Jump to content

మోత్కూర్ (యాదాద్రి భువనగిరి)

అక్షాంశ రేఖాంశాలు: 17°27′21″N 79°15′38″E / 17.455840°N 79.260650°E / 17.455840; 79.260650
వికీపీడియా నుండి
(Mothkur నుండి దారిమార్పు చెందింది)
మోత్కూరు
—  రెవిన్యూ గ్రామం  —
గ్రామపంచాయతి కార్యాలయం
గ్రామపంచాయతి కార్యాలయం
గ్రామపంచాయతి కార్యాలయం
మోత్కూరు is located in తెలంగాణ
మోత్కూరు
మోత్కూరు
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°27′21″N 79°15′38″E / 17.455840°N 79.260650°E / 17.455840; 79.260650
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి
మండలం మోత్కూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 12,616
 - పురుషుల సంఖ్య 6,397
 - స్త్రీల సంఖ్య 6,219
 - గృహాల సంఖ్య 3,202
పిన్ కోడ్ - 508277
ఎస్.టి.డి కోడ్ - 08694

మోత్కూరు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, మోతుకూరు మండలానికి చెందిన గ్రామం.[1]

ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 45 కి. మీ. దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 102 కి. మీ దూరంలో ఉంది. ఈ గ్రామం తుంగతుర్తి నియోజకవర్గం పరిధి క్రిందకు వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా మారింది.[2] ఈ మండలంలో చిన్నపడిశాల చిన్న గ్రామం, మోత్కూరు అతిపెద్ద గ్రామం. మోత్కూరు, ఆత్మకూర్, గుండాల మూడు మండలాలకు కలిపి ఇది ఒక ప్రాంతీయ వర్తకకేంద్రంగా ఉంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

గణాంక వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3202 ఇళ్లతో, 12616 జనాభాతో 3418 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6397, ఆడవారి సంఖ్య 6219. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1997 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 85. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576679.[4] పిన్ కోడ్: 508277.

పేరు చరిత్ర

[మార్చు]

పూర్వం ఈ ప్రాంతంలో మోదుగ చెట్లు అధికంగా ఉండడం వల్ల దీనిని మోదుగుల ఊరు అని పిలిచేవారు. అది కాలక్రమేణా మొదుగూరు, మొతుకూరుగా పిలువబడి చివరకు మోత్కూరుగా మారింది.

భౌగోళిక స్థితి

[మార్చు]

మోత్కూర్ 17°27′00″N 79°16′00″E / 17.4500°N 79.2667°E / 17.4500; 79.2667 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[5] ఇది సముద్ర మట్టానికి 322 m ఎత్తులో (ఎత్తు) ఉంది. తెలుగు ఇక్కడి స్థానిక భాష కాగా, కొంతమంది ప్రజలు ఉర్దూ కూడా మాట్లాడుతారు.

మోత్కూరు పట్టణంలోని ప్రాంతాలు

[మార్చు]

మోత్కూరు పట్టణంమూడు భాగాలుగా ఉంటుంది. అవి

  • పాత బస్టాండ్
  • కొత్త బస్టాండ్
  • పోతాయిగడ్డ

అంతేకాక చుట్టుపక్కల కొద్దిదూరంలో ఆరెగూడెం, రాజన్న గూడెం, ధర్మాపురం, జామచెట్లబావి, కొండాపురం మొదలైనవి మోత్కూరులో అంతర్భాగంగా ఉన్నాయి. ఇవేకాకుండా, గాంధీనగర్, గడి బజార్, అంగడి బజార్, అంబేద్కర్ నగర్, సాయిబాబా కాలనీ,ఇందిరా నగర్, డాగ్ బంగ్లా, ఎమ్మార్వో ఆఫీస్ ఏరియా, పద్మశాలీకాలనీ, డ్రైవర్స్ కాలనీ, టీచర్స్ కాలనీ, లూర్థు నగర్, వెంకటేశ్వర కాలనీ, సుందరయ్య కాలనీ, కాసవాడ వంటి అనేక నివాస కాలనీలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

పాఠశాలలు

[మార్చు]

