ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానం
1973లో సిక్ఖు రాజకీయ పార్టీ శిరోమణి అకాలీ దళ్ కొన్ని ప్రధానమైన డిమాండ్లతో ఆనంద్ పూర్ సాహిబ్ పట్టణంలో చేసిన తీర్మానాన్ని ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానంగా వ్యవహరిస్తారు. 1966లో భాషా ప్రాతిపదికన, సిక్ఖు సంఖ్యాధిక్య రాష్ట్రంగా ఏర్పడ్డ పంజాబ్ ప్రాంతానికి మరింత నీరు, అధికారం, అవకాశాలు వచ్చేలా చేయాలంటూ అందుకు అనుగుణమైన పలు డిమాండ్లను ఈ తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి చేసింది.
1980లు
[మార్చు]ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానం చేసిన చాన్నాళ్ళ వరకూ ఈ తీర్మానానికి రాజకీయంగా ప్రాముఖ్యత లేకుండా మరుగున పడింది. ఐతే 1980ల్లో ఖలిస్తాన్ ఉద్యమం వైపుకు పంజాబ్ తిరుగుబాటు నడుస్తూన్న కాలంలో అంతకు ముందు దశాబ్దంలో చేసిన ఈ తీర్మానానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. 1982లో శిరోమణి అకాలీ దళ్, సిక్ఖు మత నాయకుడు, అనంతర కాలంలో ఉగ్రవాదిగా మారిన జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే చేతులు కలిపి ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు ధరమ్ యుద్ధ్ మోర్చాకు అంకురార్పణ చేశారు. వేలాదిమంది ప్రజలు ఈ ఉద్యమం వల్ల పంజాబ్ కు అధిక వాటాలో సాగునీరు దక్కడం, చండీగఢ్ పంజాబ్ కు లభించడం వంటి సమస్యలకు ఇదే సరైన పరిష్కారమన్న భావనతో దీనిలో చేరారు.[1]
అకాలీ దళ్ కు రాజకీయ ప్రత్యర్థి ఐన కాంగ్రెస్ నాయకురాలు, ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆనంద్ పూర్ తీర్మానాన్ని వేర్పాటువాద పత్రంగా చూశారు.[2] తీర్మానంలో సమాఖ్య స్ఫూర్తి, పంజాబ్ కు మరిన్ని జలాల వాటా వంటివి సిద్ధాంతాలు కనిపిస్తూన్నా, తీర్మానానికి రాసిన ముందుమాటలో సిక్ఖు ప్రత్యేక దేశాన్ని గురించిన వేర్పాటువాద భావాలు కనిపిస్తున్నాయని మరికొందరు రాజకీయ విశ్లేషకులు భావించారు.
దీనితో అకాలీ దళ్ ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానం సార్వభౌమత్వాన్ని, స్వయం నిర్ణయాన్ని కలిగిన ప్రత్యేక సిక్ఖు రాజ్యమైన ఖలిస్తాన్ ఏర్పాటును ఆశించట్లేదని, అందుకు బీజాలు అందులో లేవని అధికారికంగా ప్రకటించింది. దాని అధ్యక్షుడు హర్ చంద్ సింగ్ లాంగోవాల్ ఈ విధంగా ప్రకటించారు:[2][3]
సిక్ఖులకు భారతదేశం నుంచి ఏ విధంగానూ విడిపోయే ప్రణాళిక లేదన్న విషయాన్ని ఒక్కసారిగా, తుదిమాటగా స్పష్టం చేద్దాం. వారికి కావాల్సిందేంటంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి మత జీవనాన్ని ఆటంకపరచే జోక్యాలు లేకుండా భారతదేశంలోనే సిక్ఖులుగా జీవించేందుకు అవకాశం కావాలి. ఇతర భారతీయుల్లానే సిక్ఖులు కూడా నిస్సందేహంగా ఒకే భారత జాతికి చెందినవారు.
—హర్ చంద్ సింగ్ లాంగోవాల్, అకాలీదళ్ అధ్యక్షునిగా
ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానం లక్ష్యాలపై రాజీపడుతూ, సిక్ఖు సార్వభౌమత్వాన్ని అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలపైహర్ చంద్ సింగ్ లాంగోవాల్ సిక్ఖు తీవ్రవాద అధిష్టానం చేతిలో తర్వాతికాలంలో హత్యకు గురయ్యారు.
