శ్రీకాకుళం ఉద్యమం
శ్రీకాకుళం ఉద్యమం 1958లో ప్రారంభమైనది. ఈ శ్రీకాకుళం గిరిజన సంఘం అనేక పోరాటాల్లో రాటుదేలి అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. పాలకొండ ఏజెన్సీ, సీతంపేటకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండ అనే గిరిజన గ్రామంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పల్లె రాములు మాస్టారు ఆ కాలంలో గిరిజన గ్రామాల్లో ప్రజలపై భూస్వాములు చేస్తున్న దోపిడీని చూసి చలించిపోయాడు. గిరిజనులను చైతన్యపర్చడం ప్రారంభించాడు. అప్పటికే పాలకొండలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న హయగ్రీవరావు, పత్తిరాజుతో కలిసి ఊరూరా గిరిజన సంఘాలు ఏర్పాటు చేశాడు. కమ్యూనిస్టు పార్టీని గిరిజన ప్రాంతానికి విస్తరింప చేశాడు.[1]
నీళ్లధార ప్రయాణం
[మార్చు]గిరిజనులను తొలుత సంఘాల్లో చేర్పించేందుకు నీళ్లదార ప్రమాణం చేయించేవారు. గ్రామంలో ఆడ, మగ పిల్లలందరీతో సమావేశపర్చి నీళ్లధార వదిలి, గడ్డిపూచ తుంచి వారిచే ప్రమాణం చేయించేవారు. అప్పటినుండి వాళ్లు సంఘంలో సభ్యులైనట్లే. అలా ప్రారంభమైన గిరిజన సంఘాలు గ్రామగ్రామాన విస్తరించాయి. 1960నాటికి అంటే కేవలం రెండేళ్లకే జిల్లాలోని గిరిజన ప్రాంతమంతా ఎర్రజెండాపై గిరిజన సంఘం అని రాసి ఎగురవేయబడ్డాయి. సుందరయ్య డైరెక్షన్, నండూరి ప్రసాదరావు ప్రత్యక్ష సహకరాంతో ఉద్యమం నడిచింది. 1961లో మొట్టమొదటి గిరిజన సంఘం మహాసభను మొందెంఖల్లు లో అత్యంత జయప్రదంగా నిర్వహించారు. 4 వేలమందితో భారీ బహిరంగసభ జరిపారు. ఈ సభకు పార్టీ తరపున నండూరి ప్రసాదరావు హాజరైనాడు. వెట్టిచాకిరీ అంతం చేయాలని, కూలిరేట్లు పెంచుకోవాలని సంఘం పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో అనేక చోట్ల ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఈ ఉద్యమాలకు పల్లె రాము మస్టారు, హయగ్రీవరావు, పత్తిరాజులతోబాటు, ఉపాధ్యాయుగా పనిచేస్తున్న వెంపటాపు సత్యం, అప్పుడే చురగ్గా కదలి పని చేస్తున్న పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు నాయకత్వం వహించారు. మైదాన ప్రాంతం నుంచి వసంతాడ రామలింగాచారి అండగా నిలిచారు. అంటే ఈ ఉద్యమం ఉపాధ్యాయులు, మేధావులను ఆకర్షించింది. మొదటి మహాసభ పిలుపును గ్రామగ్రామన తీసుకెళ్లేందుకు దళాలుగా ఏర్పడి పాటలు పాడుకుంటూ, రాత్రుళ్లు గ్రామాల్లో ఉండి అక్కడ బడులను నడిపి గిరిజనులకు చదువు నేర్పి పోరాట చైతన్యాన్ని అందించారు. గోచీకి బదులు లుంగీ, బనియన్, తుండు కట్టుకొనేలా ఆహార్యాన్ని మార్చారు. సారాయి మాన్పించారు. వెయ్యి ఎకరాలకు ఆసామి అయిన పగడాల నాయుడు మొండెంఖల్ ప్రాంతానికి మొఖసాదారు. నీలకంఠపురం, జుంభిరిలో ఇళ్లన్నీ అతనివే. ఈ ప్రాంతంలో మగాళ్లందరూ పాలేర్లు గానూ, ఆడవాళ్లంతా పాలెకత్తులు గానూ పనిచేయాలి. వారు అప్పులు తీరే వరకూ గిరిజనులు వెట్టి చాకిరీ చేయాల్సిందే. ఇంత దుర్మార్గమైన వెట్టి చాకిరీ, బానిసత్వాన్ని అంతమొందించింది ఈ ఉద్యమం.
