Jump to content

శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం (చెర్వుగట్టు)

వికీపీడియా నుండి
(శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి దారిమార్పు చెందింది)

శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఇది నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆలయం. ఇది నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో ఉంది.[1][2]ఇక్కడ ప్రధాన దైవం శివుడు. జడల రామలింగేశ్వరస్వామి వారి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్టించాడనీ, అతను ప్రతిష్టించిన 108 శివలింగాలలో చివరి లింగం జడల రామలింగేశ్వర స్వామిదని స్థలపురాణం.

భౌగోళికం

[మార్చు]

నల్గొండ జిల్లా నార్కట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో చెర్వుగట్టు గ్రామంలో ఈ ఆలయం వెలసింది. ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు, ఆ చెరువు గట్టున పార్వతీ సమేత మల్లికార్జునస్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ క్షేత్రం నల్గొండకు 14 కిలో మీటర్ల దూరంలో, అద్దంకి నార్కట్ పల్లి ప్రధాన రహదారికి ఒక కిలో మీటరు దూరంలో ఉంది. ఇక్కడి శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండటం వలన ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించడం వలన, కొండ దిగువున పార్వతీదేవి కొలువైవున్న కారణంగా ఈ స్వామిని పార్వతీ జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తూ వుంటారు.

ఆలయ విశేషాలు

[మార్చు]

నాటి నుంచి నేటి వరకూ ఒక సర్పం స్వామివారికి ప్రదక్షిణలు చేసి వెళుతుండటం ఇక్కడి విశేషం. కొండ పై భాగాన 'మూడు గుండ్లు' గా పిలవబడే రాతి బండల మధ్యలోని మరొక శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకుంటూ వుంటారు. ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తుంటాడు. ప్రతియేటా ఈ స్వామిచెంత మండల దీక్ష తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక భూత ప్రేత పిశాచ బాధలతో సతమతమైపోతోన్న వారికి స్వామివారి పాదుకలను తాకించడం ఆనవాయతీగా వస్తోంది. ఏడాదికి ఒకసారి జరిగే గ్రామోత్సవంలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించి కృతజ్ఞతలు చెప్పుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన మానసిక పరమైన, శారీరక పరమైన వ్యాధులు తొలగి పోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.[3]

స్థలపురాణం

[మార్చు]

పూర్వం హైహయ వంశ మూలపురుషుడు, కార్త వీర్జార్జున చక్రవర్తి సపరివారంగా వేటకోసం దండకారణ్యానికి బయలుదేరాడు. అవిశ్రాంతంగా వేటాడిన పిదప బడలికకు గురైన చక్రవర్తి, సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న ధేనువు సాయంతో క్షణాలతో వేలాది సంఖ్యలలో ఉన్న రాజ పరివారానికి షడ్రసోపేతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేసాడు. ఆ ధేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తనకు ఆ ధేనువు కావాలని అడుగుతాడు.అందుకు మహర్షి తిరస్కరించడంతో కుపితుడైన కార్తవీర్యార్జునుడు, జమదగ్నిని సంహరించి ధేనువును తీసుకుని వెళతాడు. ఆ సమయంలో పరశురాముడు బయటకు వెళ్లి, తిరిగి పరశువుతో (దొడ్డలి) కార్త వీర్యార్జుని సంహరించి, ఇరవై ఒక్కసార్లు భూ ప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు.

క్షత్రియ వధానంతరం, తాను చేసిన పాప పరిహారార్థం దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్టించి, ఒక్కొక్క లింగం చెంత వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, ఆ తపోఫలాన్ని, ఆ క్షేత్రానికి ధారపోసి, మానవ కళ్యాణానికి పాటుబడ్డాడు. అలా ప్రతిష్టించిన శివలింగాలలో చిట్టచివరిదైన 108వ శివలింగం ఈ చెర్వుగట్టు క్షేత్రంలోని జడల రామలింగేశ్వరుడు చివరదని పురాణ కథనం.ఈ ప్రదేశంలో పరశురాముడు శివుని వేడుతూ ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో, కోపగించుకున్న పరశురాముడు తన గడ్డలితో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంత కాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం, ప్రముఖ శైవ క్షేత్రముగా వెలుగొందుతుందని, కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడు.

అనంతరం పరశురాముడు కూడ ఇక్కడే లింగాకృతిని పొంది శివసాయుజ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగం జడల రామలింగేశ్వరాలయానికి దరిదాపుల్లో వేరొక గుహలో ఉంది. రామలింగేశ్వరుని ఊర్ధ్వభాగాన పరశురాముడు గండ్ర గొడ్డలితో దెబ్బవేసిన చోట జడల వంటి నిర్మాణాలు ఉన్నాయి. అందుకనే స్వామిని జడలరామలింగేశ్వర స్వామి అని అంటారు. కొండపై గుహలోగల జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్ధానికి చెందిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశినాడు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాలలో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతీయేటా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Wayback Machine" (PDF). web.archive.org. 2023-02-18. Archived from the original on 2023-02-18. Retrieved 2023-02-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. https://endowments.ts.nic.in/Temple-content/cheruvugattu/content.pdf
  3. "శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయం, చెర్వుగట్టు". TeluguOne Devotional (in english). 2023-02-18. Retrieved 2023-02-18.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. "నేటి నుంచి పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు". andhrajyothy. 2022-02-08. Archived from the original on 2022-02-08. Retrieved 2022-02-11.

వెలుపలి లంకెలు

[మార్చు]