పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి (నవంబరు 5, 1877 - జనవరి 7, 1950 ) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు.

జీవిత సంగ్రహం

[మార్చు]

వీరు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకాలోని చోడవరం గ్రామంలో నవంబరు 5, 1877 (బహుధాన్య కార్తీక బహుళ షష్ఠి) తేదీన జన్మించారు.

తండ్రి వద్ద ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం. శొంఠి భద్రాద్రి రామశాస్త్రి వద్ద కావ్య నాటకాలంకారాలను చదివి సంస్కృతంలో పాండిత్యాన్ని సంపాదించారు. పిదప ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి, తర్వాత కాకినాడలోని పిఠాపురం మహారాజావారి కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా నియమితులయ్యారు. పిఠాపురం మహారాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిని ప్రాచీనాంధ్ర గ్రంథ సంపాదనకై నియమించారు. ఆ పనిమీద మైసూరు, మద్రాసు, తంజావూరు వంటి ప్రాంతాలతో పాటుగా పలు తెలుగు ప్రాంతాల్లో తిరిగి విలువైన గ్రంథాలనెన్నిటినో సంపాదించారు. ఆ తర్వాత బందరు నేషనల్ కళాశాలలోను, రాజోలు బోర్డు హైస్కూలులోను కూడా ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. [1]

వీరు ప్రాచీన సంస్కృత వాజ్మయాన్ని ఒక నూతనరీతిలో పరిశోధన చేసి మంచి విమర్శకులుగా పేరుపొందారు. వీరి కృషి ఫలితంగా మహాభారత చరిత్ర (1923) అనే విమర్శన గ్రంథం వెలువడింది. ఆ గ్రంథాన్ని సమర్ధిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ కొందరు వాదప్రతివాదాలకు దిగారు. చివరకు కేసు కోర్టులకు ఎక్కింది.

మరణం

[మార్చు]

వీరు జనవరి 7 1950 తేదీన పిఠాపురంలో పరమపదించారు.

