Jump to content

అల్లమ ప్రభు

వికీపీడియా నుండి

అల్లమ ప్రభు 12 వ శతాబ్దానికి చెందిన గొప్ప వ్యక్తి. ఆ కాలంలో అంటరానితనంపైన పోరాడి సమాజంలో మార్పుని తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి. అంతేకాకుండా దేశసంచారం చేస్తూ ఎన్నో శివాలయాలని దర్శించి ఆత్మలింగాన్ని పొందిన మహా శక్తిమంతుడు.గొప్ప వచన సాహిత్యకారుడు.[1]

జీవిత గాథ

[మార్చు]

అల్లమప్రభు 12 వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించాడు.[2] ఈయన గొప్ప శివభక్తుడు. ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధువు. అయితే ఆయన కమలత అనే ఒక యువతిని వివాహం చేసుకోగా ఆమె తీవ్ర జ్వరంతో మరణించడంతో, అది తట్టుకోలేని ఆయన దేశసంచారం చేస్తూ అనేక శివాలయాలను దర్శించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే ఒక గురువు ఆత్మలింగాన్ని ఆయనకి ప్రసాదించాడట. ఇది ఇలా ఉంటె, శివనామంతో అన్ని శివాలయాలు దర్శిస్తుండగా అప్పటికే శక్తివంతమైన సాధువుగా అల్లమప్రభు ప్రసిద్ధి చెందగా, ఒక యోగి అల్లమప్రభుని కలసి అతడితో పోటీ పడాలని భావించాడు. ఆ యోగి వయసు 200 సంవత్సరాల ఉండగా, ఆయన కఠోర సాధనతో పంచభూతాలపైనా ఆధిపత్యం సాధించి శరీరాన్ని దృఢపరుచుకొని వయసుని అధిగమించాడు. ఇలా వయసుని అధిగమించాననే గర్వం ఆ యోగికి ఉంది. అయితే ఆ యోగి ఒక నది ఒడ్డున అల్లమప్రభు ని కలుసుకొని నేను అసలైన యోగిని. నువ్వు కాదు. కావాలంటే ఒక కత్తి తీసుకొని నా నెత్తి పైన కొట్టమని చెప్పగా, అప్పుడు అల్లమప్రభువు ఒక కత్తితో ఆ యోగి తలపైన కొట్టడంతో ఒక రాయికి తగిలినట్టు ఆ కత్తి మళ్ళి వెనుకకు వచ్చింది. అప్పుడు ఆ యోగి నన్ను ఏ కత్తి కూడా ఏమి చేయలేదు, నేను అమరుడను అని చెప్పి, నీవు ఏం చేయగలవు? అని అడగడంతో, అల్లమప్రభు నవ్వుతు నువ్వు కూడా నీ కత్తితో నా తలపైన ప్రయోగించి చూడు అనగా, ఆ యోగికి అల్లమప్రభు దృడంగా కాకుండా సామాన్యంగా కనిపించడంతో ఆగిపోగా, అల్లమప్రభు ఏమి పర్వాలేదు కత్తిని నా పైన ప్రయోగించు అనడంతో, ఆ యోగి కత్తితో తలపైన కొట్టగా, ఆ కత్తి అల్లమప్రభువు శరీరం మధ్యనుండి ఏదో గాలిలో వెళ్లినట్టు గా వెళ్లి భూమికి తాకడంతో ఆ యోగి అలానే కత్తితో పాటు కిందపడిపోయాడు. అప్పడు ఆ యోగి ఇది ఏమిటి అని అల్లమప్రభు ని అడగగా, 'ఇది ఇదో అదో కాదు ఇది శివుడు, ఇది ఏదైతే లేదో అది' అని ఆ యోగికి సమాధానం ఇచ్చాడు.

ఇక అల్లమ ప్రభు సంపాదించిన ఆ లింగాన్ని ఒక దట్టమైన గుట్ట పైన ప్రతిష్టించి పూజలు చేసాడు. ప్రస్తుతం ఆ గుట్టను అల్లమ ప్రభు గుట్ట అని పిలుస్తున్నారు.

అల్లమ ప్రభు గుట్ట, ఆలయం

[మార్చు]

ప్రస్తుతం ఆ లింగ ప్రతిష్టాపన జరిగిన గుట్ట తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా, నస్రుల్లాబాద్, బొమ్మన్ దేవ్ పల్లి దగ్గరలో ఉంది. దేవాలయంలో ఆ లింగం ఉంది. అందుకే ఆ లింగం మహిమాన్వితమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. అక్కడ ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య నుండి మూడు రోజుల పాటు జాతర చాలా గొప్పగా జరుగుతుంది. ఈ జాతర సమయంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కుండా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయాన్ని దర్శించాలంటే అడవి మార్గం గుండా కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి.

