ఆడెల్లి పోచమ్మ దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • Adelli lo velasina pochamma talli rupam
    Adelli Pochamma
ఆడెల్లి పోచమ్మ దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:నిర్మల్ జిల్లా
ప్రదేశం:ఆడెల్లి, సారంగాపూర్ మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:పోచమ్మ
ప్రధాన పండుగలు:గంగనీళ్ళ జాతర
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం

ఆడెల్లి పోచమ్మ దేవాలయం, నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం, ఆడెల్లి గ్రామంలో ఉన్న పోచమ్మ దేవాలయం. ఏకశిలపై వెలసిన అమ్మవారు నాలుగు చేతులలో త్రిశూలం, ఢమరుకం అభయహస్తం ,అక్షయపాత్రతో కుడికాలిని అసురుని పై ఉంచి దర్శనమిస్తుంది తనతో పాటు ఏడుగురు అక్కాచెల్లెళ్ళతో కలిసి పూజలందుకుంటున్న ఆడెల్లి పోచమ్మ, పెరుగన్నాన్ని నైవేద్యంగా స్వీకరిస్తూ భక్తుల కోర్కెలను తీరుస్తోంది. ఈ అమ్మవారి దర్శనానికి తెలంగాణతోపాటు ఆంధ్ర ప్రదేశ్,మధ్యప్రదేశ్,ఒడిషా,మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ప్రతి ఆదివారం భక్తుల తాకిడితో ఇక్కడి వాతావరణం మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరను తలపిస్తుంది.[1]

చరిత్ర

[మార్చు]

పూర్వకాలంలో ఆడెల్లి ప్రాంతంలో తీవ్ర కరవు సంభవించి తినడానికి తిండిలేని పరిస్థితిలో అనారోగ్యాలతో ప్రజలు చనిపోవడంతో ఊర్లన్ని శ్మశానాలుగా మారిపోయాయి. దాంతో తమను కాపాడమని శివుడిని ప్రార్థించగా, తన కుమార్తె అయిన పోచమ్మను శివుడు ఈ ప్రాంతానికి రక్షకురాలిగా పంపించాడు. తండ్రి ఆదేశాలతో ఇక్కడి ప్రజలకు అండగా నిలిచిన పోచమ్మ, భక్తుల కోర్కెలు తీరుస్తూ ఈ అడవిలోనే ఉండిపోయిందని స్థల పురాణం చెబుతోంది. పూర్వం నుంచి పసుపుతోనే పూజిస్తుండడంవల్ల, ప్రతి ఆదివారం గర్భగుడిలో పసుపు రాశులు దర్శనమిస్తుంటాయి. అమ్మవారిని దర్శించుకున్న తరువాత దేవాలయ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వంటలు చేసుకొని సహ పంక్తి భోజనాలు చేస్తారు.[1]

ప్రత్యేకత

[మార్చు]
  • దేశంలో మరెక్కడా లేనివిధంగా శివపార్వతుల ఏడుగురు కుమార్తెలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి విగ్రహాలు ఈ దేవాలయ గర్భగుడిలో ఉన్నాయి.
  • ఇక్కడి పోచమ్మ తల్లికి పెరుగన్నమంటే చాలా ఇష్టం. భక్తులు ఇక్కడి కోనేటి నీటితో అన్నం వండి పెరుగుతో కలిపి పోచమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.
  • దేవాలయం ముందు రూపాయి బిల్లలను నిల్చునేలా పెడితే కిందపడకుండా ఉంటాయి.

ఉత్సవాలు

[మార్చు]

ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రులకు ముందు ఈ దేవాలయంలో గంగనీళ్ళ జాతర జరుగుతుంది. దసరాకు ముందు వచ్చే (అమావాస్య) తర్వాత శని, ఆదివారాల్లో ఈ జాతరను నిర్వహిస్తారు. ఆందులో భాగంగా శనివారం గర్భగుడిలోని పోచమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు. భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాలతో అమ్మవారు ధరించిన అన్ని ఆభరణాలనూ తీసుకుని సారంగాపూర్, యాకర్పల్లి, గొడిసెర, వంజర్, పియారామూర్, కదిలి, దిలావార్పూర్, కంజర్ గ్రామాల మీదుగా సుమారు 35 కిలోమీటర్ల మేర ప్రయాణించి సంగ్వీ సమీపంలోని గోదావరి నది తీరానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి, ఆదివారం వేకువ జామున గోదావరి నీటిలో ఆభరణాలు శుద్ధి చేసి, ప్రత్యేక వెండి కడవలో నీటిని తీసుకుని సాయంత్రానికి దేవాలయానికి తీసుకువస్తారు. అమ్మవారి ఆభరణాలను దర్శించుకోడానికి నిర్మల్, నిజామాబాదులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరువుతారు.[2]

పునర్నిర్మాణం

[మార్చు]

2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఈ దేవాలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు. 65 లక్షల రూపాయలతో దేవాలయ ప్రహరీగోడ, కోనేరు, సీసీ రోడ్లు నిర్మించబడ్డాయి. పోచమ్మతల్లి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించేలా తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 11 కోట్ల రూపాయలతో ఈ దేవాలయ పునర్నిర్మాణం చేపట్టనున్నారు. దేవాలయ విస్తరణ నిర్మాణంలో భాగంగా బాలాలయం నుంచి భక్తులకు అమ్మవారిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లుచేయనున్నారు. మొదటి దశలో 3 కోట్ల రూపాయలతో గర్భగుడి, అర్థ మండప, విమాన గోపురం నిర్మించనున్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "పెరుగన్నమే ప్రీతి.. భక్తుల పాలిట కొంగు బంగారం 'అడెల్లి పోచమ్మ'". ETV Bharat News. 2022-01-29. Archived from the original on 2022-05-04. Retrieved 2022-05-04.
  2. "Adelli Pochamma / అడెల్లి పోచమ్మ". www.telugukiranam.com. Archived from the original on 2022-05-04. Retrieved 2022-05-04.
  3. telugu, NT News (2022-05-04). "రూ.11 కోట్లతో అడెల్లి పోచమ్మ ఆలయ పునర్నిర్మాణం : మంత్రి ఐకే రెడ్డి". Namasthe Telangana. Archived from the original on 2022-05-04. Retrieved 2022-05-04.