Jump to content

ఆవు

వికీపీడియా నుండి
ఆవు-దూడ చిత్రం

ఆవులు (ఆంగ్లం Cow) హిందువులకు ఎంతో పవిత్రమయిన జంతువులు. వీటి నుండి పితికే పాలు ఎంతో శ్రేష్టమయినవి. గ్రామాలలో వీటి పేడను పిడకలుగా తయారు చేసి వంటచెరకుగా ఉపయోగిస్తారు.[1] ఇవి చనిపోయిన తరువాత వీటి చర్మాన్ని ఉపయోగించి చెప్పులు మొదలయిన తోలువస్తువులు తయారు చేస్తారు. కొన్ని దేశాలలో వీటిని మాంసం కోసం కూడా పెంచుతారు. ఎద్దులు ఎద్దులు వ్యవసాయ దారునికి ఎంతో ఉపయోగం: వీటిని భూమి దున్నడానికి, బండి తోల డానికి ఇలా అనేక వ్యవసాయ పనులకు వినియోగిస్తారు. ఒకప్పుడు ఎద్దులు లేకుండా వ్యవసాయం చేయ వీలుండేది కాదు. ప్రస్తుతం యంత్రాలోచ్చాయి. అయినా ఎద్దులతో పనులు ఇంకా అక్కడక్కడా కొనసాగుతున్నాయి. ఎద్దులలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఒంగోలు గిత్త. వీటి ఠీవి, అందం, వీటి భలం, ఇలా ఏ విషయంలో నైనా వీటితో పోటీ పడే ఎద్దులు మరేవి లేవు. అందుకే వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. అందుకే వీటి ధరలు లక్షల్లో వుంటాయి. ఈ జాతి అంత రించి పోయే దిశలో ఉంది.

గడ్డి మేస్తున్న ఆవు

హిందువులకు ఆవు ఆరాద్యమైనది. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయి. ఆవు పాదాల్లో పిత్రుదేవతలు, అడుగుల్లో అకాశ గంగ, స్థనాలలో చరుర్వేదాలు పాలు పంచామృతాలు, కడుపు కైలాసం, ఇలా ఒక్కొ భాగంలో ఒక్కో దేవతకు నివాసం. అందుకే గోమాతకు ప్రధక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేద, మూత్రం లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ప్రతీతి. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు అందరికి తెలిసినదే. తల్లుల వద్ద పాలు లేని చిన్న పిల్లలకు ఆవు పాలే శరణ్యం: ఆహారంగానే కాకుండా అరాద్యంలోను అనగా పూజ పునస్కారాలలోని వీటి ప్రాశస్త్యం తెలియని వారుండరు. అలాగే ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలెడతారు. సకల దోష నివారణకు ఆవు పంచితాన్ని ఇంటా బయట చల్లు తారు. ఇది హిందువుల ఆచారం:

ఆవు పంచితాన్ని మరిగించి వచ్చే ఆవిరితో తయారు చేసిన ఔషధమే గోమాత అర్క్ చీరాల పట్టణానికి చెందిన రామ ధూత గో సంరక్షణా సంఘం దీనిని తయారు చేసి విక్రయిస్తుంటారు. అందులో మన శరీరానికి కావలసిన నత్రజని, గందకం, అమ్మొనియా, పొటాషియం, విటమిన్లు, లవణాలు పుష్కలంగా వున్నందున గోమూత్రానికి సర్వ రోగ నివారిణిగా మంచి పేరుఇన్నది. ఇది ఒక లీటరుకు సుమారు నూట యాబై రూపాయలకు విక్రయిస్తున్నారంటే దాని ఔషధ విలువ ఎంతో తెలుస్తుంది. అంతే గాక ఆవు నుంచి వచ్చే పంచగవ్వ ద్వారా అగరబత్తులు, సౌందర్య సాధనాలు, సబ్బులు, క్రిమి సంహారకాలు, సుబ్ర పరిచే ద్రావణాలు తయారు చేస్తారు. తెలుగు బాలలు అమ్మ అనే మాట తర్వాత మొదటిగా నేర్చేది ఆవు అనే మాటనే.

