Jump to content

చెరుకువాడ వేంకట నరసింహం

వికీపీడియా నుండి
(Cherukuvada నుండి దారిమార్పు చెందింది)

చెరుకువాడ వేంకట నరసింహం (మార్చి 1, 1887 - జూన్ 23, 1964) (Cherukuvada Venkata Narasimham) గారి తండ్రి గారు చెరుకువాడ సీతారామయ్య గారు, తల్లి చెరుకువాడ లక్ష్మీనరసమ్మగారు. ఆరువేల నియోగి బ్రాహ్మణులు. అతను జననం మార్చి 1, 1887 సంవత్సరం, కృష్ణా జిల్లా ఘంటసాల. 1904 సంవత్సరంలో మద్రాస్ యూనివర్సిటీ నుండి మెట్రికులేషన్ పరీక్షలో ప్రప్రథములుగా ఉత్తీర్ణులైనారు.స్వయంకృషితో వారాలు చేసుకుని ఉన్నత విద్యాభ్యాసము చేశారు. చెళ్ళపిళ్ళ శాస్రిగారికి, రఘుపతి వేంకట రత్నం నాయుడుగారికి, ప్రియశిష్యులు. హిందూ సంప్రదాయాలను, నిరాకార బ్రహ్మసిద్ధాంతాలను, అవగతం చేసుకుని, రెండింటి సమన్వయంతోజీవితాన్ని సాగించిన ధీశాలి. 1908 సంవత్సరం దేశాభిమాని వారపత్రికకు ఉప- సంపాదకులుగా, భావపూర్ణ వ్యాసాలు, కృష్ణా పత్రిక ద్వారా, కొన్ని ప్రత్యేక రచనలు రచించారు. అతను సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మమ్మగారు, స్వరాజ్య ఉద్యమ రోజులలో పికెటింగ్ చేస్తూ, ప్రతిరోజు రాట్నము మీద ఒక 'చిలప' వడికికానీ, భోజనం చేసేవారుకాదు. ఆదిదంపతుల పేరులోనే సారూప్యంకాక అతనుకు చేదోడు-వాదోడుగా అన్ని సందర్భాలలో సహకరించిన సార్థక సహధర్మచారిణి.

కృష్ణాజిల్లా కౌతరంలో 1910-1918 వరకు, ప్రధానోపాధ్యాయులుగా కొళందరెడ్డిగారిచే ప్రారంభించబడిన 'ఆంధ్రలక్ష్మీ' విద్యాలయాన్ని అత్యంత సమర్ధవంతంగా, గురుకుల పంధాలో, నిర్వహించారు. ఆ విద్యాలయ ప్రారంభోత్సవానికి 'సబర్మతీ'లో ఉన్న గాంధిమహాత్ముని కలసి ఆహ్వానించారు. అప్పటి విద్యావిధానాన్ని ఖండించి జాతీయ విద్యావిధానాన్ని ప్రోత్సహించమన్న బాపూజీ ఆదేశాన్ని ఔదలదాల్చి, బందరులో జాతీయకళాశాల (National College) ప్రారంభించారు.

జాతీయ కళాశాలలో జాతీయ విద్యావిధానంలోఇంగ్లీష్ మినహా అన్ని పాఠ్యాంశాలు ప్రారంభించారు. మోటూరి సత్యనారాయణ గారు, నార్ల వేంకటేశ్వరరావు గారు, బెజవాడగోపాలరెడ్డిగారు మొదలైన ఆణిముత్యాలు, రత్నాలవంటి ఎందరో త్యాగధనులను, నిష్కళంక చరితులను తయారుచేశారు. జాతీయకళాశాల నిర్వహణలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, కోపెల్ల హనుమంతరావు గారు, హృషీకేశ శర్మగారు, కౌతా శ్రీరామమూర్తి గారు, ముట్నూరి కృష్ణారావుగారు, మొదలైన ప్రముఖుల పరిచయం, సన్నిహితులుగా, ప్రాణస్నేహితులుగా, రూపుదిద్దుకుంది. సహాధ్యాయి కోట సుబ్బారావుగారు, కృష్ణాపత్రిక, 'కృష్ణరాయదర్బారు' లో కలిసేవారు.

