ఆంధ్రభారతి (పత్రిక)
![]() | |
సంపాదకులు | లేరు |
---|---|
తరచుదనం | మాస పత్రిక |
మొదటి సంచిక | 1909 |
ఆఖరి సంచిక | 1915 |
దేశం | భారతదేశం |
కేంద్రస్థానం | మచిలీపట్నం |
భాష | తెలుగు |
20 వ శతాబ్ది తొలినాళ్ళలో వెలువడి, ఆగిపోయిన తెలుగు పత్రిక, ఆంధ్రభారతి. అన్ని వర్గాలకు చెందిన, అన్ని వాదాలకు చెందిన రచయితల రచనలతో వెలువడిన తొలి సాహిత్య పత్రిక ఇది. ఇది 1909- 1915 మధ్య, మచిలీపట్నం, ముట్నూరు, బెజవాడల నుంచి వెలువడింది. దీనికి పోషకులు, రచయితలే గాని సంపాదకులు లేరు. రచయితల్లో చాలామంది సుప్రసిద్ధులు. వాళ్ళ పేర్లని ఈ పత్రిక ప్రతి సంచిక ప్రారంభంలో ప్రచురించేది. తెలుగులో మొట్టమొదటి కథగా పరిగణించబడే దిద్దుబాటు ఆంధ్రభారతి లోనే ప్రచురితమైంది. 1915 లో అగిపోయిన పత్రిక మళ్ళీ 1926 లో మొదలై 1928 లో ఆగిపోయింది.
చరిత్ర
[మార్చు]సి.నారాయణరెడ్డి తన ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు:ప్రయోగములు పుస్తకంలో, "ఆంధ్రభారతి 1909 లో (శాలి.శ. 1831 చైత్రము) సంచికలో రాయప్రోలువారు వ్రాసిన 'కళాకవిత్వములు' అను వ్యాసము, గురజాడవారి 'మీపేరేమిటి?' అను కథానిక ప్రచురింపబడినవి. ఇరువురి రచన లొకేసంచికలో ప్రథమ పర్యాయము వచ్చుట విశేషము" అని రాయడంతో ఆంధ్రభారతి పత్రిక మొదలైనది 1909 లో అని తెలుస్తోంది.[1]
రచనలు
[మార్చు]తెలుగులో మొట్టమొదటి కథగా పరిగణించబడే దిద్దుబాటు 1910 లో ఆంధ్రభారతి తొలిసంచిక లోనే ప్రచురితమైంది. దాన్ని గురజాడ అప్పారావు రచించాడు. 1912 అక్టోబరులో రాయప్రోలు సుబ్బారావు రాసిన కోయిల, కనకము మొదలైన కవితలు ఈ పత్రికలో ప్రచురితమయ్యాయి.[2]
1915 లో ఆగిపోయిన పత్రిక మళ్ళీ 1926 లో మొదలై, 1928 వరకూ నడిచి ఆపై ఆగిపోయింది. 1928 జూన్ సంచికలో అల్లూరి సీతారామరాజు గురించి శ్రీ రామరాజు ప్రశంస పేరుతో రెండు వ్యాసాలను ప్రచురించింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య, మద్దూరి అన్నపూర్ణయ్యలు రాసిన ఈ వ్యాసాలలో రాజును స్వాతంత్ర్య యోధుడిగా కీర్తిస్తూ అల్లూరిని చంపడంపై ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసారు.[3]
1928 ఫిబ్రవరి సంచికలో శ్లిష్టాక్షరపదబంధము పేరుతో గళ్ళ నుడికట్టును ప్రచురించారు.
ప్రశంస
[మార్చు]సి.నారాయణరెడ్డి తన ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు:ప్రయోగములు పుస్తకంలో సుజనరంజని గురించి ఇలా రాసాడు: "1909 నుండి ఆంధ సాహిత్య రంగస్థలమున 'ఆంధ్రభారతి' జేగీయమానముగా నిలచినది. ఈ పతిక చెన్నాప్రగడ భానుమూర్తి, రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు మున్నగు ప్రముఖ కవుల కవితలను పచురించినది."[4]
మూలాలు
[మార్చు]- ↑ సి., నారాయణరెడ్డి (1999). "నవ్యకవిత్వ మహోదయము". ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు:ప్రయోగములు. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. p. 182.
- ↑ వేదగిరి, రాంబాబు (2012). తెలుగులో వార, మాస పత్రికలు. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంసృతిక మండలి. p. 33.
- ↑ ఆంధ్రభారతి. మచిలీపట్నం: ఆంధ్రభారతి. 1928. pp. 57, 58.
- ↑ సి., నారాయణరెడ్డి (1999). "నవ్యకవిత్వ మహోదయము". ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు:ప్రయోగములు. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. p. 155.