భారత దేశానికి రైతు వెన్నుముక అని అంటుంటారు. అటువంటి రైతుకు వెన్నెముక వంటిది ఆవు. రైతుకు భూమి లేక పోయినా ఆవులుంటాయి. వాటిని అడవుల్లో మేపుకొచ్చి వాటి పాల ఆధారంగా బతగ్గలడు. ఆవుకు పుట్టిన కోడెలు (ఎద్దులు) రైతుల భూములను దున్నుతాయి. బండ్ల ద్వారా రైతు పంటలను ఇళ్లకు చేర వేస్తాయి. ఆ విధంగా ఆవులు రైతులకు అనేక విషయాలలో అండ దండగా వుంటాయి. అందుకే రైతులు ఆవులను ప్రేమిస్తాడు, పూజిస్తాడు, ఆరాదిస్తాడు, పోషిస్తాడు. తమ పిల్లలు లాగా కాపాడు కుంటాడు. ఆవు పేడ ద్వారా గోబర్ గ్యాసు ఉత్పత్తి చేసి వంట చెరుకుగా వాడు కుంటాడు. మిగిలిన వ్వర్థాన్ని పంట పొలాలకు ఎరువుగా వాడు కుంటాడు. చివరకు ఆవు చనిపోయిన తర్వాత కూడా దాని చర్మాన్ని చెప్పులకు ఉపయోగిస్తారు. ఈ విధంగా మనిషికన్నా ఆవే గొప్ప. ఈ విషయాన్ని ఆవు స్వగతంలో చెప్పుతున్నట్లు ఒక సినిమా పాట ఉంది. వినరా.. వినరా.... నరుడా తెలుసు కోరా పామరుడా...... గోమాతను నేనేరా నాతో సరిపోలవురా ......... ఇలా ఆపాట చాల హృద్యంగా సాగుతుంది. గో సంరక్షణార్థం మనదేశంలో చట్టాలు చాలానే ఉన్నాయి. కాని వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది.

ఇంతటి ప్రాశస్త్యం గలిగిన ఆవులు గతంలో మనదేశంలో చాల జాతులు వుండేవి. కాల క్రమేణ అవి చాల వరకు అంత రించి పోయాయి. ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది జాతులు మాత్రం మిగిలి వున్నాయని పరిశోధకులు చెపుతున్నారు. ప్రస్తుత కాలంలో ఆవులలో సంకర జాతులు, జర్సీ ఆవులు వంటివి ఎక్కువగా ఉన్నాయి. ఇవి పాలు ఎక్కువ ఇస్తున్నందున రైతులు వీటి పై మక్కువ చూపు తున్నారు. ప్రభుత్వంకూడ వీటికి సరైన ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రస్తుతం అనేక మంది రైతులు ఇటు వంటి సంకర జాతి ఆవుల పెంపకంలో తమ జీవనాన్ని సాగిస్తున్నారు.

కాని ఔషధ సేవనలో, ఆచార వ్వవ హారాలకు, ఆరాధనా ప్రక్రియలలో దేశ వాళి ఆవులకు, వాటి ఉత్పత్తులకే ప్రాధాన్యత ఉంది. అందు చేత ఈ దేశ వాళి గోవులను, వాటి లుత్పత్తులను వాటి ప్రాధాన్యతను నేటి తరానికి పరిచయం చేయడానికి డా:బి.అర్.కే.ఆర్. ప్రభుత్య ఆయుర్వేద కళాశాల వారు, చరక డైరి వారు సంయుక్తంగా దేశ వాళి ఆవుల ఉత్సవాన్ని 28..3..2012 నుండి మూడు రోజుల పాటు హైదరాబాదులో నిర్వహించారు. వాటి ఉత్పత్తులను, ప్రదర్శనకు, అమ్మకానికి పెట్టారు. అదే విధంగా గోమాతకు ప్రధక్షిణం చేసే అవకాశాన్ని కల్పించారు.

