Jump to content

శారద ముఖర్జీ

వికీపీడియా నుండి
(శారదా ముఖర్జీ నుండి దారిమార్పు చెందింది)
శారద ముఖర్జీ
నియోజకవర్గం రత్నగిరి

పదవీ కాలం
05 మే 1977 – 14 ఆగష్టు 1978
ముందు బీ.జె.దివాన్
తరువాత కె.సి.అబ్రహాం

గుజరాత్ గవర్నరు
పదవీ కాలం
14 ఆగష్టు 1978 – 05 ఆగష్టు 1983
ముందు కె.కె.విశ్వనాథన్
తరువాత కె.ఎం.చాందీ

వ్యక్తిగత వివరాలు

జననం 24 ఫిబ్రవరి 1919
రాజ్‌కోట్
మరణం 2007 జూలై 6(2007-07-06) (వయసు 88)
ముంబై
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
పూర్వ విద్యార్థి ఎల్ఫిన్‌స్టొన్ కాలేజీ
వృత్తి రాజకీయవేత్త
శారద ముఖర్జీ

శారద ముఖర్జీ (జ. 24 ఫిబ్రవరీ 1919, రాజ్‌కోట్[1]) గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు తొలి మహిళా గవర్నరు. 1978 నుండి 1983 వరకు గుజరాత్ రాష్ట్రానికి గవర్నరుగా ఉంది. శారద ముఖర్జీ మూడవ, నాలుగవ లోక్‌సభలకు మహారాష్ట్రలోని రత్నగిరి నియోజకవర్గం నుండి ఎన్నికయ్యింది.[2] రెండు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, గుజరాత్) తొలి మహిళా గవర్నరుగా పనిచెయ్యటం ఈమె ప్రాముఖ్యత.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శారద ముఖర్జీ రాజ్‌కోట్‌లో మరాఠీ కుటుంబంలో శారదా పండిత్ గా జన్మించింది. ఈమె చిన్నాన్న రంజిత్ సీతారాం పండిత్, జవహర్ లాల్ నెహ్రూ చెల్లెలు విజయలక్షిని పెళ్ళిచేసుకున్నాడు. ప్రముఖ రచయిత నయనతార సెహగల్ ఈమెకు వరసకు చెల్లెలు (బాబాయి కూతురు). శారదా ముఖర్జీ తల్లి సరస్వతీబాయి పండిత్, అలనాటి హిందీ సినిమా నటి దుర్గా ఖోటే సోదరి. ఈమె విద్యాభ్యాసం బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టొన్ కాలేజీలో సాగింది. కళాశాలలో చదివే రోజుల్లో అనేక నాటకాల్లో ఈమె హీరోయిన్‌గా చేసింది.[3] కళాశాలలో ఆర్థికశాస్త్రంలో పట్టభద్రురాలైంది. ఈమె భర్త తొలి భారతీయ ఎయిర్ చీఫ్ మార్షల్ సుబ్రతో ముఖర్జీ. ఈమె సుబ్రతో ముఖర్జీని 1937లో బొంబాయిలో కలిసింది. 1939లో వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలకు స్నేహితురాలైన సరోజినీ నాయుడే ఈ సంబంధం కుదిర్చింది. బొంబాయిలో విలాసవంతమైన జీవితం గడుపుతున్న శారద, పెళ్ళి తర్వాత భర్తతో పాటు వైమానికస్థావరల్లో జీవితానికి త్వరగానే అలవాటుపడింది. వీరి ఏకైక సంతానం, వీరి కుమారుడు సంజీవ్.[4] భర్త వాయుసేనలో పనిచేస్తుండగా శారద సైనిక సామాజిక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉండేది. కొంతకాలం పాటు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మహిళా సంక్షేమ సంఘానికి అధ్యక్షురాలిగా కూడా పనిచేసుంది. భాలభారతి, కేంద్రీయ విద్యాలయాల స్థాపనలో ముఖర్జీ దంపతులు క్రియాశీలక పాత్ర పోషించారు. 1960 నవంబరు 8న సుబ్రతో ముఖర్జీ టోక్యోలో ఒక రెస్టరెంటులో స్నేహితుడితో పాటు భోజనం చేస్తుండగా చేపముల్లు గొంతులో గుచ్చుకొని 49 ఏళ్ల వయసులో ఆకస్మికంగా మరణించాడు. అప్పటికి శారదకు 41 ఏళ్లే. భర్త మరణం తర్వాత జవహర్ లాల్ నెహ్రూ ఈమెను దౌత్యకార్యాలపై విదేశాలకు పంపించాలనుకున్నాడు కానీ ఆమె అంగీకరించలేదు.[5]