రచనలు

[మార్చు]
  • వేదకాలపు వ్యవసాయ చరిత్ర
  • పరీక్షిత్తు[2] (1932) మహాభారతంలో పాండవుల వారసుడైన పరీక్షిత్తు జీవితం గురించి ఈ కథలో అధ్యాయాలుగా వివరించారు. పరీక్షిత్తు జననానికి పూర్వరంగం, పరీక్షిత్తు జననం, ధర్మరాజు అశ్వమేధ యాగం, ఆపైన సంఘటనలు, పరీక్షిత్తు బాల్యం, మహాభారత యుద్ధం, పాండవుల పాలన, వారి మహాప్రస్థానం, పరీక్షిత్తు పాలన మొదలైన విషయాలు అధ్యాయాలుగా ఉన్నాయి. మహాభారతంలో పాండవుల వారసునిగా, భాగవతంలో భాగవత శ్రోతగా పరీక్షిత్తు ప్రవర్తిల్లుతాడు. ఇలాంటి పాత్ర జీవితక్రమాన్ని ఈ పుస్తకంలో వ్రాయడం విశేషం.
  • మాంసభుక్తి
  • రామోపాఖ్యానము-తద్విమర్శనము[3] (1938) ఎర్రాప్రగడ రచించిన రామాయణం రామోపాఖ్యానం. ఆయన రాసిన తొలినాళ్ళ కావ్యంగా దానికి పండితోలోకంలో ప్రత్యేకాసక్తి కలిగివుంది. ఆ కావ్యాన్నీ దానిపై తాను రచించిన విమర్శనూ ప్రచురించారు పెండ్యాల వారు.
  • నవకథా మంజరి (1942)[4] ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రలోని కొన్ని ఆసక్తికరమైన, విచిత్రమైన ఘట్టాలను స్వీకరించి కథలుగా మలిచారు రచయిత. పెండ్యాల వారు పురాణాలను, ఇతిహాసాలను చరిత్రతో ముడివేసి తార్కికంగా చర్చించడంలో దిట్ట. ఆంధ్రూలలో స్వాభిమానం పెరిగేందుకు ఈ గ్రంథం రచించినట్టు ముందుమాటలో చెప్పుకున్నారు. ఇందులో ఆంధ్రుల దాయాదుడు, త్రిలింగదేశపు మహారాణి, ఆంధ్రపిత, వరరుచి, కుమారిల భట్టాచార్యుడు, తెలుగునాటి తురుష్కయోగి, ఆంధ్రగాయకుడు, ప్రాచీనాంధ్ర వర్తకుడు, శ్రీశైల మల్లికార్జునుడు కథలున్నాయి.
  • ఉత్తర భారతము
  • చిత్రరత్న పేటి
  • సూక్తి సుధాలహరి[5] (1941) బ్రిటీష్ విద్యావిధానం భారతదేశంలో ప్రవేశించిన కొద్దీ తెలుగు విద్యాబోధనలో ఎన్నో మార్పులు వచ్చాయి. అటువంటి వాటిలో సూక్తుల బోధన ఒకటీ. అనేకమైన సాహిత్య గ్రంథాలు, నీతికథల నుంచి మంచి మాటలు సేకరించి ప్రచురించి వాటిని బాలురచే చదివించడం మొదలైన కొద్దీ అటువంటి ఎన్నో గ్రంథాలు ప్రచురితమయ్యాయి.
  • మహాభారత చరిత్రము (విశాలాంద్ర ప్రచురణ, తృతీయ ముద్రణ, 2018.)మహాభారతాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించి ఈ గ్రంథం రచించారు. ఇందులో ఆయన ప్రతిపాదించిన విషయాలు. శ్రీకృష్ణుడు రాముని వంటి శుద్ధ చరితుడు కాడు. 2.కురువంశ నాశనానికి