ఉద్యమ ప్రస్థానం
[మార్చు]అన్నింటా దోపిడీకి గురవుతున్న గిరిజన ప్రజలను చైతన్యపరచి వారి సహకారం, ప్రోత్సాహంతో శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటానికి శ్రీకారం చుట్టిన నాయకులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం.[2] కురుపాం మండలం కొండబరిడి గ్రామంలో 1962-63 సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేసిన వెంపటాపు సత్యం నాటి గిరిజనుల అమాయకత్వం, అన్నింటా దోపిడీకి గురవడంపై చలించి పోయాడు. పగలు విద్యార్థులకు పాఠాలు చెబుతూ, ఖాళీ సమయాల్లో రాత్రి పూట గిరిజన గ్రామాల్లో తిరుగుతూ వారిని సంఘటిత పరుస్తూ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమ పంథాలో నడిపాడు. ఆ సమయంలో వీరఘట్టం ప్రాంతానికి చెందిన ఆదిభట్ల కైలాసం, చౌదరి తేజేశ్వరరావు, పాణిగ్రహి తదితర ఒకే భావజాలం గల పలువురు నాయకులు ఒక్కటవడం, వీరందరూ కమ్యూనిస్టు పార్టీ గొడుగు కింద సమష్టి నిర్ణయాలతో పోరటాన్ని ఉద్యమ రూపంలోకి తీసుకువెళ్లారు. గిరిజన ప్రజలను దోచుకొనే షాహుకార్లు, సొండీలు, ఇతర భూస్వాములను హత్యలు చేయడం, వీరి ఇళ్లను దోపిడీ చేసి పేద గిరిజన ప్రజలకు పంపిణీ చేయడం, భూ పోరాటాలు చేయడం ప్రారంభించారు. 1967 అక్టోబరు 31న మొండెంఖల్లు గ్రామంలో గిరిజన ప్రజలతో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు పుచ్చలపల్లి సుందరయ్య, కప్పగంతుల సుబ్బారావు తదితర నాయకులు హాజరవుతున్నారు. వందలు, వేలాదిగా గిరిజన ప్రజలు ఈ సభకు తరలివస్తున్నారు. ఆ సమయంలో గుమ్మ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన భూస్వాములు ఈ సభను భగ్నం చేయడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా పిలేవిడి గ్రామం వద్ద దారికాచి సభకు వెళుతున్న గిరిజనులను అడ్డుకున్నారు. వందలాదిగా వస్తున్న గిరిజనులను భూస్వాములు అడ్డుకోవడంతో గిరిజనులు, వీరి మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణ ఇరువర్గాల మధ్య కొట్లాటగా దారితీసి చివరకు భూస్వాములు గిరిజనులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కోరన్న, మంగన్న అనే గిరిజనులు చనిపోయారు. ఈ సంఘటనతో గిరిజన ప్రజలు కసి పెంచుకోవడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. భూస్వాములను, షాహుకార్లను హత్యలు చేయడం, వారి ఇళ్లను దోపిడీ చేసి గిరిజన ప్రజలకు పంచి పెట్టడం వంటి కార్యక్రమాలను ఉధృతం చేశారు.[3]
ఉద్యమం అణచివేత
[మార్చు]ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వం పోలీసు బల ప్రయోగంతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం తదితర నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లి సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. 1967 నుంచి 70 వరకు వందలాదిగా సంఘటనలు జరిగాయి. భూస్వాములు హత్యలు, పోలీసు, సీఆర్పీఎఫ్ గాలింపు చర్యలు, ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో నక్సల్బరీ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఈ రెండు ఉద్యమాలకు భావసారూప్యత గల కారణాలుగా ఆ నాటి నక్సలైట్ పార్టీ జాతీయ నాయకులు చారూ మజుందార్, కానూసన్యాల్, నాగభూషణ్ పట్నాయిక్ తదితర నాయకులు ఉద్యమాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందించారు. చివరకు 1970, జూలై 10న వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంలు కురుపాం సమీపంలోని కొండల్లో ఉన్నట్లు సమాచారంతో పోలీసులు వీరిని చుట్టుముట్టి ఎన్‌కౌంటరు చేశారు. ఆ తరువాత పలువురు నాయకులను అరెస్టులు చేయడంతో నాటి ఉద్యమం బలహీనపడింది.