రాజకీయాల్లో

[మార్చు]

భర్త మరణించిన రెండేళ్ళకు రత్నగిరి లోక్‌సభనుంచి పోటీచేసే అవకాశం వచ్చింది. వీరి కుటుంబం మూలాలు రత్నగిరిలో ఉండటం, తప్పకుండా గెలుస్తానన్న నమ్మకంతో నామినేషను వేసింది.[5] 1962లో లోక్‌సభకు ఎన్నికై, 1962 నుండి 1971 వరకు రెండు పర్యాయాలు లోక్‌సభలో రత్నగిరికి ప్రాతినిధ్యం వహించింది. 1969లో కాంగ్రేసు పార్టీలో చీలిక ఏర్పడినప్పుడు, ఈమె ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా, సుశీలా నయ్యర్, తారకేశ్వరి సిన్హా వంటి మహిళా సభ్యులతో కలిసి సిండికేటుకు మద్దతునిచ్చింది. 1971లో జరిగిన ఎన్నికలలో ఇందిరా కాంగ్రేసు ప్రభంజనంతో ఓడిపోయింది. ఆ ఓటమి తర్వాత కొన్నేళ్లు రాజకీయాలనుండి విరమించుకొని బొంబాయిలో గడిపింది. 1977లో, కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమెను ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమించింది.

శారదా ముఖర్జీ 1977 మే 5 నుండి 1978 ఆగష్టు 14 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉంది. 1978 ఆగష్టు 14 నుండి 1983, ఆగష్టు 5 వరకు గుజరాత్ రాష్ట్రానికి గవర్నరుగా ఉంది.

శారదా ముఖర్జీ, 1977లో దివిసీమను అతలాకుతలం చేసిన భీకరమైన తుఫాను నేపథ్యంలో, స్వచ్ఛంద సంస్థలకు దీటుగా పనిచేసే చేతన సంస్థను స్థాపించి, సహాయ పునరావాస కార్యక్షికమాలను చేపట్టి, రాష్ట్రప్రజల అభినందనలు అందుకున్నది. చేతన సంస్థకు గవర్నర్ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రి ఉపాధ్యక్షులుగా వ్యవహరించే పద్ధతిలో సంస్థ నియమనిబంధనలను అప్పటి గవర్నర్ కార్యదర్శి మోహన్ కందా తోడ్పాటుతో రూపొందించారామె.[6] తుఫాను బాధితులకు ప్రభుత్వం నిర్మించిన నిర్వాసితుల కాలనీకి ఈవిడ పేరుమీదుగా శారదానగర్ అని పేరుపెట్టారు.

మరణం

[మార్చు]

శారదా ముఖర్జీ 2007లో ముంబైలో మరణించింది

మూలాలు

[మార్చు]
  1. "Members Profile". Retrieved 23 February 2012.
  2. "Former Members of Lok Sabha". Archived from the original on 16 జనవరి 2014. Retrieved 23 February 2012.
  3. http://www.indianmemoryproject.com/63/
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-05. Retrieved 2017-10-18.
  5. 5.0 5.1 Vittal, Gita (2007). Reflections: Experiences of a Bureaucrat's Wife. Academic Foundation. pp. 63–66. Retrieved 18 October 2017.
  6. వనం, జ్వాలా నరసింహారావు (2012-12-26). "రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయాలు వద్దు!". నమస్తే తెలంగాణ. Retrieved 18 October 2017.