Jump to content

దూదేకుల సిద్దయ్య

వికీపీడియా నుండి
(సిద్దయ్య నుండి దారిమార్పు చెందింది)
దూదేకుల సిద్ధయ్య
జననం1665
కలుగొట్ల గ్రామం, కోయిలకుంట్ల మండలం,కర్నూలు జిల్లా
మరణం1736
ముడుమాల,కందిమల్లయపల్లి (బ్రహ్మం గారిమఠం) మండలం ,కడప జిల్లా
వృత్తిసిద్ధుడు
తల్లిదండ్రులు
  • షేక్ పీర్ సాహెబు (తండ్రి)
  • ఆదంబీ (తల్లి)

దూదేకుల సిద్ధయ్యగా ఖ్యాతిగాంచిన సిద్ధయ్య (సిద్దీఖ్) పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుల్లో ప్రముఖుడు.[1] ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా కొయిలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామం. కడప జిల్లా ముడుమాల గ్రామం లో స్థిరపడ్డారు. దూదేకుల కులానికి చెందిన ముస్లిం అయినప్పటికీ బ్రహ్మం గారి ప్రియశిష్యుడిగా ప్రఖ్యాతిగాంచాడు. ముడుమాలలో నేటికీ ఆయన సమాధి ఉంది. సిద్దప్ప - కులమత అంతరాలను, విద్వేషాలను సామాజిక అసమానతలను తీవ్రంగా వ్యతిరేకించాడు. తన తత్వాలలోను, వచనాలలోనూ ఇదే విషయాన్ని బోధించాడు. ప్రచారం చేశాడు.

జీవితం

[మార్చు]

సిద్ధయ్య కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామంలో షేక్ పీరు సాహెబ్, ఆదంబీ దంపతులకు జన్మించాడు. ఏడో సంవత్సరంలో బడిలో ప్రవేశించి పదునాలుగో సంవత్సరానికల్లా చదువు పూర్తి చేశాడు. వీరబ్రహ్మేంద్రస్వామిని గురించి విని ఆయనను కలుసుకోవాలని తల్లిదండ్రులతో చెప్పకుండానే కందిమల్లాయపల్లెకు వచ్చాడు. తనను శిష్యుడిగా చేర్చుకోమని బ్రహ్మంగారిని ప్రార్థించగా ఆయన అందుకు అంగీకరించాడు. సిద్ధయ్య తండ్రి ఈ విషయం తెలుసుకుని కుమారుని ఇంటికి రమ్మన్నాడు. కానీ సిద్ధయ్య అందుకు అంగీకరించక తన గురువు దగ్గరే బ్రహ్మ విద్యనభ్యసిస్తామని చెప్పాడు. తండ్రి మనం మహ్మదీయులం కదా. ఇలా హైందవ ధర్మం ఆచరించడం వల్ల మనల్ని వెలివేస్తారు. వృద్ధులైన తల్లిదండ్రులను కాపాడవలసిన దానికన్నా ఈ బ్రహ్మ విద్య గొప్పదియా? అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధయ్య తాను బ్రహ్మ విద్యను ఆర్జించి తర్వాత వచ్చి వారిని సేవిస్తానని చెప్పాడు. దాంతో తండ్రి తిరుగు ప్రయాణం కట్టాడు.