ప్రస్తుతం మిగిలివున్న దేశ వాళి గో జాతుల్లోని కొన్నింటి విశేషాలు;

  1. కపిల: ఇది అరుదైన జాతి. కపిల రంగులో (నల్లగా) చూడ ముచ్చటగావుంటుంది.
  2. దయోని: అందమైన ఆకారం గల ఈ గోజాతి మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో ఉన్నాయి.
  3. ఒంగోలు: ఈ జాతి ఆవులు ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే ఉండేవి.ఈ జాతి మనదేశం నుండి ఇతర దేశాలకు తీసుకువెళ్ళబడ్డాయి. ఈ జాతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. వీటి ఆంబోతులు రాజ ఠీవితో ఎంతో దర్పంగా వుంటాయి. అతి బారి శరీరంతో ఠీవిగా అందంగా తెల్లగా వుండే ఈ ఆవులు కొమ్ములు మాత్రం పొట్టిగ వుంటాయి. వీటి ధరలు లక్షల్లో వుంటుంది.
  4. పుంగనూరు జాతి: ఈ జాతి ఆవులుకూడ ఆంధ్ర ప్రదేశ్ చెందిన చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణానికి చెందినవి. అతి చిన్న ఆవులుగా ఇవి త్వరలో గిన్నిస్ బుక్ లో రికార్డు నామోదు కాబడనున్నది. వీటి ఎత్తు రెండున్నర అడుగులు మాత్రమే.
  5. గిర్ జాతి. ఈ జాతి గోవులు గుజరాత్ కు చెందినవి. ఇవి కూడా పాల ఉత్పత్తిలో మంచివే. ఇవి ఖరీదైనవి కూడ.
  6. షాహియత్: ఈ జాతి గోవులు రాజస్థాన్, గుజరాత్ లో ఎక్కువ వుంటాయి. వంపులు తిరిగిన పెద్ద పెద్ద కొమ్ములతో బలమైన ఆకారంతో ఇవి ఎంతో హుందాగా అందంగా వుంటాయి.
ఒంగోలు జాతి గిత్త


కొన్ని విశేషాలు

[మార్చు]

ఆవు శాకాహారి జంతువు. ఇది కేవలం పచ్చిగడ్డి లేద ఎండుగడ్డి, చిట్టు, తవుడు, లేదా మొక్కలకు సంబంధించిన ఎటువంటి ఆహారాన్నైన భుజిస్తుంది. ఆవులు మరియూ ఎద్దులు వ్యవసాయంలో రైతులకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఆవులు పాలు ఇస్తే ఎద్దులు పొలం దున్నటానికి షాయపడతాయి. అందుకనే వాటికి కృతజ్ణతలు తెలుపటానికి సంక్రాంతి పండుగ ఆఖరి రోజయిన కనుమను వాటికోసమే ప్రత్యేకించారు.

గోమాత మహిమ

[మార్చు]

ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవుకన్న మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలనీ, అవి ఎన్నడూ ఎవరిచేతా దొంగిలింపబడరాదనీ, దుష్టుల వాతపడగూడదనీ, అధిక సంతతి పొందాలనీ, యజుర్వేదంలో శుభాకాంక్ష వ్యక్తం చేయబడింది. యజ్ఞ యాగాదులలో హవనానికై దుగ్ధ ఘృతాలనందించే గోవు సకల ప్రాణికోటికీ జీవాధారమైనదనీ, గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు అలవడగలవనీ, ధన సంపదలువృద్ధి పొందగలవనీ ప్రశంసించబడింది.


ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ, విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావర జంగమములు అలరారి ఉన్నాయి. శిరస్సుకు మధ్యభాగం శంకరుని గేహ, బిగువు అంగాలలో చతుర్థశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వవేదం చెబుతున్నది.

ప్రపంచంలో అన్నమును ఉత్పన్నం చేసేవి గోవులు అని ఆర్యులు శ్లాఘించారు. ఈ జగత్తులో గోసంపదతో సమానమైన ధనసంపద చూడలేదు అని చ్యవన మహర్షి 'నహుషం'లో ప్రవచించారు. చతుర్వేదాలలోనే కాక, హిందూ ధర్మశాస్త్రగ్రంథాలలోను, భారత, రామాయణ, భాగవతాది పవిత్రగ్రంథాలలోను, గోమహిమ అసమానమైనదిగా అభివర్ణించబడింది. వాల్మీకి, వ్యాసుడు, శ్రీ ఆది శంకరాచార్యులు, బుద్ధుడు, స్వామి దయానంద సరస్వతి, తులసీదాసు, కబీరు, చైతన్య మహాప్రభువు మొదలగు మహానుభావులెందరో గోసంపద యొక్క రక్షాణావశ్యకతను గూర్చి నొక్కి వక్కాణించారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలుడైనాడు. దిలీప చక్రవర్తి తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సైతం వెనుకాడలేదు. జమదగ్ని గోరక్షణకై ఆత్మత్యాగం చేశాడు. గోవులే స్వర్గ సోపానాలు.

