Jump to content

అవధానం పాపయ్య

వికీపీడియా నుండి

అవధానం పాపయ్య ( - 1809) ఈస్టిండియా పరిపాలనకాలంలో దుబాసీ, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, తెలుగు భాషా పోషకుడు. ఈస్టిండియా కంపెనీ పరిపాలన కాలంలో చెన్నపట్టణంలో కస్టమ్స్ ఆఫీసర్ కింది ఉద్యోగిగా, తదనంతరం చెన్నపట్టణపు గవర్నర్ కౌన్సిల్ సభ్యుల దుబాసీగా పనిచేశారు. ఆయన తన పైఅధికారులైన ఆంగ్లేయుల కోసం, వారితో కలిసి అనేకమైన కుట్రలు, మోసాలు చేశారన్న ఆరోపణలను అనుభవించారు. ఉద్యోగజీవితంలో అవినీతిపరుడైన అధికారిగా, వ్యక్తిగతంగా భాషాకావ్యాలను వ్రాయించి పోషించిన పండితునిగా ఆయన కీర్తి అపకీర్తులను సమానంగా పొందారు.[1]

బాల్యజీవితం

[మార్చు]

అవధానం పాపయ్య నెల్లూరు జిల్లాకు చెందినవారు. ఆంధ్ర వైదిక బ్రాహ్మణకులస్తులు. ఆయన వీదిబడిలో చదువుకుని తెలుగు వ్రాయడం, చదవడం, లెక్కలు కట్టడం, సంస్కృత భాష జ్ఞానము తెలుసుకున్నారు. అటుపైన స్వశక్తితో పార్శీ, హిందుస్థానీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుని చిన్నవయస్సులోనే చెన్నపట్టణం చేరుకున్నారు.[1]

ఉద్యోగం

[మార్చు]

ఆ రోజుల్లో వర్తకసంఘం స్థాయి నుంచి రాజాస్థానానికి అప్రతిహతంగా ఎదుగుతున్న ఈస్టిండియా కంపెనీని ఉద్యోగం కోసం ఆశ్రయించారు. కంపెనీ వారి వద్ద పనిచేసే ఉద్యోగులను ఆశ్రయించుకుని ఉమేదు వారీగా పనిచేశారు. ముందుగా ఒక గుమస్తా పనిచేశారు.తెలివి, సామర్థ్యాలను చూపి దొరల మెప్పుపొంది పెద్ద పెద్ద హోదాలు విశేషమైన ధనం సంపాదించుకున్నారు.[1]

దుబాసీగా

[మార్చు]

ఫిబ్రవరి 7, 1789న చెన్నపట్టణం గవర్నర్గా పనిచేసిన సర్ ఆచ్చిబాల్డ్ క్యాంబెల్ జబ్బు కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఇంగ్లాండు వెళ్ళిపోయాడు.దాంతో ఆ నెల 13 తేదీ నుంచి ఆరురోజుల పాటు చెన్నపట్టణం గవర్నర్గా జాన్ హాలండ్ ఉన్నారు. ఆపైన పదవి నుంచి వైదొలగి జాన్ హాలెండ్ తో పాటుగా కౌన్సిల్లోని మరో సభ్యుడు, అతని సోదరుడు అయిన ఎడ్వర్డు జె హాలెండ్ సంవత్సరం పాటుగా గవర్నర్ గా పనిచేశారు. ఈ హాలెండ్ సోదరుల వద్ద దుబాసీగా ఈ అవధానం పాపయ్య పనిచేశారు. బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి ఆ కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో దక్షిణ దేశంలోని కొన్ని భూభాగాలతో పాటుగా, మైసూరు సామ్రాజ్యం, ఫ్రెంచి కంపెనీ వంటివారితో యుద్ధాలు ఉండేవి. అలానే నిజాం, మరాఠా, తిరువాన్కూరు మొదలైన రాజ్యాలతో మిత్రత్వాలు ఉండేవి. ఇలాంటి స్థితిగతుల్లో పనిచేసేవారికి అక్రమంగా ఆర్జించే అవకాశాలు చాలానే ఉండేవి. పైగా ఉద్యోగస్తులకు జీతాలు వారి హోదాకు తగ్గవిధంగా ఉండకపోవడం, అధికారికంగానో అనధికారికంగానో వారు సొమ్ము కాజేసే విధానాలను కంపెనీ డైరెక్టర్లు సమర్థిస్తూండడం కూడా ఈ దుర్వవసాయానికి మద్దతుగా ఉండేది. మొత్తానికి ఈ స్థితిగతుల్లో అవధానం పాపయ్య గవర్నర్ దుబాసీగా పనిచేసేప్పుడు గవర్నర్కు పాపయ్య నమ్మిన బంటుగా ఉండేవారు. హాలెండు సోదరుల వల్ల ఎవరికి ఏ పని చేయించుకోవాల్సి వచ్చినా పాపయ్య ద్వారానే జరగేది. వారికి ఇష్టం లేకుంటే కనీసం దర్శనం కూడా లభించేది కాదు.