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలలు (మహాత్మా గాంధీ నగర్, పద్మశాలీ కాలనీ, ధర్మపురం, ఇందిరా నగర్, ఆరెగూడెం, రాజన్నగూడెం, జామచెట్లబావి), హరి విద్యాలయం, సెక్రెడ్ హార్ట్స్ ఉన్నత పాఠశాల, వివేకానంద విద్యా మందిర్, శ్రీ శివ శివాని కాన్సెప్ట్ పాఠశాల, ప్రగతి విద్యాలయం, అక్షర కాన్సెప్ట్ స్కూల్, శ్రీ విద్యా నికేతన్, సెయింట్ ఆన్స్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, సాయి చైతన్య స్కూల్, విశ్వ భారతి స్కూల్, మదర్సా జామియా వంటి ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.

కళాశాలలు

[మార్చు]

ఇక్కడ ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెండు ప్రైవేటు జూనియర్ కళాశాలలు (శాంతినికేతన్, ఎస్.వి), రెండు డిగ్రీ కళాశాలలు (శ్రీ సంతోషి, సాయిరాం) ఉన్నాయి. గ్రామంలో మూడు ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 10, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఏడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల భువనగిరిలో ఉంది. సమీప వైద్య కళాశాల నార్కట్ పల్లిలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు భువనగిరిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం భువనగిరిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నల్గొండ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

మోత్కూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్యశాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి.బి. వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో అంతేకాకుండా అన్ని రకాల సౌకర్యాలతో ప్రైవేట్ ఆసుపత్రులు 9 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు ఆరుగురు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. 11 మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా శుద్ధి చేసిన నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి సాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ కూడా ఉంది, సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. గ్రామంలోని కొని ప్రాంతాలలో చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

మోత్కూరులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె/సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.

రోడ్డు వసతి

[మార్చు]
వెంకటేశ్వర టాకీస్

హైద్రాబాద్ నుండి తొర్రుర్ వెళ్ళుటకు మోత్కూరు మార్గం దగ్గరిది. సుమారు 120 బస్సులు మోత్కూరు మీదుగా రాకపోకలు సాగిస్తూ, ప్రతిరోజూ 5000 నుండి 10000 మందిని గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి.

జనరల్ పోస్టాఫీస్ ఉంది. ప్రతి ఆదివారం మార్కెట్ (అంగడి) జరుగుతుంది. చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ఈ మార్కెట్ లో వ్యవసాయం, కూరగాయలు, బట్టలు, సాధారణ కిరాణా, జంతువుల అమ్మకాలు నిర్వహిస్తారు. మూడు మండలాల్లో అతిపెద్ద స్థానిక మార్కెట్ ఇది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ బస్సులు, ఇతర ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. జనగాం, భువనగిరి, నల్గొండ ప్రాంతాలలో రైల్వే స్టేషన్ల సౌకర్యం ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

బ్యాంకులు

[మార్చు]
మోత్కూరు స్టేట్ బ్యాంక్
  1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్
  2. గ్రామీణ వికాస్ బ్యాంకు
  3. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఈ ఊరిలో ఉన్న అనేక దుకాణాలు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు అవసరాన్ని తీరుస్తున్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 24 గంటల పాటు వ్యవసాయానికి, 24 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

మోత్కూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 279 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 70 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 687 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 60 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 90 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 76 హెక్టార్లు
  • బంజరు భూమి: 85 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 2066 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2002 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 225 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]
మోత్కూరు చెరువు

మోత్కూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 73 హెక్టార్లు
  • చెరువులు: 152 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

మోత్కూరులో తడి వరి ప్రధాన పంట, ఇతర పంటలు ఎండు మిరపకాయలు, పత్తి, ఆకుపచ్చ గ్రామ, కాస్టర్, ఇతర కూరగాయలు, పప్పుధాన్యాలు. ఇది ఒక చిన్న తరహా ఆహారం ప్రాసెసింగ్ పరిశ్రమ, ముఖ్యంగా వరి మిల్లులు, కూరగాయల నూనె మిల్లులు ఉన్నాయి. సహజ వస్తువుల మార్కెటింగ్ ప్రధాన ఆధారం. వరి మార్కెటింగ్ ప్రధాన వనరు.

ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, ప్రత్తి, కంది

చేతివృత్తులవారి ఉత్పత్తులు

[మార్చు]

బుట్టలు

విశేషాలు

[మార్చు]
  • మోత్కూరుకి ఆనుకొని బిక్కేరు (కృష్ణానదికి ఉపనది) ప్రవహిస్తుంది.
  • మోత్కూర్ లక్కాయ కట్టకు కమ్యూనిస్టులకు రజాకార్ యుద్ధం జరిగింది కమ్యూనిస్టు గెలిచారు రజాకార్లు వధించబడ్డారు
  • అధిక సంఖ్యలో హిందువులు ఉన్నప్పటికీ, ముస్లీంలు, క్రిస్టియన్లు కూడా ఉన్నారు. వీరంతా ఎలాంటి విద్వేషాలు లేకుండా కలసికట్టుగా ఉంటారు. మోత్కూరు కాకతీయుల కాలంలో మధ్యయుగ భారతదేశంగా పిలువబడిందని ప్రాచూర్యంలో ఉంది.
  • మోత్కూర్ గ్రంథాలయం రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రతి ఒక్కరికీ పుస్తకంతో, గ్రంథాలయంతో అనుబంధం ఉండాలనే ఉద్దేశంతో 2020, ఏప్రిల్ 14న అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని దళితవాడ నుంచి ‘ఇంటికో పుస్తకం-గ్రంథాలయ భాగస్వామ్యం’ అనే వినూత్న కార్యక్రమాన్ని రూపొందించి వేల పుస్తకాలు సేకరించి, గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతున్నారు.[6]

దేవాలయాలు

[మార్చు]
  1. శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం: ఈ ఊరిలో ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం చాలా పురాతనమైంది. ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించారని ప్రతీతి. ప్రతి సంవత్సరం అగ్నిగుండాలు కార్యక్రమం హిందూ పండుగ హోలీ తర్వాత నిర్వహిస్తారు.చాలా మంది సమీపంలోని గ్రామాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు.
  2. సాయిబాబా దేవాలయం: సాయినగర్ లో ఉంది.
  3. వెంకటేశ్వర దేవాలయం
  4. సీతారామాంజనేయ దేవాలయం
  5. పెద్దమ్మ దేవాలయం: కొత్త బస్టాండ్ సమీపంలో ఉంది.
శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం

గ్రామంలోని ఇతర ప్రాంతాల్లో గ్రామదేవతలు చాలామంది అక్కడక్కడ వెలిసారు. వీరందరికి చిన్నచిన్న గుళ్ళు నిర్మించి గ్రామస్థులు పూజలు నిర్వహిస్తుంటారు.

పండుగలు

[మార్చు]

బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవాలు

[మార్చు]

2014 ఫిబ్రవరి 17 నుండి 21 వరకు బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాలు జరిగాయి. దీనికోసం స్థానిక చెరువు కట్ట వద్ద సుమారు రూ. 12 లక్షల వ్యయంతో నూతనంగా ముత్యాలమ్మ గుడిని నిర్మించారు. అంతేకాకుండా శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో రూ. 50వేలతో భద్రకాళి విగ్రహాన్ని, గ్రామ పంచాయతీ కార్యలయం సమీపంలో రూ. 2 లక్షల వ్యయంతో గ్రానైట్ బండలతో బొడ్రాయి గద్దెను నిర్మించారు.

17న గణపతి పూజా, ఊరికి నాలుగు బాటలు కట్టుకట్టే కార్యక్రమం... 18న ఆవుపేడతో అలికి శుద్ధిచేసి దీపం పెట్టే కార్యక్రమం క్షీరాధివాసనము, హోమమలు... 19న నవధాన్యాలు కలిపే కార్యక్రమం ధాన్యాధివాసము, పుష్పాధివాసము, పాలాధివాసము, శయ్యాధివాసము... 20న విగ్రహాల ప్రతిష్ఠ అనంతరం బలిజల్లే కార్యక్రమం, పూర్ణాహుతి, మహానివేదన, హరతి, ప్రసాద వితరణ, పండిత సత్కారము... 21న బోనాల ఉత్సవంతో దేవతలకు నైవేద్యం సమర్పించారు.