కొన్ని అల్లమ ప్రభు వచనాలు (తెలుగు అనువాదంలో)

[మార్చు]

"గుహేశ్వర" అంకితంలో వచనాలు, స్వరవచనాలు, సృష్టి వచనాలు, మంత్ర గోప్యంలను రచించాడు. ఇప్పటికి 1645 వచనాలు దొరికాయి. అధ్యాత్మికతన అనుభావం వాటి మూలధనం. అలాంటి వెన్నింటినో వెడగుమార్మిక శైలిలో వ్యక్తపరచడం విశేషం.

కల్యాణమను ప్రమిదలోన భక్తి రసమను నూనెను పొసి ఆచారమనె ఒత్తితో బసవన్న అను జ్యోతి తాకించగా పూని వెలుగు చుండెనయ్యా శివుని ప్రకాశం ఆ వెలుగులో ఒప్పియుండిరయ్యా అసంఖ్యాత భక్త గణములు శివభక్తులున్న క్షేత్రమే అవిముక్త క్షేత్రమనెది అబద్ధమా? గుహేశ్వర లింగమందు నా పరమారాధ్యుని సంగని బసవన్నను గని బ్రతికితిని కనుమా సిద్ధరామయ్యా.


కుమ్మరి పురుగులా ఒంటికి మన్నంటకుండ వున్నావుగా బసవన్నా నిటిలోని తామర (పువ్వు)లా తడిసి తడియనట్లు వున్నావుగా బసవన్నా జలంలోని తామరలా అంటి అంటనట్లు వున్నావుగదా బసవన్నా గుహేశ్వరలింగం అనతి మీద దేహాభిమాన మత్తులైన ఐశ్వర్యాంధ కుల మతము నేమి చేయ వస్తివయ్యా సంగన బసవన్నా


ఆజ్ఞానమనే ఉయ్యాలలో జ్ఞానమనె శిశువును పడుకోబెట్టి సకల వేదశాస్త్రములనే తాళ్లు కట్టి పట్టి ఊపుతూ జోల పాడుతోంది భ్రాంతి అనే తల్లి. ఊయల విరిగి తాళ్లు తెగి జోల పాట నిలువక పోతే గుహేశ్వరుడనే లింగం కానలేము


అమృతసాగరంలోనే వుండి ఆవును గురించిన చింత ఎందుకు? మేరువు మధ్యదాగి బంగరు పోడిని కడిగే చింత ఎందుకు? గురునితో చేరి తత్వవిద్యల చింత ఎందుకు? ప్రసాదంలో వుండి ముక్తిని గురించి చింత ఎందుకు? కరస్థలాన లింగమున్న తరువాత ఇంక వేరే చింతలెందుకు చెప్పరా గుహేశ్వరా?


తనువు బత్తలగా నుంటేనేమి శుచి కాకున్నంత వరకు తల బొడైతేనేమి భావము బయలుకానంత వరకు భస్మము పూసితే నేమి? కరణాదుల గుణాల నొత్తి త్రొక్కి కాల్చనంత వరకు ఇట్లాంటి ఆశల వేషపు భాషకు గుహేశ్వరా నీవు సాక్షిగా ఛీకొడతాను.


తల్లిదండ్రులు లేని కన్నా నీకు నీవే పుట్టి పెరిగితివి కదా నీ పరిణామమే నీకు ప్రాణతృప్తిగా ఉంది కదా! భేదకులకు అభేద్యుడనై నిన్ను నీవే వెలుగుచున్నావు కదా! నీ చరిత్ర నీకు సహజము గుహేశ్వరా


బంగారు మాయ అంటారు - బంగారు మాయకాదు అంగన మాయ అంటారు - అంగన మాయకాదు కనుముంగిట మట్టిమాయ అంటారు - మట్టిమాయ కాదు మనసు ముంగిట ఆశే మాయ కనమా గుహేశ్వరా.


రెండు కళ్లకు ఒకే చూపైనట్లు దంపతులేక భావంతో నిలిచినపుడు గుహేశ్వర లింగానికి నివేదనమైనది సంగన బసవన్న


దేహంలో దేవాలయముండి మరినేరే దేవళ మేలయ్యా రెండింటిని చెప్పరాదయ్యా గుహేశ్వరా నీవు రాయివైతే నేనేమౌతాను?