పాపయ్య చాలా వ్యవహార దక్షుడు, రాజ్యతంత్రవేత్త, కార్యసాధకునిగా పేరుపొందారు. కంపెనీ వారు అప్పట్లో దక్షిణ భారతదేశపు రాజకీయ అనిశ్చితిని అవకాశంగా తీసుకుని రాజనీతిని ధనసంపాదన కోసం వినియోగిస్తూండేవారు. వ్యవహారవేత్తగా, రాజనీతివేత్తగా ఈ స్థితిగతులు పాపయ్య ధనసంపాదనకు చాలా ఉపకరించాయి. పాపయ్య, హాలెండు సోదరులు విపరీతమైన ధనార్జన చేశారు.

పదవీ వియోగం

[మార్చు]

టిప్పుసుల్తాన్ దక్షిణ భారతదేశంపై రాజకీయ ఆధిపత్యాన్ని సాధించడంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి దాదాపుగా చివరి అడ్డుగా నిలిచిఉండడంతో ఏదోక అవకాశాన్ని వినియోగించుకుని అతనిపై యుద్ధం చేయాలని కంపెనీ చేస్తూంది. 1790లో టిప్పుసుల్తాన్ కంపెనీ మిత్రరాజ్యమైన తిరువాన్కూరుపై యుద్ధానికి దిగాడు. ఈ అవకాశాన్ని వినియోగించి టిప్పుసుల్తాన్ పై యుద్ధం చేయడం మాత్రం స్థానిక గవర్నర్ హాలెండ్కు, చెన్నపట్టణం గవర్నర్ కౌన్సిల్ కు ఇష్టం లేకపోయింది. దీనిపై విపరీతంగా కోపించిన గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ చెన్నపట్టణానికి 1790లో సర్వసేనానిగా నియమింపబడ్డ సర్ విలియం మెడోస్ ను టిప్పుసుల్తాన్ పై యుద్ధం చేయాల్సిందిగా ఉత్తర్వు పంపి గవర్నర్ గా హాలెండును తొలగించి ఆ పదవిలో కూడా మెడోస్ నే నియమించారు. దీనితో చక్రంతిప్పిన పాపయ్య కూడా పదవి కోల్పోయి, అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు.

అవినీతి కేసులు

[మార్చు]
  • 1789-90 కాలంలో అధికారంలో ఉండగా హాలెండ్ సోదరులు, అవధానం పాపయ్య, అతని సోదరుడు అవధానం రామస్వామి, శంకరపురం వెంకటాచలం శెట్టి, ఒప్పెంగారు కలిసి చెన్నపట్టణం కంపెనీలో సీనియర్ మర్చంట్ హోదాలో ఉద్యోగం చేస్తూండే డేవిడ్ హాలిబర్టన్ ని చాలా ఇబ్బందులకు గురిచేశారు. హాలిబర్టన్ వారి అవినీతికి అడ్డువచ్చినందుకు అవినీతి నిందలు ఆయన మీదే మోపి రెవెన్యూ బోర్డు పని నుంచి తొలగించి చాలా ప్రమాదకరమైన మన్య ప్రదేశానికి బదిలీచేసి బాధలుపెట్టారు. 1792లో అప్పటి గవర్నర్ మెడోస్ అధ్యక్షతన న్యాయవిచారణ సభలో ఈ ఆరోపణలు నిజమని తేలడంతో మూడేళ్ళ జైలుశిక్ష, పెద్దమొత్తం జరిమానా విధించారు.
  • పాపయ్య ఖైదులోంచి బయటకు వచ్చాకా ఆర్కాటు నవాబు బాకీల గురించిన విచారణ జరిగి ఆ బాకీల విషయంలో చెన్నపట్టణంలోని దొరలు, పెద్ద ఉద్యోగులు చేసిన అక్రమాలు బయటపడ్డాయి. కర్ణాటక నవాబును బ్రిటీష్ ఈస్టిండియావారు అనవసరమైన ఖర్చుల కిందను, కుట్రల కిందను మోసం చేసి బాకీపత్రాలు వ్రాయించుకుంటూ అతని ఆస్తంతా స్వాధీనం చేసుకుని చివరకు రాజ్యాన్ని కూడా లాక్కున్నారు. ఈ క్రమంలో కర్నాటక నవాబు వద్ద చాలా పలుకుబడి కలిగిన శిరస్తాదారు రాయపురెడ్డిరావుకీ అవధానం పాపయ్యకీ నడుమ బాకీల విషయమై ఓ కేసు నడిచింది. ఈ కేసులో ఫోర్జరీల గొడవలు జరిగి భారతదేశపు ఎల్లలు దాటి లండన్ లోని సుప్రీంకోర్టు వరకు సాగిపోయింది. ఐతే పాపయ్య పక్షం వారు చాలా బలవంతులు కావడతో ఎదురు అతని ప్రతికక్షులపైన పెట్టిన కేసులు నెగ్గి పాపయ్య కేసు వీగిపోయింది. తుదకు పాపయ్య పక్షంవారి అధికార బలంతోనో మరోవిధంగానో నిర్దోషిగా బయటపడ్డా కొద్దికాలంలోనే వేరే ఉపద్రవంరేగి మళ్ళీ కేసు మరోమారు విచారణకు వచ్చింది. ఆ విచారణ ప్రారంభమయ్యేలోగానే 1809 సంవత్సరం మొదట్లో పాపయ్య మరణించారు.
  • అవధానం పాపయ్యను చేరదీసి అతని తెలివితేటలని తమకనుకూలంగా వాడుకుని బ్రిటీషర్లు బాగా ఆర్జించారు. అతని మరణానంతరం చరిత్ర వ్రాసేవారు కూడా అతను బ్రిటీషర్ల చేతిలో ఉపకరణంలా వినియోగపడ్డా ఆ విషయాన్ని తోటి బ్రిటీషర్లను చరిత్రహీనులు కాకుండా కాపాడేందుకు గాను చివరకు ఆ తప్పులన్నిటినీ ఆయనపై పెట్టారు.