గురువు సాహచర్యంలో ఆధ్యాత్మికంగా పరిణతి గాంచాడు సిద్దయ్య. మరోవైపు తండ్రి తమ మతంలోని కొంతమంది చెప్పిన మాటలు విని తన కుమారుడిని తనకు ఇప్పించవలసిందిగా కడప నవాబు దగ్గర ఫిర్యాదు చేశాడు. నవాబు బ్రహ్మంగారిని తన దగ్గరికి రమ్మని ఆదేశాలు జారీ చేశాడు. సిద్ధయ్య జరిగిన విషయం తెలుసుకుని తన గురువు గారి ఆజ్ఞ తీసుకుని ఆయన బదులు తానే నవాబు ముందు హాజరయ్యాడు. నవాబు మతభ్రష్టుడెందుకైనావని ప్రశ్నించగా ఏ మతంలోనైనా దేవుడు ఒకడే అని సమాధానం చెప్పాడు. నవాబు తనకు సలాం చేయమని కోరగా సిద్ధయ్య తాను కేవలం గురువుకే వందనం చేస్తాననీ ఇతరులకు చేస్తే ప్రమాదమని చెప్పాడు. అతన్ని పరీక్షించడం కోసం ఒక రుబ్బురోలు పొత్రాన్ని తెప్పించాడు. సిద్ధయ్య తన గురువును తలుచుకుంటూ దానికి సలాము చేయగా అది పగిలి ముక్కలైనది. దాంతో నవాబు తన తప్పును తెలుసుకుని అతన్ని సత్కరించి తిరిగి పంపివేసినాడు.

బ్రహ్మంగారు జీవ సమాధిలో ప్రవేశించ తలచి సిద్ధయ్య తన దగ్గర ఉంటే తట్టుకోలేడని భావించి పూలు తెమ్మనే నెపంతో తోటకు పంపాడు. పూలకోసం వెళ్ళిన సిద్ధయ్య అక్కడెవరో తన గురువు జీవ సమాధి అవుతున్నాడని చెప్పగా విని పరుగున తిరిగి వచ్చాడు. అప్పటికే బ్రహ్మంగారు సమాధిలోని వెళ్ళిపోయాడు. సిద్ధయ్య తన గురువుకోసం రోదించి స్పృహ లేకుండా పడి ఉండగా ఆయనకు నిజరూప దర్శనమిచ్చి సంసార ధర్మాన్ని నిర్వర్తించమని ఆదేశించాడు. దాంతో సిద్ధయ్య వివాహం చేసుకుని పలువురు శిష్యులను కూడా చేర్చుకున్నాడు. 1736 వ సంవత్సరంలో మరణించినాడు.

సిద్దప్ప తత్వం

[మార్చు]

దూదేకుల సిద్దయ్య కులం గురించి ప్రశ్నలనెదుర్కొన్నాడు. అవమానాలు ఎదుర్కొన్నాడు. "ఎవడవురా దూదేకుల సిద్దూడనే వాడెవడవురా?" అని వీరబ్రహ్మం గారి కొడుకులే అవమానిస్తారు. మతం మారి వచ్చాడని ఆదరించరు. కుల పిచ్చే దీనికి కారణం అంటూ సిద్దప్ప - కులమత అంతరాలను, విద్వేషాలను, సామాజిక అసమానతలను తీవ్రంగా వ్యతిరేకించారు. తన తత్వాలద్వారా ఈ విషయాన్ని బోధించారు, ప్రచారం చేశారు.

ఏ కులమని నను వివరమడిగితే
ఏమని చెప్పుదు లోకులకూ
లోకులకు పలుగాకులకూ
దుర్మార్గులకూ ఈ దుష్టులకూ

ఇంటిలోపలను యిల్లు గట్టుకొని
మంటలోపల రాటం బెట్టుక
కంటిలోపల కదురు బెట్టుకొని
ముక్కులోపల యేకు బెట్టుకొని
చేతిలో బాక చేతికి తీసుక
నారాయణ యను నరము తీసుకొని
అష్టాక్షరియను తడిక వేసుకొని
పంచాక్షరి యను పంచదీసుకొని
తకథిమ తకథిమ గుబదెబ గుబదెబ
ఏకిన కులమే మా కులము

ముట్టునబుట్టిందీ కులము
ముట్టంచున పెరిగిందీ కులము
ఏకిన ఏకులు పీకిన పిందెలు
లోకమంతనొక పాపము జేసుక
ఏకిన కులమే నా కులము"

మూలాలు

[మార్చు]
  1. పంగులూరి, వీరరాఘవుడు (1957). ఆంధ్ర మహాభక్తులు. p. 188.