కుంతీ ద్రౌపదులే మూల కారణం, 3.28 మంది వ్యాసులలో కృష్ణడ్వయిపేయనులు ఒకరు మాత్రమే.4. కృష్ణుడు, ధర్మరాజుల ప్రవర్తన ఆనాటి ధర్మాలను బట్టి తప్పులుకావు. కుమారీలభట్టు ప్రకారం ద్రౌపది బహు భర్తలను అంగీకరించినా, వాస్తవంలో ఆమె అర్జునుడి భార్య మాత్రమే. పాండవులు అనార్యులు, టిబెట్ దేశవాసలు. ఇతర ఆర్యక్షత్రియులు పాండవులను ద్వేషించారు. పాండవులకు తీవ్రమయిన విరోధం బ్రాహ్మణులతో వుంది. యుధిష్టిరుడు కృష్ణుడికన్నా మెరుగయిన నాయకుడు. సంజయుడు ధర్మరాజును మేకతోలు కప్పుకొన్న సింహం అని అభివర్ణించాడు. నిండు రాజసభలో స్వయంవరంలో కర్ణుడు శూద్రుడు కనక అతణ్ణి తాను వరించనని ద్రౌపది అన్నది. ద్రోణుడు పాండవ పక్షపాతే కానీ పాండవ పక్షానికి అపకారం చేయడు. వేణీసంహార నాటకంలో అతని స్వభావం చిత్రించబడింది. పాండవ, కౌరవుల పేర్లు వేదసాహిత్యంలో కనిపించవు. మహాభారత వ్యాఖ్యాతలలో నీలకంఠాచార్యులు ప్రముఖులు. క్రీస్తు పూర్వం 17-18 శతాబ్దులలో మహాభారత యుద్ధం జరిగివుంటుంది. జయం, జైమినీభారతం, మహాభారతం మూడూ ఉన్నవని, వ్యాసుడు,వేశంపాయునుడు, 'సౌతి' రచనలు మాత్రమే కాక, మరికొందరి రచనలు కూడా మహాభారతంలో చేరాయి. విమర్శనాృదృష్టితో పరిశీలిస్తే, ద్రోణపర్వంలోనే మహా యుద్ధాలు జరిగినట్లు అనిపిస్తుంది. ఆర్యులు, మిశ్రజాతీయులు స్వజాతి ఔన్నత్యం కోసం చేసిన పోరాటమే మహాభారతం కథ. చిన్న పిల్లలకుసోకే వ్యాధులను, రకరకాల పీడలను పూతన, శకటాసురుడు వంటి రాక్షసులుగా, ఈ కథల్లో దయ్యాలుగా భావించబడినవి. ఉలూపి వితంతువయినా అర్జునుణ్ణి వరించింది. అసలు ద్రౌపదీ వస్త్రాపహరణమే జరగలేదని భావించాలి. మహాభారతంలో నాలుగు మిశ్ర జాతులను గుర్తించవచ్చు. ఆనాడు జూదం, మద్యపానం, వ్యభిచారం దోషాలుగా పరిగణించబడలేదు. అంధునికి, బ్రహ్మచారికి యాగార్హత లేదని శాస్త్రం, ధృతరాషట్రుడు, భీముడు యాగం చేసినట్లు మహాభారతం. యాగ సమయంలో యాగం చేసేవారి భార్యలు ఋత్విక్కులకు భార్యలు కావలసిఉంది. ఈ విషయం బోధపడక కొందరు సమర్ధన చేస్తున్నారు. పాండవులకు అర్థరాజ్యం పంచిపెట్టడానికి భీశముడే కారకుడు. మహాభారతంలో మ్లేచ్చుల భాష అని పేర్కొనబడిన భాష భారతీయ భాష. ఆనాడు అది టిబెట్.లో వాడుకలో ఉన్న భాష. వారణావతమునకు వెళ్ళే సమయంలో ధర్మరాజు విదురునితో ఆభాషలోనే మాట్లాడాడు. మాహాభారత యుద్ధసమయంలో షుమారు 70 లక్షలమంది మరణించారు. కయివర్తులు, చండాలజాతివారు. వ్యాసుడు ఆజాతివారే. వాల్మీకి వలె వ్యాసుడు ధర్మప్రతిపాదక స్వభావంకల ఋషి కాదు. వ్యాసుడు బలరామముణ్ణి దశవతారాల్లో పేర్కొని కర్ణుణ్ణి చెప్పకపోవడం విచిత్రంగా ఉంది. భగవద్గీతలో రాజకీయ విషయాలు చొప్పించినట్లు సుబ్రహ్మణ్యశాస్త్రి భావించారు. శిశుపాలవధ జరాసంధవధ లాగే కపటంతో చేయబడిందని ఈయన భావించారు. విశ్వరూప ప్రదర్శన ఒక గారడీ విద్య వంటిదని అంటాడు. కర్ణుడి కుమారులు సాంబుడు, పాండవుల పక్షంలోకి రాలేదు. యుద్ధానంతరం కుమారుల అపరకర్మలకు ధృతరాశత్రుడు