అలీ ఆదిల్షా
అలీ ఆదిల్షా, బీజాపూరు సుల్తాను. 1558 నుండి 1580 వరకు పరిపాలించాడు.
అలీ ఆదిల్షా తన పట్టాభిషేకము రోజే సున్నీ పద్ధతులను వదిలి షియా కుత్బాను, ఇతర ఆచారాలను తిరిగి ప్రవేశపెట్టాడు. పర్షియన్ సున్నీ మతగురువులకు షియా మతాన్ని ప్రచారము చేయటానికి పూర్తి మతస్వాతంత్ర్యము ఇచ్చి ప్రచారకలాపాలకు కావలసిన డబ్బును సమకూర్చాడు. కొత్త సుల్తాను దక్కనీలను దూరంచేసి అఫకీలను పునరుద్ధరించాడు. ఈయన తండ్రి అమలుచేసిన అన్ని మతసంబంధ ప్రయోగాలనూ పక్కనపెట్టాడు.
అలీ పాలనలో బీజాపూరు, విజయనగరం అత్యంత సన్నిహితంగా మెలగినాయి. అలీ విజయనగరాన్ని సందర్శించినప్పుడు రామరాయలు సగౌరవంగా ఆహ్వానించి ఆదరించాడు. అలీ యొక్క పాలనలో దక్కన్ ముస్లిం రాజ్యాలను ఏకం చేసి సమైక్య కూటమి ఏర్పరచగలగటం ఈయన యొక్క అత్యున్నత విజయం. సుల్తానుల మధ్య సంధిలో భాగముగా అలీ ఆదిల్షా 1562లో అహ్మద్‌నగర్ సుల్తాను హుస్సేన్ నిజాంషా కూతురు చాంద్ బీబీని వివాహము చేసుకున్నాడు.
అలీ ఆదిల్షా ఇతర దక్కన్ ప్రాంతపు ముస్లిం రాజులతో కలసి తళ్ళికోట యుద్ధములో విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైనాడు. ఈ యుద్ధము యొక్క పర్యవసానంగా బీజాపూరు రాజ్యపు సరిహద్దులు దక్షిణాన విజయనగరం పట్టణం వరకు విస్తరించి మరింత దక్షిణానికి విస్తరించే అవకాశాన్ని కలిగింది. విజయనగరం నుండి దోచుకొన్న సంపదతో అనేక కట్టడాలు నిర్మింపచేసాడు. ఈయన బీజాపూరులో గగన్ మహల్, అలీ రౌజా (తన సొంత సమాధి), చాంద్ బావుడీ (పెద్ద బావి), జామీ మసీదు కట్టించాడు.
అలీ ఆదిల్షా గోవాలోని సఫా షహౌరి మసీదును 1560లో పోంద ప్రాంతములో కట్టించాడు. అలీ అదిల్షా మరణించే సమయానికి బీజాపూరు రాజ్యాన్ని పశ్చిమ తీరంలో హొన్నవర్ రేవు వరకు, దక్షిణాన వరద, తుంగభద్రా నదుల వరకు విస్తరించాడు. అలీ పాలనలో బీజాపూరు మొఘల్ చక్రవర్తి అక్బరుతో దౌత్యసంబంధాలు ఏర్పరచుకొని పరస్పరము రాయబారులను నియమించుకున్నారు.
అలీ ఆదిల్షాకు సంతానము లేక పోవడము వలన 1579లో తన తమ్ముడు తహమసిఫ్ యొక్క కొడుకును వారసునిగా ప్రకటించాడు. ఆ తరువాత సంవత్సరం 1580లో అలీ ఆదిల్షా హత్యచేయబడ్డాడు. అలీని బీజాపూరులో సకఫ్ రోజా దగ్గర అలీ కా రోజాలో సమాధి చేశారు. మరణించే సమయానికి అలీ ఆదిల్షాకు సంతానము లేక పోవడము వలన తన తమ్ముని కొడుకైన పదేళ్ల బాలుడు రెండవ ఇబ్రహీం ఆదిల్షా పట్టాభిషిక్తుడైనాడు. ఆ కాలములో అలీ ఆదిల్షా భార్య చాంద్ బీబీ రాజ్యవ్యవహారాలు చూసుకొన్నది.