20వ తేదీన ధ్వజస్తంభం, దేవతామూర్తుల విగ్రహాలు, బొడ్రాయిని రామలింగేశ్వరస్వామి దేవస్థానం నుండి ట్రాక్టర్ పై ఉంచి పట్టణ కేంద్రంలోని వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అడపడుచులు బిందెలతో నీళ్లు తెచ్చి ధ్వజస్తంభం, దేవతామూర్తుల విగ్రహాలపై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

21వ తేదీన గ్రామంలోని మహిళలు నూతన వస్త్రాలు ధరించి వడిబియ్యం పోసుకొని బొడ్రాయి, ముత్యాలమ్మ ఆలయాల వద్ద బోనాలను సమర్పించి పూజలు నిర్వహించారు. బొడ్రాయి, ముత్యాలమ్మలకు బోనాలు సమర్పించడంతో ఉత్సవాలు ముగిసాయి.

ఉగాది

[మార్చు]

మోత్కూరు‌లో ఉగాది వేడుకలు విభిన్నంగా జరుగుతాయి. గ్రామస్థులకు వ్యాధులు రాకుండా ఉండాలంటే ఉగాది రోజు కోళ్లను బలి ఇచ్చే ఆచారం కొనసాగుతోంది. ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా సంవత్సరాదిని షడ్రుచులతో స్వాగతం పలుకుతుంటే, మోత్కూరులో రివర్స్‌. గత 100 ఏళ్లుగా నాన్ వెజ్‌తో స్వాగతం పలుకుతున్నారు గ్రామస్థులు. అటు తర్వాత రైతులు ఎడ్ల బండ్ల పోటీని నిర్వహించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇలా చేస్తే గ్రామానికి మంచి జరుగుతుందని స్థానికుల విశ్వాసం. గత 100 ఏళ్లుగా వెరైటీగానే సాగుతున్నాయి.[7] స్వాతంత్ర్యం రాక ముందు నుంచి మోత్కూరు గ్రామస్తులకు కలరా, మశూచి వ్యాధులు వచ్చాయి. అప్పట్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో చాలామంది చనిపోయారు. దీంతో గ్రామం నలువైపులా ముత్యాలమ్మ దేవతలను ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. అందులోభాగంగా గ్రామ దేవతకు బోనం సమర్పించి, ఉగాది రోజు కోళ్లను బలి ఇచ్చి మళ్లీ బోనం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.[8]

గ్రామంలోని మహిళలంతా డప్పు చప్పుళ్లతో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణంలోకి చేరుకుంటారు. అక్కణ్నుంచి గ్రామ దేవత వద్దకు చేరుకుంటారు. అటు గ్రామంలోని పురుషుల సంఖ్య తమ శక్తికి తగ్గట్లు వాహనాలను అందంగా అలంకరించి ఎడ్ల పోటీలు నిర్వహిస్తారు. మోత్కురు వాసులు ఎక్కడ స్థిరపడ్డా ఉగాది రోజు గ్రామానికి చేరుకుంటారు. ఇలా చేయడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని, ఎలాంటి వ్యాధుల బారిన గ్రామస్థులు పడరని స్థానికుల నమ్మకం.[9]

బోనాలు

[మార్చు]

శ్రావణమాసంలో గ్రామ దేవతలకు బోనాలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. గ్రామంలో మ హిళలు గ్రామ దేవతలకు బోనాలు వండి పసుపు, కుంకుమలతో బోనం కుండలను అలంకరించి, బోనం కుండలపై దీపాలు వెలిగించుకుని డప్పు చ ప్పుళ్లతో ప్రదర్శనగా తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో గ్రామదేవతలకు నైవేద్యం సమర్పిస్తారు. టెంకాయలు కొట్టి మొ క్కులు తీర్చుకుంటారు.

ఫంక్షన్ హాల్స్

[మార్చు]
సుమంగళి గార్డెన్స్
  1. జి.యం.ఆర్ ఫంక్షన్ హాల్
  2. సుమంగళి ఫంక్షన్ హాల్
  3. ఎల్.ఎన్ గార్డెన్స్
  4. వై. జె. గార్డెన్స్
  5. మధుర మీనాక్షి ఏసీ ఫంక్షన్ హాల్

సినిమా టాకీస్

[మార్చు]
ఎల్.ఎన్ గార్డెన్స్
  1. వెంకటేశ్వర టాకీస్
అంబేద్కర్ చౌరస్తా

పెట్రోల్ బంక్స్

[మార్చు]

3 (భువనగిరి రోడ్డులో ఒకటి, అమ్మనబోల్ రోడ్డులో రెండు) ఉన్నాయి.