ధనం కోరగా ఇవ్వనీకుండా భీముడు అడ్డుపడ్డాడు. ధర్మరాజు, అర్జునుడు స్వీయధనాన్నిచ్చి ఆ కార్యం పూర్తి చేయించారు. ఉపపాండవుల నిర్మూలన అయితేనే తప్ప పాండవులు కృష్ణుని పక్షంలో ఉండరు. ద్రవుపది సుతులలో ఒకడయిన, భీముడి సంతతి గాని మిగిలితే, భీముుడు పాంచాలులతో చేరి శ్రీకృష్ణుడి పలుకుబడి తగ్గిస్తాడు. యుద్ధం తరువాత శ్రీకృష్ణుడు 36 సమవత్సరాలు జీవించినట్లు మహాభారతంలో ఉంది. కృష్ణుడు ఆర్జునునికంటే కొన్ని మాసాలు మాత్రమే పెద్ద. కృష్ణనిర్యాణ సమయంలో ఆయనకు 104 సంవత్సరాలని శాస్త్రి గారు అంటారు. దృపుపది విద్యావతి, తన ప్రశ్నలతో సభాసదులను నిరుత్తరులను చేసింది. తనమీద అణుమాత్ర మయినా మాట పడనీయని మానవతి. ఖాండవవన దహనంలో ఇంద్రప్రస్థ రాజ్యవిస్తృతి ఉంది. ఆ సందర్భంలో నాగులతో శతృత్వం కలిగింది. మయుడు అనార్య శిల్పి. వికృత రూపులులగు 8000 వేలమంది సభానిర్మాణానికి తోడ్పడినట్లు భారతం. అసుర .. .. ఆహుర .. పారశీక దేవతలు. హిడింబి, ఉలూచి, చిత్రాంగద ఆర్యేతరులు, పాండవుల భార్యలయినారు. మేనమామ కుమార్తెను పరిణయమాడడం ఆర్యావర్త స్మృతికి విరుద్ధం. సుభద్రను అర్జునుడు, విజయను సహదేవుడు చేసుకున్నారు. శిశుపాలుడు పాండవులకు పినతల్లి కుమారుడు, శిశుపాలుని కూతురు రేణుమతిని నకులుడు చేసుకుంటాడు. రాజసూయ యాగవిభవం క్షత్రియులలో పాండవులంటే అసూయ కలిగించింది. మయసభలో దుర్యోధనుని దృపదపుత్రి హేళనకు ప్రతీకారంగానే ఆమెను కౌరవులు సభలొకి ఈడ్చుకొని వచ్చారు.ఘోషయాత్ర ఒక నెపం,కల్పితం. గాంధారి కొడుకులలో నలుగురు ఔరసులు, మిగతావారు స్వయందత్తాదులు,అన్యజాతులవారు కావచ్చు. మహావీరుని దుశ్శాసునుణ్ణి దుర్మార్గుడుగా చూషించబడ్డాడు.అతను అభిమన్యుణ్ణి చంపుతాడు. మహావీరుడు కర్ణుడు దుర్మార్గుడుగా చిత్రించబడ్డాడు. అతనికి దవుపడి మీద కాంక్షలేదు. ఆరవ భర్తగా ఒప్పిస్తానని కృశనుడు రహస్యంగా అంటే నాకు సూతకన్యలు భార్యాలున్నారు, వారిమీద నా ప్రేమ చాలు అని సమాధానం చెప్తాడు. సోమశేఖరశర్మ గారికి సాన్నిహితంగా ఉండడం, వారిద్వారా జయస్వాల్, ఫ్లీట్ అభిపారాయాల ప్రభావం వల్ల సుబ్రహ్మణ్యశాస్త్రి చేసిన సంప్రదాయేతర విమర్శను సహించలేని సమకాలికులు దూషణలకు దిగారు.

మూలాలు

[మార్చు]
  1. పెండ్యాల, వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి (1928). పరమయోగి విలాసము గ్రంథ పీఠిక (1 ed.). పిఠాపురం: రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు. p. i. Retrieved 22 March 2015.
  2. భారత డిజిటల్ లైబ్రరీలో పరీక్షిత్తు పుస్తకం.
  3. భారత డిజిటల్ లైబ్రరీలో రామోపాఖ్యానము-తద్విమత్శనము పుస్తకం.
  4. భారత డిజిటల్ లైబ్రరీలో నవకథామంజరి పుస్తకం.
  5. భారత డిజిటల్ లైబ్రరీలో సూక్తిసుధాలహరి, రెండవ భాగము పుస్తకం.
  • వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, పెండ్యాల, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీలు: 774-5.