భాషాసేవ

[మార్చు]

సంస్కృతం భాషకు చెందిన అనేక అపూర్వమైన గ్రంథాలను ఆయన భద్రంచేశారు. అనేక అపూర్వమైన గ్రంథాలను సంపాదించేవాడు. తాళపత్రాలలో నశించిపోకుండా అచ్చులేని ఆ కాలంలో వాటికి ప్రతులు వ్రాయించి భద్రపరిచేవారు. కొన్నింటిని ఆయన తెలుగులోకి అనువాదం చేయించారు. ఏనుగుల వీరాస్వామయ్య బ్రౌన్ దొరకు వ్రాసిన ఉత్తరంలో లంగరు పాపయ్య చేసిన భాషా సేవ వివరాలు తెలుస్తున్నాయి. స్కాందం అనే అపూర్వమైన గ్రంథం పాపయ్య గ్రంథసంచయంలో ఉందని, అందులోని ఆరు సంగుహితల్లో ఒకటైన శంకర సంగుహితను పాపయ్య తెలుగు పద్యాలలోకి అనువదింపజేసినట్లు 1831నాటి ఏనుగుల వీరాస్వామయ్య బ్రౌన్ దొరకు వ్రాసిన ఉత్తరం ద్వారా తెలుస్తోంది. వీరాస్వామయ్య పాపయ్య భార్య, కుమారులను అడిగి ఈ వివరాలు తెలుసుకున్నట్టు సనత్కుమార, సూర్య, బ్రహ్మ, వైష్ణవ, శంకర, సౌర సంగుహితలు 50 కాండలు, లక్ష శ్లోకాలుగా ఉన్నట్టు, తాను వాటిని సేకరించినట్టు వ్రాశారు. ఆయన వైదిక పండితులను, వైదిక విద్యలను పోషించేవారని తెలిపారు.

ప్రాచుర్యం

[మార్చు]

ఆయనకు కీర్తి, అపకీర్తి కూడా సమంగా ఉండడంతో అవధానం పాపయ్య పేరు చరిత్రలో కొన్ని అంశాల్లో మంచిగానూ, మరికొన్నిట్లో చెడ్డగానూ నిలిచిపోయింది.

  • చెన్నపట్టణంలో ‘’వేపేరీ’' అనే పేటలో పాపయ్య నివసించేవాడు. ఆ వీధికి కాలక్రమేణా అవధానం పాపయ్యరు వీధి అనే పేరు వచ్చి శతాబ్దాల పాటు అది అలాగే నిలిచిపోయింది.
  • సుప్రసిద్ధ ఆంగ్ల నవలాకారుడు సర్ వాల్టర్ స్కాట్ 1827లో రచించిన సర్జన్స్ డాటర్ నవలలో పాపయ్య అనే దుబాసీ పాత్రను అవధానం పాపయ్యపై వచ్చిన ప్రచారానుగుణంగా చిత్రీకరించారు. స్కాట్ మాతామహునికి చెన్నపట్టణంలో పనిచేసి పాపయ్య కుట్రవల్ల దెబ్బతిని తిరిగి అతనిపై కేసుపెట్టి ఖైదుచేయించిన హాలిబర్టన్ బంధువు. పాపయ్యపై ఆంగ్లంలో కరపత్రాలు కూడా ప్రచురితమయ్యాయి. పాపయ్య అనే దుబాసీ అని, కౌన్సిల్ అధ్యక్షుడు ఇతని ద్వారా దేశీయరాజులతో రాయబారాలు నెరపుతూంటారని, జిత్తులమారి, ఘోరమైన పన్నాగాలు చేసేవాడు, బీదలజీవనాన్ని పడగొట్టేవాడు, స్త్రీల మానాన్ని చెడగొట్టేందుకు వెనుదీయడని, పగకు తాచుపాము అనీ వ్రాశారు. ఐతే ప్రముఖ చారిత్రికుడు దిగవల్లి వేంకటశివరావు నిర్ధారణ ప్రకారం అతను సామాన్యమైన అవినీతిపరుడు, తనపై అధికారుల పనులు నెరవేర్చేవారే తప్ప అంత దుర్మార్గుడు కాదు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.