విగ్రహాలు

[మార్చు]
  1. జ్యోతి రావు పూలే
  2. అంబేద్కర్
  3. మహాత్మా గాంధీ
  4. బాబు జగ్జీవన్ రామ్
  5. సర్ధార్ సర్వాయి పాపన్న
  6. కొండా లక్ష్మణ్ బాపూజీ

ముఖ్యమైన వ్యక్తులు

[మార్చు]

మోత్కూరు గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది.

  1. కీ.శే. కల్వల సదానందరావు: తెలంగాణ తొలిదశ పోరాట యోధుడు.
  2. కీ.శే. కల్వల ప్రభాకర్ రావు: పార్లమెంట్ రాజ్యసభ (1986-1992)
  3. కీ.శే. ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి: మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు.
  4. కీ.శే. మద్ది రంగారెడ్డి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, BCCI కి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసాడు.
  5. దిలీప్ కొణతం: రచయిత, సాంకేతిక నిపుణుడు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్.
  6. ఎస్.ఎన్. చారి: చిత్రకారుడు, రంగస్థల నటుడు, దర్శకుడు, పాత్రికేయుడు.
  7. అరవిందరాయుడు దేవినేని: కవి, రచయిత, ఉపాధ్యాయుడు.
  8. అభినయ శ్రీనివాస్: ఉద్యమ, సినీ గీత రచయిత, గాయకులు, రంగస్థల నటులు, దర్శకులు.
  9. ప్రణయ్‌రాజ్ వంగరి: నాటకరంగ పరిశోధకుడు, తెలుగు వికీపీడియా నిర్వాహకుడు.

సాహిత్య-సాంస్కృతిక-సేవా సంస్థలు

[మార్చు]
  • ప్రజాభారతి[10]

తెలంగాణ సాయుధ ఉద్యమం

[మార్చు]

మోత్కూరు ప్రాంతానికి చెందిన అనేకమంది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఆ కాలంలోనే ఈ గ్రామంలో పోలీసు స్టేషన్ కూడా ఉండేది. మోత్కూరు గడ్డం అమీను అనేక దౌర్జన్యాలు చేసేవాడు. సాయుధ దళాల పిలుపుతో ఇరవై గ్రామాల ప్రజలు మోత్కూరు పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టడంతో అమీను పారిపోయాడు.[11]

ఉత్సవాల చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 14 September 2018.
  3. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  5. Motkur at Fallingrain.com
  6. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (16 October 2021). "ఉండమ్మా పుస్తకమిస్తా!". Namasthe Telangana. Archived from the original on 17 October 2021. Retrieved 27 October 2021.
  7. "అక్కడ ఉగాదికి చుక్కా ముక్క పక్కా.. ఈ వెరైటీ ఆచారం ఎక్కడో కాదు.. తెలంగాణలోనే..!". Samayam Telugu. 2023-03-22. Archived from the original on 2023-06-03. Retrieved 2024-04-10.
  8. Bharat, E. T. V. (2021-04-13). "ఉగాది రోజు కోళ్లు, మేకలు తెగాల్సిందే...!". ETV Bharat News. Archived from the original on 2024-04-10. Retrieved 2024-04-10.
  9. Velugu, V6 (2024-04-10). "మోత్కూరులో నాన్ వెజ్ ఉగాది!". V6 Velugu. Archived from the original on 2024-04-10. Retrieved 2024-04-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  10. ఎస్.ఎన్., చారి (2024-07-29). "కళలకు హారతి.. ప్రజాభారతి". EENADU. Archived from the original on 2024-07-29. Retrieved 2024-07-29.
  11. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (17 September 2019). "విప్లవ ఝరి.. రద్దయిన ఉరి." www.andhrajyothy.com. Archived from the original on 21 September 2019. Retrieved 21 September 2019.

వెలుపలి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.