Jump to content

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం (నారాయణ తిరుమల)

అక్షాంశ రేఖాంశాలు: 18°18′N 83°54′E / 18.3°N 83.9°E / 18.3; 83.9
వికీపీడియా నుండి
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం,
నారాయణ తిరుమల
నారాయణ తిరుమల దేవాలయం
శ్రీకాకుళం లోని శ్రీ వేంకటేశ్వరుని దివ్యసన్నిధి.
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, నారాయణ తిరుమల is located in ఆంధ్రప్రదేశ్
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, నారాయణ తిరుమల
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం,
నారాయణ తిరుమల
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం
భౌగోళికాంశాలు :18°18′N 83°54′E / 18.3°N 83.9°E / 18.3; 83.9
పేరు
ప్రధాన పేరు :శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం
దేవనాగరి :वेंकटेश्वर मंदिर, नारायण तिरुमल
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:శ్రీకాకుళం జిల్లా
ప్రదేశం:శ్రీకాకుళం (పట్టణం)
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వేంకటేశ్వరస్వామి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సా.శ.. 1961

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం (నారాయణ తిరుమల) శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం పట్టణం లోని ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి వారు చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువైయున్నారు. ఈ ఆలయం తిరుమల తరువాత అంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. శ్రీకాకుళం పట్టణంలో భాగమైన గుజరాతీపేటలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం లోని వేంకటేశ్వర స్వామి ఉత్తరాంధ్ర భక్తజనకోటికి అభయప్రదాతగా విలసిల్లుతున్నారు.

చరిత్ర

[మార్చు]

ఒక భక్తుడి సంకల్పం ఫలితంగా ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పూర్వీకులు చెబుతుంటారు. వేదాంత ప్రవక్త అయిన గురుగుబెల్లి నారాయణదాసు అనే భక్తుడి కలలో శ్రీవేంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై నారాయణ తిరుమల కొండపై ఆలయం నిర్మించమని ఆదేశించారట. స్వామివారి ఆదేశానుసారం నారాయణదాసు అనువైన కొండ కోసం గాలిస్తుండగా, నాగావళి నదికి పశ్చిమ దిశలోని ఒక కొండను ఎంపిక చేశాడు. ఈ కొండపైని స్వామివారి పాదాల గుర్తులను అనుసరించి, అక్కడ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. 1961వ సంవత్సరంలో తిరుపతిలో తయారు చేయించిన భూనీలాసమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి విగ్రహాలను పాంచరాత్రాగమ ప్రకారం ప్రతిష్ఠించాడు. అనంతరం 1997లో నారాయణదాసు మృతి చెందేదాకా ఆలయ ధర్మకర్తగా వ్యవహరించాడు.

ఆలయ ప్రత్యేకత

[మార్చు]

తిరుమల వెళ్లలేని భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను తీర్చుకుని వెళ్తుంటారు. ఇక్కడి కొండపైన ప్రకృతి సౌందర్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం కొండపై ఉంది. ఈ ఆలయ ప్రవేశం వద్ద అతిపెద్ద గరుత్మంతుని విగ్రహం దర్శనమిస్తుంది. ఇది దేశంలోనే అత్యంత ఎత్తయిన గరుత్మంతుని విగ్రహం. ఆలయంలోనికి ప్రవేశించిన తర్వాత ఆలయ ప్రాకారంపై చుట్టుప్రక్కల విశేషమైన కళాకృతులు కలిగిన దేవతా శిల్పాలు దర్శనమిస్తాయి. వాటిలో అష్ట విధములైన లక్ష్మీదేవి విగ్రహాలు, విష్ణువు దశావతారాల విగ్రహాలు, అనేక దేవతా మూర్తుల విగ్రహాలు మనకు కనువిందు చేస్తాయి.

నారాయణ తిరుమల కొండపై నిర్మాణమైన శ్రీవేంకటేశ్వర ఆలయం ఎన్నో ప్రత్యేకతలతో అలరారుతోంది. ఆలయంలోని శ్రీరామానుజాచార్య, శ్రీనమ్మాళ్వార్ విగ్రహాలు, స్వామివారి దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నర్సింహ, వామన, పరశురామ, రామ, శ్రీకృష్ణ, బలరామ, కల్కి అవతారాలతో కూడిన విగ్రహాలను భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతాయి.

అలాగే అష్టలక్ష్మి వైభవాన్ని విశదీకరించే లక్ష్మీదేవి విగ్రహాలు ఈ ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఆలయంలో ఐదు అంతస్తుల గాలి గోపురం తిరుమలేశుని సన్నిధిని గుర్తుకు తెస్తుంది. ఆలయంలోని బేడా మండపం, కళ్యాణ మండపం, యాగశాల, పుష్కరిణి, ప్రాకారాలు ఆకట్టుకుంటాయి.

పూజలు

[మార్చు]

ఈ శ్రీవేంకటేశ్వర ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య పూజాదికాలను నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణంతోపాటు, శ్రీకృష్ణాష్టమి, భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి తదితర పండుగలను, పర్వదినాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలో విష్ణు సహస్ర నామపారాయణం జరుగుతుంటుంది.

ఆలయానికి వెళ్ళే మార్గాలు

[మార్చు]

శ్రీకాకుళం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండుకు కిలో మీటరు దూరంలో ఉంటుంది శ్రీవేంకటేశ్వర ఆలయం. శ్రీకాకుళం రోడ్ (ఆముదాల వలస) రైల్వే స్టేషన్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస చేయాలనుకునే వారికి శ్రీకాకుళం పట్టణంలో అనేకమైన వసతి సౌకర్యాలు ఉన్నాయి.

చిత్రమాలిక

[మార్చు]

కృష్ణ లీలలు

[మార్చు]

ఇతర చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]