మానులోని ఆకులూ పళ్లు క్రమానుగుణంగా కనుపించినట్లుగా హరునిలోపలి ప్రకృతి స్వభావాలు హరుని భావేచ్ఛతో కానుపించు కొంటాయి లీల యైతేను ఉమాపతి లీల మానితే స్వయంభువు గుహేశ్వరా


మర్త్యలోకములోని మానవులు దేవళమందొక దేవుని చేయ నేనబ్బుర పడితిని నిత్యానికి నిత్యంగా అర్చన పూజనలు చేయించి వైభోగము నెరపే వారిని చూచి నేనబ్బుర పడితిని గుహేశ్వరా మీ శరణులు, గతమున లింగమునుంచి పోయారు


మాటన్నది జ్యోతిర్లింగం స్వరమనేది పరతత్వం తాళవాద్య సంపుటమన్నది నాదబిందు కళాతీతం గుహేశ్వరుని శరణులు మాట్లాడి మైలచెందరు వినరా ఉన్మాదీ.


స్నానించి దేవుని పూజింతుననే సందేహి మానవా వినరోరీ స్నానించదా చేప? స్నానించదా మొసలి? తాను స్నానించి తనమనసు శుచికానంత వరకు ఈ మాయల మాటలు మెచ్చునా మా గుహేశ్వరుడు.


మబ్బుల మాటున మెరపులా బయలు మాటున ఎండమావిలా శబ్దము మాటున నిశ్యబ్దములా కన్నుల మాటున వెలుగులా గుహేశ్వరా మీ తీరు.


వేదాలనేవి బ్రహ్మాయ్య బూటకం శాస్త్రములనేవి సరస్వతమ్మ పితలాటకం ఆగమాలనేవి ఋషుల ఉన్మాదం పరాణాలనేవి పూర్వుల నాటకం ఈలాగున వీటిని తెలిసిన వారిని వీధికిలాగి నిజంగా నిందించేవాడే గుహేశ్వరునిలో అచ్చంగా లింగైక్యుడు.


వేదం ప్రమాణం కాదు శాస్త్రమూ ప్రమాణం కాదు శబ్దం ప్రమాణం కాదు చూడండహో లింగానికి అంగసంగం నడుమ నుండి, దాచుకొని వాడకొన్నాడు గుహేశ్వరా మీ శరణుడు


వేదమనేది చదువుల మాట శాస్త్రమనేది సంతల సుద్దులు పురాణములనేది దోంగల గోష్ఠి తర్కమనేది టగరుల పోరు భక్తి అనేది, కోరి, అనుభవించే లాభం గుహేశ్వరడు అందని ఘనము.


వేదాలు అందుకోవడం తెలియక చెడ్డాయి శాస్త్రాలు సాధించుటెరుగక చెడ్డాయి పురాణాలు పూరించుట తెలియక చెడ్డాయి పెద్దలు తమ్ముతా మెరుగక చెడ్డారు తమ బుద్ధి, తమనే తిన్నది మిమ్మేక్కడ తెలిసేరురా గుహేశ్వరా.


సతిని గాంచి వ్రతియైనాడు బసవన్న వ్రతియై బ్రహ్మచారియైనాడు బసవన్న బ్రహ్మచారియై భవరహితుడైనాడు బసవన్న గుహేశ్వరా మిలో బాలబ్రహ్మచారియైనది బసవన్న ఒక్కడే.


చుట్టి చుట్టి వస్తే లేదు లక్ఞగంగల్లో మునిగిన లేదు కొట్టకొనల మేరుగిరినెక్కి కెకలిడిన లేదు నిత్య నేమముతో తనువు తాకినా లేదు నిత్యానికి నిత్యం తలచే మనసును ఆనాటి కానాటికి అట్టిట్టు తిరిగే మనసును చిత్తంలో నిలుపగల్గితే నిర్మలమైన వెలుగు గుహేశ్వరలింగము


పాల నేమము పట్టినవాడు పిల్లియై పుడతాడు శనగల నేమము పట్టినవాడు గుర్రమై పుడతాడు ఆర్ఘ్యపు నేమము పట్టినవాడు కప్పయై పుడతాడు పూల నేమము పట్టినవాడు తుమ్మెదై పుడతాడు ఇది షడు స్థలమునకు వెలుపలనే సుమా నిజభక్తి లేనివారిని చూసియు మెచ్చడు గుహేశ్వరుడు


మూలాలు

[మార్చు]
  1. Subramanian 2005, p. 16.
  2. Roshen Dalal, Hinduism: An Alphabetical Guide, Penguin, ISBN 978-0143423171, page 159

బయటి లింకులు

[మార్చు]