ప్రభుత్వంలో చలనం
[మార్చు]ఈ ఉద్యమంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం వచ్చింది. నాటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ యుగంధర్ నివేదికతో నాడు పార్వతీపురం ఏజెన్సీగా పిలవబడే గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, గిరిజన ప్రాంతంలో రోడ్లు నిర్మించడం, జీసీసీ డిపోలు ఏర్పాటు, పాఠశాలలు, ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు 1/70 ఏజెన్సీ భూబదలాయింపు చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేశారు. జీడీఏ, ఐటీడీఏ సంస్థలు ఏర్పాటు చేసి గిరిజనాభివృద్ధిపై ప్రభుత్వాలు శ్రద్ధ చూపతున్నాయి. నాటి అమరవీరుల త్యాగ ఫలమే నేటి గిరిజనాభివృద్ధిగా చెప్పకతప్పదు.
సాధించిన విజయాలు
[మార్చు]శ్రీకాకుళం గిరిజన పోరాటం గోచీకట్టుకొన్న గిరిజనులను పోరాటయోధులుగా మార్చింది. వేలాది ఎకరాలు భూములు సాధించింది. అటవీశాఖాధికారుల వేధింపులు, భూస్వాముల వెట్టిచాకిరీ నుంచి విముక్తి చేసింది. గిరిజన విద్య, వసతి, రోడ్లు ఐటిడిఎ సాధించింది. గిరిజన కార్పొరేషన్ ద్వారా గిరిజన ఉత్పత్తులు కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించింది.
పుస్తకాలు
[మార్చు]- శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం) 1960, 70లలో సాగిన శ్రీకాకుళ గిరిజన రైతాంగ విప్లవ పోరాటాన్ని గురించి ప్రముఖ రచయిత ఛాయరాజ్ వ్రాసిన కథా కావ్యం.
మూలాలు
[మార్చు]- ↑ గిరిజనులను పోరాట యోధులుగా మార్చిన శ్రీకాకుళం ఉద్యమం, October 30,2015[permanent dead link]
- ↑ "Heroic Martys of the Turbulent Sixties". Archived from the original on 2018-05-25. Retrieved 2016-07-10.
- ↑ "తెలంగాణ, ఆంధ్రాల్లో నక్సల్స్ ఉద్యమ ప్రభావం". Archived from the original on 2017-05-28. Retrieved 2016-07-10.
మరింత చదవడానికి
[మార్చు]- http://www.indiastudychannel.com/resources/150006-Armed-Struggle-Andhra-Pradesh-Greatest.aspx
- Guruswamy, Mohan (2010). "The Heart of our Darkness" (PDF). Archived from the original (PDF) on 2016-12-21. Retrieved 2021-10-16.
బాహ్య లంకెలు
[మార్చు]- "శ్రీకాకుళములోన చిందింది రక్తము..కొండలెరుపెక్కినాయి..పోరాడ బండలే కదిలినాయి - వరవరరావు". avaninews.com. Retrieved 2021-10-16.
- "చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు". www.avaninews.com. Retrieved 2021-10-16.
- "ఆర్కైవ్ నకలు". m.andhrajyothy.com. Archived from the original on 2021-10-16. Retrieved 2021-10-16.