన రాముడు కుశలవులను కలుసుకోవడం జరుగుతుంది. వారిని ప్రేమాలింగన చేసుకొని, వారిలో రాజోచిత లక్షణాలను, సీత పోలికలను గుర్తుపడతాడు.

ఏడవ అంకం

[మార్చు]

గర్భాంకం అనే నాటక కల్పన ద్వారా గతంలో జరిగిన సంఘటనలన్నింటినీ చూపించబడతాయి. సీత ప్రాతివత్యాన్ని, సౌశీల్యాన్ని గ్రహించిన అందరూ ఆమెకు నమస్కరిస్తారు. ఈ విధంగా సీతా రాముల సంయోగంతో నాటకం సుఖాంతమవుతుంది.

నాటకంలో సృష్టించబడిన మార్పులు, చేర్పులు

[మార్చు]

వాల్మీకి రామాయణంలోని ఉత్తర రామాయణ కథను ఇతివృత్తంగా గ్రహించిన భవభూతి ఆ మూలకథలో అనేక మార్పులు ప్రవేశపెడుతూ, కొత్త పాత్రలను కల్పిస్తూ, కొత్త కల్పనలను చేరుస్తూ ఉత్తరరామచరిత్ర నాటకాన్ని అద్వితీయంగా రచించాడు. మూలకథకు భిన్నంగా ఉత్తరరామచరిత్ర నాటకంలో సృష్టించిబడిన ప్రధాన మార్పులు, కల్పనలు:

  • వాల్మీకి ఉత్తరరామాయణ కథ సీతా మరణంతో విషాదాంతం కాగా భవభూతి 'ఉత్తరరామచరిత్ర' సీతారాముల పునఃకలయికతో సుఖాంతం అవుతుంది.[4]
  • వాల్మీకి ఉత్తరరామాయణ కథ సీతా ప్రాధాన్యంతో సీతా చరిత్రగా కొనసాగితే, భవభూతి 'ఉత్తరరామచరిత్ర' రాముడు ప్రధానంగా రామచరిత్రగా కొనసాగుతుంది.[5]
  • మూలకథలో లేని ఆత్రేయి, తరళ, వాసంతి, తమస వంటి కొత్త పాత్రలు నాటకీయత కొరకు ఉత్తరరామచరిత్రలో కల్పించబడ్డాయి.[6]
  • మూలకథకు భిన్నంగా కొత్త సన్నివేశాలను కల్పించబడ్డాయి: ఉదాహరణకు
    • వాల్మీకి ఆశ్రమంలో విదిచిపెట్టబడిన సీత గంగానదిలో దూకడం, గంగానదిలోనే ప్రసవించడం,[7]
    • పాతాళలోకంలో సీత ఎవరికీ కనబడకుండా వుండటం,[6]
    • పాతాళలోకంలో సీత భూదేవి, గంగలతో కలసి వుండటం,[6]
    • రాముని విరహవేదనను, సీతావియోగ విలాపాన్ని అత్యంత కరుణరసభరితంగా వర్ణించడం
    • బాలుడైన చంద్రకేతువును యాగాశ్వానికి రక్షణగా పంపడం[7]
    • సీతారాముల కలయిక సన్నివేశం మొదలైనవి.

అనువాదాలు

[మార్చు]

ముఖ్యంగా 19 వశతాబ్దంలో ఉత్తరరామచరిత్ర సంస్కృత రూపకానికి దాదాపు అన్ని ప్రధాన ప్రాంతీయ భాషలలోనూ అనువాదాలు వచ్చాయి. తెలుగులో 1918 లో మంత్రి ప్రెగడ భుజంగరావు ఆంధ్రీకృతోత్తర రామచరిత్రము పేరిట అనువదించాడు.[8] 1920 లో వేదం వేంకటరాయ శాస్త్రి ఉత్తర రామ చరిత నాటకము పేరిట అనువదించాడు.[9] 1930 లో బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి ఉత్తరరాఘవం పేరుతొ అనువదించడం జరిగింది.[10] 1931 లో జయంతి రామయ్య పంతులు ఉత్తర రామ చరితము పేరిట అనువదించాడు.[11] 1959 లో వాధూల వీర రాఘవాచార్యులు ఉత్తర రామ చరిత నాటకము పేరుతోనూ,[12] రాయప్రోలు సుబ్బారావు ఉత్తర రామ చరిత పేరుతోను అనువదించడం జరిగింది.[13]

సాహిత్యంపై ప్రభావం

[మార్చు]

నభూతో నభవిష్యతిగా కరుణరసానికి పట్టం కట్టిన ఈ నాటకంలో చిత్రితమైన మహోన్నత పాత్రలు, ఉదాతమైన విలువలు, కళాత్మకత, అత్యంత కరుణరస ప్లావితమైన కథా సంవిధానం మొదలైనవి ఈ నాటకాన్ని మహత్తర నాటక కావ్యంగా, సంస్కృత సాహిత్యంలో క్లాసిక్స్ సరసన సమున్నతంగా నిలబెట్టాయి. ఈ సంస్కృత నాటకం అన్ని భారతీయ భాషలలోనే కాకుండా ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ తదితర యూరోపియన్ భాషలలో సైతం అనువదించబడింది. ఈ నాటక రచనలో భవభూతి చూపిన ఒరవడి ఇతర నాటక కర్తలకు ప్రేరణ కలిగించింది.

