అడ్డాల అరవలరాజు

అడ్డాల అరవలరాజు, ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. పశ్చిమగోదావరి జిల్లా, పూర్వపు కొవ్వూరు తాలూకా ధర్మవరం గ్రామానికి చెందిన అరవలరాజు జిల్లాలో జాతీయోద్యమాన్ని పెంపొందించిన నాయకుల్లో ఒకరు. 1920ల్లో గాంధీ ఇచ్చిన సహాయనిరాకరణోద్యమ పిలుపుతో ఉద్యమంలోకి అడుగుపెట్టారు. రెబ్బాప్రగడ మందేశ్వరశర్మ, శనివారపు సుబ్బారావు వంటి స్నేహితులతో స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.[1] గాంధీ పిలుపుననుసరించి కొవ్వూరు తాలూకాలో జాతీయోద్యమంలోని సహాయనిరాకరణ, ఉప్పుసత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలను దగ్గరుండి నడిపించారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో అరవలరాజు చినవెంకటరాజు, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించాడు.8వ తరగతి వరకు చదువుకున్న అతను వారసత్వ భూముల్లో వ్యవసాయం చేసుకునేవారు. అరవలరాజు గ్రామ పెద్దగా కూడా వ్యవహరించాడు.
జాతీయోద్యమం
[మార్చు]1920లో మహాత్మాగాంధీ సహాయనిరాకరణ ఉద్యమ పిలుపుతో అతను తన స్నేహితులు మందేశ్వరశర్మ, సుబ్బారావులతో కలసి జాతీయోద్యమంలోకి ప్రవేశించాడు గాంధీజి త్రివిధ బహిష్కరణోద్యమాన్ని తాలూకాలో ప్రచారం చేశారాయన. తాళ్ళపూడి, ప్రక్కిలంక మలకపల్లి, ధర్మవరం, చాగల్లు గ్రామాల్లో మద్యపాన నిషేధానికి విశేష కృషి చేశాడు. విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో భాగంగా ఎన్నోసార్లు నిడదవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో విదేశీ వస్త్రాల కుప్పలను తగులబెట్టారు. వందలకొద్దీ తాటిచెట్లను నరికించి, కల్లు గీయనివ్వకుండా వినూత్న రీతిలో మద్యపాన నిషేధ ఉద్యమాన్ని నడిపారు అరవలరాజు.[1]