ఈగ బుచ్చిదాసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈగ బుచ్చిదాసు
జననం1907
వరంగల్లు, తెలంగాణ
మరణం1957
ప్రసిద్ధిసంకీర్తనాచార్యుడు

ఈగ బుచ్చిదాసు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంకీర్తనాచార్యుడు. యాదగిరి నృసింహస్వామి పేరుమీద కీర్తనలు, రెండు శతకాలు, మంగళహారతులు, స్తోత్రాలు రాశాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

బుచ్చిదాసు 1907లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లుకు చెందిన పద్మశాలి కుటుంబంలో జన్మించాడు. కొంతకాలం బట్టల షాపులో గుమాస్తాగా పనిచేశాడు. బుచ్చిదాసుకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

ఆధ్యాత్మిక సేవ

[మార్చు]

1937-38 మధ్యకాలంలో తనకు, తనవారికి అనారోగ్యంగా ఉండటం వల్ల నరసింహస్వామి సేవించడం కోసం యాదగిరిగుట్టకు వచ్చాడు. కొండపైనున్న గుండం దగ్గర చిన్న గుడిసె వేసుకొని నరసింహస్వామిని కొలుస్తుండేవాడు, స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు. అక్కడ ఉత్పల చెన్నయ్య (చెన్నదాసు) అనే గురువు దగ్గర ఉపదేశం పొందాడు. గుట్టపైన ‘కానిగి బడి’ ఏర్పాటుచేసి అందరికీ ‘ప్రహ్లాద చరిత్ర’, ‘గజేంద్రమోక్షం’ వంటి భాగవత ఘట్టాలు, పెద్ద బాలశిక్ష, నీతి శతకాలతో విద్యను బోధించేవాడు.

రచనారంగం

[మార్చు]

బుచ్చిదాసు తను రాసిన సంకీర్తనలలో బిళహరి, కాంభోజ, ఫీలురాగం, యెదుకుల కాంభోజి, కేదారి గౌడ, నాథనామక్రియ వంటి రాగాలను ఉపయోగించాడు. ప్రతి కీర్తన 5 నుంచి 15 పాదాలలోపుగా ఉంటుంది. కీర్తనలన్నీ, ప్రాస నియమంలో ఉన్నాయి.[2] ప్రతిరోజూ బుచ్చిదాసు తన శిష్యులను వెంటబెట్టుకొని బ్రాహ్మీ ముహూర్తంలోనే నగర సంకీర్తనతో వెళ్ళి, స్వామి దేవాలయం ముందు మేలుకొలుపు కీర్తనలు ఆలపించేవాడు. ఆ తర్వాతనే దేవాలయ తలుపులు తెరిచేవారు. దాసు చెప్పున్న కీర్తనలను ఆయన శిష్యులు (బుచ్చిమాంబ తదితరులు) రాసిపెట్టేవారు. బుచ్చిదాసు రాసిన కీర్తనలల్లో కొన్ని సంకీర్తనలు ఆ కాలంలోనే ముద్రింపబడగా, మరికొన్ని భాగాలు బుచ్చిమాంబచే ముద్రించబడ్డాయి. బుచ్చిదాసు రాసిన సంకీర్తనలు స్వామివారి ముందు ఆలపిస్తూ షోడశోపచార పూజల్లో గీతాలను వినిపించేవారు. బుచ్చిదాసు కీర్తనలు 1962లో నాలుగు భాగాలుగా ముద్రించారు. వాటిల్లో మొత్తం 127 కీర్తనలు ఉండగా అందులో చివర 14 మేలుకొలుపులు, మంగళహారతులున్నాయి.[1]

రచనలు

[మార్చు]
  • శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భజన కీర్తనలు
  • శ్రీయాదగిరి నరహరి శతకం
  • శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి బతుకమ్మ పాట

మరణం

[మార్చు]

బుచ్చిదాసు 1957 జూన్‌ 19 మరణించాడు. గుట్టకు కిందభాగంలో బుచ్చిదాసు సమాధి నిర్మించబడింది.

ఇతర వివరాలు

[మార్చు]

డాక్టర్‌ పి. భాస్కరయోగి సంకలనం చేసిన యాదగిరి క్షేత్ర సంకీర్తన కవి ఈగ బుచ్చిదాసు పుస్తకాన్ని 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 telugu, NT News (2022-04-03). "యాదగిరీశునికి సంకీర్తనల హారం". Namasthe Telangana. Archived from the original on 2022-04-03. Retrieved 2022-04-03.
  2. "ఆధ్యాత్మిక ఔన్నత్యం". www.andhrabhoomi.net. Archived from the original on 2022-04-03. Retrieved 2022-04-03.
  3. "నీతి శాస్త్రము చెప్పబోతది –పాతకములో బడునుబోతది". Sakshi. 2019-01-21. Archived from the original on 2022-04-03. Retrieved 2022-04-03.
  4. "Eega Bucchidasu,ఈగ బుచ్చిదాసు". www.telugubooks.in (in ఇంగ్లీష్). Archived from the original on 2023-06-06. Retrieved 2022-04-03.