1922 సంవత్సరం గుడివాడలో మొదటిసారిగా అరెస్ట్ అయి ఒక సంవత్సర కారాగారవాసం అనుభవించారు. కృష్ణాపత్రికకు ఉప-సంపాదకులుగా 1924-25 లో పనిచేశారు. శ్రీ పట్టాభి గారు 1925 సంవత్సరంలో ఆంధ్రా ఇన్షురెన్స్ కంపెనీ ప్రారంభించారు. నరసింహంగారు అందులో ఇన్షురెన్స్ ఏజెంటుగా పనిచేస్తూ, ఖాది ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణలపై ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో మహోపన్యాసాలు చేశారు. చెళ్ళపిళ్ళ వారి శిష్యులై ఆంధ్ర-సంస్కృత భాషాభిమానులై నల్లేరుపై బండి నడకగా బ్రిటిష్ పాలకులను దుయ్యబట్టారు. ఎంతో వ్యవహరజ్ఞానం, ఆర్థికపరిజ్ఞానం కలిగిన డాక్టర్ పట్టాభిగారికి, సేవాభావం త్యాగం కలిగిన లాయర్ ఆంధ్రకేసరికి, చెరుకువాడ అత్యంత సన్నిహితులు. ఉపన్యాసకేసరి చెరుకువాడ 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో 'కడలూరు' సెంట్రల్ జైల్లో ఒక సంవత్సరం సింపల్ ఖైదీగా జైలుశిక్ష అనుభవించారు. మొత్తంమీద అతను నాలుగుసార్లు జైలుశిక్ష అనుభవించారు. ఆంధ్ర ప్రాంతంలో గాంధీజీ చేసిన కొన్ని ఉపన్యాసాలను తెలుగులో ప్రజలకు అందించారు. 1932 లో విదేశీబహిష్కరణపై మహోపన్యాసాలు, కృష్ణాపత్రికకు రాజకీయ పంచాంగ ధృుక్సిద్ధాంతిగా పంచాంగం, వ్యాసాలు, ప్రముఖ రచనలు వెలువడ్డాయి. రేడియో ప్రసంగాలు చేశారు.

అతను వ్రాసిన పుస్తకాలు 1) శాసనసభలు 2) స్వరాజ్య దర్పణము(సహాయ నిరాకరణ ఉద్యమ కాలం లో)3) ఈశ్వర చంద్ర విద్యాసాగర్ జీవితచరిత్ర 4) మల్లు తానుల మహాసభ. 1935-45 సంవత్సరాలవరకు హిందూస్తాన్ మ్యూచువల్ ఇన్షురెన్స్ కంపనీలో ఉన్నారు. నరసింహం పంతులుగారు చేపట్టని జాతీయ ఉద్యమం లేదు. ఖాది ఉద్యమం, గ్రంథాలయోద్యమం, గ్రామ పునర్నిర్మాణం, హరిజనోద్ధరణ, హరిజన దేవాలయ ప్రవేశము, సర్వోదయ ఉద్యమం, మొదలైనవన్నిటిని ఆచరించారు. మాల, మాదిగ వ్యక్తులు ఇంట్లో వ్యక్తులుగా మసలేవారు. టంగుటూరి ప్రకాశం పంతులు 'కిసాన్ మజ్దూర్ పార్టీ' పెట్టి, పార్టీ అభ్యర్థిగా బందరు నియోజక వర్గంలో నిలబెట్టారు.M.L.A.D.D.L (Defeated, Deposit Lost) అని పరాజయాన్ని కూడా జయంతో సమానంగా స్వీకరించారు. ఆదర్శ విద్యార్థిగా, ఉత్తమ ఉపాధ్యాయుడుగా, నిరాడంబరుడైన స్వాతంత్ర్య సమరయోధుడిగా అన్ని జాతీయ ఉద్యమాలలో పాల్గొనిన సంస్కర్తగా, వక్తగా, న్యాషనల్ అవార్డ్ గ్రహీతగా జూన్ 23, 1964 సంవత్సరం స్వర్గదాముము చేరుకున్నారు. తెలుగుజాతికి గర్వకారణంగా, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడుగా ప్రఖ్యాతిగాంచిన ధన్యజీవి.