భవభూతి రచించిన ఉత్తరారామచరిత్ర నాటకాన్ని ఆదర్శంగా తీసుకొన్న తరువాత తరం కవులు భవభూతి వలె మూల రామాయణంలో మార్పులు చేరుస్తూ, కొత్త సన్నివేశాలను సృష్టిస్తూ, మూలకథకు భిన్నంగా సరికొత్త రూపాలలో సంస్కృత రామాయణ నాటకాలను రాయడం ప్రారంభించారు. వీరిలో శక్తి భద్రుడు (ఆశ్చర్యచూడామణి), మాయురాజు (ఉదాత్త రాఘవం), రాజశేఖరుడు (బాల రామాయణం), దిజ్ఞాగుడు (కుందమాల) మొదలైనవారు ముఖ్యులు. అయితే భవభూతి పెట్టిన ఒరవడిలో అనుకరిస్తూ వచ్చిన తదనంతర రామాయణ నాటకాలలో దిజ్ఞాగుని "కుందమాల" లాంటివి కొన్ని తప్ప మిగిలినవి అంతగా ప్రజాదరణను పొందలేకపోయాయి.

వీటిని కూడా చూడండి

[మార్చు]

భవభూతి

గ్రంథసూచిక

[మార్చు]
  • C RAMANATHAN. BHAVABHUTI A BRIEF SKETCH OF LIFE & WORKS (PDF) (1985 ed.). Bangalore: INDIAN INSTITUTE OF WORLD CULTURE. Archived from the original (PDF) on 13 జూలై 2017. Retrieved 4 August 2017.
  • Mudiganti Gopala Reddy; Mudiganti Sujatha Reddy. Sanskrita Saahitya Charitra (Telugu) (2002 ed.). Hyderabad: Potti Sreeramulu Telugu University .
  • Malladi Suryanarayana Shastry. Samscrutha Vangmaya Charitra Loukika Vangmayamu (Vol 2)(Telugu) (1961 ed.). Hyderabad: Andhra Saraswata parishattu.
  • V.V. Mirashi. Bhavabhuti (1996 ed.). Motilal Banarsidass. ISBN 8120811801.
  • SV Dixit, Bhavabhuti: His life & Literature, Belgaum, 1958
  • Mirashi, Vasudev Vishnu. Bhavabhūti (1974 ed.). Delhi: Motilal Banarsidass. ISBN 8120811801.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. R.D, Karmarkar. Maltimadhavam Of Bhavbhuti (2003 ed.). Chowkhamba Vidyabhawan Varanasi. p. 3. ISBN 8170841801. Retrieved 9 July 2019.
  2. C RAMANATHAN 1985, p. 2.
  3. Malladi Suryanarayana Shastry 1961, p. 398.
  4. Mudiganti Gopalareddy 2002, p. 419.
  5. Mudiganti Gopalareddy 2002, p. 424.
  6. 6.0 6.1 6.2 Mudiganti Gopalareddy 2002, p. 421.
  7. 7.0 7.1 Mudiganti Gopalareddy 2002, p. 422.
  8. మంత్రిప్రెగడ, భుజంగరావు. ఆంధ్రీకృతోత్తర రామచరిత్రము (1918 ed.). ఏలూరు: Rama Mudrksharasala , ఏలూరు. Retrieved 10 July 2019.
  9. వేదము, వేంకటరాయశాస్త్రి. ఉత్తరరామచరితనాటకము (1920 ed.). మద్రాసు: Vedamu Venkata Raya Sastry And Brothers. Retrieved 10 July 2019.
  10. బలిజేపల్లి, లక్ష్మీకాంతకవి. ఉత్తర రాఘవము (1930 ed.). తెనాలి: ఎం . వీరభద్రరావు. Retrieved 10 July 2019.
  11. జయంతి, రామయ్య పంతులు. ఉత్తర రామ చరితము (1931 ed.). రాజమండ్రి: Saraswathi Power Mudraksharasala. Retrieved 10 July 2019.
  12. వాధూల, వీర రాఘవాచార్య. ఉత్తర రామచరిత నాటకము (1959 ed.). మద్రాసు: Vavilla Ramaswamy Sastrulu And Sons.
  13. రాయప్రోలు, సుబ్బారావు. ఉత్తర రామచరిత (1959 ed.). సికింద్రాబాద్: రాయప్రోలు సుబ్బారావు. Retrieved 10 July 2019.