ఉద్దేశ్యం
[మార్చు]శిరోమణి అకాలీ దళ్ ఎప్పటికీ ఈ కింది లక్ష్యాలు చేరుకునేందుకు కృషిచేస్తుందంటూ ఈ తీర్మానం ప్రతిపాదించారు:
- నాస్తికతపై పోరాటం చేస్తూ సిక్ఖుమత విలువలు, నియమావళి సహా సిక్ఖుమతాన్ని విస్తృత పరుస్తూండడం.
- పంత్ యొక్క విస్పష్టమైన, సార్వభౌమ గుర్తింపును కాపాడుతూ, సజీవంగా నిలుపుతూ, సిక్ఖు పంత్ యొక్క జాతీయ భావాలు, ఆశయాలు పూర్తిస్థాయిలో వ్యక్తీకరణ పొంది, సంతృప్తి చెంది, విస్తరించే సౌకర్యాలు కల్పించేందుకు తగ్గ పరిస్థితులను నిర్మించడం.
- పెరుగుతున్న ఉత్పత్తితో పాటుగా మరింత సమానంగా సంపద పంచుతూ, ఏ రకమైన దోపిడీనైనా నాశనం చేయగల న్యాయమైన సాంఘిక క్రమాన్ని నిర్మించి పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించడం.
- కుల, శాఖ, ఇతర ఏ ప్రాతిపదికనైనా వివక్షను నిర్మూలించి సిక్ఖు మత మౌలిక సూత్రాలను అమలుచేయడం.
- సిక్ఖు జాతి జాతీయ రక్షణకు నియోగించగల శారీరిక పటుత్వాన్ని నిలబెట్టేందుకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తూ, మత్తుపదార్థాల వినియోగాన్ని అరికడుతూ, జబ్బులు, అనారోగ్యం అరికట్టడం. పైన చెప్పినవి సాధించేందుకు సిక్ఖు మత ఆరాధన, ఆత్మగౌరవ భావం వారి గొప్ప సాంఘిక-ఆధ్యాత్మిక పరంపరలో ఏర్పరిచేలా చేయడానికి ఈ కింది విధానాలు పాటించడాన్ని తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తోంది:
(అ). దేవుని ఏకత్వం, ఆయన పేరిట ధ్యానం, గుర్బానీ పునరుద్ఘాటన, పవిత్ర సిక్ఖు గురువుల్లోనూ, గురు గ్రంథ సాహిబ్ జీలోనూ విశ్వాసాన్ని పాదుకొల్పడం సహా ఇతర తదనుగుణమైన కార్యకలాపాల పునరుద్ఘాటన.
(ఆ). సిక్ఖు యువతను బోధకులు, రాగీలు, ధాడీలు, కవులు అయి సిక్ఖు మతాన్ని, సూత్రాలను, సంప్రదాయాలు వ్యాప్తి చేసేలాంటి స్వాభావిక శక్తిని సిక్ఖు మిషనరీ కళాశాల ద్వారా అభివృద్ధి చేయడం, తద్వారా మౌలిక మత విలువలు మరింత ప్రభావశీలంగా, తీవ్రతరంగా స్వీకరించే అవకాశం కల్పించడం.
(ఇ). పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో సిక్ఖులను పెద్ద ఎత్తన మతదీక్ష ఇవ్వడం.
(ఈ). దస్వంత్ అన్న మత సంస్థను సిక్ఖుల్లో పునర్వికసింపజేయడం.
(ఉ). రచయితలు, బోధకులు సహా సిక్ఖు మేధావుల పట్ల సాధారణ గౌరవ ప్రతిపత్తులు తయారుచేయడం, దీని వల్ల వారి సాఫల్యాలు విస్తరించడం.
మూలాలు
[మార్చు]- ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ సిక్ఖిజం, వాల్యూం. 1, 1995, ఎడిటర్., హర్బన్స్ సింగ్, పేజీ 133-141
- ↑ Akshayakumar Ramanlal Desai (1 January 1991). Expanding Governmental Lawlessness and Organized Struggles. Popular Prakashan. pp. 64–66. ISBN 978-81-7154-529-2.
- ↑ 2.0 2.1 Giorgio Shani (2008). Sikh nationalism and identity in a global age. Routledge. pp. 51–60. ISBN 978-0-415-42190-4.
- ↑ G. S. Basran; B. Singh Bolaria (2003). The Sikhs in Canada: Migration, Race, Class, and Gender. Oxford University Press. ISBN 978-0-19-564886-7. Retrieved 18 August 2013.