గో మహిమ గురించి శివపార్వతుల సంభాషణ

[మార్చు]

" శ్రీ కృష్ణ పరమాత్మ" గోవును ఎంతో భక్తితో శ్రద్ధతో సేవకుడిగా చూసుకొనే వాడు. మహా జనులారా గోవును పూజించిన ముక్తికి పొందెదరు.

ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్ఠింపగా దయామయుడగు పరమశివుడు " ఓ పార్వతీ! గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును. ఆ గోవునందు పాదములు ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళ లో సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును. ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది. కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు తొలగును. ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును. గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది" అని బోధించాడు.

" శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే "

ఆవు పాలు

[మార్చు]

ఆవు పాలలో విటమిన్‌ ఏతో పాటు, పోషక విలువలు అధికంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.గేదెల కంటే ఆవులు ఎక్కువ కాలం పాలు ఇస్తాయి.రోజువారీ పోషణ ఖర్చు తక్కువ, రోజుకు 20లీటర్ల వరకూ పాలు ఇస్తాయి.పోషక విలువలు అధికం.గేదె పాలతో పోల్చితే ఆవు పాలలో వెన్న శాతం తక్కువ. సంకర జాతి ఆవు పాలలో వెన్నశాతం 3.5 ఉండగా, జెర్సీ ఆవు పాలలో 4.5 శాతం, గేదె పాలలో 6 నుంచి 9 శాతం వరకూ వెన్న ఉంటుంది.

ఆవు పేడ

[మార్చు]

ఆవు పేడలో క్రిమి సంహరక గుణాలున్నయన్న నమ్మకం వల్ల ఇళ్ళు అలకడానికి ఉపయోగిస్తారు. పొద్దునే ఇంటి ముందు ముగ్గు వేసే ముందు పేడ నీళ్ళతో కల్లాపి చల్లుతారు. ఆవు పేడను పిడకలు చెయ్యడానికి కూడా ఉపయోగిస్తారు

గోమూత్రం

[మార్చు]

విశ్వహిందూ పరిషత్‌నిర్వహిస్తున్న 'గో విజ్ఞాన అనుసంధాన కేంద్ర' తయారు చేసిన ఉత్పత్తులకు అమెరికా, చైనా మేధో సంపత్తి హక్కులు లభించాయి. ఔషధంతో గోపంచకాన్ని సమ్మిళితం చేస్తే అది సూక్ష్మజీవులను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని యూఎస్‌ పేటెంట్‌ గుర్తించింది.ఆవు పంచకం నుంచి ఉత్పత్తి చేసిన మిశ్రమం డీఎన్‌ఏను కాపాడేలా పనిచేస్తుందట.బాక్టీరియాను అడ్డుకోవడం, క్యాన్సర్‌ను నివారించడం వంటి ఔషధ లక్షణాలున్న ఈ ద్రవాన్ని- రీ డిస్టిల్డ్‌ కౌ యూరిన్‌ డిస్టిలేట్‌ ( 'కామధేను ఆర్క్‌') అని నామకరణం చేశారు.

గోవధను నిషేధించండి

[మార్చు]

హిందువులు గోవులను దైవంతో సమానంగా పూజిస్తారు కాబట్టి గో రక్షణకు చట్టం తీసుకురావాలని, ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని, గోవధను నిషేధించాలని కోరుతూ హిందూమత పెద్దలు ఎనిమిది కోట్ల సంతకాలతో కూడిన ఓ వినతి పత్రాన్ని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు సమర్పించారు. (ఈనాడు1.2.2010)

ప్రత్యేకమైన గోవులు

[మార్చు]

మూలాలు , సూచనలు

[మార్చు]
  1. గోబర్ గ్యాసు లో గోబర్ అంటే పేడ అని అర్ధం, అంటే మన పిడకలు ఉపయోగించే విధానానికి ఒక శాస్తీయతను కల్పించే ప్రక్రియ గోబర్ గ్యాసు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆవు&oldid=4352541" నుండి వెలికితీశారు